లక్ష మంది రైతన్నల ఉసురు తీశారు గదరా…

ఇది నా హృదయానికి చాలా దగ్గరి విషయం. స్వతహాగా వ్యవసాయ కుటుంబం నుండి రావటం వల్లనేమో. రైతుల వెతలు నన్నెప్పుడూ ఆందోళన పెడుతూనే ఉంటాయి.

మనం “సృష్టిస్తున్న” కొత్త బంగారు లోకపు ఫలాలను అందుకోలేని రైతన్నలు పిట్టల్లా రాలిపోతున్నారు. గడచిన 15 ఏళ్లుగా మన ప్రభువులు తీసుకుంటున్న వరుస నిర్ణయాలు వారి ఉసురు తీస్తున్నాయి. “అధికారిక లెక్కల” ప్రకారమే ఇప్పటికి లక్షమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారట.

farmer.jpg

సమాచార హక్కు చట్టం కింద డక్కన్ క్రానికల్ పత్రిక అడిగిన ప్రశ్న కు బదులుగా “రోజుకు ఏడుగురు రైతులు చనిపోతున్నారని” ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ఇక్కడ చదవండి

ఆంధ్ర ప్రదేశ్ లో రైతుల ఆత్మహత్యల పైన చాడ్ హీటర్ తీస్తున్న Seeds of Suicide అనే డాక్యుమెంటరీని ఇక్కడ చూడండి.

దేశం లో రైతుల ఆత్మహత్యల పై నడుస్తున్న ఒక బ్లాగుని ఇక్కడ చదవండి

రైతుల వెతల పై పి. సాయినాద్ రాసిన అలోచింపజేసే వ్యాసం కింద చదవండి (ఈనాడు దినపత్రిక నుండి)

విధి వంచన కాదు, విధాన వంచన!
పి.సాయినాథ్‌

2005లో అమెరికాలో పండిన మొత్తం పత్తి విలువ 390 కోట్ల డాలర్లు. కానీ పత్తికి అమెరికా ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ 470 కోట్ల డాలర్లు!

డబ్ల్యూటీవో ఒప్పందం ప్రకారం డంపింగ్‌ను అడ్డుకునే హక్కు మనకుంది. విభిన్నరేట్లను నిర్ణయించడం, సుంకాలను పెంచడం ద్వారా అడ్డుకోవచ్చు. కానీ మనం ఇలా చేశామా? లేదు.

1990లో జీడీపీలో 14.5% ఉన్న ప్రభుత్వ అభివృద్ధి వ్యయం 2005 నాటికి 5.9% నికి తగ్గింది. దీనివల్ల గ్రామీణ భారతం ఏటా రూ.1.2 నుంచి 1.5 లక్షల కోట్ల మేర నష్టపోతోంది. వైమానిక దళాన్ని గ్రామాల మీదికి పంపించి బాంబులు వేయించినా ఈ స్థాయిలో నష్టం జరగదేమో!

వ్యవసాయాభివృద్ధిని క్వింటాళ్ల దిగుబడి ప్రకారం కాదు, రైతుల ఆదాయాలనే స్కేలుతో కొలవాలి.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిణామాలు తప్పుడు దిశలో సాగుతున్నాయి. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని రైతుల్ని జైలులో వేస్తున్నారు. ఇది చాలా అసాధారణమైన పరిస్థితి. ముందుగా ప్రభుత్వ విధానాల ద్వారా మనమే రైతుల్ని అప్పుల దిశగా నడిపిస్తున్నాం. ఆ తర్వాత ఆ అప్పులు కట్టలేదని మనమే వారిని శిక్షిస్తున్నాం…

నీరు, దాణా దొరకని విదర్భ జిల్లాల్లో రైతులకు ఆవుల్ని పంచడమనేది అర్థం లేని పని. ఒక్కో ఆవుని పోషించడానికి రోజుకు రూ.120 నుంచి 150 రూపాయలు ఖర్చవుతుంది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు చెల్లించేదాని కంటే ఇది రెట్టింపు. విదర్భలో రైతుకు రోజుకు 150 రూపాయల ఆదాయం ఉండిఉంటే అసలక్కడ సంక్షోభమే వచ్చేది కాదు. అతడు ప్రభుత్వ సహాయం కోసం చూసేవాడే కాదు. ఖరీదైన ఈ ఆవులు ‘లబ్ధిదారుల’ ఇళ్లు గుల్ల చేశాయి. ఇంటిల్లిపాదికీ సరిపడ సొమ్ము వాటి కోసం ఖర్చయిపోయింది. ప్రస్తుతం విదర్భలో రైతుల ఇళ్లకు వెళ్లి చూస్తే… ఆ ఆవుల్ని అమ్మి వదుల్చుకునే పనిలో వారు తీరిక లేకుండా ఉన్నారు. కొందరైతే ఉచితంగా ఎవరో ఒకరికి ఇచ్చేస్తున్నారు.

1993-2003 మధ్య లక్ష మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అధికారికంగా అంగీకరించిన దేశమిది. మంత్రి శరద్‌ పవారే పార్లమెంటులో ఈ మేరకు ప్రకటన చేశారు. వాస్తవ సంఖ్యలు ఇంకా దారుణంగా ఉన్నప్పటికీ అధికార గణాంకాలను బట్టి చూసినా పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. కానీ మన దృష్టి, మన అభివృద్ధి నమూనా, మన విధానాలు… అన్నీ ధనికుల్ని మరింత ధనికులుగా మార్చేవిగానే ఉన్నాయి. పేదలు, రైతుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం మనం నిజాల్ని దాటవేస్తున్నాం.

కేంద్ర వ్యవసాయ మంత్రి ఈ రాష్ట్రానికి చెందినవారే. ఆయనకు క్రికెట్‌ అంటే యమా ఇష్టం. కనీసం ఆ ఆటలోని వ్యాపార కోణమంటే ఇష్టం. ఇక ఈ రాష్ట్ర గవర్నర్‌కు పక్కనున్న సొంత రాష్ట్రం కర్ణాటక అంటేనే ఇష్టం. ముఖ్యమంత్రికి రియల్‌ ఎస్టేట్‌ అంటే మహా ఇష్టం.

రైతుల జీవితాల్లో సానుకూల మార్పు తెచ్చే దిశగా ఎం.ఎస్‌.స్వామినాథన్‌ నేతృత్వంలోని జాతీయ రైతుల కమిషన్‌ (ఎన్‌సీఎఫ్‌) పలు సిఫారసులు చేసింది. వ్యవసాయ రంగాన్ని కాపాడాలన్న చిత్తశుద్ధి నిజంగా ప్రభుత్వానికి ఉంటే ఆ సిఫారసుల్ని ఆమోదించాలి. వచ్చే బడ్జెట్‌లో అందుకోసం నిధుల్ని కేటాయించాలి. ఆవుల పంపిణీ వంటి చేష్టలు పటిష్ఠ కార్యాచరణకు ప్రత్యామ్నాయం కాబోవు. ఎన్‌సీఎఫ్‌ చెప్పినట్లుగా కేంద్ర-రాష్ట్ర ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తే రైతులకు గిట్టుబాటు దక్కని పరిస్థితి ఉండదు.

ఇంతకాలం అంతర్జాతీయ ధరల హెచ్చుతగ్గుల నుంచి రైతులకు మనం ఎలాంటి రక్షణా కల్పించకుండా గాలికి వదిలేశాం. పత్తినే తీసుకుంటే… ఆంధ్రప్రదేశ్‌లో పత్తి రైతులు ఎన్నో ఏళ్లుగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. భారత్‌లో రైతులు పోటీ ధరలకు నాణ్యమైన పత్తిని పండిస్తున్నారు. కానీ 1995 నుంచి అమెరికా, ఐరోపా సమాజం పత్తి పండించేవారికి మున్నెన్నడూ లేని రీతిలో భారీ సబ్సిడీలను అందించడం ప్రారంభించాయి. అమెరికాలో అసలు రైతులే కాని వారికి సబ్సిడీలు అందుతున్నాయి. వ్యవసాయం పేరిట బడా వ్యాపార సంస్థలు, బహుళ జాతి సంస్థలు రాయితీలు పొందుతున్నాయి. అమెరికాలో పత్తి పండించేవారు 20,000 మంది మాత్రమే ఉండగా అందులో అధిక భాగం వ్యాపార సంస్థలే. భారత్‌లో అలా కాదు. ఇక్కడ పత్తిని పండించేది చిన్న రైతులు. ఒక్క మహారాష్ట్రలోనే మనకు 30 లక్షలమంది పత్తి రైతులున్నారు. 2005లో అమెరికాలో పండిన మొత్తం పత్తి విలువ 390 కోట్ల డాలర్లు. కానీ పత్తికి అమెరికా ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ 470 కోట్ల డాలర్లు! 1995 నుంచీ ఇలాగే జరుగుతోంది. దాని ఫలితంగా అంతర్జాతీయంగా పత్తి ధర పౌండుకు 100-110 సెంట్ల నుంచి 40 సెంట్లకు పడిపోయింది. ధరలు ఊహించనంతగా పతనం కావడంతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పత్తి రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోను, విదర్భలోనే కాదు… మాలి, బుర్కినాఫాసో తదితర దేశాల్లో కూడా!

అమెరికా పత్తి ఈ దేశంలోకి విపరీతంగా వచ్చి పడుతోంది. మన పత్తి దిగుమతులు ఇటీవల మూడింతలయ్యాయి. ధరలు పతనమయ్యే కొద్దీ మన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ విధంగా కృత్రిమంగా ధరల్ని పడదోసే పథకం వివిధ పంటల్లో వివిధ రకాలుగా అమలవుతోంది. కేరళలోని వాయనాడ్‌లో కాఫీ, మిరియాలు పండించే వందలాది రైతులు ఈ కారణంగానే ఆత్మహత్యలు చేసుకున్నారు. వెనీలా రైతుల పరిస్థితీ ఇంతే.

మరి ఈ పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు ఏం చేయాలి? కానీ నిజంగా ఏం చేశాయి? డబ్ల్యూటీవో ఒప్పందం ప్రకారం డంపింగ్‌ను అడ్డుకునే హక్కు మనకు ఉంది. విభిన్నమైన రేట్లను నిర్ణయించడం, సుంకాలను పెంచడం ద్వారా డంపింగ్‌ను మనం అడ్డుకోవచ్చు. అది మన హక్కు. కానీ మనం ఇలా చేశామా? లేదు. పైగా సుంకాలను తగ్గించి సమస్యను తీవ్రతరం చేశాం. పత్తిపై సుంకం నామమాత్రంగా పది శాతం మాత్రమే ఉంది. ముంబాయికి చెందిన వస్త్ర ఉత్పత్తిదారులు ఆ మాత్రం సుంకం కూడా చెల్లించనక్కర్లేదు. పత్తిని దిగుమతి చేసుకుని, దానితో తయారైన దుస్తుల్ని తిరిగి ఎగుమతి చేస్తామని చెబితే సుంకం నుంచి మినహాయింపు లభిస్తుంది. పత్తిపై సుంకం నామమాత్రంగా ఉండగా చక్కెరపై మాత్రం భారీ స్థాయిలో ఉంది. కారణం… అభివృద్ధి చెందిన పశ్చిమ మహారాష్ట్రలో చక్కెర పవార్‌కు ప్రాణప్రదమైనది. పత్తి వెనుకబడ్డ ప్రాంతాలైన విదర్భ, మరాఠ్వాడాల్లో బీద రైతులకు సంబంధించినది.

రైతుల్ని ఆదుకోవాలంటే ఇంకేం చేయవచ్చు? వారికి సరైన ధరలు లభించేలా చూసేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయవచ్చు. ధరలు తగ్గినప్పుడల్లా ఈ నిధిని ఉపయోగించవచ్చు. మళ్లీ ధరలు పెరగ్గానే ఉపసంహరించవచ్చు. కానీ ఇలా చేయడానికి బదులు రైతులకిస్తున్న కొద్దిపాటి రాయితీల్నీ మనం వెనక్కి తీసేసుకున్నాం. పశ్చిమ దేశాలు ప్రతి కిలో పత్తికీ భారీ సబ్సిడీలు ఇస్తున్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 చొప్పున ఇచ్చే ‘అడ్వాన్స్‌ బోనస్‌’ను ఉపసంహరించుకుంది. 2005లో ఈ నిర్ణయం వెలువడ్డాక విదర్భలో ఆత్మహత్యలు మూడింతలయ్యాయి.

1990లో ప్రభుత్వ అభివృద్ధి వ్యయం స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 14.5 శాతం ఉండేది. 2005 వచ్చేసరికి ఇది 5.9 శాతానికి తగ్గిపోయింది. దీనివల్ల గ్రామీణ భారతం ప్రతి ఏటా రూ.1.2 నుంచి 1.5 లక్షల కోట్ల మేర నష్టపోతోందన్నది జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ ఉత్సా పట్నాయక్‌ అంచనా. మన వైమానిక దళాన్ని గ్రామాల మీదికి పంపించి యుద్ధ విమానాలతో బాంబులు వేయించినా ఈ స్థాయిలో నష్టం జరగదేమో! అభివృద్ధి వ్యయాన్ని వెనుకటి స్థాయికి పునరుద్ధరిస్తే తప్ప మనం చేయగలిగేది పెద్దగా ఉండదు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడుల్ని 1991 పూర్వ స్థాయికి తీసుకెళితే తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు రాదు. ఎన్‌సీఎఫ్‌ చెప్పినట్లుగా… వ్యవసాయాభివృద్ధిని కిలోలు, క్వింటాళ్ల దిగుబడి ప్రకారం కాదు, రైతుల ఆదాయాలనే స్కేలుతో కొలవాలి.

యూపీఏ ప్రభుత్వం ఎన్ని వాగ్దానాలు చేసినా అప్పు అనేది రైతుకు ఇప్పటికీ చాలా పెద్ద సమస్యగా ఉంది. వ్యవసాయ రంగ సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకున్న ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రస్తుత పరిణామాలు తప్పుడు దిశలోనే సాగుతున్నాయి. 2004 మే తర్వాత ప్రభుత్వం సదుద్దేశంతో, చొరవను ప్రదర్శించి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. కానీ ఇప్పుడు… తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని రైతుల్ని జైలులో వేస్తున్నారు. ఇది చాలా అసాధారణమైన పరిస్థితి. ముందుగా ప్రభుత్వ విధానాల ద్వారా మనమే రైతుల్ని అప్పుల దిశగా నడిపిస్తున్నాం. ఆ తర్వాత ఆ అప్పులు కట్టలేదని మనమే వారిని శిక్షిస్తున్నాం. జాతీయ శాంపిల్‌ సర్వే గణాంకాల ప్రకారం భారత్‌లో రైతుల రుణ భారం 1992-93తో పోలిస్తే 2001-02లో రెట్టింపైంది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రభాగాన ఉంది. అందువల్ల వ్యవసాయ సంక్షోభంపై ఇతర రాష్ట్రాలన్నింటి కంటె ఆంధ్రప్రదేశ్‌ మరింత స్పందనాత్మకంగా వ్యవహరించాలి. రైతుల్ని జైళ్లలో వేయడం తిరోగమన కారకమైన, ప్రమాదకరమైన చర్య. ఇది మరింత సంక్షోభానికే దారితీస్తుంది.

ఎన్‌సీఎఫ్‌ ఛైర్మన్‌ మరో విలువైన సూచన చేశారు. రైతులకు రుణాల మంజూరీ ప్రతి అయిదేళ్లకోసారి జరగాలన్నారు. ప్రస్తుతం రైతు ప్రతి సీజన్‌లోనూ అప్పు చేయాల్సిన సమయం వచ్చేసరికి విపరీతమైన టెన్షన్‌కు గురవుతున్నాడు. అలాకాకుండా బ్యాంకులు ఒకేసారి అయిదేళ్లపాటు ప్రతి సీజన్‌లో రుణం పొందడానికి అనుమతి ఇచ్చినట్లయితే రైతులకు మానసిక ఒత్తిడి, వేధింపులు తగ్గుతాయి. ఫలితంగా ఆత్మహత్యలూ తగ్గుముఖం పడతాయి.

గత దశాబ్దకాలంలో మనం నియంత్రణల ఎత్తివేత పేరిట అక్రమాల రాకెట్లను అనుమతించాం. ఖరీదైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ద్వారా రైతును మోసగించి వ్యవసాయ పెట్టుబడిని భారీగా పెంచేయడానికి మన కంపెనీలు, బహుళ జాతి సంస్థలకు వీలు కల్పించాం. తప్పుడు ప్రకటనలతో మాయదారి విత్తనాల్ని అమ్మే అవకాశమిచ్చాం. ఇప్పుడు దానిని సరిదిద్దాలి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల వంటి వాటి ధరల్ని తగ్గించడంతోపాటు తక్కువ ఖర్చయ్యే సేద్యానికి రైతులు మళ్లేలా ప్రోత్సహించాలి. అంటే మన వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ప్రైవేటు కార్పొరేషన్లకు కాకుండా రైతుకు సేవలందించేలా చూడాలి.

ఇప్పటివరకూ మనం అనుసరిస్తున్న మార్గాన్ని సరిదిద్దుకోవడానికి బడ్జెట్‌ ఓ అవకాశం. వ్యవసాయంపై మనకు చిత్తశుద్ధి ఉంటే ధరల స్థిరీకరణ నిధిని మనం ఏర్పాటు చేయగలం. రైతులకు స్థిరమైన ఆదాయాల్ని కల్పించగలం. పెద్ద పెద్ద కార్పొరేషన్లు భారీ సబ్సిడీలతో కూడిన వస్తువుల్ని మన దేశంలోకి డంప్‌ చేయకుండా నిబంధనల్ని ఉపయోగించి అడ్డుకోగలం. వ్యవసాయ రుణ వ్యవస్థను మార్చి తక్కువ వడ్డీకి… ఆ మాటకొస్తే వడ్డీ లేకుండానూ రుణాలివ్వగలం. అయిదేళ్ల రుణ మంజూరీని అమలులోకి తేగలం. అభివృద్ధి వ్యయాన్ని పెంచగలం. వ్యవసాయంలో ప్రభుత్వ పెట్టుబడిని అధికం చేయగలం. మరి బడ్జెట్‌ ఈ మార్గాన్ని అనుసరిస్తుందా? అలా జరగాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలా జరగదని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను.

రుణాలు రద్దు చేయాలి

చిన్న, సన్నకారు రైతులు ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయారు. రైతుల దృష్టి నుంచి చూస్తే ఇవి చాలా భారీ మొత్తాలు. కానీ ఇతర కోణాల నుంచి చూస్తే చాలా చిన్న మొత్తాలు. ఈ రుణాల్ని రద్దు చేయాలి. ధనికులైన కొద్దిమంది పారిశ్రామికవేత్తల లబ్ధి కోసం వేల కోట్ల రూపాయల నిరర్థక ఆస్తుల్ని (రాని బాకీల్ని) రద్దు చేసిన దేశమిది. కానీ కోట్లాది రైతులు బకాయిపడ్డ వేల రూపాయల్ని రద్దు చేయడానికి మనం సుముఖత చూపడం లేదు. ధనికుల కోసం ఖర్చు రాసేసిన 40 వేల కోట్ల రూపాయల నిరర్థక ఆస్తులతో పోలిస్తే… విదర్భ రైతుల కోసం రద్దు చేయాల్సిన రూ.1,200 కోట్ల అప్పుల మొత్తం చాలా తక్కువ.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: