తడిసిన మట్టి పరిమళం!

ఆఫీసు నుంచి బయటికి వచ్చానో లేదో భోరున వర్షం మొదలైంది. వేళ కాని వేళ అకాల వర్షం. గత కొద్ది రోజులుగా నిప్పుల కొలిమిలా మారిన నగరజీవికి ఇంత ఉపశమనం. ఇక ఏ రూపం లో ఉన్నా సరే నీళ్లంటే పడిచచ్చే నా బోటి వారికయితే పండగే…అలా కళ్లప్పగించి ఏ అదృశ్య ఆకాశ దేవతలో మన పై జల్లుతున్న అక్షింతల్లా రాలిపడుతున్న ఆ మెరిసే చినుకులను చూస్తూ ఉండిపోయా. మా క్యాబ్ హైటెక్ సిటి దాటిందో లేదో వాన ఇంకా జోరందుకుంది. మనసులో సంతోషంగా ఉన్నా తెచ్చి పెట్టుకున్న గాంభీర్యంతో నేనుంటే, వెనక సీట్లోని బెంగాలీ కొలీగ్ మాత్రం చిన్న పిల్లలా కేరింతలు కొట్టసాగిందా వర్షం చూసి.

వర్షం ప్రతీ మనిషిలో ఏదో ఒక భావం రేకెత్తిస్తుందనుకుంటా. రానంత సేపు రాలేదనే వేదన మిగిల్చేది ఈ వర్షమే, అకాలంగా వచ్చి చేలూ, ఇళ్లూ ముంచెత్తేదీ ఈ వర్షమే. ఇక భావుకులైతే ఓ వర్షా కాలపు సాయంత్రం గురించి అందమైన కవితలు కూడా అల్లేస్తారు.

“ఇప్పుడు వేడి వేడి మిరపకాయ బజ్జీలు ఉంటే బాగుంటుంది, పొగలు గక్కే చాయ్ ఉంటే అద్భుతంగా ఉంటుంది”…ఇలా సాగుతున్నాయి వెనక సీట్లో చర్చలు.

నా కొలీగ్ అన్న ఒక్క మాట మాత్రం నన్ను ఆకర్షించింది. ఒక ప్రాజెక్ట్ పనిపై లండన్ వెళ్లిన తన స్నేహితురాలు మొన్ననే ఆఫీసుకు తిరిగొచ్చిందట. నిన్న సాయంత్రం కూడా ఓ చిన్నపాటి వాన జల్లు పడింది. ఆ జల్లుకు తడిసిన మట్టి వాసన వస్తోంటే ఆ అమ్మాయి అందట, “లండన్లో చాలా సార్లు వర్షం పడుతుంది, కానీ ఒక్కసారి కూడా ఇంత అద్భుతమైన పరిమళం రాలేదు” అని.

ఎంత చక్కని అబ్జర్వేషన్!

తొలకరికి తడిసి పులకరించిన మట్టి వాసనకు సాటిరాగల పరిమళం ఇంకేం ఉంటుంది…

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: