రాష్ట్రం లో ఒక కొత్త ‘Face/Off’ సినిమా

రాష్ట్రం లో కాంగ్రెస్ పాలన మళ్లీ మొదలయ్యాక జరుగుతున్న వరుస సంఘటనలు చూస్తే నాకు ఆ మధ్య ఇంగ్లీష్ లో రిలీజైన Face Off సినిమా గుర్తొస్తుంది . నికొలాస్ కేజ్, జాన్ ట్రవోల్టా లు నటించిన ఆ చిత్రం లో విలన్ ను పట్టుకోవడానికి హీరో విలన్ లా మారిపోతాడు (ప్లాస్టిక్ సర్జరీ సాయం తో). విలన్ ఏమన్నా తక్కువ తిన్నాడా…తానూ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని హీరోలా మారి పోతాడు. సినిమా చాలా రసవత్తరంగా సాగుతుంది…ఒక్కో సారి ప్రేక్షకుడికి హీరో ఎవరో, విలన్ ఎవరో అర్ధం కాదు.

రాజ శేఖర రెడ్డి, చంద్ర బాబులు సరిగ్గా అలానే వ్యవహరిస్తున్నారిప్పుడు. గత మూడేళ్లు గా రాష్ట్రం లో ఒక కొత్త ‘Face Off’ సినిమా రంజుగా ప్రదర్శితమవుతోంది. ఎవరు హీరోనో, ఎవరు విలనో అర్ధం కాని ప్రజలు జుట్టు పీక్కుంటూనే ఉన్నారు.

ఫ్యాబ్ సిటీ మంజూరు లో జరిగిన అవకతవకలు చూస్తుంటే నాకు మళ్లీ ఒక సారి తెలుగు దేశం హయాం లో జరిగిన ఐ.ఎం.జీ కుంభకోణం గుర్తొచ్చింది. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లేముందు చంద్రబాబు హడావిడి గా ఒక అనామక కంపెనీకి హైదరాబాద్ లో ఉన్న అన్ని స్టేడియాలు 40 యేళ్ల పాటు అతి చవక ధరలకు లీజుకిచ్చాడు, అంతే కాదు గచ్చిబౌలీలో బంగారం లాంటి 800 ఎకరాల భూమిని కారుచవకగా రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా మినహాయించి ధారాదత్తం చేశాడు. సదరు అనామక కంపెని (IMGB – IMG Bhaarata) సాక్షాత్తూ అమెరికాలోని ప్రఖ్యాత స్పోర్ట్స్ మేనేజ్మెంట్ సంస్థ (IMG) కి అనుబంధ సంస్థ అనీ, అది రాష్ట్రం లో క్రీడల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడే స్పోర్ట్స్ కాంప్లెక్సులు నిర్మించబోతున్నదనీ అప్పటి ప్రభుత్వమూ, ప్రచార సాధనాలు ఊదరగొట్టాయి.

కొన్నాళ్లకు లోగుట్టు బయట పడింది. చంద్రబాబు కు దగ్గరి మనిషి గా చెప్పుకునే అహోబిల రావు ఉరఫ్ బిల్లీ రావు నెలకొల్పాడీ IMGB ని. దీనికీ అమెరికా లోని IMG కీ ఏ సంబంధమూ లేదని. అన్నిటికన్న మిన్నగా ప్రభుత్వం ఎం.వో.యూ కుదుర్చుకునే నాటికి సదరు IMGB అసలు ఉనికిలోనే లేదని. వందల కోట్లతో క్రీడా సౌకర్యాలు అభివృద్ధి చేయబోయే కంపెనీకి హైదరాబాదు లోని ఒకనొక అపార్ట్మెంట్ ఫ్లాటు లో ఒక బోర్డు మినహా మరే “మౌలిక సౌకర్యాలూ” లేవని తెలుసుకున్న ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే IMG తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుని ఆ కంపెనీకి ఇచ్చిన భూములు వాపసు తీసుకుంది.

ఇక ఇప్పుడు తెలుగు దేశం పార్టీ మొన్న ఫ్యాబ్ సిటీ ఎం.వొ.యూ. గురించి విడుదల చేసిన కొన్ని వివరాలు మళ్లీ IMG స్టోరీ నే గుర్తుచేస్తున్నాయి. ఫ్యాబ్ సిటీ కోసం ఎన్నో నగరాలు పోటి పడితే చివరికి హైదరాబాద్ ఎంపిక అయ్యిందనీ, దాదాపు 13,500 కోట్ల రూపాయల పెట్టుబడి తో వచ్చే ఈ ఫ్యాబ్ సిటీ వల్ల 5-10,000 మందికి ప్రత్యక్షంగా, పది లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని 2005 ఫిబ్రవరి లో సెం ఇండియా అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు పత్రికలు రాశాయి. సెం ఇండియా ప్రమోటర్ వినోద్ అగర్వాల్ శక్తి సామర్ధ్యాల గురించి అనేక మంది అనుమానాలు వెలిబుచ్చినా ప్రభుత్వం ఖాతరు చేయలేదు. సెం ఇండియా లో సాక్షాత్తూ చిప్ మేకర్ AMD పెట్టుబడి పెట్టనుందని వార్తా పత్రికలు రాశాయి. ఫ్యాబ్ సిటీ వచ్చేస్తుందని రియల్ ఎస్టేటు కంపెనీలు భూముల ధరలు ఆకాశానికి పెంచేశాయి.

ఇప్పుడు తెలుస్తున్నదేమిటంటే ఈ ఫ్యాబ్ సిటీ కి AMD కి ఎటువంటి సంబంధమూ లేదు. సెం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ రాష్ట్ర ప్రభుత్వం తో MOU కుదుర్చుకున్నాక కొన్ని రోజులకు కేవలం లక్ష రూపాయల మూలధనం తో డిల్లీలో రిజిస్టర్ అయ్యింది. దానికి కేటాయించినది 1200 ఎకరాలు. అందులో 2007 జులై నాటికి మొదటి దశ ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉండగా ఇప్పటికి ఒక పునాది రాయి కూడా వేసిన పాపాన పోలేదు. ఆ భూమికి చెల్లించాల్సిన 480 కోట్లలో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి చెల్లించలేదు. అంతే కాదు సదరు వినోద్ అగర్వాల్ ఈ భూమిలో రిసార్టులు, షాపింగ్ కాంప్లెక్సులు నిర్మించడానికి ఇతర సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే పనిలో బిజీగా ఉన్నాడట. ఒక సారి సెం ఇండియ వారి వెబ్ సైటు చూస్తే (www.semindia.in) ఏ కోశానా 13,500 కోట్ల పెట్టుబడి పెట్టే సంస్థది లా అనిపించదు.

కొత్త వర్చువల్ అభివృద్ధి నమూనా వచ్చాక బ్రోకర్లకు, దొంగలకు వేల కోట్ల రూపాయల “ప్రాజెక్టులు” కట్టబెట్టడం ఒక పధకం ప్రకారం సాగిపోతుంది. ఈ నాటకం లో రాజకీయ నేతల దగ్గరి నుండి బహుళ జాతి కంపెనీల దాకా ఎవరి పాత్ర వారు నిర్లజ్జగా పోషిస్తున్నారు. పార్టీలు ఎన్ని మారినా దోపిడీ మాత్రం యధావిధి గా సాగిపోతుందనేది ఐ.ఎం.జీ, వోక్స్ వాగెన్, ఫ్యాబ్ సిటీ ఒప్పందాల్లో జరిగిన/జరుగుతున్న అక్రమాలు రుజువు చేస్తున్నాయి.

ఇది అంతులేని కధ. మరిన్ని “వర్చువల్ అభివృద్ధి ప్రాజెక్టుల” కధలు వచ్చే పోస్టులో…

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: