స్కూళ్లు నడవవిక్కడ బార్లు తెరవండి!

రాష్ట్రం లో దాదాపు 6000 స్కూళ్లు మూతపడనున్నాయన్న వార్త మన సమాజపు “అభివృద్ధి” ఎంత మేడిపండు వంటిదో నిరూపిస్తుంది. ఓ వైపు నాలెడ్జ్ సొసైటీ అయిపోతుందని ఊదరగొట్టే కబుర్లు చెప్పే నేతలు, మరో వైపు ప్రాధమిక విద్యకు కూడా నోచుకోని లక్షలాది మంది చిన్నారులు ఉన్నారీ రాష్ట్రం లో…

అక్షర క్రమం లో ముందున్న ఆంధ్రప్రదేశ్ (60.47%) అక్షరాస్యతలో దేశ సగటు (64.84%) కంటే దిగువన ఉంది. ఇక డ్రాప్ ఔట్ రేటు లో మన రాష్ట్రం ముందు వరుసలో ఉంది. 1-10 తరగతుల మధ్య డ్రాప్ ఔట్ రేటు 66.70% గా ఉంది.

దీనికి కారణం వనరుల లేమి కొంత కారణమైతే, కేటాయించిన కొద్ది పాటి నిధులూ అవినీతిపరుల కడుపులు నింపడానికే సరిపోన్నాయి. మొన్నటికి మొన్న బయటపడ్డ సర్వ శిక్ష అభియాన్ నిధుల కుంభకోణం, విద్య శాఖలో ప్రబలిన అవినీతికి నిలువెత్తు సూచిక.

భావి పౌరులు నేర్చుకునే విద్య పైనే ఈ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. దాని పై ఎక్కువ నిధులు వెచ్చించి ఇంకా పాఠశాలలు ఎక్కువ స్థాపించాల్సింది పోయి ఇలా ఉన్న స్కూళ్లను మూసివేయడం దారుణం. ప్రైవేటు స్కూళ్లు మూడూ పువ్వు ఆరు కాయలు గా “వ్యాపారం” వృద్ధి చేసుకుంటుంటే, ప్రభుత్వ స్కూళ్లేమో నానాటికీ క్షీణదశకు చేరుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు పిల్లలు చేరట్లేదో తెలుసుకుని వాటిని సక్రమంగా నడిచేట్టు చేయాల్సిన ప్రభుత్వాలు ఇలా వాటిని మూసేస్తూ పోవడం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. మన ప్రగతి తిరోగమన దిశలో సాగుతోందనేందుకు ఇదో తాజా ఉదాహరణ.

నిన్నటి ఆంధ్రజ్యోతి నుండి ఈ వార్త చదవండి…

మూసివేత యజ్ఞంలో వెయ్యి స్కూళ్లు సమిధలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (ఆన్‌లైన్‌): రాష్ట్రంలో సర్కారీ స్కూళ్ల మూసివేత యజ్ఞం మొద లైంది. తొలి విడతగా 1020 ప్రాథమిక పాఠశాలలకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో తాళాలు పడ్డాయి. మరో ఆరున్నరవేల పాఠశాలలు వచ్చే ఏడాది మూతపడే అవకాశముంది. పాఠశాల విద్యా శాఖ తాజాగా సేకరించిన గణాంకాలు ‘ఆంధ్రజ్యోతి’కి లభ్యమ య్యాయి.

2005-06 విద్యా సంవత్సరంలో పది మంది కంటే తక్కువమంది విద్యార్థులు చేరిన పాఠ శాలలను 2006-07 విద్యా సంవత్సరంలో మూసి వేశారు. తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలు మినహా మిగిలిన 21 జిల్లాల్లో మూతపడిన పాఠశాలలు ఉన్నాయి. వెనుకబడిన జిల్లాల్లో, ప్రాంతాల్లో మూతపడ్డ పాఠశాలు ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మూతపడ్డ మొత్తం ప్రాథమిక పాఠ శాలల్లో 881 జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ యాజమాన్యాల ఆధ్వర్యంలోనివి కాగా అచ్చంగా ప్రభుత్వ యాజమాన్యంలోనివి 139 లెక్క తేలాయి.

ఈ 139 లోనూ ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే 47 ఉన్నా యి. రాజధానిలో మురికివాడలకు చెందిన పిల్లలకు, వలస కార్మికుల పిల్లలకు పెద్దదిక్కుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూతవేయడంతో ఇప్పుడు భాగ్యనగ రంలో ‘పేద’వారి విద్యకు చేటు వచ్చింది. రాష్ట్రం లోనే అత్యధికంగా చిత్తూరు జిల్లాలో మొత్తం 161 ప్రాథమిక పాఠశాలలు (ఒకటి ప్రభుత్వ పాఠశాల) మూతబడ్డాయి. ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లోనివే కావడం ఆందోళన కలిగించే విషయం. రాయలసీమలో చిత్తూరు, అనంతపురం జిల్లా ల్లోను, ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలోను, తెలంగాణలో మహబూబ్‌నగర్‌, నల్లగొండ, అదిలాబాద్‌, రంగారెడ్డి జిల్లాలతోపాటు వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోనూ ఎక్కువ సంఖ్యలో ప్రాథమిక పాఠశాలలు మూతబడ్డాయి.

పదిమందికంటే తక్కువ ఉన్న పాఠశాలలు 2005-06లో 1715 లెక్క తేలగా వాటిలో 1020 పాఠశాలలను మూతబడ్డాయి. మిగి లిన చోట్ల కూడా ఉపాధ్యాయులు లేరు. వారందరినీ గత ఏడాది జరిగిన హేతుబద్ధీకరణలో ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. మూసివేసినవి పోగా మిగిలిన పాఠశాలల్లో ఎడ్యుకేషన్‌ గ్యారంటీ సెంటర్లు (ఈజీఎస్‌)లను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అంటే ఆ పాఠశాలలను కూడా మూతవేసినట్లే! ఇప్పటివరకు పదిమంది లోపు విద్యార్థులున్న పాఠశాలలనే మూసి వేస్తుండగా ఇకపైన 20 మంది లోపు విద్యార్థులున్న అన్ని పాఠశాలలనూ మూసివేయాలని ప్రభుత్వం ఒక అభిప్రాయానికి వచ్చింది. ‘ఆరు వేల స్కూళ్లకు తాళం?’ శీర్షికన ఫిబ్రవరి 16వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో ఈ అంశంపై ఒక వార్తా కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. 20 మందిలోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలు 2006-07లో 6,617 లెక్క తేలాయి. అంటే.. 2007-08 విద్యా సంవత్సరంలో వీటికి తాళాలు పడతాయన్నమాట..! వాటిలోనూ చిత్తూరు, అనంతపురం, కడప, శ్రీకాకుళం జిల్లాలకు చెందినవే ఎక్కువ ఉన్నాయి.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: