610 కూ పాకిస్తాన్ కూ పోలికేమిటి?

610 జీవో గురించి గత నెల రోజులుగా చాలా వాడిగా, వేడిగా చర్చ సాగుతున్నది. ఈ చర్చలో సంయమనం కోల్పోయిన రాజకీయ నేతలు అనవసరంగా రెచ్చగొట్టే మాటలు కూడా ఉపయోగిస్తున్నారు. తలా ఒక మాట అంటూ అసలు సమస్య మరుగున పడి ఏవేవో అపోహలూ, అపార్ధాలు, పెడార్ధాలు మధ్యలోకి వచ్చాయి.

(శోధన) సుధాకర్ ఈ పరిస్థితి పై ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక పోస్టు కూడా చేశాడు. అక్కడక్కడ బ్లాగర్లు రాసిన కామెంట్లు కూడా చదివాను. చాలా రోజులుగా ఈ విషయం పై రెండు ముక్కలు రాద్దామనుకుని వాయిదా వేస్తున్నాను. ఇప్పుడు రాస్తున్నాను.

ఇప్పుడు 610 జీవో పై వస్తున్న విమర్శల్లో ప్రముఖంగా వినపడుతున్నది “మమ్మల్ని పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్లలాగా తరిమేస్తున్నారు. మాకిక్కడ ఉద్యోగం చేసుకునే హక్కు, ఉండే హక్కు లేవా?” అనేది

610 జీవో గురించి ఇటువంటి ప్రశ్నలు అడిగే వారు రెండు రకాలు. ఒక రకం 610 జీవో పూర్వాపరాలు తెలియని వారు. బహుశా సుధాకర్ కూడా తెలియకనే అటువంటి కామెంట్ చేస్తున్నాడు. ఇక రెండో రకం అన్నీ తెలిసి సమస్యను పక్కదోవ పట్టించే ఉద్దేశంతో ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్లు.

మనకు ఒక యూనివర్సిటీ లో సీటు కావాలన్నా, లేక ప్రభుత్వ ఉద్యోగం కావాలన్నా దాన్ని పొందడానికి ఒక పద్ధతి ఉంటుంది. సాధారణంగా ఒక ప్రవేశ పరీక్ష, ఆ తరువాత ఒక ఇంటర్వ్యూ ఉంటాయి. మొత్తం ఉన్న సీట్లు/ఖాళీల్లో కొన్ని జనరల్ క్యాటగిరి కొన్ని రిజర్వుడు (స్త్రీలు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఎన్సీసీ, వికలాంగులు లాంటివి) క్యాటగిరిలో ఉంటాయి. సాధారణంగా 85% సీట్లు/ఖాళీలు స్థానికులకు (Locals) మిగతా 15% స్థానికేతరులకు (Non-locals) రిజర్వ్ చేయబడి ఉంటాయి. ఎక్కడి భూమిపుత్రులకు అక్కడ విద్య/ఉద్యోగం ఉండాలని, ఒక ప్రాంతం వారు మరో ప్రాంతం వారి పై ఆధిపత్యం చెలాయించకుండా స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే ఈ పద్ధతి పాటించడం మొదలు పెట్టారు.

మనందరికీ ఈ విషయాలు తెలుసు.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు కూడా ఈ రాష్ట్రం లో ప్రభుత్వ ఉద్యోగాల్లో/ విద్యా సంస్థల్లో అటువంటి నిబంధనలే ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్రం ఏర్పడ్డ కొద్ది సంవత్సరాలకే ఈ ఉద్యోగాల్లో స్థానికేతరులు 15% శాతం మించొద్దు అన్న రూల్ తుంగలో తొక్కడం ప్రారంభం అయ్యింది. తప్పుడు ధృవీకరణ పత్రాలు, డెప్యుటేషన్ల వంటి అడ్డ దారుల్లో ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు హైదరాబాద్ రావడం మొదలైంది.

దీనివల్ల తెలంగాణ వాసులకు గత 3-4 దశాబ్దాలుగా ప్రభుత్వ ఉద్యోగాల విషయం లో తీరని అన్యాయం జరిగింది. తెలంగాణా లో స్థానికేతర ఉద్యోగులు లక్షల్లోనే ఉన్నారని అంచనాలు ఉన్నాయి.

ఎన్.టీ.ఆర్ కాలం లో ఇలా అక్రమంగా తెలంగాణాలో ఉద్యోగం చేస్తున్న వారిని వెనక్కి పంపడానికి 610 జీవో తీసుకు వచ్చారు. అది అమలు జరపకుండా అడుగడుగునా ఆంధ్ర ప్రాంత నేతలు అడ్డు పడడం తో అది రెండు దశాబ్దాలుగా జీడి పాకంలా సాగుతోంది.

మీరే ఒక్కసారి ఆలోచించండి, తప్పుడు నివాస ధృవీకరణలతో, ప్రభుత్వ నియమాలకు వ్యతిరేకంగా ఉద్యోగాల్లో కొనసాగుతున్న ఆంధ్రా ప్రాంతం వారిని ఉద్యోగాల్లోంచి తొలగించాలని మేం కోరడం లేదు. అలా చేసి వారి పొట్ట కొట్టడం మా ఉద్దేశం కాదు. వారికి వారి లోకల్ ఏరియాలో సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి అక్కడికి బదిలీ చేయాలంటున్నాం. తద్వారా ఏర్పడే లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు తెలంగాణా భూమి పుత్రులకు దక్కాలని ఆరాటపడుతున్నాం. ఈ న్యాయమైన ఆకాంక్షకు కూడా మీబోటి వారు పెడార్ధాలు తీస్తే ఎలా? ఇలా అక్రమంగా ఉద్యోగాలు సంపాదించడం కరెక్టే నని మీరు చెప్పదలుచుకున్నారా?

మీరే కనుక ఒక సంస్థ లో తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి ఉద్యోగం పొందినట్లు తేలితే ఆ కంపెనీ ఏం చేస్తుందో ఆలోచించండి.

ఆంధ్రా వాళ్లు తెలంగాణాలో ఉండొద్దు అని కానీ, ఉద్యోగాలు చెయ్యొద్దని కానీ ఎవరూ అనడం లేదు. కానీ అన్ని నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ప్రభుత్వోద్యోగాలు చేజిక్కించుని, ఇక్కడి వారికి దక్కాల్సిన న్యాయమైన వాటా కొల్లగొట్టుకుపోతుంటే ఎంత కాలమని ఉపేక్షిస్తారు ఎవరైనా? దేనికైన ఒక పద్ధతి అంటూ ఉంది కదా.

ఇవన్నీ ఆలోచిస్తున్నాం కాబట్టి ఒకసారి ఆంధ్రా ప్రాంతం లో తెలంగాణా వారు ఎంత మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారో కూడా గమనించండి. విద్య, ఉద్యోగం, వైద్యం వంటివి ఉన్నప్పుడు తెలియదు వాటి విలువ. మనకు న్యాయంగా దక్కల్సినవి మరొకరు అన్యాయంగా తన్నుకుపోతేనే తెలుస్తుంది ఆ బాధేమిటో.

ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరూ గమనించని విషయం ఒకటి మీ దృష్టికి తీసుకు రాదలిచాను. 610 జీవో కేవలం ఆంధ్రా ప్రాంతం వారిని ఉద్దేశించింది కాదు. ఇది అన్ని ప్రాంతాల వారికీ వర్తిస్తుంది.

610 జీవో పూర్వాపరాల పైన ఎన్. వేణుగోపాల్ గారు ఒక మంచి వ్యాసం రాశారు. దాన్నిక్కడ చదవచ్చు.

నోట్: జీవో 610 పై జరుగుతున్న చర్చలో కేసీయార్ వాడిన పదజాలం తో పాటు హరి రామ జోగయ్య, టీ. జీ. వెంకటేష్ వ్యాఖ్యల్ని కూడా ఖండించాలి. అందులో మినహాయింపేమీ లేదు.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: