బాసరకో న్యాయం బందరుకో న్యాయం!

గత వారం జరిగిన రెండు సంఘటనలు ఒక విషయాన్ని చాలా నగ్నంగా నిరూపించాయి. ఈ రాష్ట్రం లో తెలంగాణకు చాలా విషయాల్లో అన్యాయం జరుగుతోందని ఎంతో కాలంగా చెబుతున్న విషయాన్ని వైయెస్ ప్రభుత్వం నిస్సిగ్గుగా, నిర్లజ్జగా నిరూపించి చూపింది.

అదిలాబాద్ జిల్లాలో బాసర ఐఐటీ విషయంలో ఒక న్యాయం, మచిలీపట్నం ఓడ రేవు విషయంలో మరో న్యాయం జరిగింది మన కళ్ల ముందే. ప్రజల మనోభావాల విలువ ప్రాంతానికో విధంగా ఉంటుందని సెలవిస్తుంది మన స్వర్ణోత్సవ రాష్ట్ర ప్రభుత్వం. ముందో సారి ఈ రెండు అంశాల పూర్వాపరాలు పరిశీలిద్దాం

బాసరలో ఐఐటీ ఏర్పాటు కోసం చంద్ర బాబు హయాం లోనే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. అప్పట్లో రాష్ట్ర శాసన సభ దీని గురించి ఒక ఏకగ్రీవ తీర్మాణం కూడా చేసింది. వై యెస్ ప్రభుత్వం వచ్చాక మరో సారీ రాష్ట్ర శాసన సభ బాసర ఐఐటీ విషయం పై ఏకగ్రీవ తీర్మాణం చేసింది. తీరా ఐఐటీ సాంక్షన్ కాగానే రాజ శేఖర రెడ్డి ప్లేటు ఫిరాయించి ఐఐటీ బాసరలో కాదు మెదక్ జిల్లాలో పెడతామని ప్రకటించాడు. కేంద్రం బాసరలో అయితే పర్మిషన్ ఇవ్వనందని నిండు సభ ముందు, పత్రికా విలేకరులతో పచ్చి అబద్దం చెప్పాడు. మరునాడు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అర్జున్ సింగ్ ఐఐటీ సాంక్షన్ చేయడం వరకే తమ పని అని, అది ఎక్కడ పెట్టుకోవాలో నిర్ణయించుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని కుండ బద్దలు కొట్టడం తో వై యెస్ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి కొన్ని కుంటి సాకులు ఏకరువు పెట్టాడు. బాసరలో విమానాశ్రయం లేదనీ, అక్కడ ఫ్యాకల్టీ ఉండరనీ ఇలా…

పేరుకి మెదక్ జిల్లా అన్నా ఇప్పుడు ఐఐటీ పెడదామనుకుంటున్న ప్రదేశం హైదరాబాదు శివారు కిందికే వస్తుంది. ఇప్పటికే రాష్ట్రం లోని అభివృద్ధి అంతా హైదరాబాదు చుట్టే కేంద్రీకృతమైపోతుందన్న విమర్శలు ఉన్నాయి. ఇక బాసర ఎందుకు వద్దో చెబుతున్న కారణాలు కూడా హేతు బద్దమైనవి కావు. ఏ విమానాశ్రయం లేకుండానే ఖరగ్పూర్ వంటి చోట ఐఐటీలు పెట్టలేదా? చిన్న ఊరిలో నెలకొల్పిన బిట్స్ పిలానీ ఎంత పేరు పొందిందో మనకు తెలియనిదా? ఒక మారు మూల పల్లెలో పెద్ద పరిశ్రమ పెట్టి అసామాన్య విజయాలు సాధిస్తున్న అమర రాజ బ్యాటరీస్ కథ వినలేదా మనం? సంకల్పం ఉండాలే కానీ ఇలాంటి చిన్న చిన్న అడ్డంకులు అధిగమించడం ఎంత సేపు?

ఐఐటీ బాసరలోనే స్థాపించాలని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. బంద్ లు, నిరాహార దీక్షలు, ధర్నాలు ఎన్నో జరిగాయి. అన్ని రాజకీయ పార్టీలు బాసరలోనే ఐఐటీ నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఒక విధంగా ఈ అనవసర వివాదం లేవదీసి దీన్ని తెలంగాణ లోని రెండు జిల్లాల మధ్య తగాదాగా మార్చివేసే ప్రయత్నం కూడా చేసింది ప్రభుత్వం. ఏదో కంటి తుడుపుగా ఒక స్థల పరిశీలన కమిటీ వేసింది. ఆ కమిటీ పోయిన వారం తన నివేదిక లో ఐఐటీ మెదక్ జిల్లాలోని కంది గ్రామం వద్దనే నెలకొల్పాలని చెప్పింది.

మచిలీపట్నం ఓడ రేవు ది మరో కధ. ముందుకృష్ణా జిల్లా గోగిలేరు ఈ ఓడరేవు నిర్మాణానికి అనువుగా ఉంటుందని నిర్ణయించిన ప్రభుత్వం అక్కడ ఈ పోర్టు నిర్మాణం కోసం సత్యం కంప్యూటర్స్ వారి మేటాస్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చింది. సదరు కంపెనీ దీనికోసం 6000 ఎకరాల స్థలం కూడా సేకరించింది.

పోర్టు గోగిలేరు లో కాకుండా మచిలీపట్నం దగ్గరలోని గిలకలదిన్నె లోనే నిర్మించాలని ప్రజల, ప్రజాప్రతినిధుల నుండి వత్తిడి వచ్చింది. ఇది రాను రాను తీవ్ర రూపం దాల్చడంతో ప్రభుత్వం దిగి వచ్చింది.

ఇప్పుడు ఇలా స్థలమార్పు చేయడం వలన ప్రభుత్వానికి అదనంగా 500 కోట్ల వరకూ అదనంగా ఖర్చు కాగలదని అంచనా. గోగిలేరుతో పోలిస్తే తక్కువ లోతులో ఉండటం వలన గిలకలదిన్నెలో అదనంగా డ్రెడ్జింగ్ చేయవలసి రావడం, సాండ్ ట్రాప్ నిర్మించాల్సి రావడం వల్ల పోర్టు నిర్మాణపు ఖర్చులు పెరగడమే కాక ప్రతి యేటా మెయింటెనెన్స్ ఖర్చు కూడా బాగానే పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ పోర్టు కోసం అల్రెడీ గోగిలేరు లో సేకరించిన 6000 ఎకరాలు ఎస్.ఈ.జెడ్ గా మార్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.

ఐఐటి గురించి వార్త వచ్చిన మరునాడే మచిలీపట్నం పోర్టు స్థలం మార్పు విషయం పేపర్లలో వచ్చింది. ఈ సంధర్భంగా వై యెస్ ఇలా అన్నాడు “ప్రజల మనోభావలు గౌరవిస్తూ, అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మాణం చేసినందు వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది”

“ప్రజల మనోభావాలూ, “ఏకగ్రీవ తీర్మాణం”…వహ్వా…ఏం చెప్పావు వైయెస్సూ….బాసరకొక న్యాయమూ బందరుకు ఒక న్యాయమూనా?…ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. తెలంగాణ విషయంలో నీ కపటత్వం మరో సారి బయటపెట్టుకున్నావు. రేపు ఎన్నికల్లో వారు నీకు, కాంగ్రెస్ కు తగిన గుణపాటమే చెబుతారు.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: