అరకు లోయ అందాలు ఇక చరిత్రేనా? – 2

K-K పాసింజర్ గురించి ముందే తెలియడం వల్ల నాకు పెద్దగా ఆశ్చర్యం కలగలేదు కానీ తెలియని వాళ్లు మాత్రం ఆ రైలు కండీషన్ చూసి కొంచెం ఆశ్చర్య పోక తప్పదు. ఏ మాత్రం సౌకర్యంగా లేని చెక్క, ఇనుము బెంచీలతో ఘోరంగా ఉంటుందా రైలు. రైలు స్టేషన్ లో ఆగగానే దాన్లో అధిక భాగం సీట్లు అక్కడి కూలీలు కర్చీఫులు, తువ్వాళ్లు వేసి రిజర్వ్ చేసుకుంటారు. కొంచెం ఆలస్యంగా వచ్చిన ప్రయాణీకులకు పది రూపాయలకు ఒక సీటు చొప్పున అమ్ముకుంటారు. మేము కొంచెం ముందే వెళ్లడం వల్ల మాకు సీటు దొరికింది. వైజాగ్ నుంచి బయలుదేరాక దాదాపు ప్రతీ స్టేషన్ లో ఆపుతూ జనాలని ఎక్కించుకుంటూ మెల్లిగా అరకు వేపు ప్రయాణం కొనసాగించింది కేకే పాసింజర్.

రోజూ తమ పనుల నిమిత్తం ఈ ట్రెయిన్ ఎక్కే వాళ్లు చాలా మందే ఉండేట్టున్నారు. మా బోగీలో కింద నేల మీదా, పైన బెర్తులోను ఎటు చూసినా మనుషులే. అందులో చాలా మంది గిరిజనులు అని అర్ధం అవుతోంది. ఎవరో టూరిస్ట్ అనుకుంటా ఈ జనాన్ని చూసి విసుక్కోవడం వినిపిస్తోంది పక్క నుంచి. నాకు నవ్వొచ్చింది. ఇది మన లాంటి టూరిస్టుల కొరకు వేసిన రైలు కాదు బ్రదరూ, ఇక్కడ వాళ్లు కాదు మనమే Persona non grata అని అని చెప్పాలనిపించింది .

మేము బయల్దేరాక దాదాపు రెండు గంటల దాకా మైదాన ప్రాంతం గుండానే ప్రయాణించిందా రైలు. ఆ తరువాతే మొదలైంది అందమైన పర్వత శ్రేణి.

araku-1b.gif

araku-1a.gif

మా ఎదురుగా కూర్చున్న నడి వయసు మనిషి తనని తాను పరిచయం చేసుకున్నాడు. National Mineral Development Corporation లో పని చేస్తాడట. Kirandul వరకూ వెళ్తున్నాడట. ఇక మాకూ, మా పక్కన ఉన్న మరో జంటకూ అరకు వెళ్లే వరకూ అతనే గైడులా వ్యవహరించాడు.

araku5.jpg

దాదాపు 40 యేళ్ల క్రితం (1966) ఇప్పటి చత్తీస్ గడ్ లోని బైలడిల్లాలో గనులు తవ్వినప్పుడు అక్కడి ముడి ఖనిజం విశాఖపట్నం పోర్టు గుండా జపాన్ దేశానికి ఎగుమతి చేయడానికి ఈ రైలు మార్గం ఏర్పరిచారు. ఏటా దాదాపు 15 మిలియన్ టన్నుల ముడి ఇనుము ఖనిజం ఈ మార్గం గుండా రవాణా అవుతోంది. 445 కిలోమీటర్ల పొడవున్న ఈ రైల్వే లైను చత్తీస్ గడ్, ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్ ల గుండా వెళ్తుంది.

ప్రతి నిత్యం దాదాపు డజన్ గూడ్స్ రైళ్లు ఈ మార్గం గుండా ప్రయాణిస్తే, గనులలో పని చేసే ఉద్యోగుల కోసం వేసిన ఈ ఒక్క పాసింజర్ రైలు ఈ ప్రాంతపు గిరిజనులకు, ఇప్పుడు మా బోటి టూరిస్టులకు ఉపయోగపడుతోంది. South Eastern Railway లో అత్యంత ఎక్కువ ఆదాయం వచ్చేది ఈ మార్గం నుండే (ఏటా 600 కోట్ల రూపాయల ఆదాయం).

మేం మాటల్లో ఉండగానే ఘాట్ సెక్షన్ మొదలైంది. మరి కాసేపటికి ఎదురుచూసిన సొరంగాలు రానే వచ్చాయి. ఒకదాని తరువాత మరొకటి అలా వస్తూనే ఉన్నాయి. రైలు సొరంగంలోకి వెళ్లిన ప్రతీసారి రైల్లోని పిల్లలు పెట్టే కేకలు మార్మోగిపోతున్నాయి.

araku-3.gif

“యాభైకి పైగా సొరంగాలు ఉన్నాయి ఈ మార్గం లో” మా ఎదురుగా ఉన్న పెద్దాయన వివరించాడు.

బైలడిల్లా గనులలో, ఇంకా చత్తీస్ గడ్ రాష్ట్రంలో ఉన్న ఖనిజ నిల్వల గురించీ, వాటి ద్వారా ప్రభుత్వానికి వస్తున్న వేల కోట్ల రూపాయల గురించి తను వివరించాడు. అదే ధోరణిలో మాట్లాడుతూ ఆ అటవీ ప్రాంతం లో నివసిస్తున్న గిరిజనులు ఇంకా “నాగరికత దరి చేరకుండా నివసిస్తున్నారని” ఆయన చెబ్తుంటే నేను అడ్డు తగిలాను. “నలభై ఏళ్లైంది కదా మనం అక్కడ గనులు తవ్వి, అలా వచ్చిన సొమ్ములో అక్కడి ప్రజలకు ఎంత శాతం దక్కిందంటారు?” అని ప్రశ్నించాను. ఊహించని ఈ ప్రశ్నకు అతను బిత్తర పోయాడు.

“ఏమో తెలియదు” అన్నాడు. ఒక శాతమో, రెండు శాతమో దక్కితే అదే గొప్ప అన్నాన్నేను. “వాళ్ల జీవితాలను చిధ్రం చేస్తుందీ మైనింగ్. కొంపా గోడు, భూమీ, నీళ్లు ఇవన్నీ నాశనం చేస్తుంది. మైనింగ్ లో చాలా డబ్బులొస్తాయి, కానీ ఎవరికి? ప్రైవేటు కంపెనీలకు, ప్రభుత్వాలకు. వచ్చిన డబ్బులో ఈ గిరిజనులకు చెందేదెంత? మరి వారికి ఏమీ దక్కనప్పుడు వాళ్లెందుకు తమ జీవితాలనే త్యాగం చేయాలి?”

అతను ఇక మాట్లాడటం మానేసాడు.

ఘాట్ సెక్షను మరింత బాగా చూసేందుకు రైలు బోగీ డోర్ వద్ద నిలబడి చూడసాగాను. అక్కడక్కడ చిన్న చిన్న జలపాతాల్లాంటివి కూడా కనపడ్డాయి.

తైద స్టేషన్ కూడా వచ్చింది దారిలో. ఇక్కడ ఏపీ టూరిజం వారి జంగిల్ బెల్స్ కాటేజస్ చాలా ఫేమస్.

ఈ మార్గంలో భారత రైల్వే లో అతి ఎత్తైన రైల్వే స్టేషన్ శిమిలిగుడా ఉంటుందని చెప్పాడు మా ఎదురు పెద్దమనిషి. స్టేషన్ రాగానే నా కెమెరాతో రెండు ఫొటోలు క్లిక్ మనిపించాను.

araku-11.gif

బొర్రా గుహల వద్ద కూడా ఒక స్టేషన్ ఉంది. మేము తిరిగి వచ్చేప్పుడు ఇక్కడ దిగుదామనుకున్నాం.

araku-21.gif

మధ్యాహ్నం పన్నెండున్నర అవుతుండగా అరకు వాలీ చేరాము.

స్టేషన్ ఇంకొంచెం దూరంలో ఉంటుందట. ఇక్కడేదో రిక్వెస్ట్ స్టాప్ లాంటిది ఉంది కాబోలు. మేము మా బాగేజీ తీసుకుని రైలు దిగిపోయాం. అక్కడి నుంచి కాస్త దూరంలో ఉన్న మయూరి క్రాఫ్ట్ సెంటర్ కు కాలి నడకన చేరుకున్నాం.

వెంటనే రూం ఇచ్చారు మాకు. రిసార్ట్ చూడముచ్చటగా ఉందనుకుంటే, మా రూం ఇంకా అద్భుతంగా ఉంది. రూం నుంచి వ్యూ మరీ అద్భుతంగా ఉంది.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: