అరకు లోయ అందాలు ఇక చరిత్రేనా? – 3

araku821.jpg

కాసేపటికే రూం సర్వీస్ చేస్తున్న పెద్దావిడ వచ్చి “లంచ్ టైం ఐపోతుందని” చెప్పింది. ఐదు నిముషాల్లో రిసార్టులో ఉన్న చిన్న రెస్టారెంటుకి వెళ్లాం. చుట్టూ వేరే టేబుల్స్ పై కూర్చున్న వాళ్లను చూస్తే ఒక్క తెలుగు మనిషీ కనిపించలేదు. కాసేపటికి ఆ రిసార్టులో ఉన్న వాళ్లలో అత్యధికులు బెంగాలీలేలని అర్ధం అయ్యింది.

రిసార్ట్ మేనేజర్ ను అడిగితే ఈ టైంలో బెంగాలీలు ఎక్కువగా వస్తుంటారని చెప్పాడు. వైజాగ్ కు కలకత్తా నుండి నేరుగా రైలు మార్గం ఉండడం వల్ల అక్కడి నుంచి టూరిస్టుల రాక బానే ఉండేట్టుంది.

భోజనం చేయగానే అక్కడి రిసార్ట్ మేనేజర్ ను అడిగాం ఎక్కడెక్కడికి వెళ్లాలని. మరి కాసేపటిలో పున్నమి గెస్ట్ హౌస్ దగ్గర ధింసా డాన్స్ ఉంటుందని చెప్పాడు. అక్కడే ఉన్న టాక్సీవాలా వచ్చి అరకులో చూడాల్సిన ప్రదేశాలు అన్నీ చూపిస్తానని, 500 అవుతుందని చెప్పాడు. మేము 350 రూపాయలకు బేరం కుదుర్చుకున్నాం.

ముందు ఏపీ టురిజం వారి గెస్ట్ హౌస్ వద్దకు వెళ్లి అక్కడ ధింసా నృత్యం చూశాం. ముందు రోజు మాతో రైల్లో వచ్చిన మా ఆఫీసు కొలీగ్స్ కూడా అక్కడే కనిపించారు.

dhimsa.jpg

డాన్స్ అయిపోయాక అక్కడి నుంచి బొటానికల్ గార్డెన్స్ కు వెళ్లాం. శిధిలావస్థలో ఉన్నా కూడా ఆ గార్డెన్స్లో కలపతో నిర్మించిన కాటేజ్ చాలా బాగుంది. ఇక ఆ ఉద్యానవనంలో విరిసిన రకరకాల పుష్పాలను నా కెమెరాలో బంధించాను (?) అక్కడే ఉన్న సావనీర్ షాపులో స్వర్ణ కాసేపు షాపింగ్ చేసింది. అక్కడినుంచి అరకులో షూటింగులకు బాగా పేరొందిన జలపాతం వద్దకు బయల్దేరాం. ఆ దారి పొడవునా మా టాక్సీ డ్రైవర్ మాకు అరకులో ఎక్కడెక్కడ ఏ సినిమా షూటింగ్ జరుపుకుందో చెప్తూ గైడులా వ్యవహరించాడు.

botanical.jpg

దారి పొడవునా అక్కడక్కడా కొండ వాగులు కనపడుతూనే ఉన్నాయి. ఇక అరకు కొండల్లో అనేక చోట్ల కనిపించే పచ్చని పువ్వుల తోటల వద్ద ఆగి ఒక ఫొటొ తీసుకున్నాం (మొదట్లో ఇక్కడి గిరిజనులు ఈ పంటను ఇందులోంచి వచ్చే నూనె కోసం సాగు చేసేవారట. ఇప్పుడు చాలా మంది సినిమా షూటింగులవారి కోసమే సాగు చేస్తున్నారట) జలపాతం వద్దకు చేరుకున్నాక గంగోత్రి సినిమా లో చూపించిన జలపాతం ఇదేనని చెప్పాడు మా డ్రైవర్.

అక్కడ ఉన్న రైలింగ్ గోడలకు ‘బాక్సైట్ వ్యతిరేక పోరాట కమిటీ” వేసిన పోస్టర్లు ముంచుకొస్తున్న ముప్పును మళ్లీ గుర్తుకు చేశాయి. అరకు అనంతగిరి కొండల్లో ఉన్న బాక్సైట్ నిక్శేపాలు మైనింగ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జిందాల్ సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అది కార్య రూపం దాలిస్తే ఈ ప్రాంతపు రూపురేఖలు మారిపోవడం ఖాయం. బైలడిల్లలో ఇప్పుడు NMDC, ఎస్సార్ కంపెనీలు జరుపుతున్న మైనింగ్ వల్ల అక్కడ పరిసరాలు ఎంత కలుషితం అయ్యాయో, స్థానికులకు మంచి నీళ్లు అందించే శంఖినీ, డంఖినీ నదులు ఎలా విషతుల్యం అయ్యాయో చదివాను నేను. ఇప్పుడు ఎస్సార్ కంపెనీ నిర్మిస్తున్న ముడి ఇనుము స్లర్రీ పైప్ లైన్ ఈ కొండలను చీల్చుకుంటూ వెళ్తోంది. ఈ గిరిజనుల కాళ్ల కింద ఉన్న విలువైన ముడి ఖనిజాలు పైపులైన్ల గుండా, రైల్వే లైన్ల గుండా మన రేవులకు, అక్కడి నుండి ఏడేడు సముద్రాలు దాటి బహుళజాతి కంపెనీల ధనకాంక్షను తీరుస్తాయి. డబ్బులు వాడికి, వళ్లు గుల్లైయేది మన అడవి బిడ్డలది. ఇదీ కొత్త అభివృద్ధి నమూనా ఆవిష్కరిస్తున్న భవిష్యత్ చిత్రం.

ఇంకా సూర్యాస్తమయం కాకుండానే చలి కమ్ముకోవడం మొదలైంది. అక్కడి నుంచి తిరిగి రిసార్ట్ చేరుకునే సరికి దాదాపు ఏడు అయ్యింది.

మరునాడు ఉదయాన్నే లేచి మా రూం కిటికీలోంచి చూస్తే…ఓహ్..పొగమంచు దుప్పటి కప్పుకున్న అరకు ముగ్ధ మనోహరంగా కనిపించింది. అలా కొండల్లోకి వాకింగ్ కు వెళ్దామని స్వర్ణని అడిగితే, బాగా అలసిపోయాను నువ్వు వెళ్లి రా అంది. సరేనని కెమెరా భుజాన వేసుకుని అలా నడుస్తూ పోయా ఆ వేకువజాము దృశ్యాలను కళ్ల నిండా నింపుకుంటూ ఓ రెండు గంటలు ఆ పరిసరాలన్నీ చుట్టేసి వచ్చాను.

araku832.jpg

ఉదయం తొమ్మిదింటికి రిసార్ట్ ఎదురుగానే ఉన్న ట్రైబల్ మ్యూజియం కు వెళ్లాం. గిరిజనుల జీవన విధానం, వారి ఆచార వ్యవహారాల గురించి ఎంతో విలువైన సమాచారం ఉంది అక్కడ. కొన్నాళ్ల తరువాత గిరిపుత్రుల జీవనం గురించి తెలుసుకోవాలంటే ఇలాంటి మ్యూజియాలే శరణ్యమేమో అనిపించింది నాకు.

museum.jpg

పదకొండింటికి బొర్రా గుహలకు బయల్దేరాం. దారిలో వ్యూ పాయింట్ వద్ద ఆగాం. ఎత్తైన ఆ ప్రదేశం నుంచి చుట్టూ ఉన్న breathtaking view చూడాల్సిందే కానీ మాటల్లో చెప్పడం కుదరదు. దారిలో కాఫీ తోటల వద్ద కూడా ఆగి వాటిని చూశాక బొర్రాకు చేరుకున్నాం.

borra1.jpg

సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఈ భారీ గుహ చూసి తీరవల్సిన అద్భుతం. లోపల టూరిజం వారు చేసిన రంగు రంగుల లైటింగ్ ఆ గుహలకో వింత శోభను కలుగజేసింది. బొర్రా గుహల వద్ద ఉండే పాక హోటల్ లో చక్కని భోజనం చేశాం. కాసేపు రెస్ట్ తీసుకును రెండింటికి వైజాగ్ బస్సెక్కాం.

అరకు పర్యటన ఎంతో అహ్లాదకరమైన అనుభవం. కానీ ఇక్కడి ప్రజల భవిష్యత్తును తలుచుకుంటే మాత్రం దిగులేస్తుంది. అభివృద్ధిని మనమందరం పునర్నిర్వచించుకోవాల్సిన సమయం వచ్చిందని నాకనిపిస్తోంది.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: