చెరువోయి… మా ఊరి చెరువు

batukamma.jpg

నిన్ననే మా ఊరిలోని గౌరమ్మ కుంటను (కుంట అంటే చిన్న చెరువును) చూసి వచ్చాను. యాదృచ్చికంగా నిన్ననే ఆంధ్ర జ్యోతిలో సి. వనజ “చెరువోయి మా ఊరి చెరువు” అనే చక్కని ఫీచర్ ను అందించింది.

తెలంగాణ, రాయలసీమ ప్రజలకు చెరువుతో అవినావభావ సంబంధం ఉంది. రాజుల కాలంలో రత్నాలు పండించిన చెరువులు వలస పాలన మొదలయ్యాక క్రమంగా నిర్వీర్యమయ్యాయి. నేటి వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారణం చెరువుల విధ్వంసమే.

అందుకే ఇప్పుడీ ప్రాంతాల ప్రజల ఆలోచనల్లో, జ్ఞాపకాల్లో చెరువు తల్లి కనపడుతోంది.

cheruvu.jpg

తన ఇంటి వెనుక ఉన్న చెరువు మాయమవటంతో నారాయణ స్వామి పడుతున్న వేదనను ఇక్కడ చదవండి

అటుపై రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లోని ఆరు గ్రామాల ప్రజలు శిధిలమైపోయిన తమ చెరువులను, ఊళ్లనూ ఎలా బాగు చేసుకున్నారో వివరిస్తూ వనజ అందించిన చక్కని ఫీచర్ ను కింద చదవండి.

చెరువోయి… మా ఊరి చెరువు
బతుకు నింపిన నీటి కథలు
– వనజ

“నింగివానా చెట్టు నేలకొంగినట్టు
పారేటి మా చెరువు పల్లె కెంతందమో
చెరువోయి మా ఊరి చెరువు
ఊరి బరువునంతా మోసే ఏకైక ఆధరువు
చెరువోయి మా ఊరి చెరువు”

ఈ మధ్య గోరటి వెంకన్న ఏ సభలోనూ ఈ పాట పాడకుండా ఉండట్లేదు. నదులు, కాలువలు లేని వేలాది గ్రామాలకు తాగునీటికి, సాగునీటికి, పశువుల దాహానికి, కుమ్మరికుండలకు, చేపలకు, చాకిరేవులకు, ఈతలకు, ఇటుక బట్టీలకు ఇలా సమస్త అవసరాలకూ చెరువులే ప్రాణాధారం. రాజుల కాలం నుంచి పల్లెలకు ఆధరువుగా ఉన్న ఈ చెరువులు స్వాతంత్య్రం తర్వాత మారిన రాజకీయ ప్రాధాన్యాలు, పెరిగిన భారీ ఆనకట్టల మోజుకు బలయిపోయాయి. కట్టలు తెగిపోయి, పూడిక పెరిగిపోయి ఒకవైపు చెరువులు విధ్వంసం అవుతుంటే మరోవైపు తరిగిపోతున్న భూగర్భజలాలు, వరస కరువుల వల్ల పల్లెలు వలసబాటన పడ్డాయి. దాంతో పల్లెలు బతకడానికి భారీ ఆనకట్టల కన్నా చిన్న నీటి వనరులైన చెరువులే మేలన్న గుర్తింపు మొదలయింది. ఎవరికి పట్టినా పట్టకపోయినా మోడువారి పోయేది తామేనని గుర్తించిన కొన్ని పల్లెలు చెరువుల్ని బతికించుకోవడానికి కొన్నేళ్ళుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థల చొరవ, కొందరు అధికార్ల చిత్తశుద్ధి, ప్రజల శ్రమదానం, రకరకాల ప్రభుత్వ పథకాల నుంచి వచ్చిన నిధులు వారికి సహాయంగా నిలిచాయి. కరువు బారిన పడిన తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో ఇలా పునరుత్థానం పొందిన చెరువులు తమ పల్లెల్ని ఎలా నిలబెట్టాయో చూస్తే చిన్న సంకల్పం కూడా ఎంత పెద్ద ఫలితాలివ్వగలదా అని ఆశ్చర్యం కలగక మానదు. అలాంటి కొన్ని పల్లెల చెరువుల కథలివి.

మట్టిగుట్టపల్లి, చిత్తూరు జిల్లా

“మా తరంలో ఐదో తరగతి దాటి ఎవరూ చదువుకోలేదు” అని చెప్పే జానకిరాంకు మహా అయితే పాతికేళ్ళు. ఒక చెరువు ఒక ఊరి రూపు రేఖలను ఎలా మారుస్తుందనడానికి ఈ పల్లె ఒక నిదర్శనం.

పాతికకు మించని ఒడ్డెర కుటుంబాలున్న ఈ పల్లెకు (చిత్తూరు జిల్లాలో ఓ మూలకు) బయటి ప్రపంచంతో సంపర్కం తక్కువే పదేళ్ళ క్రితం వరకూ. ఈ ఊరికున్న ఆస్తి ఒక పూడిపోతున్న చెరువు. బోడిగా ఉన్న మట్టిగుట్ట. ఆ గుట్ట వల్లే ఈ పల్లెకు మట్టిగుట్టపల్లి అన్న పేరు. అడపా దడపా వచ్చే వానలకు నీళ్ళ కంటే ఎక్కువ మట్టిని తెచ్చి చెరువును పూడుస్తూ పోవడం ఈ గుట్ట ప్రత్యేకత. దాంతో పూడిన చెరువు కింద పంటలు లేవు. కష్టం చేయడం తెలిసినా బయటికి పోయి పనిచేసే చొరవ లేని ఈ పల్లెకు ఆకలితో దొరికిన దుంపలు తిని నీళ్ళు తాగి కాళ్ళు ముడుచుకు పడుకోవటమే తెలుసు.

అలాంటి స్థితిలో పదేళ్ళ కింద ఆ గ్రామంలో అడుగుపెట్టిన ఒక స్వచ్ఛంద సంస్థ చెరువు పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. సంస్థ ఇచ్చింది 10 వేలే. కాని దానితో పనులు మొదలుపెట్టిన ప్రజలు శ్రమదానం చేసి దానికి పదింతలు పనిచేశారు. కేవలం చెరువు పూడిక తియ్యటం, కట్ట ఎత్తు పెంచటం వంటి పనులే కాకుండా ఆ పల్లె చుట్టూ వాళ్ళు చేసిన పనులు చూస్తే చెప్పలేనంత ఆశ్చర్యమేస్తుంది. ఊరికి పేరునిచ్చిన మట్టిగుట్ట చుట్టూ పైనుంచి కిందిదాకా వలయాలు వలయాలుగా కందకాలు తవ్వి వాటిలో చెట్లు నాటారు. గుట్ట నుంచి వచ్చే నీళ్ళకు అడ్డంగా వరుసగా గల్లీ చెక్‌లు కట్టి ఒక చిన్నకుంట తవ్వి నీటిని అందులోకి అక్కడి నుంచి చెరువులోకి మళ్ళించారు.

పైనుంచి వరద వచ్చి చెరువును పూడ్చకుండా ఉండటం కోసం ఊరిచుట్టూ దాదాపు 20 చెక్‌ డ్యాంలు, కుంటలు కట్టారు. ఒకసారి పనులు మొదలై ఫలితాలు చూడటం మొదలయ్యాక రకరకాల ప్రభుత్వ పథకాలను వాడుకోవటం నేర్చుకున్నారు. వాటర్‌షెడ్‌, నీరు మీరు, కరువు పనుల్లో వచ్చే నిధులను వాడుకున్నారు.

ఇప్పుడా ఊరికి నీటి కరువు లేదు. ఎక్కడ చూస్తే అక్కడ వాగులు, వంకలు, కుంటలు, చెక్‌ డ్యాంలలో మోకాలిలోతు నీళ్ళు నిలబడి కనిపిస్తున్నా సాగు చేసుకోవడానికి ఆ ఊరికి భూమి లేదు. ఇప్పుడు వాళ్ళ సమస్యంతా అదే.

ఊరి చుట్టూ పరుచుకున్న విశాలమైన పరుపు బండలు తప్ప ఆ ఊరికి వేరే భూములు లేవు. దాంతో ఈ పల్లె ప్రజలు చెరువు నుంచి పూడిక తీసిన మట్టిని అడుగున్నర ఎత్తు నుంచి నాలుగు అడుగుల వరకూ పోసి రకరకాల పంటలు పండిస్తున్నారు. తక్కువ ఎత్తు మీద రాగి, వరి పండితే; ఎక్కువ ఎత్తు మీద కాడమల్లి, అరటి వంటి ఫ్లోరీ కల్చర్‌, హార్టీ కల్చర్‌ సాగు చేస్తున్నారు. ఎలాగూ ఏడాది పొడవునా నీరేనాయె.

బండమీద వచ్చే పంట మామూలు నేల మీద కూడా రాదంటారు ఇక్కడ రైతులు. ముందే సారం ఉన్న చెరువు మట్టి పరుస్తున్నాం. ఆపైన వేసే ఎరువు కూడా నేలలోకి దిగకుండా మొక్కకే కదా అందుతుంది అంటారు వాళ్ళు. ఇప్పటికే పదెకరాలకు పైగా ఇలా బండల మీద భూమిని సృష్టించిన పల్లె మళ్ళీ పూడిక తీస్తే పోసుకోవడానికి ఇంకో పదెకరాలు గుర్తులు కూడా పెట్టుకుని తయారుగా ఉంది.

అప్పుడు పల్లెకు సహాయపడిన స్వచ్ఛంద సంస్థ క్రాప్స్‌ ఇప్పుడు ఇలాంటి పనులన్నీ మానేసి మైక్రో ఫైనాన్స్‌ పనుల్లో మునిగిపోయింది. అయితే పదేళ్ళయినా పనులు నిలవడానికీ, వాటి నిర్వహణ జరగడానికీ కారణం పల్లె ప్రజల్లో చెరువు తమలో ప్రతి ఒక్కరికీ చేసిన మేలు పట్ల గుర్తింపు, చెరువు తమదే అన్న స్పృహ రావడమే అంటారు క్రాప్స్‌ సంస్థ ప్రతినిధి ఉదయ్‌ సాగర్‌.

ఒకప్పుడు పూరి గుడిసెలు మాత్రమే ఉన్న ఆ పల్లెలో 22 కుటుంబాలకు ఇప్పుడు పక్కా ఇళ్ళు ఉన్నాయి. వరి, మల్బరీ, రాగి, బీన్స్‌, అరటి, మల్లె, ఆలుగడ్డ వంటి పంటలు పండుతున్నాయి. ఊరి పిల్లలంతా ఊరిదాకా వచ్చే స్కూలు బస్‌లో కాన్వెంట్‌ స్కూలులో చదువుకుంటున్నారు. ఇంకో పది పదిహేనేళ్ళలో ఎదిగి వచ్చే ఈ తరం తమ తల్లిదండ్రుల్లా చెరువును ప్రేమిస్తే మంచిదే. స్కూలు చదువులు చెరువుల మీద ప్రేమని చంపెయ్యకూడదని ఆశిద్దాం.

cheruvu2.jpg

జట్టిగుండ్లపల్లి, చిత్తూరు జిల్లా

చిత్తూరు జిల్లాలో జమీందార్లను పాళెగాళ్ళంటారు. రాయల రాజ్యం అంతరించాక చిన్న చిన్న సంస్థానాలు పాలించిన పాళెగాళ్ళ ఆస్థానంలో సైనికుల్లా పనిచేసిన వాళ్ళను జట్టిగుండ్ల వాళ్ళంటారు. అలాంటి కొందరితో ఏర్పడిన గ్రామానికి జట్టిగుండ్లపల్లి అన్న పేరు వచ్చింది. ఈ పల్లెలోని దళితవాడ దాదాపు 150 ఏళ్ళ కింద తెగిపోయిన ఒక చెరువు కింద ఉన్న పోరంబోకును సాగుచేసుకుంటూ ఉంది. తెగిపోయిన చెరువు, దానికింద వాగులు, వంకల మయంగా మారిన పోరంబోకులో ‘ఏం పండిందో, ఏం తిన్నామో’ మాకే తెలుసు అంటారు అక్కడి పెద్దలు. ఇక్కడ ఒక చెరువు ఉందన్న సంగతి మా తాతలు కూడా మాకు చెప్పలేదంటారు వాళ్ళు.

నాలుగేళ్ళ క్రితం ఆ ప్రాంతానికొచ్చిన ఒక ఎంఆర్‌ఓ సంకల్పం ఆ చెరువు కథను సంపూర్ణంగా మార్చింది. దాదాపు అరవై అడుగుల పొడవున తెగిపోయి, దట్టంగా చెట్లు పెరిగిపోయిన లోయలో తిరిగి కట్ట పోయడానికి ఆయన ప్రభుత్వంతో కూడా పోరాడాల్సి వచ్చిందట. ఎంఆర్‌ఓగా ఉన్న రాజశేఖర్‌, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఉన్న రవిచంద్ర దీనికి పూనుకుంటే స్థానికంగా పనిచేస్తున్న గ్రామ వికాస సంస్థ కాసిన్ని నిధులతో చేయి కలిపి పనుల పర్యవేక్షణ చేసింది.

చెరువు బాగైతే బతుకు బాగవుతుందన్న సంతోషంతో శ్రమదానం పేరిట దళితులు చేసిన రెక్కల కష్టం విలువ కట్టలేనిది. అంత కట్టను తిరిగి పోసి, చెరువు బాగుచేసిన తొలి ఏడే పెద్ద వానవచ్చి ఆ చెరువు నిండింది. నాలుగేళ్ళుగా తిరిగి ఈ చెరువు ఎండిందే లేదు. ఇప్పుడు ఒక పెద్ద వాన వచ్చిందంటే మొత్తం వాడంతా పిల్లాజెల్లాతో కలిసి కట్టమీదకు వచ్చేస్తారు. వానకు ఎక్కడ కట్ట తెగిపోతుందో అని భయం వారికి. వచ్చిన నీటిని బయటికి వదలడమా, ఉంచడమా నిర్ణయించి ఆ మేరకు మెరవలోకి వదలడమో, మానడమో చేస్తారు.

ఈ చెరువులో ప్రతి నీటి చుక్కా వాళ్ళకు చాలా విలువయింది. అందుకే తూమును కూడా మూసేసి రైతులు చెరువుకింద సగం పంటను జవుకు (ఊట) నీళ్ళతో పండిస్తారు. మిగిలిన సగానికి గాలి పైపుతో నీళ్ళు పారిస్తారు. పైపుతో డ్రమ్ముల నుంచి పెట్రోలు, నీళ్ళు లాగడానికి వాడే పద్ధతిని వాళ్ళు చెరువు నుంచి పొలాలకు నీళ్ళు పెట్టటానికి ఉపయోగిస్తారు. ఈ సైఫన్‌కి కరెంటు ఖర్చు లేదు. చుక్క నీరు వృధా కాదు. చెరువులో ఒక్క పిచ్చి కట్టె కనపడినా ఈదుకుంటూ పోయి తీసుకొచ్చి, కాలేస్తారు వాళ్ళు. అందుకే చెరువు అద్దంలా తళతళా మెరిసిపోవాల్సిందే. పంటకెంత ప్రాధాన్యతో పశువులకీ అంతే ప్రాధాన్యం ఇస్తారు ఈ పల్లె ప్రజలు. పశువుల కోసం వదిలాక మిగిలితేనే రెండో పంట తీస్తారు.

అందరూ వదిలేసిన చెరువునూ, భూములనూ సాగుచేసుకున్నారు కాని తాము సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు లేకపోవడం వీరి సమస్య. కావాలని గ్రామ పొలాలను పోరంబోకుగా చూపించారంటున్న దళితులు ఇప్పుడు పట్టాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నారు. అవసరమైతే పోరాటానికి సన్నద్ధం అవుతున్న వారికి విజయం లభించాలని కోరుకుందాం.

వడ్లకొండ, వరంగల్‌ జిల్లా

సముద్రం లేని తెలంగాణలో చెరువుల్నే సముద్రం అంటారు. సముద్రంలానే ఉండే వడ్లకొండ చెరువు నాలుగేళ్ళ వరస కరువులో చుక్కనీరు లేకుండా ఎండిపోయి చెరువు మధ్య నుంచి జీపులు, ట్రాక్టర్లు కూడా తిరిగాయంటే ఇప్పుడు నమ్మశక్యం కాదు.

చెరువు ఎండిపోయి, పంటలు లేక, ఊళ్ళో పనులు లేక వలసదారి పట్టిన వాళ్ళలో ఈ ఊరి కూలీలు కూడా ఉన్నారు. అలాంటి రోజుల్లో చెరువు పనులు మొదలైనాయి ఈ ఊర్లో. దాదాపు వందమంది కూలీలు వరుసగా నాలుగేళ్ళు రకరకాల పథకాల కింద పనులు చేశారు. పూడిక తియ్యడానికి మిషన్లు వస్తే నిలేసి కొట్లాడి మరీ కూలీలు పనులు దక్కించుకున్నారు. నాలుగో ఏడు వర్షాలు పడే నాటికి చెరువు నీటి నిల్వ సామర్థ్యం చాలా పెరిగింది. దాంతో ఒక్కసారి నిండినా ఆయకట్టు ప్రాంతం మొత్తం సాగులోకి వస్తోందిప్పుడు. చెరువు లోతు పెరగటం వల్ల చుట్టుపక్కల బావుల్లో నీళ్ళు పెరుగుతాయని అందరికీ తెలుసు. దాంతో పాటు చేపలు కూడా పెరిగాయని సంతోషపడుతున్నారు ఆ ఊరి ముత్తరాసి కుటుంబాలు. “అంతకు ముందు కిలో తూగితే ఎక్కువ. ఇప్పుడు ఏ చేపా రెండు కిలోలకు తగ్గదు” అని చెప్తారు వాళ్ళు. వాళ్ళకు ఏడాదిలో మూడు నెలలు చేపల వేటే ఆధారం.

“అందుకే చెరువులు బాగు చెయ్యటం మాత్రమే కాదు, చెరువు పనుల్లో కాంట్రాక్టర్లు, మిషన్లు లేకుండా చేయటం కూడా చాలా ముఖ్యం” అంటారు ఆ గ్రామంలోనూ, వరంగల్‌ జిల్లాలోని మరికొన్ని గ్రామాల్లోనూ చెరువు పునరుద్ధరణ పనులకు సారథ్యం వహించిన మారి సంస్థ ప్రతినిధి మురళి. ప్రజల చేతుల్లోంచి చెరువులను తీసుకుని ఏళ్ళ తరబడి పట్టించుకోకుండా వదిలేసిన ప్రభుత్వం పదేళ్ళ క్రితం నీటిసంఘాల పేరుతో వాటిని రైతులకు అప్పగించి మరో తప్పు చేసిందంటారు ఆయన. చెరువు అనేది ఊరి మొత్తానికి చెందిన వనరుగా, రైతులు, పశువులు, గొర్రెల పెంపకందార్లు, బెస్తలు, కూలీలు, రజకులు వంటి అన్ని వర్గాల ఉమ్మడి ఆస్తిగా చూసినప్పుడే చెరువులను నిలుపుకోవడం, నిర్వహించడం సాధ్యమవుతుందనేది మా అనుభవం అంటారు మురళి.

ఎస్‌.గొల్లపల్లి, చిత్తూరు జిల్లా

మహాకీకారణ్యం అంచున, విశాలమైన చెరువు కింద ఉంది ఈ పల్లె. ఇది కొత్త చెరువు. ఈ చెరువు కట్టి పాతికేళ్ళే. కాని చెరువు కట్టినప్పటి నుంచి దీని కథ సరిగా లేదు. ఒక వైపు మరవ కింద (కొన్ని ప్రాంతాల్లో మత్తడి, కొన్ని ప్రాంతాల్లో అలుగని కూడా అంటారు) చిల్లులు పడి కింద నుంచి నీరు ఏకధారగా కారుతోంది. పంట వెన్ను మీదకు వచ్చే నాటికి చెరువు ఖాళీ. ఉన్న కాసిని నీళ్ళ కోసం డబ్బున్న రైతులు ఆయిల్‌ ఇంజన్లు పెట్టి నీళ్ళు తోడడం. అందుకోసం కొట్లాటలు. ఇలా కాదని చెప్పి రైతులంతా కలిసి ఆలోచించి చెరువు తూమును మూసేశారు.

అంత విశాలమైన చెరువుకు తూము ముయ్యటం ఏమిటని బోలెడు ఆశ్చర్యమేస్తుంది. కాని దానివల్ల ఆయకట్టు ఇంకా పెరిగిందంటారు ఆ ఊరి రైతులు. మరవ కింద ఏడాది పొడవునా కారి వంకగా ప్రవహించే నీటికి చెక్‌ డ్యాంలు, కుంటలు కట్టారు. ఏడాది పొడవునా నిండి ఉండే ఈ చెక్‌డ్యాంలు, కుంటల నుంచి ఆరేడు వందల అడుగుల వరకూ పైపులు వేసి ఇంజన్లతో రైతులు రెండు పంటలు పండిస్తున్నారు. మరో వైపు వరద కాలువను పంట కాలువగా చేసి పొలాలకు మళ్ళిస్తున్నారు. పైన ఉన్న ఫారెస్టు కాచ్‌మెంట్‌ వల్ల చెరువులో నీళ్ళు ఎప్పుడూ నిండుగా ఉండటంతో కింద కిలోమీటరు దూరం వరకు కూడా బావుల్లో నీళ్ళు దాదాపు భూమికి సమానంగా ఉంటాయి. ‘చెరువు ఎంత ఉంది అన్నది కాదు. దాన్ని ఎంత బాగా వాడుకోగలం అన్నదే అసలు కీలకం’ అంటారు ఆ ఊరి రైతు నాగభూషణరెడ్డి. ఒకప్పుడు సంకటికి కటకట లాడిన ఆ ఊరిలో ఇప్పుడు లేని పంట లేదు. ప్రతి రైతూ కనీసం ఒక ఆహార పంట, వాణిజ్య పంట పండిస్తున్నాడంటే ఆశ్చర్యం లేదు.

హరిపిరాల, వరంగల్‌ జిల్లా

వరంగల్‌ జిల్లా గొలుసు చెరువులకు పెట్టింది పేరు. అలాంటి ఒక గొలుసులోని చిన్న కుంటే వరంగల్‌ జిల్లా హరిపిరాలలోని రెండు దళిత కాలనీలకు ఆధరువు. కాని అన్ని చెరువుల్లాగే ఆ చెరువుకూ నిర్వహణ లేదు. పూడికతో నిండిపోయి తాంబాలంగా మారిన చెరువుకు తోడు పాడై పోయి కన్నాలు పడి వచ్చిన నీటిని వచ్చినట్టే వదిలేసే తూము. కుంట కింద 90 ఎకరాల పైన ఉన్నా పదెకరాల్లో కూడా పంట వచ్చేది కాదు. దాంతో 80 శాతం ప్రజలు పొట్ట చేతపట్టుకుని వలసలకు పోవటం ఆ గ్రామానికి పరిపాటి.

అలా పరాయి ఊళ్ళలో చేసిన వాటర్‌షెడ్‌ పనులు, ఫలితాలే ఆ ఊరిని ఆలోచనలో పడేశాయి. చెరువును బాగు చేసుకోవాలన్న ఆలోచనకు స్వచ్ఛంద సంస్థ తోడయింది. వాళ్ళిచ్చిన 4 వేలకు తమ శ్రమదానం కలిపి చెరువును, తూమును బాగుచేసుకున్నారు. పూడికతీతకోసం ప్రభుత్వం వెంటపడి నిధులు తెచ్చుకున్నారు. కాని దళితుల చెరువులోకి నిధులు అంత తేలిగ్గా వస్తాయా? ఊరికి వచ్చిన డబ్బులు పెద్ద చెరువు మీద పెట్టాలి గాని చిన్న కుంట మీద ఎలా పెడతారంటూ ఊరు అడ్డుకుంది. పెద్ద చెరువులకు కూడా శ్రమదానం చెయ్యాల్సింది మేమే కనుక ఈ చెరువు పని జరగకపోతే ఆ చెరువులో దిగమన్నారు వీరు.

అలా పట్టుబట్టి తమ చెరువును బాగు చేసుకున్న కాలనీల కథ ఇప్పుడు చాలా మారింది. ఇప్పటికీ పూర్తిగా బాగుకాని తూము నుంచి వచ్చే జాలుతో కింద 93 ఎకరాలలో పంట పండుతోంది. నిండుగా ఉన్న చెరువు మూలంగా బావుల్లో, బోరుల్లో పెరిగిన జలలతో రెండో పంట కూడా కొందరికైనా అందుతోంది. కొత్తగా ఈ ఏడాది తామే పాట పాడుకున్న దళితులు చెరువులో చేపలు కూడా వేసుకున్నారు. ఇప్పుడు గ్రామంలో వలసలు చాలావరకు తగ్గాయని చెప్తారు గ్రామస్తులు. చిన్న కుంటల్లోకి నిధులు వస్తేనే కదా మాలాంటి చిన్న వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చేది అంటారు వాళ్ళు.

గంగన్నగారి పల్లి, చిత్తూరు జిల్లా

నలభై కురవ కుటుంబాలు ఉన్న చిన్న పల్లె ఇది. వీరికి వ్యవసాయం, గొర్రెల పెంపకం జంట వృత్తులు. రెండింటికీ ఆధారం పల్లెకున్న రెండు చెరువులు ఒడ్డె చెరువు, రెడ్డి చెరువు. కానీ ఏడేళ్ళయింది ఈ రెండు చెరువులు నిండి. విశాలమైన రెండు చెరువులూ ఒట్టిపోయి పశువులు, గొర్రెలు తిరిగే మైదానాలుగా మారాయి. అలాంటి స్థితిలోనూ వాళ్ళు ఆసక్తికరమైన పని ఒకటి చేశారు. పడే కాసిని నీళ్ళ చుక్కల్ని వృధా పోనివ్వకుండా పశువులు వచ్చే పోయే దారిలో కోనేటి గుంతలు తవ్వుకున్నారు. పకడ్బందీగా రివిట్‌మెంట్‌ కూడా చేసుకున్న ఈ కోనేటి గుంతలు ఏడాది పొడవునా గొర్రెలకీ, పశువులకీ నీళ్ళు కరువు లేకుండా చేస్తున్నాయి.

“ఎప్పుడూ మదనపల్లి నుంచి కాంట్రాక్టర్లు వచ్చి పనులు చేసేవాళ్ళు. కరువు కాలంలో ఇలా లాభం లేదని ఊరంతా కలిసి ప్రభుత్వంతో పోట్లాడి తీసుకోవటం వల్లే ఇవ్వాళ ఇంత కరువులోనూ మా గొర్రెలను దక్కించుకున్నాం, నాలుగు మూటల ధాన్యం ఇంటికి తెచ్చుకోగలుగుతున్నాం అంటారు ఆ ఊరి రైతు రామయ్య.

పూర్తిగా నిండని చెరువు కింద పంటలు వేసి పంట వెన్నుమీదకు వచ్చేనాటికి నీళ్ళు అయిపోయి పంట ఎండిపోవడం దాదాపు రైతులందరికీ అనుభవమే. దానికి కూడా ఈ పల్లె ఒక ఉపాయం కనిపెట్టింది. చెరువులో ఎన్ని నీళ్ళున్నాయో చూసి, అది ఎంత పంటకు సరిపోతుందో అంచనా వేసి చెరువు కింద అంతే భూమిని ఎన్నుకుంటారు. దాన్నే ఊరంతా దామాషా పద్ధతిలో పంచుకుని సేద్యం చేసుకుంటారు. దాంతో మొత్తం భూమిలో పంటంతా పోయే బదులు కొంత భూమిలో అయినా నికరంగా ప్రతి ఇంటికీ ఎంతో కొంత పంట వస్తుంది.

***
ఊరుమ్మడి వనరు అనుకుంటేనే …

ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి చిన్నా పెద్దా చెరువులు, కుంటలు ఓ లక్ష పైనే ఉంటాయని అంచనా. ఇందులో వెయ్యేళ్ళ కింద తవ్విన చెరువులు కూడా ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు, కాకతీయుల కాలం నుంచి రాజులు, జమీందార్లు కూడా చెరువులకు పెద్దపీట వేస్తూనే వచ్చారు. పల్లెల బతుకుతెరువుకు ప్రధాన ఆధారంగా ఉన్న ఈ చెరువులను కట్టించింది ఎవరైనా వాటి నిర్వహణ, యాజమాన్యం ఎప్పుడూ ప్రజల చేతుల్లోనే ఉంటూ వచ్చింది. పొలాల్లో పనులు ముగిసి వేసవి మొదలవుతూనే రైతులు పూడికమన్ను తవ్వి పొలాల్లో వేసుకునే వాళ్ళు. గట్లు బాగు చేసుకునే వాళ్ళు. కాని చెరువుల్ని మైనర్‌ ఇరిగేషన్‌ పేరుతో ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజల భాగస్వామ్యాన్ని తగ్గించటం, మరోవైపు పొలాలకు ఒండ్రు పోయటం వంటి సాంప్రదాయ పద్ధతులు కనుమరుగవటంతో ఈ చెరువులు మెల్లగా, పూడిపోయి, కట్టలు తెగిపోయి, తుప్పలకు ఆలవాలంగా మారుతూ వచ్చాయి. ఆలస్యంగా అయినా ఈ వనరుల రక్షణకు ప్రజల భాగస్వామ్యం అవసరం అని గుర్తించిన ప్రభుత్వం వాటిని నీటి సంఘాల పేరుతో ఆయకట్టు రైతులకు అప్పగించి మరో తప్పటడుగు వేసింది. చెరువు ఊరి ఉమ్మడి వనరన్న భావనకు అది గండికొట్టింది. మరోవైపు చెరువుల నిర్వహణకు, మరమ్మతులకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవటంతో చెరువుల పునరుద్ధరణ, మరమ్మతులు జరగనే లేదు.

ఇప్పుడు ప్రపంచ బ్యాంకు నిధులతో పెద్ద ఎత్తున చెరువుల పునరుద్ధరణ చేపట్టిన ప్రభుత్వం మరోసారి ప్రజలను పక్కనబెట్టి కాంట్రాక్టర్లకు పెద్దపీట వేసింది. మొదట చెరువుగట్లను బలోపేతం చేస్తామంటూ డజన్ల కొద్దీ చెరువులను ఒక గుంపుగా కాంట్రాక్టర్లకు అప్పగించే ప్రయత్నం చేస్తోంది. ఏ కాంట్రాక్టరుకైనా పని ముగించి బిల్లు తీసుకోవటంలో ఉన్న ఆసక్తి ఆ పని ఆ ఊరికి ఎంత ఉపయోగం అన్న దానిమీద ఉంటుందా. కొన్ని చోట్ల చెరువు గట్ల మీద రోడ్లు వేయడానికి కూడా తయారవుతున్నారు. అన్ని ప్రపంచ బ్యాంకు పథకాల్లాగా ఇదీ దళారులను బాగుచెయ్యడం కోసమే తప్ప చెరువులు బాగుచెయ్యడానికి కాదన్న భావనకు అప్పుడే ఇది బీజం వేసింది.
ఒక మంచి సంకల్పం మట్టిపాలు కాకూడదని ఈ పల్లెల అనుభవాల నుంచి ప్రభుత్వం నేర్చుకుంటుందని ఆశిద్దాం.

(Converted to Unicode using http://uni.medhas.org/)

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: