ఈనగాచి నక్కలపాల్జేయకండి కామ్రేడ్లూ

left-struggle.jpg

తాజా కలం: 28 julai, 2007, 3:30 PM

ఖమ్మం లో పోలీసు కాల్పులు జరిగి ఎనిమిది మంది మరణించారన్న వార్త నన్ను కలచివేసింది. వారికి నా ప్రగాఢ సంతాపం తెలియ జేస్తున్నాను. కరెంటు చార్జీలు తగ్గించమని ఆందోళన చేసిననాడూ, నిలువ నీడ కొరకు చారెడూ భూమి కావాలని అడిగిన నాడు రాజ్యం చేస్తున్నది వేర్వేరు పార్టీలయినా నష్టపోయింది వామపక్ష కార్యకర్తలే. చంద్రబాబు, వైయెస్ ఒకే నాణేనికి రెండు ముఖాలు. 2000 ఆగస్టు 28 కీ, 2007 జులై 29 కీ ఎంత తేడా…అదే రంగస్థలం పై అదే విధమైన దృశ్యం…పాత్రధారులూ వాళ్లే ఆనాడు శత్రువులు ఇప్పుడు మిత్రులయ్యారు…అప్పటి మిత్రులు ఇప్పుడు కత్తులు దూసుకుంటున్నారు..ఆనాడూ ఈనాడూ పోలీసులది అదే దాష్టీకం…ప్రజల ప్రాణాలంటే అదే అలుసు…చనిపోయేవాడెప్పుడూ బడుగు జీవే…ప్రజల మృతదేహాలే నేతలను అందలమెక్కించే సోపానాలు…

————————–

పొద్దున్నుంచీ టీవీల్లో వామపక్షాల బంద్ వార్తలు చూస్తుంటే ఓ పక్క వారి పోరాట స్పూర్తి ని చూసి మెచ్చుకోవాలో లేక ఇదంతా చివరికి ఎవరికి లబ్ది చేకూరుస్తుందో తెలిసి నిట్టూర్చాలో అర్ధం కాని స్థితి. కొంతకాలం క్రితం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి గురించి వ్యాఖ్యానిస్తూ “రాష్ట్రం లో ఒక కొత్త ఫేస్ ఆఫ్ సినిమా” ప్రదర్శితమవుతోందని ఇది హీరోలు ఎవరో విలన్లు ఎవరో అర్ధం కాని అయోమయానికి దారితీస్తోందని రాశాను.

కమ్యూనిస్టులు త్యాగధనులు. ముఖ్యంగా మన రాష్ట్రంలోనయితే అలనాడు నిజాం పై సాగిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం నాటి నుండీ ఇప్పటి దాక ఎర్ర జెండా పార్టీలు (అన్ని రకాల వాళ్లూ) చేసిన పోరాటాలు అన్నీ ఇన్నీ కాదు. పేదలకు కూడు, గుడ్డ, నీరు కావాలని, కార్మికులకు కనీస వేతనం కావాలని…ఇలా సమాజం లోని విభిన్న వర్గాల కొరకు వారు చేసినన్ని పోరాటాలు స్వతంత్ర భారతం లో ఇంకే పార్టీ చేసి ఉండదు. ఈ పోరాటాల్లో భాగంగా అనేక కామ్రేడ్లు పోలీసు తూటాలకు నేలకొరిగారు.

ఇన్ని త్యాగాలు చేసినా అదేం దురదృష్టమో చాలా మంది కామ్రేడ్లను తప్పుగానే అర్ధం చేసుకుంటారు. దానికి వామపక్ష వ్యతిరేకులు సాగిస్తున్న దుష్ప్రచారం కొంత కారణమైతే, స్వయంగా కామ్రేడ్లు చేసిన తప్పులు కొంత కారణం.

వామపక్ష పార్టీలు అలనాడు చంద్ర బాబు, ప్రపంచ బ్యాంక్ పాలన పై సాగించిన పోరాటం అటు తిరిగి, ఇటు తిరిగి కాంగ్రెస్ కు పాలన అప్పగించేందుకు ఉపయోగపడింది. బషీర్ బాగ్ లో పోలీస్ ఫైరింగ్ సంఘటన వంటి వాటిలో ముందుండి త్యాగాలు చేసింది కామ్రేడ్లయితే, ఆ పోరాటాన్ని సోపానం గా చేసుకుని కాంగ్రెస్ గద్దెనెక్కింది.

ఇప్పుడు వామపక్షాలు భూపోరాటం మొదలు పెట్టగానే అందరికన్న ఎక్కువ సంతోషపడింది చంద్ర బాబే అయ్యుంటాడు. కోనేరు కమిటి సిఫారసులు అమలు చేయాలని, పేదవారికి ఇంటి స్థలాలు, వ్యయసాయ భూములు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వామపక్ష నేతలు గత 3 నెలలుగా పోరాటం చేస్తున్నారు. దీనికి తెలుగు దేశం మొదలు పరోక్షంగా మద్ధత్తు ఇచ్చింది. ఇవ్వాళ జరుగుతున్న బంద్ లోనయితే ఏకంగా తెలుగు దేశం నాయకులు పాల్గొన్నారు. గత రాత్రి పోలీసులు నిరాహార దీక్ష చేస్తున్న కమ్యూనిస్టు నేతలను అరెస్ట్ చేసి హాస్పిటల్ కు తరలిస్తే ఉదయం చంద్రబాబు, దేవేందర్ గౌడ్ సహా తెలుగు దేశం నేతలంతా వెళ్లి పరామర్శించారు.

ఓ వైపు ఖమ్మం లో పోలిసు కాల్పులు జరిగాయని, కనీసం ఒక వ్యక్తి మరణించి ఉంటాడని వార్తలు వస్తుంటే ఇక్కడ చంద్రబాబు ఆసుపత్రిలో రాఘవులు, నారాయణ లను పరామర్శించడం నిజంగా ఐరనీ.

పేదల కొరకు పోరాటాలు చేయడం నిజంగా అభినందనీయమే. కానీ అది అంతిమంగా చంద్రబాబు వంటి వారికి అధికారం సాధించి పెట్టేందుకే అన్నట్టుగా కనిపిస్తోంది.

కామ్రేడ్లు మరో సారి పల్లకీ మొసే బోయీలయ్యేందుకు సిద్ధ పడ్డారా?

ఈనగాచి నక్కలపాల్జేయకండి కామ్రేడ్లూ…

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: