ఆంధ్ర రాష్ట్రానికి రాయలసీమ వ్యతిరేకత – శ్రీ బాగ్ ఒప్పందం

తెలంగాణా ఉద్యమకారులు తరచూ ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడేప్పుడు జరిగిన “పెద్ద మనుషుల ఒప్పందం” గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. తెలంగాణా ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రం తో కలిపే ముందు జరిగిన ఈ ఒప్పందం వంటిదే రాయలసీమ ప్రాంతాన్ని, సర్కారు జిల్లాలతో కలిపి ఆంధ్ర రాష్ట్రం గా ఏర్పాటు చేసే ముందూ జరిగింది. దీన్నే శ్రీ బాగ్ ఒప్పందం అంటారు. ఇది వరకు ఒక పోస్టులో ఈ రెండు ఒప్పందాల గురించీ నేను ప్రస్తావిస్తే ప్రసాద్ చరసాల గారు ఈ ఒప్పందాల వివరాలు ఎక్కడైనా దొరుకుతాయా అని అదిగారు. ఇప్పుడు నడుస్తున్న తెలంగాణ ఉద్యమం నేపధ్యం మిత్రులకు అర్ధం కావడం కొరకు ఈ రెండు ఒప్పందాల పూర్తి సారాంశం ఇస్తున్నాను.

ఆంధ్ర రాష్ట్రానికి రాయలసీమ వ్యతిరేకత – శ్రీ బాగ్ ఒప్పందం.

రెండు విభిన్న నేపధ్యాల నుండి వచ్చిన ప్రాంతాలను కలిపేందుకు ప్రయత్నిస్తే ఎలా ఉంటుందో మొదలు మనకు రాయలసీమ, సర్కారు జిల్లాలను కలిపి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయబూనినప్పుడే తెలిసింది.

1913 లో బాపట్లలో జరిగిన మొదటి ఆంధ్ర మహా సభ నాటి నుండే రాయలసీమ వాసుల్లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం పై అనుమానాలు మొదలయ్యాయి. ఈ సభలు విజయవంతమవగానే సీడెడ్ జిల్లాలు (రాయలసీమ) కు చెందిన బ్రాహ్మణేతరులు, స్థానిక తమిళుల నుండి వ్యతిరేకత వ్యక్తమైంది. తదనంతర కాలం లో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం పై బ్రాహ్మణ ఉద్యమంగా ముద్ర పడింది.

అయితే కొంత మంది ఆంధ్ర మహాసభ నేతల చొరవ వలన 1915 లో కర్నూల్ లో జరిగిన రెండో ఆంధ్ర మహాసభ, 1916 లో కడప జిల్లా మహా సభ లు మాత్రం ఆంధ్ర రాష్ట్ర భావనకు మద్దతు ఇచ్చాయి.

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే అప్పటి మద్రాస్ నగరం తో తమకున్న అనుబంధం తెగిపోతుందనే భావన నెల్లూరు జిల్లా వాసులకు ఉండేది. 1924 లో బెజవాడలో జరిగిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీటింగులో సీడెడ్ (రాయలసీమ) ప్రాంత కాంగ్రెస్ నాయకులు తమ ప్రాంతానికి ఒక ప్రత్యేక కాంగ్రెస్ కమిటీ ఉండాలని డిమాండ్ చేశాయి. 1927 లో మద్రాస్ అసెంబ్లీ లో ఆంధ్ర రాష్ట్ర ప్రతిపాదన చర్చకు వచ్చినప్పుడు సీడెడ్ జిల్లాలను అందులో కలపవద్దని బీ. ముని స్వామి నాయుడు చేసిన సవరణ వీగిపోయింది.

ఆంధ్రా యూనివర్సిటీ ఏర్పాటు సర్కార్ (ఆంధ్ర) సీడెడ్ (రాయలసీమ) జిల్లాల మధ్య దూరం మరింత పెంచింది.1934 లో రాయలసీమ మహా సభ అవతరించింది. అలా అలా రాయలసీమ వాసులు ఆంధ్ర రాష్ట్ర భావనకు వ్యతిరేకత కనబరుస్తూ వచ్చారు.

1937 లో మద్రాసు రాష్ట్రానికి ఎన్నికలు జరిగి సీ. రాజగోపాలా చారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన క్యాబినెట్ లో ఉన్న ముగ్గురు మంత్రుల్లో ఒక్కరూ సీడెడ్ ప్రాంతానికి చెందిన వాళ్లు లేకపోవడం ఇక్కడి ప్రజల్లో అసంతృప్తికి దారి తీసింది.

1937లో బెజవాడలో జరిగిన ఆంధ్ర మహాసభ 25 వ వార్షికోత్సవ సభలో సీడెడ్ జిల్లాలను పోగొట్టుకుంటే అది క్షమించరాని నేరం అవుతుందని. అందుకే రాయలసీమ, ఆంధ్ర రాష్ట్రానికి మద్ధతు ఇవ్వడానికి ఒక ఒప్పందం చేసుకోవాలని ఇదే వేదిక పైనుండి అప్పటి ఎమ్మెల్యేలు కడప కోటి రెడ్డి, సీతారామ రెడ్డి పిలుపునిచ్చారు.

15 నవంబర్ 1937 దీపావళి పర్వదినాన కాశీనాధుని నాగేశ్వర రావు నివాసమైన శ్రీ బాగ్ లో జరిగిందీ ఒప్పందం. రాయలసీమ ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రం లో కలవాలంటే ఏ షరతులు నెరవేర్చాలో ఈ ఒప్పందం లో పొందుపరిచారు.

1) ఆంధ్రా యూనివర్సిటీ కింద రెండు సెంటర్లు అభివృద్ధి పరచాలి. అందులో ఒకటి వాల్తేరులో మరొకటి అనంతపురంలో ఏర్పాటు చేయాలి.

2) కోస్తా జిల్లాలతో సమానంగా రాయలసీమ, నెల్లూరు అభివృద్ధి చెందడానికి వీలుగా పదేళ్ల పాటు ఈ ప్రాంతానికి నీటి పారుదల రంగం లో అత్యధిక ప్రాదాన్యత ఇవ్వాలి, ముఖ్యంగా తుంగభధ్ర, కృష్ణా, పెన్న నదుల నీటి వినియోగం కొరకు భారీ ప్రాజెక్టులు నిర్మించాలి.

3) అసెంబ్లీ సీట్లు సమానంగా జిల్లా వారీగా ఉండాలి.

4) హై కోర్టు, రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించే హక్కు రాయలసీమ వాసులకే ఉండాలి.

దాదాపు 1920ల నుండి రాయలసీమ వాసులు కోరుతున్న రక్షణలు ఈ ఒప్పందం ద్వారా కల్పించబడ్డాయి.

అయితే ఈ ఒప్పందం కూడా తదనంతర కాలంలో తీవ్ర ఉల్లంఘనలకు లోనయ్యిందన్నది, రాయలసీమ వాసులు భయపడ్డట్టే ఆ ప్రాంతం తీవ్ర నిర్ల్యక్షానికి లోనయ్యిందన్నది చరిత్ర చాటుతున్న సత్యం.

తరువాయి భాగం: పెద్ద మనుషుల ఒప్పందం

మూలం: The Emergence of Andhra Pradesh by K. V. Narayana Rao

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: