కాకుల్ని కొట్టి గద్దలకు వేస్తున్నారు

ఈ మధ్య చదువరి కార్పోరేట్ కిరాణా దుకాణాలపై ఒక పోస్ట్ చేశాడు. దాని పై జరిగిన చర్చలో బ్లాగు మిత్రులు కొంత మంది మాల్స్ రావాలని అవి వస్తేనే కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయనే అభిప్రాయాలు వెలిబుచ్చారు.

ఇంట్లో ఎలుకలు దూరాయని ఇల్లు తగలబెట్టుకోవడం లాంటి పని ఇది. భారత దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయాన్ని గత 15 యేళ్ల liberalized economic policies ఇప్పటికే సర్వనాశనం చేసి పెట్టాయి. ఇక రిటైల్ రంగం లో ఇప్పుడు అనుమతించిన విదేశీ పెట్టుబడులు తద్వారా మొదలైన shopping malls, మన దేశ ప్రజల మరో ముఖ్య జీవనోపాధిని దారుణంగా దెబ్బతీస్తాయి.

wal.JPG

ముందు ఒక సంఘటన గురించి చెప్పాలి మీకు.

మొన్న జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ కి గట్టి ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. పెరుగుతున్న ధరలే ఆ పార్టీ కొంప ముంచాయని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు.

మన రాష్ట్రం లో గత రెండు నెలలుగా పప్పులు, నూనెల ధరలు మరీ అన్యాయంగా పెరిగిపోయాయి. దరలు ఇలా పెరిగి పోవడానికి కారణం కొంత మంది వ్యాపారులు భారీ ఎత్తున నిత్యావసర వస్తువులను నిల్వ చేయడమేనని పౌర సరఫరాల అధికారులు గుర్తించారు. నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం హోల్ సేల్, రిటేల్ వ్యాపారస్తులు లైసెన్స్ లేకుండా నిత్యావసర వస్తువులు నిల్వ చేయడం నేరం. సరుకులు బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా ప్రభుత్వం యాభై ఏళ్ల కిందటే ముందు చూపుతో తెచ్చిన చట్టం అది.

సరుకుల అక్రమ నిల్వలపై దాడులు జరిపేందుకు విజిలెన్స్ శాఖ, తూనికలు కొలతల శాఖ, పౌర సరఫరాల శాఖ, వాణిజ్య పన్నుల శాఖ కలిసి ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసాయి. సదరు టాస్క్ ఫొర్స్ గత వారం రోజులు గా రాష్ట్రం నలుమూలల అక్రమార్కుల పై ముమ్మరంగా దాడులు జరిపి దాదాపు 20 కోట్ల రూపాయల పప్పు ధాన్యాలను సీజ్ చేసింది. ఇంత వరకూ బాగానే ఉంది స్టొరీ. కొసమెరుపు చూడండి…

పట్టుబడ్డ ఘనుల లిస్ట్ లో మన త్రినేత్ర, స్పెన్సర్స్, హైదరాబాద్ సెంట్రల్, ఫుడ్ వరల్డ్, సుభిక్ష, సిటి కాపిటల్ ఉన్నాయి.

హైదరాబాద్ లో ఎలాంటి లైసెన్సులు లేకుండా నిత్యావసర వస్తువులు అమ్మే వారిలో అత్యధికులు ఇలాంటి మాల్స్ యజమానులే అని ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు.

“మంచి” (?) ఉద్యోగాలు పొందలేని ఎందరో దేశ పౌరులకు ఒక గౌరవ ప్రదమైన జీవనోపాధి ని కలుగజేస్తుంది రిటైల్ రంగం. చిన్న పల్లెటూర్ల నుండి పట్నాల దాకా చదువుకోని, చదువుకున్నా సరైన ఉద్యోగం దొరకని లక్షలాది మంది ఏ చిన్న కిరాణా కొట్టో, కూరగాయల కొట్టో పెట్టుకుని బతుకు బండిని నడుపుతున్నారు.

ఇప్పుడు వాల్ మార్ట్ వంటి సంస్థలకు ఈ రంగం లో ప్రవేశించే అవకాశం కలిపించిన మన ఏలికలు రేపు జరగబోయే ఉపద్రవాన్ని గమనిస్తున్నట్టు లేరు.

ఒక అంచనా ప్రకారం భారత దేశం లోని 35 పెద్ద పట్టణలలో కనుక వాల్ మార్ట్ తన మాల్స్ ను తెరిస్తే ఇప్పటి వాల్ మార్ట్ పనితీరు ప్రకారం అది కేవలం 10195 మంది ఉద్యోగులతో 80,330 మిలియన్ రూపాయల టర్నోవర్ సాధించగలదు. అలా చేయడం ద్వారా అది దాదాపు 4,32,000 వ్యక్తుల జీవనోపాధిని దెబ్బతీయగలదు.

ఇక మాల్స్ వస్తే తక్కువ ధరకు నాణమైన సరుకు దొరుకుతుందన్న వాదన కూడా కరెక్ట్ కాదు. సాధారణంగా బహుళ జాతి కంపెనీలు ఏ దేశానికి వెళ్లినా ముందు అక్కడ స్థానిక కంపెనీల కన్నా తక్కువ ధరకు సరుకులు అమ్మడం చేస్తాయి. పోటిదారులంతా చచ్చూర్కున్నాక అప్పుడు ఉంటుంది విశ్వరూప ప్రదర్శన. వీళ్ల మోనోపొలి మొదలయ్యాక అటూ రైతుకు, ఇటు వినియోగదారునికీ పంగనామాలు పెట్టడం ఖాయం. చిన్న వ్యాపారస్తులు నాణ్యత తక్కువ సరుకులు అమ్మడానికి చాలా సార్లు వాళ్లున్న మార్కెట్ కారణం. నాణ్యమైన A1 సరుకంతా డబ్బున్న షరాబులుండే చోటికి తరలి పోతుంది. ఇక మధ్య తరగతి, పేదలుండే ప్రాంతాల్లో సహజంగానే B, C రకాలే దొరుకుతాయి. శివారు ప్రాంతాల్లో కూరగాయల మార్కెట్ కు వెళ్లి చూడండి అన్నీ చచ్చు పుచ్చు కూరగాయలే దొరుకుతాయి. అదే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 12 లో తోపుడు బండి పైన అయినా తళ తళ లాడుతూ మిరిమిట్లు గొలిపే కూరగాయలు “సరసమైన” ధరలకు లభ్యమవుతాయి. ఖరీదు కట్టే షరాబు దొరకాలి కాని అమ్మడానికి కొట్టువాడికేమీ అభ్యంతరం ఉండదు.

కాలం మారి ఉండొచ్చు. మారుతున్న కాలంతో పాటు మనుషులూ మారాలని మనం గట్టున కూర్చొని ఎన్ని జీవిత సత్యాలైనా బోధించవచ్చు. కానీ ఉన్న ఊర్లో వ్యవసాయం గిట్టుబాటు కాక పొలం పుట్రా తెగనమ్మి నగర శివార్లలో జనరల్ స్టొర్ పెట్టుకుని బతుకుదామనుకున్న వ్యక్తి ఇప్పుడేం కావాలి. సహజంగా జరిగే మార్పులకు మనిషి కొన్ని వేల సంవత్సరాలుగా adapt అవుతూనే ఉన్నాడు. కొద్ది మంది బలమైన వ్యక్తుల ప్రయోజనాలకు జరుగుతున్న ఈ కృత్రిమ మార్పులకు బలహీనులు ఎన్ని సార్లు adapt కావాలి?

ఈ mall culture ఎవరికీ లాభదాయకం కాదు. ఒక వైపు లక్షలాది మంది చిన్న వ్యాపారస్తుల పొట్టలు గొడుతుంది, రైతుల ప్రయోజనాలు దెబ్బతీస్తుంది, మధ్య తరగతిని ఆశల పల్లకీలో ఊరేగించి కష్టార్జితం అంతా గుల్ల చేస్తుంది, చట్టాలు ఉల్లంఘించి పన్నులు ఎగవేస్తుంది.

లాభం వాల్ మార్ట్ కు, రిలయన్స్ కు. సామాన్యుడి జివితం మాత్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: