మహా సంగ్రామానికి 150 ఏళ్లు

1857-memorial.jpg

పరపీడనకు వ్యతిరేకంగా దేశవాసులంతా చేయి చేయి కలిపి సలిపిన మహాసంగ్రామమది. స్వంత మనుషులే పరాయి వాడి పంచనచేరి దేశద్రోహులైన సందర్భమది. మొదట సిపాయిల తిరుగుబాటుగా ఆ తరువాత ప్రధమ భారత స్వాతంత్ర సంగ్రామంగా అభివర్ణించబడుతున్న 1857 తిరుగుబాటు జరిగి 150 ఏళ్లవుతున్నాయి.

ఆ మహోన్నత పోరాటం జరిగి నూట యాభై ఏళ్లయిన తరువాత ఈనాటి పరిస్థితిని ఒకసారి బేరీజు వేసుకుంటే…పేరుకు స్వయం పాలనే అయినా ఇప్పుడు మనల్ని పాలిస్తున్నది మాత్రం ఏడేడు సముద్రాల ఆవలి తెల్ల దొరలే. కాకపోతే ఆనాడు హిందూ, ముస్లిం తారతమ్యం లేదు, ఆనాడు దేశవాసులందరికీ తెల్లవాడిని వెళ్లగొట్టాలని, స్వేచ్చగా బ్రతకాలనే ఒకే కోరిక. ఇవ్వాళ మన శత్రువులెవరో, స్నేహితులెవరో తెలియని అయోమయ పరిస్థితి. స్వేచ్చ అంటే ఏమిటో కూడ అర్ధం కాని దుస్థితి.

మొన్న ఆదివారం ఆంధ్ర జ్యోతి లో సంగిశెట్టి శ్రీనివాస్ హైదరాబాద్ లో 1857 జులై 17 నాడు జరిగిన పోరుపై ఒక చక్కని వ్యాసం రాశాడు. చదవండిక్కడ…

aj-cover.jpg

జూలై 17, 1857 హైదరాబాద్‌
– సంగిశెట్టి శ్రీనివాస్‌

శుక్రవారం
హైదరాబాద్‌ మక్కామసీదు
జులై17, 1857
మసీదులోపలా, బయటా కిక్కిరిసిన జనం.

పర్వదినాల్లో తప్ప మామూలు ప్రార్థన సమయంలో అన్ని వేల మంది ముస్లిములు అక్కడికి రారు. కలవరం, ఆవేశం, ఆగ్రహం వారిని నిలవనీయడంలేదు. ఒకపక్క పెద్ద పెద్దగా నినాదాలు వినిపిస్తున్నాయి. మరొకపక్క తీవ్రంగా తర్జనభర్జన పడుతూ చేస్తున్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఆ రోజేదో జరగబోతోంది!

కొద్దిరోజుల కిందటే జమేదార్‌ చీదా ఖాన్‌ను, అతని 12 మంది అనుచరులను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. వచ్చీరాగానే ప్రధానమంత్రి సాలార్‌జంగ్‌ వారిని అరెస్టు చేయించాడు. ఔరంగాబాద్‌లో సిపాయిల తిరుగుబాటుకు ప్రేరణ, నాయకత్వం అందించినవాడు చీదాఖాన్‌.

అతని సాహసాల గురించి కథలు కథలుగా అప్పటికే నగరంలో ప్రచారమైపోయింది. అటువంటి వీరుణ్ణి నిజాం ప్రభుత్వమే అరెస్టు చేయించడం హైదరాబాద్‌ ప్రజలు జీర్ణం చేసుకోలేకపోయారు. మక్కామసీదు దగ్గర కలకలంలో జరుగుతున్న చర్చ చీదాఖాన్‌ అరెస్టు గురించే!

చీదాఖాన్‌ను, అతని అనుచరులను బ్రిటిష్‌ రెసిడెంట్‌ నివాసమైన రెసిడెన్సీ (ప్రస్తుతం కోఠి మహిళాకళాశాల, ఉస్మానియా వైద్యకళాశాల ఉన్న భవనసముదాయాలు)లోని బందిఖానాలో బంధించి ఉంచారు. అతన్ని విడుదల చేయించడానికి నిజాము మీద ఒత్తిడి తేవాలని కొందరు, లేదు, మనమే రెసిడెన్సీమీద దాడికి వెళ్లి చీదాఖాన్‌ను విడిపించుకు రావాలని మరికొందరు వాదిస్తున్నారు. మౌల్వీలు ఆవేశపూరితమైన ప్రసంగాలు చేస్తున్నారు. నిజాము బానిసమనస్తత్వాన్ని నిందిస్తున్నారు కొందరు. సాలార్‌జంగ్‌ ద్రోహబుద్ధిని నిరసిస్తున్నారు మరికొందరు!

మక్కామసీదు గోడలమీద, చార్మినార్‌ కుడ్యాలమీద వెలసిన పోస్టర్లు అప్పటికే ప్రత్యేక సందేశాలను ఇస్తున్నాయి.
“ఈ సందేశాన్ని చదవకపోతే అల్లా మీద ఒట్టే!” అన్న శీర్షికతో రాసిన ఆ పోస్టర్‌ ఇలా సాగుతుంది:
“సర్వ శక్తిమంతుడైన అల్లా, ఆయన ప్రవక్త అండదండలు మన అఫ్జల్‌- ఉద్‌- దౌలా బహదూర్‌కు ఉన్నాయి. కాబట్టి, బహదూర్‌ భయపడకూడదు.
భయపడేట్టయితే అతను గాజులు ధరించి ఇంట్లో కూర్చోవాలి.

ఈ కాగితంలోని అంశాలకు అఫ్జల్‌- ఉద్‌-దౌలా స్పందించకపోతే ఢిల్లీ నుంచి మరో పాలకుడు వస్తాడు….”
అని హెచ్చరించిన ఈ పోస్టర్‌ ఉత్తరాదిని జరుగుతున్న తిరుగుబాటును, దాన్ని దక్షిణానికి విస్తరింపజేయవలసిన అవసరాన్ని వివరిస్తుంది. స్వాతంత్య్రపోరాటాన్ని ‘అవిశ్వాసుల పై జిహాద్‌’గా ఈ పోస్టర్‌ అభివర్ణించింది. ముల్లాలందరూ నిజాముకు ఫత్వా జారీచేయాలని, అతను ఈ పోరాటంలో పాల్గొనేలా ప్రజలు ఒత్తిడిచేయాలని

పోస్టర్‌ కోరింది. ఈ సందేశాన్ని పాటించకపోతే ముస్లిములైతే పందిమాంసం తిన్నంత ఒట్టు అని, హిందువులైతే ఆవుమాంసం తిన్నంత ఒట్టు అని హెచ్చరించారు.

అతడు తుర్రెబాజ్‌ఖాన్‌!

మక్కామసీదు దగ్గర జరుగుతున్న ఆలోచనల గురించి ఉప్పందుకున్న సాలార్‌జంగ్‌ పోలీసులను పంపించి జనాన్ని చెదరగొట్టించాడు. జనం వెళ్లిపోయారు కాబట్టి భయమేమీ లేదని రెసిడెంట్‌ డేవిడ్‌సన్‌కు వర్తమానం పంపాడు. అయితే. అప్పుడు చెదిరిపోయిన జనం మధ్యాహ్నం మళ్లీ సమీకృతమైంది. బేగంబజార్‌ మీదుగా రెసిడెన్సీవైపు తరలింది. మౌల్వీ అలావుద్దీన్‌ అశ్వారూఢుడై జనం ముందు నడుస్తున్నాడు. కంటికింద చిన్న గాటుతో, స్ఫురద్రూపంతో తుర్రెబాజ్‌ ఖాన్‌ అనే జమేదార్‌ మరో గుర్రం మీద సాయుధులకు ముందునడుస్తున్నాడు. 500 మంది జనం గౌలిగూడ మీదుగా పుత్లిబౌలి చేరారు. ఉద్యమకారులలో అధికం రోహిల్లాలున్నారు. తుర్రెబాజ్‌ ఖాన్‌ కూడా రోహిల్లాయే. ఆవేశాగ్రహాలతో ఊగిపోతున్న సాయుధులు రెసిడెన్సీ పశ్చిమద్వారం (నేటి ఉస్మానియా వైద్యకళాశాల నుంచి మూసీవైపు తిరిగే మలుపులో) చేరుకున్నారు. చార్మినార్‌ దగ్గరి సంచలనం గురించి ఉప్పందిన బ్రిటిష్‌ అధికారులు సైన్యంతో సిద్ధంగా ఉన్నారు.

25 మంది ప్రాణత్యాగం

నిజానికి ఆ రోజు సాయంత్రం రెసిడెన్సీ ఎదురుగా జరిగినది పెద్ద పోరాటమేమీకాదు. ఏనుగులతో చిట్టెలుకలు చేసిన యుద్ధం అది. ఫిరంగులు మోగుతుంటే, కత్తులు, తల్వార్లతో రోహిల్లాలు బ్రిటిష్‌ సైన్యాన్ని ఎదుర్కొన్నారు. బ్రిటిష్‌ సైనికులు నిమిషాలలో పరిస్థితిని అదుపుచేశారు. సంసిద్ధులైన బ్రిటిష్‌ సైనికులను చూసి తిరుగుబాటుదారులలో అధికులు కొద్దిపోరాటం తరువాత వెనక్కు తగ్గారు. రెసిడెన్సీ గేటుకు ఎదురుగా ఉబ్బన్‌సాహెబ్‌, షావుకార్‌ జయగోపాల్‌దాస్‌ అనే ఇద్దరు వ్యాపారుల ఇళ్లున్నాయి. వాటిలో ఆశ్రయం తీసుకుని తిరుగుబాటుదారులు చాటుమాటు పోరాటం కాసేపు చేశారు. చీకటిపడేవేళకు పోరాటం ముగిసింది. తిరుగుబాటుదారుల మృతదేహాలు నాలుగు ఆ స్థలంలో మిగిలాయని బ్రిటిష్‌ అధికారులు రాశారు కానీ, మొత్తం 25 మంది రోహిల్లాలు, ఇతర యోధులు ఆ పోరాటంలో మరణించారు. బ్రిటిష్‌ పక్షంలో ప్రాణనష్టం ఏమీ జరగలేదు. తుర్రెబాజ్‌ఖాన్‌, మౌల్వీ అల్లావుద్దీన్‌ పోరాటస్థలం నుంచి పారిపోయారు. అయితే రెండురోజుల్లోనే తుర్రెబాజ్‌ఖాన్‌ను పోలీసుకాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్థితిలో మొగిలిగిద్ద (నేటి మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ సమీపంలో ఉన్నది) వద్ద అరెస్ట్‌ చేశారు. కొన్ని నెలల తరువాత అల్లావుద్దీన్‌ను మంగళపల్లి (రంగారెడ్డి జిల్లా) లో నిర్బంధించారు. తరువాత జరిగిన విచారణలో తుర్రెబాజ్‌ఖాన్‌ తాను తిరుగుబాటులో పాల్గొన్న మాట వాస్తవమేనని అంగీకరించాడు. తాను అనేకమందిని వారించానని, అయితే తాను మాత్రం రెసిడెన్సీ దాకా వచ్చానని సూఫీ వేదాంతి, శాంతికాముకుడు అయిన మౌల్వీ అల్లావుద్దీన్‌ అంగీకరించాడు. ఇద్దరూ ఒకరికొకరు పెద్దగా తెలియదని చెప్పుకున్నారు. నిజానికి – రెసిడెన్సీమీద దాడికి వెడుతున్నప్పుడు అల్లావుద్దీన్‌ తాను సైద్ధాంతిక నాయకత్వమే అందిస్తాను తప్ప ఆయుధం పట్టనని అన్నప్పటికీ, తుర్రెబాజ్‌ఖాన్‌ ప్రోద్బలంతో ప్రత్యక్షపోరాటంలో పాల్గొన్నాడు. వారి వాంగ్మూలాలేమైనప్పటికీ, బ్రిటిష్‌ కోర్టు అల్లావుద్దీన్‌కు, తుర్రెబాజ్‌ఖాన్‌కు ద్వీపాంతరవాస యావజ్జీవ శిక్ష, విధించింది. అల్లావుద్దీన్‌ను 1859 జూన్‌ 28 నాడు అండమాన్‌ జైలుకు తరలించారు. 1857 ఖైదీలకోసం అప్పుడప్పుడే నిర్మితమవుతున్న కారాగారంలో కఠిననిర్బంధ జీవితాన్ని అనుభవించి 1884లో అల్లావుద్దీన్‌ అక్కడే కన్నుమూశాడు. అండమాన్‌ కారాగారంలో శిక్ష అనుభవించిన ఏకైక హైదరాబాద్‌ రాజ్య ఖైదీ అల్లావుద్దీన్‌.

తుర్రెబాజ్‌ వీరమరణం

తుర్రెబాజ్‌ఖాన్‌ భవితవ్యం భిన్నంగా పరిణమించింది. అతనికి ద్వీపాంతర వాస శిక్ష తక్కువని, మరణశిక్ష విధించాలని రెసిడెంట్‌ పై అధికారులకు సూచించాడు. కానీ, గవర్నర్‌ జనరల్‌ శిక్షతీవ్రతను పెంచలేదు. అండమాన్‌కు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్న దశలో, జైలు సెంట్రీల సహకారంతో 1859 జనవరి 18 నాడు అతను నిర్బంధం నుంచి తప్పించుకున్నాడు. అతన్ని పట్టి ఇచ్చినవారికి 5వేల రూపాయల బహుమానం ప్రకటించారు. కానీ మరో ఆరురోజుల్లోనే అతని సమాచారం కుర్బాన్‌ అలీ అనే వ్యక్తికి చిక్కింది. అతను పోలీసులను తీసుకుని అక్కడికి వెళ్లినప్పుడు జరిగిన ఘర్షణలో తుర్రెబాజ్‌ ఖాన్‌ మరణించాడు. తర్వాత అతని మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చి, రెసిడెన్సీ ప్రాంతంలోనే బహిరంగంగా కొన్ని రోజుల పాటు వేలాడదీశారు. దీనితో హైదరాబాద్‌లో బ్రిటిష్‌వారికి దడపుట్టించిన అధ్యాయం ముగిసింది. తరువాత కూడా అనేక చెదురుమదురుసంఘటనలు జరుగుతూనే ఉన్నాయి కానీ అవేవీ పెద్ద పోరాటాలుగా పరిణమించలేదు.

నేపథ్యం

తాంత్యా తోపే, నానాసాహెబ్‌ హైదరాబాద్‌ రాజ్యంలో చేసిన ప్రచారం, మక్కామసీదు గోడలపై అంటించిన ఉద్యమ ప్రచార పోస్టర్లు, బ్రిటిష్‌వారిపై ‘జిహాద్‌ ‘ ప్రకటించిన మౌల్వీల ఆగ్రహం, ఆంగ్లేయులకు మొదటి సాలార్‌జంగ్‌ అందించిన సహకారం, వెన్నెముక లేని నిజాం అఫ్జలుద్దౌలా కొత్తగా అధికారంలోకి రావడం- ఈ పరిణామాలన్నీ కలిసి హైదరాబాద్‌లో 1857 సన్నివేశాలను రచించాయి. హైదరాబాద్‌లో రాజుకున్న నిప్పు దావానలం కాకుండానే చల్లారిపోయింది. ఉత్తరాదిన భగ్గుమంటున్న తిరుగుబాటుకు దక్షిణ పవనాలు తోడయి ఉంటే బ్రిటిష్‌ పాలన ఆనాటితోనే ముగిసిపోయి ఉండేది.

మీరట్‌లో 1857 మే 10 నాడు ఆరంభమైన తొలిసంగ్రామం గురించి హైదరాబాద్‌లో కూడా విస్త­ృతంగా చర్చలు జరిగాయి. అప్పటికి హైదరాబాద్‌ రాజ్యం పేరుకు మొగల్‌ సామంతరాజ్యంగా వ్యవహరిస్తున్నా, ఆచరణలో బ్రిటిష్‌వారి కనుసన్నలలో పాలనసాగించేది. ఆనాడు నిజాం జారీచేసే ఫర్మానాలు కూడా మొగల్‌ చక్రవర్తిపేరిటే వెలువడేవి. నాణేల మీద మొగల్‌ చిహ్నమే ఉండేది. నిజాం వారసుల ప్రకటన కూడా ఢిల్లీనుంచే జరిగేది. హైదరాబాద్‌ రాజ్యంపై 1798 సంవత్సరంలో సైన్యసహాయసంధిని బలవంతంగా రుద్దిన బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు, నిజాంకు సొంతసైన్యం లేకుండా చేశారు. మరే విదేశంతోనూ హైదరాబాద్‌ వ్యవహరించకుండా కట్టడిచేశారు. ఆ ఒప్పందం ఫలితంగానే- నిజాం రక్షణకుగాను బ్రిటిషర్లు నిర్వహించే సైనికపటాలంగా- సికింద్రాబాద్‌ అవతరించింది. నాటినుంచి హైదరాబాద్‌ రాజ్యంలో పెరుగుతున్న బ్రిటిష్‌ పలుకుబడిని అడ్డుకునేందుకు పాలక కుటుంబంలోను, ప్రజలలోను అనేక తిరుగుబాట్లు జరిగాయి. సైన్యంలో కూడా చెదురుమదురు సంఘటనలనేకం జరిగాయి. 1857 నాటికి ఈ అసమ్మతి, అసంతప్తి, వ్యతిరేకత – ప్రతిఘటన రూపం తీసుకున్నాయి. తూటాలకు పందికొవ్వు లేదా ఆవుకొవ్వు పూయడం అన్నది తిరుగుబాటుకు తక్షణ ప్రేరణా, అగ్నికి ఆజ్యమూ మాత్రమే.

సాలార్‌జంగ్‌ ప్రభుభక్తి

నిజాం సైన్యాన్ని నియంత్రించే కుట్రలో భాగంగా బ్రిటిష్‌ రెసిడెంట్లు తమకు అనుకూలురైనవారిని హైదరాబాద్‌ ప్రధానులుగా, ఇతర ఉన్నతాధికారులుగా నియమించడం చేసేవారు. ఫలితంగా అధికారయంత్రాంగంలో స్థానికుల ప్రాధాన్యం తగ్గిపోయింది. నాటివరకు నిజాంసైన్యంలో విడదీయరాని భాగంగా ఉన్న అరబ్బులు, రోహిల్లాలకు గుర్తింపు తగ్గిపోతూ వచ్చింది. అంతకుముందు, 1839లో వహాబీ ఉద్యమకారులు బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు భావాలను ప్రచారం చేసినప్పుడు, వారికి మద్దతుగా నిలబడిన నిజాం వంశీకుడు ముబారిజుద్దౌలా 1854లో గోలకొండలో నిర్బంధంలో మరణించడం హైదరాబాద్‌ ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించింది. నిజాం ప్రభుత్వానికి అప్పులిచ్చి, వసూళ్ల పేరిట రాజ్యంలోని రెవిన్యూ అధికారాలను కైవసం చేసుకున్న బ్రిటిష్‌ ఆర్థిక సంస్థలపై కూడా తీవ్రవ్యతిరేకత నెలకొన్నది. సికింద్రాబాద్‌లో సైన్యం నిర్వహణ ఖర్చులను చెల్లించలేక బకాయిపడిన నిజాముల దగ్గరనుంచి ఈస్టిండియా కంపెనీ 1853లో బేరార్‌, రాయచూరు, ఉస్మానాబాద్‌ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం అసంతప్తిని మరింతగా రగిలించింది.

బేరార్‌ బదలాయింపును అప్పటి నిజాం నాసిరుద్దౌలా బహిరంగంగా వ్యతిరేకించాడు. ఈ ప్రాంతాలను బ్రిటిష్‌వారికి బదలాయిస్తూ ఒప్పందం చేసుకున్న హైదరాబాద్‌ ప్రధానమంత్రి సిరాజ్‌ ఉల్‌ ముల్క్‌ మరణించిన అనంతరం సాలార్‌జంగ్‌ (ప్రథమ) పదవీ బాధ్యతలు స్వీకరించాడు. బ్రిటిష్‌వారిపై నిరసనభావం ఉన్న నాసిరుద్దౌలా 1857 మే 16న- అంటే ఉత్తరాదిన యుద్ధవాతావరణం నెలకొన్న తరువాత- మరణించారు. అతని కొడుకు అఫ్జలుద్దౌలా కొత్త నిజాం అయ్యాడు. అతనికి రాజకీయ అవగాహన, స్వతంత్రభావాలు తక్కువ. ఈ పరిణామాల నేపథ్యంలో 1857లో ఈ సంఘటన జరిగే నాటికి మొదటి సాలార్‌జంగే తిరుగులేని అధికారం చెలాయిస్తున్నాడు. హైదరాబాద్‌రాజ్యంలో రెవెన్యూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆధునికుడుగా, విద్య రవాణా కమ్యూనికేషన్‌ సదుపాయాలను ప్రారంభించిన సమర్ధుడుగా చరిత్రలో కీర్తి సంపాదించుకున్న సాలార్‌జంగ్‌ – ప్రథమ స్వాతంత్య్ర సమరంలో మాత్రం బ్రిటిష్‌వారి దాసానుదాసుడిగా వ్యవహరించాడు. 1857 తిరుగుబాటుదారులను వేటాడడంలో బ్రిటిష్‌వారికంటె ఉత్సాహం చూపించాడు. బ్రిటిష్‌వారి అధీనం కాకుండా, ఆశ్రయం కోరడానికి వచ్చిన సురపురం రాజా వెంకటప్ప నాయక్‌ను తానే స్వయంగా బ్రిటిష్‌ అధికారులకు అప్పగించాడు. సిపాయిల తిరుగుబాటు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌కు పాకి, ఆ తరువాత హైదరాబాద్‌కు కూడా అంటుకుంటుందనే భయంతో- బ్రిటిష్‌ ఇండియా పౌరులెవరైనా సికింద్రాబాద్‌ దాటి రావాలంటే పాస్‌పోర్ట్‌చూపించాలనే నిబంధన విధించాడు. ఇంతగా విదేశభక్తి చూపించినందువల్లనే – అతని మీద అనేక మార్లు హత్యాయత్నాలు జరిగాయి.

డేవిడ్‌సన్‌ వేగులు

1857 తిరుగుబాటు నాటికి హైదరాబాద్‌లో బ్రిటిష్‌రెసిడెంట్‌గా ఉన్న కల్నల్‌ డేవిడ్‌సన్‌ బాధ్యతలు స్వీకరించి ఏడాది కూడా కాలేదు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను దష్టిలో ఉంచుకుని డేవిడ్‌సన్‌ అప్పటికి హైదరాబాద్‌ ప్రభుత్వ గూఢచారి వ్యవస్థకు సమాంతరంగా సొంతంగా వేగుల వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నాడు. అ ందువల్లనే జులై17 నాడు రెసిడెన్సీపై జరిగిన దాడి గురించి సాలార్‌జంగ్‌కు సమాచారం లేకున్నా, డేవిడ్‌సన్‌ పసిగట్టగలిగాడు, ముందుజాగ్రత్తతో దాడిని విఫలం చేయగలగాడు. హైదరాబాద్‌ వ్యవహారాలపై మంచి పట్టు ఉన్న డేవిడ్‌సన్‌ నాటి ప్రతికూల పరిస్థితిని కూడా అనుకూలంగా మలచుకుని నిజాంను మరింతగా లొంగదీయగలిగాడు. స్వతహాగా సైనికుడైన డేవిడ్‌సన్‌ రెసిడెన్సీపై దాడిసమయంలో ఎంతో నిబ్బరంగా కూడా వ్యవహరించాడు. “నేను ఇక్కడే మరణించడానికి సిద్ధపడి వచ్చాను. ప్రాణమున్నంతవరకు పోరాడతాను” అని అతను సాలార్‌జంగ్‌తో అన్నాడు.

హైదరాబాద్‌ కీలకం

రెసిడెన్సీమీద దాడి కానీ, తుర్రెబాజ్‌ ఖాన్‌ ఆత్మత్యాగం కానీ, అల్లావుద్దీన్‌ అండమాన్‌ నరకవాసం కానీ 1857 పోరాటంతో పోలిస్తే చాలా చిన్నవే. సందేహం లేదు. కానీ, హైదరాబాద్‌ రాజ్యం నాటి బ్రిటిష్‌ మహాసామ్రాజ్యానికి ఎంత కీలకమైనదో తెలుసుకుంటే, ఇక్కడి పోరాటం విలువ అవగతమవుతుంది. దేశమంతా అగ్నిగుండంగా మారి, త్వరలోనే తెల్లవారిని తిరుగుబాట పట్టిస్తామన్న నమ్మకం దేశీయులలో బలపడుతున్న సమయంలో- హైదరాబాద్‌లో కూడా అగ్గిరాజుకుంటే పరిస్థితి ఏమిటన్న ఆందోళన పరపాలకులలో కలిగింది. దేశీయసైనికులను నమ్మలేని పరిస్థితి. దేశం కాని దేశం నుంచి వచ్చి భారతదేశంలో సైనికవృత్తిలో స్థిరపడ్డ రోహిల్లాలు, అరబ్బులు కూడా బ్రిటిషర్లపై కత్తులు నూరుతున్న కాలం అది. ఇంత పెద్ద దేశాన్ని నిజంగా సైనికంగానే అదుపు చేయవలసి వస్తే కావలసినంత సైన్యం సామ్రాజ్యవాదుల వద్ద లేదు. ఆ సమయంలో హైదరాబాద్‌, నిజాం, సాలార్‌జంగే బ్రిటిషర్లకు కొండంత అండ అయ్యారు. పెనుప్రమాదం నుంచి రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులను రక్షించారు. అందువల్లనే – నిజాంసేవలకు ప్రతిఫలంగానే – రాయచూర్‌, ఉస్మానాబాద్‌లను బ్రిటిషర్లు తిరిగి ఇచ్చారు. హైదరాబాద్‌ రాజ్యంతో సహా ఏ స్వదేశీ సంస్థానాన్నీ విలీనం చేసుకోబోమని హామీ ఇచ్చారు. పెద్ద రుణభారాన్ని మాఫీచేశారు. ‘హైదరాబాద్‌ కనుక అటు తిరిగిపోతే మన పని ఖాళీ’ అని బ్రిటిషర్లు అనుకున్నారంటేనే నిజాంరాజ్యానికి వారి దష్టిలో ఉన్న ప్రాధాన్యం అర్థం అవుతుంది. నిజాముతో సహా దక్కన్‌ ప్రజలంతా తెల్లవారికి దాసోహం అనలేదని, ఇక్కడా ప్రతిఘటన ఉన్నదని చరిత్రకు చాటి చెప్పినందుకు- తుర్రెబాజ్‌ఖాన్‌, అల్లావుద్దీన్‌ చిరస్మరణీయులవుతున్నారు.

ఇప్పటివరకు వచ్చిన చరిత్రపుస్తకాలలో తగినంత ప్రాధాన్యం దక్కనప్పటికీ, తుర్రెబాజ్‌ఖాన్‌, అల్లావుద్దీన్‌లతో పాటు రఫత్‌ అలీ, అబ్దుల్‌వాహెబ్‌, కౌలాస్‌రాజా దిలీప్‌ సింగ్‌, మోర్తాడ్‌ జమీందార్‌ రుక్మారెడ్డి, రాంజీగోండు, సురపురం రాజా వెంకటప్ప నాయక్‌, వెంకటాచారి మొదలైన ఎందరో వీరులు సామ్రాజ్యవాద వ్యతిరేక యోధులుగా భవిష్యత్తులో పునఃప్రతిష్ఠితులవుతారు.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: