ఈ మారణా హోమానికి స్క్రిప్ట్ రాసిందెవరు?

2mudigonda28july2008.jpg

అంతా అనుకున్నట్టుగానే జరిగింది! వామపక్షాల భూపోరాటం చిలికి చిలికి గాలివానై తుదకు రక్తసిక్తమైంది.

అది నెల్లిమర్ల కావచ్చు, బషీర్ బాగ్ కావచ్చు, నందిగ్రాం కావచ్చు, గంగవరం కావచ్చు, ముదిగొండ కావచ్చు…పార్టీలు ఏవైనా కావచ్చు…తక్షణ కారణాలు ఏమైనా కావచ్చు… ప్రజలు ప్రశ్నలడిగిన ప్రతీ సారీ ప్రభుత్వాలు మాత్రం తూటాలతోనే సమాధానం ఇస్తున్నాయి.

నిన్నటి బంద్ హింసాత్మకంగా మారి ఎనిమిది మందిని బలిగొంది. వామపక్షాలు, తెదేపా ఇతర ప్రతి పక్షాలూ ఆగ్రహంతో ఊగిపోయాయి. రాష్ట్రం లోనూ, కేంద్రం లోనూ ముదిగొండ కాల్పుల సంఘటన పెను మార్పులకు తెర తీస్తుందని విశ్లేషకులు రాసేస్తున్నారు.

ఇదంతా చూస్తుంటే నాకు deja vu లాగా అనిపిస్తుంది. బషీర్ బాగ్ సంఘటన చంద్ర బాబు ప్రభుత్వ పతనానికి దారి తీసిన విషయం అందరికీ తెలిసిందే. అందుకే వామపక్షాలు భూపోరాటం మొదలుపెట్టగానే కాంగ్రెస్ ఉలిక్కిపడింది. ఒకప్పటి స్నేహితుల పోరాట స్పూర్తి ఎటువంటిదో వారికి బాగా తెలుసును గనకే ఆ ఉలికిపాటు.

రాష్ట్రం లో తెలుగు దేశం అధికారం లోకి రావడానికి పరిస్థితులు సానుకూలంగా మార్చడానికే సీపీఎం ఈ ఆందోళన చేపట్టిందని. దీన్ని వెనక ఉన్నది తెలుగు దేశం పార్టీ నేనని కాంగ్రెస్ అప్పట్లోనే ఆరోపించింది.

ముదిగొండ సంఘటన తీరు తెన్నులను జాగ్రత్తగా విశ్లేషిస్తే ఇది బషీర్ బాగ్ నాటి ఘటనను పునరావృతం చేసి కాంగ్రెస్ ను పడగొట్టాలనే లక్ష్యం తోనే చేశారేమోనని అనుమానం కలుగుతున్నది.

ఒక సారి ఆలోచించండి…

అప్పుడూ ఇప్పుడూ పోరాటాన్ని తారాస్థాయికి తీసుకుపోవడానికి ఆమరణ నిరాహార దీక్షనే ఎత్తుగడ.

26 జులై నాడు హైదరాబాద్ మోజం జాహి మార్కెట్ వద్ద సీపీఎం కార్యకర్తలు అసెంబ్లీ వైపు దూసుకుపోవడానికి ప్రయత్నం చేశారు. పోలీసులపై కారం పొడి, రాళ్లతో దాడి చేశారు. అదృష్టవశాత్తూ కాల్పుల దాక వెళ్లలేదు పరిస్థితి.

26 జులై నాడు అసెంబ్లీ లో ఆవేశం తో ఊగిపోతూ దేవేందర్ గౌడ్ ఇలా అన్నాడు ” పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే ఎంత పెద్ద ఉద్యమం మొదలవుతుందో చూద్దురుగానీ…ఇది శాంతి భద్రతల సమస్యగా మారుతుంది. ఏమైనా చేస్తారేమోనని ఇంకా ఆశతో ఉన్నాం. మా ఓపిక నశిస్తోంది”

ఇక బషీర్ బాగ్ వంటి సంఘటన పునారావృతం అవుతుందేమోనని అందరూ అనుకోవడం మొదలు పెట్టారు.

బంద్ ముందు రోజు రాత్రి పదింటికి ఆర్టీసి క్రాస్ రోడ్స్ వద్ద ఒక కేఫ్ లో నా మిత్రుణ్ని కలిసాను. మాటల సందర్భం లో రేపు ఆఫీసుకు వెళ్తున్నానని అతను చెప్తే, వద్దు వెళ్లొద్దు రేపు ఏదైనా హింసాత్మక సంఘటన జరగొచ్చు అని వారించానతన్ని.

ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్ ముందే హెచ్చరించింది. బంద్ లో హింస చెలరేగవచ్చని. అందుకే ఎట్టి పరిస్థితి లోనూ సమ్యమనం కోల్పోవద్దని అందరు ఎస్పీలకు ఆదేశాలు వెళ్లాయి.

ఇంత జాగ్రత్తగా ఉన్న చివరికి అనుకున్నంతా అయ్యింది. ముదిగొండ లో పోలీసు కాల్పుల వెనుక ఇప్పుడిప్పుడే సాక్ష్యం దొరకని మతలబు ఏదో ఉంది.

ఆరోజు ఆ గ్రామంలో పోలీసులు అంతలా రెచ్చిపోవాల్సిన సంఘటన ఏదీ జరగలేదు. బంద్ పిలుపు ఇచ్చిన అనేక సందర్భాల్లో గుంపులు ఏదో ఒక స్థాయిలో విధ్వంసం సృష్టించడం పరిపాటి. ముదిగొండలో కూడ అటువంటి పరిస్థితే కనపడింది. అయినా పోలీసులు రెచ్చిపోయి గ్రే హౌండ్స్ దళాల సాయం తో ఏకే-47 ల తో ప్రజలను పిట్టలను కాల్చినట్టు కాల్చారంటే, అదీ నిరాహార దీక్ష శిబిరం పైనే కాల్పులు జరిపారంటే నమ్మశక్యం గా లేదు.

అనుమానం రేకెత్తించే ప్రశ్నలివీ:

1) అ సంఘటన జరిగిన సమయం లో కేవలం ఈ-టీవీ కెమెరా కే ఆ కాల్పుల దృశ్యాలు చిక్కడం యాదృచ్చికమేనా?

2) సంఘటన జరిగిన కొద్ది సేపటికే ఈ-టీవీ సదరు హృదయ విదారక దృశ్యాలకు తన సొంత గ్రాఫిక్స్, గద్దర్ బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ తో ప్రసారం చేయడం ఏమిటి?

3) ముది గొండ లో కాల్పులకు ఆదేశించిన అదనపు ఎస్పీ రమేష్ బాబు తెలుగు దేశం పార్టీ చెందిన వ్యక్తి. అతను గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం టికెట్ కోసం ప్రయత్నాలు కూడ చేశాడు.

4) హైదరాబాద్ లో ఆందోళనకారులు ఎంత కవ్వించినా రెచ్చిపోని పోలీసులు ముదిగొండలో అంత స్వల్ప సంఘటనలకే ఎందుకు అన్ని రౌండ్ల కాల్పులు జరిపారు?

5) నిరాయుధ ప్రజలపై ఏకే-47, ఎస్.ఎల్.ఆర్. తుపాకులు ఉపయోగిస్తారా అంటూ ఇప్పుడు ప్రశ్నిస్తున్న చంద్రబాబు కింది ఫొటోలకు ఏమని సమాధానం చెబుతారు?

basheerbagh28aug2000.jpg

2basheerbagh28aug2000.jpg

బషీర్ బాగ్ కాల్పుల దృశ్యాలు

ఆ రోజు కూడ ప్రజలపై ఇవే ఆయుధాలు ఎక్కుపెట్టిన విషయం మరచి పోయారా బాబూ?

బంద్ కు పిలుపునిచ్చింది సీపీఐ, సీపీఎం అయితే రాష్ట్రం లో అనేక చోట్ల తెలుగు దేశం కార్య కర్తలు బంద్ అమలు జరిపారు. చివరికి బంద్ కు సంబంధించిన కవరేజ్ లో ఈటీవీ ఏకంగా సీపీఐ. సీపీఎం, తెలుగు దేశం పార్టీల గుర్తులతో గ్రాఫిక్స్ రూపొందించింది. ఇప్పుడు భూ పోరాటాన్ని తెలుగు దేశం చాలా తెలివిగా హైజాక్ చేసింది.

నాకెందుకో ముదిగొండ సంఘటన ఎవరో రాసిన స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందని బలంగా అనిపిస్తోంది.
ప్రజల ప్రాణాలనే ఎన్నికల వ్యూహం గా మార్చుకునే కొత్త సంస్కృతికి ముదిగొండ నాంది కాదు కదా?

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: