దురహంకారపు ప్రేలాపన!

“ప్రపంచం రోజురోజుకీ బాధ్యతలేని ఆడవారితో నిండిపోతోంది.దానికి స్త్రీవాదమనీ చిలకడదుంప అనీ పేరుపెట్టి భావితరాలకి ఇంకా ఇంకా ద్రోహం చేస్తున్నారు.”

“గృహహింసలో అధికభాగం తల్లులు పిల్లలపై చేస్తున్న భౌతిక దాడులే.తమ మానసిక ఒత్తిళ్ళని పిల్లలపై తీర్చుకోవడం మూలంగా ఇది సంభవిస్తోంది.”

“నీటి సంపులో పడిపోయి చనిపోయిన ప్రతి పిల్లవాడి వెనుకా, ఇంటి ముందు ఆడుకుంటూ ఏ వాహనమో ఢీకొట్టి చనిపోయిన ప్రతి బిడ్డ వెనుకా ఓ బాధ్యతా రహితురాలైన తల్లి ఉంటుంది.”

“బడికి వెళ్ళే పిల్లలకి సరైన భోజనం ఇచ్చి పంపడానికి బద్ధకించి పసుపూ నిమ్మకాయ కలిపిన పాచికూడు పులిహోర పేరుతో కలిపి ఇచ్చే మిలియన్లాది తల్లులున్నారు ఆంధ్రాలో.”

“ఏ దేశంలో నయినా మగవాడి నుంచి సమాజం చాలా ఎక్కువ ఆశిస్తుంది.ఆడదాని పట్ల సమాజం ఎలాంటి భ్రమల్నీ ఆశల్నీ పెంచుకోదు”

“స్వయంకృషితో జీవితంలో ఓ స్థాయికి చేరుకున్న దశలో మాత్రమే మగవారు పెళ్ళిచేసుకుంటున్నారు.తండ్రులవుతున్నారు.ఈ విధమైన ఆంక్ష ఆడవారి మీద లేకపోవడం చేత పొద్దున లేవగానే బాత్‌రూమ్‌కి వెళ్ళడం ఎంత మామూలో పెళ్ళి కాగానే పిల్లల్ని కనడం బాధ్యతా రహితులైన ఆడవారికి అంత మామూలు విషయమైపోయింది.”

“తల్లికైనా సరే గౌరవమివ్వడం బేషరతు (unconditional) కాదు.”

ఇవి మొన్న మదర్స్ డే నాడు “తెలుగు జాతీయవాది” నంటూ గత కొంతకాలంగా ఒక బ్లాగు నడుపుతున్న అంబానాధ్ అనే బ్లాగర్ రాసిన “తల్లుల్ని తయారుచెయ్యాలి” అనే గొప్ప వ్యాసరాజం లోంచి కొన్ని ఆణిముత్యాల్లంటి వ్యాఖ్యలు. ఇవి చదివి మీలో కొందరికి అసహ్యం, జుగుప్స లాంటి భావాలు కలగవచ్చు. ఇంకొందరు ఆవేశంతో పళ్లు పట పటా కొరకవచ్చు. నాకు వివిధ పాళ్లలో ఇవన్నీ కలిగాయి.

ఇక రాసినాయన పైత్యం ఒక ఎత్తు అయితే, దాన్ని చదివి తన్మయత్వం తో “ఆహా…ఓహో” అంటున్న ముగ్గురు నలుగురు బ్లాగర్లకు నాదొకటే ప్రశ్న.

పై లైన్లు చదివినాక కూడా మీకు అంబానాధ్ “కొందరు” స్త్రీ లనే ఉద్దేశించి ఈ పోస్టు రాశాడని మీకు అనిపించిందా? ఆయన భావాలు అందరు స్త్రీలను, లేదా మెజార్టీ స్త్రీలను ఉద్దేశించి రాసాడని నాకు అర్ధం అయ్యింది. ఒకవేళ మీకూ అలాగే అర్ధం అయ్యుంటే మహిళలను ఇంత దుర్మార్గంగా చిత్రిస్తున్న అతని పోస్టును సమర్ధిస్తూ ఎలా మాట్లాడగలుగుతున్నారు.

ఒక బ్లాగర్ నాలుగు గ్రాంధిక పదాలూ, ఒకటో రెండో శ్లోకాలూ, పద్యాలూ ఉటంకిస్తే వెంటనే అతను ఏది రాసినా “అబ్బా ఏం రాసారండీ” అంటూ జైకొట్టే ముందు ఒకసారి ఆ పొందికైన పదాల వెనుక ఎంత దుర్మార్గమైన ఎజెండా ఉందో అర్ధం చేసుకోనక్కరలేదా?

ఒక బ్లాగు పోస్టులో మనం ఒప్పుకోని విషయాలు ఉంటే తప్పకుండా దాన్ని చర్చకు పెట్టాల్సిందే. ఒక బ్లాగరు ఒక విషయం పై పోస్టు రాసి దాన్ని కూడలి వంటి సైట్లలో పెట్టుకోనిస్తున్నాడంటే దాని అర్ధం అది అందరూ చదవాలనే కదా. చదివి నచ్చితే మెచ్చుకునే వాళ్లూ ఉంటారు. నచ్చకపోతే విమర్శించే వాళ్లూ ఉంటారు. (నచ్చని వ్యాఖ్యలు వస్తే వ్యాఖ్యలు తొలగించుకునే వీలు బ్లాగర్ కు ఉంది కదా)

ఇక అంబానాధ్ దురహంకారంతో చేసిన వ్యాఖ్యలకు నా సమాధానం ఇదీ

“ప్రపంచం రోజురోజుకీ బాధ్యతలేని ఆడవారితో నిండిపోతోంది.దానికి స్త్రీవాదమనీ చిలకడదుంప అనీ పేరుపెట్టి భావితరాలకి ఇంకా ఇంకా ద్రోహం చేస్తున్నారు.”

బాధ్యత అంటే బానిసల్లాగా చెప్పిన పని చెయ్యడమేనా?. ఒక వైపు తన కాళ్ల మీద తను నిలబడడానికి ఉద్యోగం చేస్తూ, మరో వైపు అనాదిగా వస్తున్న ఇంటి పనీ, పిల్లల సమ్రక్షణా చేస్తున్న మహిళలపై ఇంత బేస్ లెస్ కామెంట్ ఎలా చెయ్యగలిగారు?

“గృహహింసలో అధికభాగం తల్లులు పిల్లలపై చేస్తున్న భౌతిక దాడులే.తమ మానసిక ఒత్తిళ్ళని పిల్లలపై తీర్చుకోవడం మూలంగా ఇది సంభవిస్తోంది.”

నాకు తెలిసినంత వరకూ గృహ హింస అంటే భర్తా, అతని కుటుంబ సభ్యులు స్త్రీలను పెడుతున్న బాధలు. యాదృచ్చికంగా గృహ హింస కేసుల్లో మన రాష్ట్రం ముందు వరసలో ఉంది. సరిగా చదువుకోనందుకో, హోం వర్కు చేయనందుకో పిల్లలని రెండు అంటించిన సంఘటనను మీరు గృహ హింస అంటున్నారంటే మీ అవగాహనా రాహిత్యానికి నవ్వొస్తోంది.

“నీటి సంపులో పడిపోయి చనిపోయిన ప్రతి పిల్లవాడి వెనుకా, ఇంటి ముందు ఆడుకుంటూ ఏ వాహనమో ఢీకొట్టి చనిపోయిన ప్రతి బిడ్డ వెనుకా ఓ బాధ్యతా రహితురాలైన తల్లి ఉంటుంది.”

బట్ట తలకూ మోకాలికి బ్రహ్మముడి వేయడం అంటే ఇదే. మీరు చూసినప్పుడు పొరపాటున ఏ కోడి పెట్టనో బిల్డింగ్ మీద నుండి కిందికి దూకుతూ కనిపిస్తే వెంటనే ఆంధ్ర దేశంలో కోడి పెట్టలు పక్షుల్లాగా గాల్లో ఎగరడం నేర్చుకున్నాయి అని సూత్రీకరణలు చేసేయగలరు మీ బోటి వారు.

“బడికి వెళ్ళే పిల్లలకి సరైన భోజనం ఇచ్చి పంపడానికి బద్ధకించి పసుపూ నిమ్మకాయ కలిపిన పాచికూడు పులిహోర పేరుతో కలిపి ఇచ్చే మిలియన్లాది తల్లులున్నారు ఆంధ్రాలో.”

మిలియన్ అంటే పది లక్షలు. ఇక మీరు ఏ సర్వే ప్రకారం ఈ పాచి స్టాటిస్టిక్స్ కనుక్కున్నారో కానీ అది పచ్చి అబద్దమని చూడగానే అర్ధం అవుతుంది. తమ భావజాలనికి సరిపోయే అబద్ధాలను ఇంత నిస్సిగ్గుగా రాసిన మరో మనిషిని చూళ్లేదు నేనింత వరకూ. తాము కలో గంజో తాగి పిల్లల అభ్యున్నతి కొరకు పాటుపడే మాతృమూర్తులే ఎక్కువ ఉంటారు ఏ సమాజంలోనైనా. దయచేసి ఇటువంటి పాచి అబద్దాలతో తల్లులని కించపరచకండి.

“ఏ దేశంలో నయినా మగవాడి నుంచి సమాజం చాలా ఎక్కువ ఆశిస్తుంది.ఆడదాని పట్ల సమాజం ఎలాంటి భ్రమల్నీ ఆశల్నీ పెంచుకోదు”

తమరి పురుషాహంకారం ఇంత నగ్నంగా బయటపెట్టేసుకున్నారు. స్త్రీ పురుషులు సమాజ రధానికి రెండు చక్రాల్లంటి వారు. ఒకరు మరొకరి కంటే గొప్ప అని అనడం దురహంకారమే…

“స్వయంకృషితో జీవితంలో ఓ స్థాయికి చేరుకున్న దశలో మాత్రమే మగవారు పెళ్ళిచేసుకుంటున్నారు.తండ్రులవుతున్నారు.ఈ విధమైన ఆంక్ష ఆడవారి మీద లేకపోవడం చేత పొద్దున లేవగానే బాత్‌రూమ్‌కి వెళ్ళడం ఎంత మామూలో పెళ్ళి కాగానే పిల్లల్ని కనడం బాధ్యతా రహితులైన ఆడవారికి అంత మామూలు విషయమైపోయింది.”

మాతృత్వం స్త్రీకి పునర్జన్మ వంటిదని అంటారు. ప్రసవ వేదన పడ్డ ఏ తల్లినైనా అడుగు తల్లి కావడమంటే ఏమిటో. బాత్ రూంకి వెళ్లడం అంత సులభంగా ఉండేది పురుషులకు. స్త్రీలకు అది నవ మాసాలూ మోసి, ఆనక జీవితాంతం కొనసాగే బాధ్యత.

“తల్లికైనా సరే గౌరవమివ్వడం బేషరతు (unconditional) కాదు.”

ప్రపంచంలో అంతో ఇంతో ప్రేమ మిగిలి ఉంది తల్లీ బిడ్డల మధ్యే. దాన్నీ ఒక transaction కింద దిగజార్చేశారు, మీకసలు మానవత్వం అనేది ఉందా అసలు?

అంబానాధ్ మొత్తం వ్యాసాన్ని ఇక్కడ చదవచ్చు

http://telugujaatheeyavaadi2.blogspot.com/2007/05/blog-post_13.html

ఆ వ్యాసానికి ప్రసాద్ చరసాల రాసిన చక్కని జవాబుని ఇక్కడ చదవచ్చు:

http://www.charasala.com/blog/?p=167

అంబానాధ్ ప్రేలాపనకు కొండవీటి సత్యవతి గారి ప్రతిస్పందన ఇక్కడ చదవచ్చు:

http://maagodavari.blogspot.com/2007/05/blog-post_22.html

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: