మళ్లీ ఒకసారి మారిషస్ కి

గుర్తుందా మీకు? ‘ మారిషస్ లో అన్ని డబ్బులున్నాయా ?‘ అని ఫిబ్రవరి 9, 2007 నాడు నేను ఒక పోస్టు చేశాను.

అందులో మారిషస్ కీ మనకీ మధ్య ఉన్న Double Tax Avoidance Treaty ఎలా దుర్వినియోగం అవుతుందో రాశాను. ఇప్పుడు దేశం లోనే అతి పెద్ద కుంభకోణం అని భావిస్తోన్న గుర్రాల హసన్ అలీ చేసిన ముఖ్యమైన వ్యాపారం మారిషస్ నుంచి హవాలా డబ్బుల లావాదేవీలే అని వార్తలొస్తున్నాయి. ఒక పెద్ద చేప దొరికింది. ఇంకా ఎన్ని ఉన్నాయో…

ఈ విషయం పై ఆంధ్ర జ్యోతి కధనం కింద చదవండి

హసన్‌ అలీ హవాలా గుర్రాలు ఘరానా లీడర్లే

హసన్‌ అలీ తీగలాగితే అగ్రశ్రేణి రాజకీయ నాయకులు, కార్పొరేట్‌ సంస్థల అధినేతలు, బాలీవుడ్‌ ఫైనాన్షియర్ల డొంక కదులుతోంది. హవాలా దారుల్లో వేల కోట్లు ప్రవహించినట్లు తేలుతుండటంతో ఇది దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణం కూడా కావచ్చంటున్నారు. బడాబాబులు, నేతలు తమ అక్రమార్జనను హవాలా ద్వారా విదేశాలకు పంపి… దానికి ‘విదేశీ పెట్టుబడి’ ముసుగు తొడిగి రాచమార్గంలో భారత్‌కు తేవడానికి హసన్‌ అలీని వాడుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద హసన్‌ అలీ అసలు కథలన్నీ వెల్లడయితే ఇది సంచలన వ్యవహారం కాబోతున్నది.

(ఆన్‌లైన్‌ న్యూస్‌ నెట్‌వర్క్‌) హసన్‌ అలీ వ్యవహారంలో తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా పలువురు అగ్రశ్రేణి రాజకీయ నాయకులు, సినిమా ఫైనాన్షియర్లు, కార్పొరేట్‌ సంస్థల అధిపతుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఐటీ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, సీబీఐ, ‘రా’ వంటి సంస్థలు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయవర్గాల్లోనూ, కార్పొరేట్‌ రంగంలోనూ పెను సంచలనం సృష్టిస్తున్నది. గుర్రాల వ్యాపారమే అయినప్పటికీ హసన్‌ అలీ అసలు సంపాదనంతా హవాలా దందాలో ఉన్నట్టుగా చెబుతున్నారు. దేశీయ స్టాక్‌ మార్కెట్‌లోకి విదేశాల నుంచి వచ్చిపడుతున్న నిధులపై దర్యాప్తు సందర్భంగా లభించిన సమాచారం ఆధారంగానే ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు హసన్‌ అలీపై దాడులు జరిపారని అంటున్నారు. దరిమిలా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న హవాలా నెట్‌వర్క్‌ గుట్టును అధికారులు కనిపెట్టగలిగారని తెలిసింది. హవాలా మార్గంలో వేల కోట్ల రూపాయలను హసన్‌ అలీ దేశం నుంచి విజయవంతంగా తరలించారని అంటున్నారు. హసన్‌ అలీకి 35,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నట్టుగా వెల్లడికావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు హసన్‌ అలీ హవాలా దందాలో అగ్రశ్రేణి రాజకీయనాయకులు, కార్పొరేట్‌ సంస్థల అధిపతులు, బాలీవుడ్‌ ఫైనాన్షియర్ల ప్రమేయం ఉన్నట్టుగా వస్తున్న వార్తలతో ఈ వ్యవహారం దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణంగా రూపుదిద్దుకుంటున్నట్టుగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

దాడులు నిజమే…

పుణె, ముంబై, బెంగళూర్‌, హైదరాబాద్‌లో స్థా వరాలు, ఇళ్లు వున్న గుర్రాల వ్యాపారిపై గత జనవరిలో దాడులు జరిపిన మాట నిజమేనని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ ప్రతినిధి ఎకె సిన్హా చెప్పా రు. ఈ సందర్భంగా స్విస్‌ బ్యాంక్‌ ఖాతాల వ్యవహారం కూడా బయటపడిందని ఆయన వెల్లడిం చారు. అయితే ఈ మొత్తం వ్యవహారం హవాలా దందాకు సంబంధించినదేనా అన్న విషయాన్ని ఇప్పుడే నిర్ధారించి చెప్పడం సాధ్యం కాదని ఆయ న దాటవేశారు. అధికారులు అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిపారు.

అధికారికంగా చెప్పనప్పటికీ దాదాపు డజనుపైగా స్విస్‌ బ్యాంకు ఖాతాలతో హవాలా దందాను హసన్‌ అలీ నిర్వహించినట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే భారత ప్రభుత్వం విజ్ఞప్తిపై ఏడు ఖాతాలను స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం స్తంభింపజేసిందని తెలిసింది. హవాలా మార్గంలో వేల కోట్ల రూపాయలను మారిషస్‌ వంటి దేశాలకు పంపినట్టుగా చెబుతున్నారు. మారిషస్‌, భారత్‌ మధ్య ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పం దం ఉంది. అందువల్ల మారిషస్‌ను పన్నుల స్వర్గధామంగా వ్యాపారవేత్తలు పరిగణిస్తారు. మారిషస్‌ నుంచి వచ్చే పెట్టుబడులపై లాభాలకు పన్ను భారం భారత్‌లో ఉండదు.

మారిషస్‌లోనే పన్ను చెల్లిస్తే సరిపోతుంది. పైగా మారిషస్‌లో పన్ను రాయితీలు లభిస్తాయి. పన్ను రేట్లు కూడా తక్కు వ. అందుకే భారత్‌లోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో సగానికి పైగా మారిషస్‌ నుంచే వస్తున్నాయి. స్టాక్‌మార్కెట్‌లోకి ప్రవహిస్తున్న విదే శీ మారకంలో అత్యధిక భాగం మారిషస్‌ కేంద్రం గా ఉన్న సంస్థల నుంచే వస్తున్నది. మారిషస్‌ సంస్థల యజమానులు ఎవరో ఎవరికీ తెలియదు. భారత్‌కు చెందిన బడా సంస్థలు సైతం నిధులను హవాలా మార్గంలో విదేశాలకు తరలించి లోపాయికారిగా మారిషస్‌ నుంచి దొంగకంపెనీల పేర్లతో మళ్లీ ఇండియాకు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నల్లధనం ఎక్కువగా ఈ రూట్లో బయటికి వెళ్లి విదేశీ పెట్టుబడిగా మారిషస్‌ మీదు గా మళ్లీ భారత మార్కెట్లోకి ప్రవహిస్తోంది.

ఎలా దొరికారు…

హసన్‌ అలీ విలాసవంతమైన జీవన విధానమే ఐటీ అధికారులకు ఆయనపై అనుమానానికి ఆస్కారం ఇచ్చిందని అంటున్నారు. అత్యంత ఖరీదైన కార్లు, విలాసవంతమైన బంగ్లాలు, రేసు గుర్రాలు, హైదరాబాద్‌, పుణె రేసుకోర్సులతో సన్నిహిత సంబంధాలు, మేలు జాతి అశ్వాల పెంపకం కేంద్రాలు, గుర్రాలపై మోజున్న సంపన్నులతో సన్నిహిత సంబంధాలు…ఇవన్నీ హసన్‌ అలీపై ఐటీ అధికారుల కన్నుపడటానికి కారణమంటున్నారు. ఎగుమతి-దిగుమతులకు సంబంధించిన కొన్ని లావాదేవీలపై దర్యాప్తు సందర్భంగా వేలకోట్ల రూపాయల మేర నిధులు అక్రమంగా దేశం దాటి వెళ్లుతున్నట్టుగా వెల్లడయిందని ఐటీ అధికారులు తెలిపారు. ఆ సొమ్మే మళ్లీ ఇతర మార్గాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌లోకి తరలి వస్తున్నట్టుగా కూడా వెల్లడికావడంతో దర్యాప్తు ముమ్మరం చేశామని ఈ క్రమంలోనే హసన్‌ అలీ పేరు కూడా బయటకు వచ్చిందని వారు చెబుతున్నారు.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: