ఈ సమైక్య రాగం ఎవరి మేలు కొరకు?

నిన్న రాత్రి సెలూన్ కి వెళ్తే అక్కడ మన లగడపాటి రాజ్ గోపాల్ గారితో టివీ9 ఫోన్ ఇన్ ప్రోగ్రాం వస్తోంది. 610 జీవో, గురించి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి మనవాడి ప్రేలాపలనలు విని ముందు నవ్వొచ్చింది. ఆ తరువాత కోపమూ వచ్చింది. (వెనకటికోసారి అయ్యవారు ఇలానే అర్ధ సత్యాలను అసలు సత్యాలుగా చెలామణీ చెయ్యబోతే నేను నోరు మూసుకోమని సలహా ఇచ్చాను నా బ్లాగులో)

తెలంగాణా విషయం లోనే ఎందుకు ఇన్ని అబద్దాలు? సమైక్యత, తెలుగు జాతి అనే సెంటిమెంట్ ఆయింట్మెంట్ పూతల వెనుక ఎందుకు ఇన్ని దుర్మార్గపు ఎత్తుగడలు? పక్క వాడి నోటి కూడును లాగేసుకునే క్షుద్ర క్రీడలు?

రాజ గోపాల్ గారు అంటారు: ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చెస్తే హైదరాబాద్ జిల్లాకు చెందిన వారే హైదరాబాద్ లో ఉండాలని, తక్కిన 22 జిల్లాల వారూ వెనక్కి పోవాల్సి వస్తుందని. ఎంత అందంగా, నమ్మేట్టుగా ఉందో చూడండీ అబద్దం.

అయ్యా రాజ గోపాల్ గారూ. 1975 లో స్వయానా రాష్ట్రపతి ఈ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు చాలా చరిత్ర నడిచింది. రాష్ట్రం ఏర్పడడమే ఒక “పెద్ద మనుషుల ఒప్పందం” ప్రాతిపదిక పై జరిగింది. కోస్తాంధ్ర ప్రజలు నుండి ఎప్పటికైనా ముప్పు తప్పదని తెలంగాణా ప్రాంతీయులకున్న న్యాయమైన అనుమానం తీర్చడానికి అన్ని విధాలా హామీలు ఈ ఒప్పందం ద్వారా సమకూర్చుకున్న తరువాతనే తెలంగాణా, ఆంధ్ర తో కలిసింది.

గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, తెలంగాణ తో దాదాపు సమానంగా నిర్లక్షానికి లోనైన రాయలసీమ ప్రాంతీయులు కూడా కోస్తాంధ్ర తో కలిస్తే తమకు అన్యాయం జరుగుతుందని అనుమాన పడ్డారు. అలా జరగకుండా శ్రీ బాగ్ ఒప్పందం ఏర్పాటు చేసుకున్నారు.

పెద్ద మనుషుల ఒప్పందం లోని హామీలు అన్నీ తుంగలో తొక్కడంతో ఆవేదనకు గురైన తెలంగాణా ప్రజలు 1969 లో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. ఆ ఉద్యమం లో భారీ సంఖ్యలో పాల్గొన్న విద్యార్ధుల్లో నాలుగు వందల పై చిలుకు మందిని నిరంకుశంగా హతమార్చింది మన రాష్ట్ర ప్రభుత్వం.

ఉద్యమం అణిచి వేసి 1973 లో స్థానిక అభ్యర్ధులకు రక్షణ కలిపించడం కొరకు Six Point Formula ను ప్రకటించింది ప్రభుత్వం.

ఆ తరువాత రాజ్యాంగం లో 371-D సవరణ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లో విద్య, ఉపాధి రంగాల్లో స్థానికులకు రక్షణలు ఏర్పాటు చెయ్యబడ్డాయి.

ఇన్ని జరిగినా స్థానికులకు దక్కాల్సిన ఉద్యోగాలు అడ్డదారిన వేరే ప్రాంతాల వారు కొల్లగొట్టుకుపోతుండటం తో ఎన్.టీ.ఆర్. హయాం లో 30-12- 1985 నాడు స్థానికేతర ఉద్యోగులను re-patriate చెయ్యాలనే 610 జీవో వెలువరించారు. (జీవో ఇక్కడ చదవచ్చు:http://telanganautsav.wordpress.com/2007/06/15/go-ms-610-and-mulki-rules-six-point-formula-presidential-order-1975-repatriation-of-non-locals/)

దాన్ని 22 ఏళ్లు గడిచినా అమలు జరపకుండా అడ్డుకుంటున్నారు ఆంధ్రా లాబీ.

ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం రాష్ట్రాన్ని మొత్తం 6 జోన్లుగా విభజించారు. APPSC -Andhra Pradesh Public Service Commission చేసే నియామకాల్లో అధిక శాతం ఈ జోన్ల వారీగానే జరుగుతాయి. ఆ జోన్ల వివరాలు ఇవీ:

జోన్ 1: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం
జోన్ 2: తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా
జోన్ 3: గుంటూర్. ప్రకాశం, నెల్లూరు
జోన్ 4: అనంతపూర్, కర్నూల్, కడప, చిత్తూరు
జోన్ 5: అదిలాబాద్, కరీం నగర్, వరంగల్, ఖమ్మం
జోన్ 6: హైదరాబాద్, రంగా రెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ

ఇందులో గమనించాల్సింది ఏమిటంటే తెలంగాణా జిల్లాలైన జోన్ 5 వారు కూడా జోన్ 6 లో నాన్-లోకల్ కోటాకు మించి ఉండటానికి వీలులేదు.

టీచర్ పోస్టుల వంటివి మాత్రం DSC -District Service Commission భర్తీ చేస్తుంది. డిఎస్సీ ద్వారా భర్తీ అయ్యే ఉద్యోగాల్లో మాత్రం ఏ జిల్లా వారు ఆ జిల్లాలోనే లోకల్ అభ్యర్దులు. పక్క జిల్లాలో వారు నాన్ లోకల్ అభ్యర్ధులవుతారు.

వాస్తవం ఇలా ఉంటే, ఆంధ్రా లాబీ పైరవీలు ఎక్కడిదాకా పోయాయంటే, రాష్ట్రపతి ఉత్తర్వులకు భిన్నంగా అక్రమంగా ఒక “జోన్ 7” ను సృష్టించారు.

సాక్షాత్తూ APPSC వెబ్ సైట్ ఎంత అసంబద్ధంగా పై లైనులో రాష్ట్రం లో 6 జోన్లు ఉన్నాయని రాసి కింద టేబుల్ లో మాత్రం జోన్ 7 గురించి రాసిందో చూడండిక్కడ.

7thzone.jpg

610 జీవో గెజిటెడ్ పోస్టులకు వర్తించదు కాబట్టి అంతకు ముందు నాన్-గెజిటెడ్ పోస్టులుగా ఉన్న వాటిని గెజిటెడ్ గా మార్చారు. ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఒక ప్రత్యేక ఆఫీసు ఏర్పాటు చేసి అది 610 పరిధిలోకి రాకుండా చూసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇవన్నీ సాక్షాత్తూ ప్రభుత్వమే నియమించిన గిర్ గ్లానీ కమీషన్ గుర్తించింది.

రాజ్యాంగానికైనా విలువ ఉందా ఈ రాష్ట్రం లో?

అన్ని నియమాలకూ తిలోదకాలిచ్చి ఒక ప్రాంతం వారి పొట్టగొట్టి పాడుతున్న ఈ సమైక్య రాగం ఎవరి మేలు కొరకు?

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: