నేరం ప్రేమరాహిత్యానిది

వర్జీనియా టెక్ యూనివర్సిటీ లో మొన్న జరిగిన ఘాతుకం చూస్తే అమెరికా భూతల స్వర్గం కాదనీ అది సాక్షాత్తూ “భూతాల” స్వర్గమే నని మరో సారి అనిపిస్తోంది. ఇంత మంది సాటి మనుషులను ఓ విద్యార్ధి అకారణంగా చంపేశాడంటే ఆ సమాజం లో మానవత్వం ఎంత మృగ్యం అయిపోయిందో కళ్లకు కడుతోంది.

అమెరికా కున్న సవాలక్ష అవలక్షణాల్లో ఈ “విద్యార్ధుల హింస ఒకటి”. అక్కడి స్కూళ్లలో ఇటువంటి సంఘటనలు సర్వసాధారణం. గడచిన 15 సంవత్సరాల్లోనే ఇటువంటి సంఘటనలు 35 వరకూ జరిగాయని వాటిల్లో ఎంతో మంది స్కూల్, కాలేజీ పిల్లలు అకారణంగా తమ తోటి విద్యార్ధులు జరిపిన కాల్పుల్లో మరణించారని వార్తా కధనాలు తెలియజేస్తున్నాయి. ఇక పోలీసులు సకాలం లో ఇటువంటి నేర మనస్థత్వం గల విద్యార్ధులను అరెస్ట్ చేయడం వల్ల పోయిన సంవత్సర కాలంలోనే 16 సంఘటనలు నివారింపబడ్డాయన్న వార్త ఎవరికైనా ఆందోళన కలిగించక మానదు.

ఏటా వేలాది మంది భారతీయ విద్యార్ధులు అమెరికాకు విద్యాభ్యాసం కొరకు వెళ్తుంటారు. మొన్నటి సంఘటన దరిమిలా అమెరికాలో చదువుతున్న అనేక మంది విద్యార్ధుల తల్లి తండ్రులు ఇక్కడ చాలా టెన్షన్ పడ్డారు. అంతే కాదు అమెరికన్ విశ్వవిద్యాలయల్లో అనేక మంది భారతీయులు బోధకులుగా పని చేస్తున్నారు. మొన్నటి సంఘటనలో లోగనాధన్ అనే తమిళనాడుకు చెందిన ప్రొఫెసర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు.

ఆర్ధికాభివృద్ధే మానవుని అభివృద్ధిగా చలామణీ అయిపోతున్న కాలం ఇది. ఎంతో ఘనమైన వారసత్వం, విలువల పునాది ఉన్న భారత దేశం కూడా ఒకనొక అగ్ర రాజ్యపు అభివృద్ధి నమూనానే గుడ్డిగా అనుసరిస్తున్న పాడు కాలమిది. మరో దారి లేదు (There Is No Alternative) అంటూ ప్రపంచమంతటా తన “సంస్కృతే” వర్ధిల్లేలా ఆ దేశం చేస్తోంటే, ప్రత్యామ్న్యాయాలు ఉన్నా కూడా గుడ్డిగా ఆ దేశపు పంధానే అనుకరిస్తున్నాయి మన బోటి దేశాలు. ప్రేమానుబంధాలు మృగ్యమై, వ్యక్తిగత స్వార్ధాలే పరమావధిగా బ్రతకమని బోధించే ఒక విలువల విషవలయం లో ఇవ్వాళ మనమందరం చిక్కుకుని ఉన్నాం. దాని పర్యవసానమే ఇటువంటి మానవ మృగాలు…

అసలు సమస్య మూలాలు సమాజం లో ఉంటే దాన్ని అర్ధం చేసుకోకుండా విద్యాలయాలకు భద్రత పెంచాలని. మెటల్ డిటెక్టర్లు పెట్టాలని అమెరికా లో జరుగుతున్న చర్చ చూస్తుంటే వారి అజ్ఞానానికి జాలి కలుగుతోంది.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: