అరకు లోయ అందాలు ఇక చరిత్రేనా? – 1

అరకు లోయను చూడాలనే కోరిక చాలా ఏళ్లుగా ఉన్నా మొన్న అక్టోబర్ దాకా వీలుపడలేదు. జేబులో డబ్బులు ఉన్నప్పుడు తీరిక లేకపోవడం, సమయం దొరికినప్పుడు జేబులో డబ్బులు లేకపోవడంతో ఈ చిన్న కోరిక నెరవేరడానికి చాలా కాలమే పట్టింది.

ఏ పని చెయ్యాలన్నా బాగా ఆలోచించి ఆచి తూచి అడుగు వేసే రకం నేను. నా అర్ధాంగి అప్పుడప్పుడు “నీకు బొత్తిగా చురుకుదనం లేదు” అని ఈసడించుకుంటున్నా నేను పెద్దగా మారింది లేదు. ఓ నెల రోజులు ప్లానింగ్ చేసి కానీ అసలు పని మొదలు పెట్టలేదు.

ముందు http://www.irctc.co.in వెబ్ సైటు కు వెళ్లి రైలు టికెట్స్ బుక్ చేసుకున్నా. వెళ్లేటప్పుడు గోదావరి ఎక్స్ ప్రెస్, వచ్చేటప్పుడు ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్. ఇక ట్యాంక్ బండ్ వద్ద గల టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ వారి రిజర్వేషన్ కౌంటర్ కు వెళ్లి వైజాగ్ లో అప్పు ఘర్ వద్ద పున్నమి గెస్ట్ హౌస్ లో ఒక రూం, మరునాటికి అరకు మయూరి క్రాఫ్ట్ సెంటర్ లో ఉన్న రిసార్టులో ఒక రూం బుక్ చేసుకున్నాను. రిషికొండలో రూం కోసం ప్రయత్నిస్తే దొరకలేదు.

అరకు వెళ్లడానికి ఇప్పుడు మరో కారణం కూడా ఉంది. మరి కొన్నాళ్లాగితే ఆ సౌందర్యం కనుమరుగు అవుతుందనే వార్తలు వస్తున్నాయి ఈ మధ్య.

ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతమంతా యుద్ధరంగంలా మారింది. విశాఖ జిల్లాలో బాక్సైట్ తవ్వకాలు, ఇటు ఖమ్మం జిల్లాలో పోలవరం రెండూ గిరిపుత్రుల మనుగడకు సవాల్ విసురుతున్నాయి. మన రాష్ట్రంలో అత్యంత సుందరమైన ప్రాంతాలుగా పేరుగాంచిన అరకు, పాపికొండలు రెండు ఈ కొత్త “అభివృద్ధి” పుణ్యమా అని కనుమరుగు అయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపధ్యంలో జరిగిన నా అరకు యాత్ర ఎన్నో తెలియని విషయాలని నాకు తెలియ జెప్పింది. మనం గుడ్డిగా జపిస్తున్న అభివృద్ధి మంత్రం ఎందరి జీవితాలను చీకటి చేస్తుందో నాకు ప్రత్యక్షంగా అవగతమైంది.

సికింద్రాబాదు రైల్వే స్టేషన్ లోనే మా ఆఫీసు కోలిగ్స్ వి రెండు బృందాలు కనిపించాయి. ఒక బాచ్ మాలాగే వైజాగ్, అరకులో బస చేస్తుండగా మరో బాచి మాత్రం రిషికొండ, తైదలో బస చేస్తున్నారు.

వైజాగ్ స్టేషన్ లో దిగి ఆటో తీసుకుని పున్నమి గెస్ట్ హౌస్ చేరాం. బీచ్ ఎదురుగానే ఉందీ గెస్ట్ హౌస్. ఫ్రెష్ అప్ అయ్యాక అక్కడే టిఫిన్ చేసి భీమిలి ఎలా వెళ్లాలో రిసెప్షన్ లో కనుక్కున్నాం.

ఎదురుగానే ఉన్న బస్ స్టాప్ లో భీమిలి వెళ్లే బస్ ఎక్కాం. మొత్తం సముద్రపు అంచున ఉన్న ఆ రోడ్ నిజంగా కనులకు విందు. వైజాగ్ వాసులు ఎంతైనా అదృష్టవంతులు. సండే వస్తే జామ్మంటూ బైక్ వేసుకుని భీమిలి వెళ్లి రావొచ్చు.

bhimli1.gif

భీమిలి బీచ్ -1

bhimli2.gif

భీమిలి బీచ్ -2

భీమిలి బస్ స్టాండ్ లో దిగి ఓ కొబ్బరి బోండాం తాగి ఫర్లాంగ్ దూరం లో ఉన్న బీచికి నడచి వెళ్లాం. దారిలో హైదరాబాద్ హబ్సీగుడా లో ఉన్న విజ్ఞాన్ స్కూల్ వారి బ్రాంచి చూసి ఆశ్చర్యపోయాను. అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం నిజంగా వింతే.

భీమిలి బీచ్ లో దాదాపు రెండు మూడు గంటలు గడిపాం. అక్కడ ఉన్న కొబ్బరి చెట్ల కింద ఉన్న బెంచీ లో కుర్చుని అలా ఎన్ని గంటలైనా సముద్రాన్ని చూస్తూ ఉండిపోవచ్చు అనిపించింది మాకు .

bhimli3.gif

బీచ్ వద్ద అల్లూరి సీతారామరాజు బొమ్మ

bhimli4.gif

బీచ్ ఇసుకలో మా నీడలు !!

పక్కనే ఉన్న ఓ చిన్న హోటల్ లో ప్రాన్స్ బిర్యానీ తిన్నాం. ఆ హోటల్ యజమాని మాకిచ్చిన మర్యాద చూసి స్వర్ణ అయితే చాలా ఇంప్రెస్ అయిపోయింది. లంచ్ అయ్యాక ఒక గంట ఆగి రిషికొండ బయలుదేరాం. రిషికొండలో ఏ.పి టూరిజం వారి హిల్ రిసార్టులో మాకు రూం దొరకలేదు కానీ, ఆ కొండపై ఉన్న రిసార్టు చూడచక్కగా ఉంది. ఈ సారి ఇటువైపు వస్తే తప్పక ఆ రిసార్టులో ఉండాలని అనిపించింది నాకు.

rishikonda11.gif

రిషికొండ బీచ్

సాయంత్రం ఆరింటికి వైజాగ్ తిరిగి వచ్చాం.

2006 ఫిబ్రవరిలో మా మరదలి రిసెప్షన్ అటెండ్ అవడానికి వైజాగ్ వెళ్లానోసారి. మా చుట్టాలలో ఇటువైపు పెళ్లి సంబంధం చేసుకోవడం అదే తొలిసారి. అప్పుడు వచ్చినప్పుడే కైలాసగిరి, వుడా పార్క్, ఆర్కే బీచ్ వగైరాలు చూసేశాం. కాబట్టి ఈ సారి వైజాగ్ లో చూసే ప్రదేశాలు పెద్దగా లేవు. పోయినసారి మిస్సయిన సబ్ మెరిన్ మాత్రం చూడాలనుకున్నాం. పోర్ట్ చూడడం ఈసారి కూడా వీలుపడలేదు.

సాయంత్రం వైజాగ్ లో స్థిరపడ్డ నా డిగ్రీ ఫ్రెండ్ ఇంటికి వెళ్లాం. వీడిది నల్లగొండ జిల్లాలో మా ఊరి పక్కన గ్రామం. ఆ అమ్మాయిది వైజాగ్. ఇద్దరూ అక్కడే ఒక సంస్థ లో ఉద్యోగం చేస్తు ఒకరినొకరు ఇష్టపడ్డారు. నా పెళ్లైన ఆరు నెలలకు జరిగింది వీడి పెళ్లి జరిగింది.

ఓ రెండు గంటలు వాడి ఇంటిలో గడిపి ఆ తరువాత వాడి బండి తీసుకుని అలా ఆర్కే బీచ్ దాకా ఓ రౌండ్ వేశాం. సబ్ మెరిన్ కూడా చూశాం. అక్కడే ఉన్న ఓ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఫ్రైడ్ రైస్ తిన్నాం.

రాత్రి పదిన్నరకు మళ్లీ గెస్ట్ హౌస్ చేరాం.

మరునాడు ఉదయమే రూం ఖాళీ చేసి వైజాగ్ రైల్వే స్టేషన్ కు వెళ్లాం. అప్పటికే KK(కొత్తవలస-కిరండుల్) పాసింజర్ రెడీ గా ఉంది మాకోసం.

(ఇంకా ఉంది)

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: