నిన్న పులకరింత నేడు జలదరింపు!

వర్షం రేకెత్తించిన హర్షాతిరేకం గురించి రాసి పూట గడిచిందో లేదో ప్రకృతి భీబత్సాన్ని ప్రత్యక్షంగా చూడవలసి వచ్చింది నాకు.

నిన్న సాయంత్రం ఐదవుతుండగా ఒక్కసారిగా గాలీ, వానా మొదలయ్యాయి. మూసిన కిటికీ అద్దాల్లోంచి కూడా బయట జరుగుతున్నది లీలా మాత్రంగా వినపడుతోంది. నా రూం లో ఉన్న కొలీగ్స్ చాలా మంది వెనీషియన్ బ్లైండ్స్ తొలగించి బయట కురుస్తున్న వర్షాన్ని చూసి ఆనందపడ్డారు.

ఆరూ పది అవుతుండగా నా క్యాబ్ చెక్ పోస్ట్ దాటి కాస్త ముందుకెళ్లిందో లేదో, ముందో పెద్ద ట్రాఫిక్ జాం. రెండు నిముషాలు ఏమైందా అని చూస్తుండగానే అటు వైపు నుండి అంబులెన్స్ ల సైరన్లు, ఒక దాని వెంట మూడు 108 అంబులెన్స్ లు దౌడు తీస్తూ కనిపించాయి. మనసు ఏదో కీడును శంకిస్తూనే ఉంది. అల్లంత దూరం నుంచే ఏదో భవనం కూలినట్టు కనిపించింది.

దగ్గరకు పోయి చూస్తే, కూలిందో భారీ హోర్డింగ్. గత కొంత కాలంగా నగరం నలు మూలలా పుట్ట గొడుగుల్లా వెలిసాయి ఈ కొత్త రకం ఒంటి స్థంభం హోర్డింగులు. వాటిని చూస్తే నే భయం వేస్తుంది. అయిదింటికి వీచిన బలమైన గాలుల ధాటికి ఈ హోర్డింగ్ నేలకూలింది. పక్కనే ఉన్న చిన్న ఐస్ క్రీం పార్లర్ మొత్తం కుప్ప కూలి అందులో పనిచేసే మనిషి ఒకతను అక్కడికక్కడే చనిపోగా, నలుగురైదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పక్కనే ఉన్న రెస్టారెంట్ కూడా బాగానే ధ్వంసం అయ్యింది. రెండు మూడు కార్లు పూర్తిగా నాశనం అయ్యాయి. ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉంది. ఇంకొంచెం లేటుగా ఈ సంఘటన జరిగినా, లేకా ఆ హోర్డింగ్ ఇంకొంచెం ముందుకు వచ్చి రోడ్డు పై వెళ్లే ట్రాఫిక్ పై పడినా నష్టం భారీగా ఉండేది.

ఈ హోర్డింగుల నుండి వచ్చే పన్ను కోసం ఆశపడి ఎడాపెడా అనుమతులు ఇస్తున్న అధికారులు అసలు ఇవి సురక్షితమేనా అన్న విషయం పట్టించుకుంటున్నట్టు లేరు. నిన్నటి గాలి దుమారం ఒక విధంగా చిన్నదే. దానికే ఇలాంటి హోర్డింగులు కూలి పొతే ఇక రేపు రేపు వచ్చే బలమైన తుఫాన్లకు ఇవి తట్టుకుంటాయా?

వెంటనే ఒక నిపుణుల బృందంతో వీటి భద్రతను తనిఖీ చేసి ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారకుండా చూడాల్సిన బాధ్యత అధికారులది.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: