తెలంగాణా వాదం వేర్పాటువాదమా?

ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణా ప్రజలు చేస్తున్న ఉద్యమాన్ని “వేర్పాటువాదం’ అని ముద్ర వేస్తున్నారు కొందరు. ఇలా వేసేవారందరూ ఒకే ఉద్దేశ్యం తో ఈ పని చేయట్లేదు. కొంత మంది మిత్రులు నిజంగానే ఈ తేడా ను అర్ధం చేసుకోలేకపోతున్నారు. మరి కొంత మంది అర్ధం చేసుకున్నా ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న వేర్పాటువాద (ఉదా: కాశ్మీర్, ఖలిస్తాన్) ఉద్యమాల కోవలో చూడగూడదు. దేశం నుండి విడిపోవాలనుకోవడం వేర్పాటువాదం అవుతుంది కానీ తమ ప్రాంతానికి స్వయం పాలనాధికారం కావాలని కోరడం వేర్పాటువాదం కాదు.

ఒకవేళ తెలంగాణా కోరడం వేర్పాటువాదం అయితే 1952 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి విడిపోవాలనుకున్న తెలుగు ప్రజల ఆకాంక్షను కూడా వేర్పాటువాదం గానే పరిగణించాల్సి ఉంటుంది.

ప్రాంతం ప్రాతిపదికన అసలైన ప్రాంతీయతత్వం, సంకుచిత ప్రాంతీయతత్వం, వేర్పాటువాదం…వీటి మధ్య తేడాను వివరిస్తూ ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ రాసిన ఈ చక్కటి వ్యాసం ఆంధ్రజ్యోతి నుండి…..

నోట్: ఈ పోస్ట్ ఉద్దేశం ప్రాంతీయవాదం, వేర్పాటువాదాల మధ్య తేడా వివరించడానికే. వేర్పాటువాదం చెడ్డదని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు.

సమైక్యతను దెబ్బతీస్తున్న వివక్ష
– రామచంద్ర గుహ

అసోమ్‌లో ఇటీవల బీహారీ కూలీలపై యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ఆఫ్‌ అసోమ్‌ (ఉల్ఫా) దాడులు నిస్సందేహంగా నేరపూరితచర్యలే. అసోమ్‌ ప్రజలు, భద్రతా దళాలు వాటినలా పరిగణించడం పూర్తిగా సబబే. అయితే ఉల్ఫా దాడులను చారిత్రిక నేపథ్యంలో పరిగణించాల్సిన అవసరమెంతైనా ఉంది. భారత్‌ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించినదాది వక్రగతి పడుతోన్న ప్రజల మనోభావాలు అభివ్యక్తమవుతోన్న వైనంలో ఆ దాడులు ఒక భాగం. ప్రజలకు తమ భాష, ప్రాంతంతో ఉన్న అనుబంధం ప్రాతిపదికగా ఉత్పన్నమైనదే ఈ ప్రజా ప్రవృత్తి. ప్రజలు ప్రదర్శిస్తున్న ఆ ప్రవృత్తికి ‘ప్రాంతీయవాదం’ అని పేరిడవచ్చు. ఇది వివిధ రూపాలలో హింసాత్మకంగా ప్రజ్వరిల్లుతోంది. ప్రజల్లో ప్రాంతీయతత్వం తొలుత ప్రత్యేక ప్రదేశాన్ని అంటే (భారత్‌లో భాగంగా ఉండే సొంత రాష్ట్రాన్ని డిమాండ్‌ చేస్తుంది. ఈ డిమాండ్‌ చాలావరకు న్యాయబద్ధమైనదే. ఈ తరహా ప్రాంతీయవాదానికి ఆద్యులు ఇది వరకటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు భాష మాట్లాడే ప్రజలు.

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 1952లో 52రోజులపాటు ఆమరణ నిరాహారదీక్షచేసి అమరుడయ్యారు. ఆయన ఆత్మబలి తొలుత ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి, సుదీర్ఘకాలంలో భాషా ప్రయుక్తత ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు ప్రధాన హేతువయింది. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ప్రాంతీయతత్వాన్ని పూర్తిగా రూపుమాపలేదు. కేంద్రం నుంచి తమకు మరిన్ని నిధులు, అధికా రాలు కావాలనే డిమాండ్‌ రూపంలో ఇది ఇప్పుడు వ్యక్తమవుతోం ది. ఈ తరహా ప్రాంతీయ వాదానికి ఆద్యులు తమిళులు. కేంద్ర ప్రభుత్వం ఉత్తరాదిరాష్ట్రాల (ముఖ్యంగా హిందీ భాషా రాష్ట్రాలు) ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తుందనేది తమిళల ఆరోపణ. వారు తమ నిరసనను చాలా తీవ్రస్థాయిలో వ్యక్తంచేసేవారు. లక్ష్య సాధ నలో విజయమూ సాధించారు. హిందీ వ్యతిరేకోద్యమానికి నాయకత్వం వహించిన డిఎంకె 1967లో అధికారానికి వచ్చింది. ఎన్నికలలో పోటీచేసి గెలవడం ద్వారా అధికారానికి వచ్చిన తొలి రాజకీయ పక్షం డిఎంకె.

ఆ తరువాత డిఎంకెని ఆదర్శంగా తీసుకొని పం జాబ్‌లో అకాలీదళ్‌, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, అసోమ్‌లో అసోమ్‌ గణపరిషత్‌ తమ తమ ప్రాంతాల హక్కుల కోసం, కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా పోరాడి అధికారం లోకి వచ్చాయి. ఈ రాజకీయ పక్షాలు తమ పేర్ల ద్వారా తమను తాము ప్రాంతీయ రాజకీయపక్షాలుగా ప్రకటించుకున్నాయి. అయితే సిపిఎం పశ్చిమ బెంగాల్‌ విభాగాన్ని -కనీసం ఆ శాఖకు జ్యోతిబసు, బెంగాల్‌ ఆర్థిక కార్యకలాపాలకు అశోక్‌ మిత్రా సారథ్యం వహించినప్పుడు-కూడా ఒక ప్రాంతీయపక్షంగా పేర్కొనవచ్చు. ఏమంటే న్యూఢిల్లీ అనుసరిస్తోన్న వివక్షాపూరిత విధానాలకు వ్యతిరేకంగా బెంగాల్‌, బెంగాలీల ప్రయోజనాలను కాపాడేందుకు తాము నిబద్ధమయ్యామని మార్క్సిస్టు నాయకులు ఉద్ఘాటించేవారు.

భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ వివిధప్రాంతాల ప్రజలలో అసంతృప్తి తొలగి పోనేలేదు. ప్రాంతీయవాదం కొత్త రూపు తీసుకొంది. దీనికి ఉప-ప్రాంతీయతత్వమని విద్యావేత్తలు పేరు పెట్టారు. భాష ప్రాతిపదికన ఏర్పడిన కొత్త రాష్ట్రాలలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్దిష్ట ప్రాంతాలలో అత్యధిక సంఖ్యలో మైనారిటీలు ఉన్నారు. భాష లేదా జాతి/ మతం ప్రాతిపదికన వారు రాష్ట్రంలోని మెజారిటీ వర్గానికి వ్యతిరేకంగా సమైక్య మవడం జరిగింది. పశ్చిమ బెంగాల్‌లో నేపాలీలు, అసోమ్‌లో బోడో భాషీయులు ఇలాంటి మైనారిటీ వర్గాలే. సొంత రాష్ట్రం కోసం పలు సంవత్సరాలపాటు పోరాడిన నేపాలీలు, బోడోలు చివరకు ఉన్న రాష్ట్రంలోనే స్వతంత్ర ప్రతిపత్తిగల మండళ్ళ (అటానమస్‌ కౌన్సి ల్స్‌)తో సంతృప్తి పడవలసివచ్చింది.

సొంత రాష్ట్రంకై ఉత్తరప్రదేశ్‌లోని కొండ ప్రాంతాల ప్రజల పోరాటం ఉత్తరాంచల్‌గా ఫలించింది. అలాగే చోటానాగపూర్‌ పీఠభూమి వాసులైన గిరిజనులు, ఇతర ప్రజలు జార్ఖండ్‌ను సాధించుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం వారు స్వాతంత్య్రం రాకముందునుంచే పోరాడుతున్నారు. తమ విలక్షణ గుర్తింపును పరిరక్షించుకోవడానికి భారత్‌లో భాగంగా సొంత రాష్ట్రం లేదా రాష్ట్రంలో భాగంగా స్వతంత్ర పాలనామండలిని డిమాండ్‌చేయడం ప్రజాస్వామ్యా నికిగానీ, దేశభక్తికిగానీ విరుద్ధమైనది కాదు. అయితే మనజాతి చరిత్రలో ప్రాంతీయ వాదం కొన్నిసార్లు సంకుచితత్వంగా పరిణమించింది. ఇది బెంగాలీల విషయంలో నిరపాయంగా వ్యక్తమైంది. బెంగాలీలు తమ సాహిత్యం, సంగీతం భారత్‌లోని ఏ ప్రాంతపు సాహిత్య సంగీతాలకంటే ఉత్క­ృష్టమైనవని భావిస్తారు. అయి తే సంకుచిత ప్రాంతీయ తత్వం హింసాత్మకంగాకూడా వ్యక్తమయింది. బీహారీలపై ఉల్ఫాదాడులే ఇందుకు తార్కాణం. అసోమ్‌లో నివశించే హక్కు అస్సామీ భాష మాట్లాడే ప్రజలకు మాత్ర మే ఉందన్న ప్రగాఢ విశ్వాసమే ఉల్ఫా కార్యకర్తలను ఆ దాడులకు పురిగొల్పింది.

నిరపాయ సంకుచిత ప్రాంతీయ తత్వా నికి నాయకులు బెంగాలీలు అయితే దౌర్జ న్యపూరిత సంకుచిత ప్రాంతీయ తత్వానికి ఆద్యులు మహారాష్ట్రీయులు. 1960ల మధ్యనాళ్ళలో బొంబయిలోని దక్షిణ భారతీయులపై శివసేన కార్యకర్తలు తర చుదాడులు చేసేవారు. వారు భూమిపుత్రులుగారని, నగరానికి ‘వెలుపలివార’నేది శివసే న ఆరోపణ. ఆ ఆరోపణలతోనే వారు బొంబాయిలోని ఉడిపి హోటళ్ళను దగ్ధంచేశారు. తదనంతర కాలంలో బెంగాలీలు, బీహారీలపై కూడా శివసేన వారు ఇదే విధమైన ఆగ్ర హావేశాలను ప్రదర్శించారు. శివసేన, ఉల్ఫాదాడుల మధ్యకాలంలో బీహారీ వలస కార్మి కులను పంజాబ్‌లో ఖలిస్థానీ తీవ్రవాదులు, జమ్మూ-కాశ్మీర్‌లో ముజాహిదీన్‌లు హత మార్చారు. భారతీయ నేర శిక్షాస్మ­ృతిప్రకారం ఈ చర్యలు ఘో రనేరాలే. అంతకంటే కలవరపరిచే విషయమేమిటంటే ఆ హత్యా కాండ అసలు భారత్‌ భావన (ఐడియా ఆఫ్‌ ఇండియా)కే సవాల్‌ కావడం.

భారత్‌లో ఎక్కడైనా నివశించడానికి, పనిచేసుకోవడానికి భారతరాజ్యాంగం తన పౌరులకు హక్కు కల్పించింది. ఒక రాష్ట్రంనుంచి మరో రాష్ట్రానికి, ఒక ప్రాంతంనుంచి మరో ప్రాంతానికి స్వేచ్ఛగా తరలివెళ్ళడమనేది స్వేచ్ఛాయుత పౌరసత్వానికి ప్రాతిపదిక. భారత్‌నుంచి పూర్తిగా విడివడి సార్వభౌమికదేశంగా ఏర్పడాలనే ప్రగాఢ ఆకాంక్ష, కాల్పనిక భావన అతి తీవ్ర, ప్రమాదకర మైన ప్రాంతీయతత్వానికి ప్రాతిపదిక. ఇటువంటి ఆకాంక్ష ఒకప్పుడు నాగానాయకుడు ఎ.జడ్‌. ఫిజోను ఆవహించింది. ఆయన నేతృత్వంలో నాగా నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌ చాలా సంవత్సరాలపాటు స్వతంత్ర నాగాలాండ్‌ కోసం పోరాడింది. ఇప్పుడు నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌ నేత టి.మూయివాను నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది కూడా ఇదే ఆకాంక్ష అని చెప్పవచ్చు. ఆ విధంగా సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికే కాశ్మీర్‌లో కాశ్మీరీ, కాశ్మీరీయేతర తీవ్రవాదులు దశాబ్దాలుగా పోరాడుతున్నారు.

1980లనాటి సిక్కు తీవ్రవాదులుకూడా తమ సొంతజాతి- రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనిఆశించారు. వాస్తవానికి ద్రవిడ ఉద్యమం కూడా చాలా సంవత్సరాలపాటు భారత్‌నుంచి విడిపోయేహక్కు తమకుందని వాదించింది. ఈ తరహా ప్రాంతీయ తత్వాన్ని వేర్పాటువాదంగా పరిగణించవచ్చు. సంకుచిత ప్రాంతీయ తత్వానికి కంటే దీనికి న్యాయబద్ధత మరింత తక్కువే. ఆనందకరమైన విషయమేమిటంటే సిక్కులు మళ్ళీ భారత్‌తో మమేకమయ్యారు. అలాగే మిజోలకూడా. ప్రత్యేక దేశంకోసం పోరాడిన మిజోలు 1986 నుంచి భారత్‌లో భారతీయులుగా శాంతియుత సహజీనవం నెరపుతున్నారు. ఈ విధంగా మన దేశంలో ప్రాంతీయవాదం మూడు రకాలుగా అభివ్యక్తమయింది. ఒకటి భాష, ప్రాంతం ప్రాతిపదికన అసలైన ప్రాంతీయతత్వం, రెండోది సంకుచిత ప్రాంతీయతత్వం, మూడోది వేర్పాటువాదం. ఉల్ఫా ప్రాంతీయతత్వం ప్రత్యేకమైనదని చెప్పవచ్చు.

మనం ప్రస్తా వించుకున్న మూడు విధాల ప్రాంతీయ తత్వధోరణులు మిలిటెంట్‌ సంస్థ పోరాటానికి స్ఫూర్తిగా ఉన్నాయి. కనుకనే అస్సామీలు ఉల్ఫాను పూర్తిగా వ్యతిరేకించ లేకపోతున్నారు. తాము వివక్షకు గురవుతున్నామన్న భావన అస్సామీలలో బలీయంగా ఉంది. ప్రత్యేక దేశంగా ఏర్ప డాలన్న ఉల్ఫా ఆకాంక్షతో వారు ఏకీభవించకపోవచ్చు; వలస కార్మికులను హతమార్చడాన్ని కూడా వారు ఆమోదించకపోవచ్చు. అయితే తమ రాష్ట్రాన్ని మిగతా భారతదేశం తిరస్కార ధోరణితో చూస్తుందనే భావనకు అస్సామీలు లోనవుతున్నారు. నాగాలు, కాశ్మీరీలు కూడా ఇదే విధమైన అసంతృప్తితోఉన్నారు. అసోంతో పాటు నాగాలాండ్‌, జమ్మూ-కాశ్మీర్‌లో కూడా ప్రాంతీయతత్వం హింసాత్మకంగా ప్రజ్వరిల్లడానికి కారణమిదే. అందుకే భారత్‌ (యూనియన్‌ఆఫ్‌ ఇండియా)తో ఒక సుస్థిర శాంతి ఒప్పందానికి రావడానికి నాగాలు, కాశ్మీరీలు తిరస్కరిస్తున్నారు.

(వ్యాసకర్త చరిత్రకారుడు)

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: