చరిత్ర లేని జాతిగా మిగిలిపోనున్నామా?

1796: అమరావతి/ ధాన్య కటకం

amaravati.jpg

చింతపల్లి నుండి అమరావతి కి వలసవచ్చిన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అనే జమీందార్ అక్కడ ఒక నూతన నివాస ప్రాంతాన్ని ఏర్పాటు చెయ్యాలని సంకల్పించాడు. సమీపంలోని అమరావతి స్థూపం వద్ద ఉన్న పురాతన దిబ్బలను తవ్వి అందులోని ఇటుకలను, ఫలకాలను తీసి వాడుకొమ్మని ప్రజలను ఆదేశించాడు. ఇంకేముంది! ఎవరి చేతికందింది వారు తీసుకుపోయి వాడుకోవడం మొదలెట్టారు. ఆఖరుకి శిల్పఫలకాలను చూర్ణం చేసి సున్నంగా కూడా వాడుకున్నారు. 1797 లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన బ్రిటీషు అధికారి కల్నల్ కోలిన్ మెకంజీ, వెంకటాద్రి నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విధ్వంసాన్ని నిలిపివేయించాడు. అమరావతిని పరిరక్షించే ఏర్పాట్లు చేశాడు.

1956: నందికొండ/శ్రీ పర్వతం

nagarjunakonda-buddha.gif

కృష్ణా నది పై నందికొండ వద్ద ఒక భారీ బహుళార్ధ సార్ధక ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. నాగార్జునసాగర్ గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ డ్యాం ఒకప్పుడు నలందా, తక్షశిల స్థాయిలో పేరొందిన బౌద్ధ విశ్వవిద్యాలయం ఉన్న ప్రదేశంలోనే కట్టారు. తత్ఫలితంగా ఎంతో అరుదైన, వెలకట్టలేని వారసత్వ సంపద జలసమాధి అయ్యింది. కంటి తుడుపుగా తవ్వకాలలో దొరికిన కొన్ని శిల్పాలు, స్థూపాలు నాగర్జున కొండపైకి తరలించి ఒక మ్యూజియం నెలకొల్పింది రాష్ట్ర ప్రభుత్వం.

2005: విశాఖపట్నం/ బావికొండ

buddhistsite-bavikonda.gif

విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ (వుడా) జురాంగ్ ఇంటర్నేషనల్ అనే సింగపూర్ సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం విశాఖ శివార్లలో ఒక భారీ నివాస కాంప్లెక్స్ ను జురాంగ్ నిర్మిస్తుంది. ప్రాజెక్టు చేపట్టిన ప్రాంతం ప్రముఖ బౌద్ధ క్షేత్రం బావికొండకు కూతవేటు దూరంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 1981లోనే జీవో నెంబర్ 1295 ద్వారా బావికొండ పరిసర గ్రామం మధురవాడలోని సర్వే నెంబర్ 336A ను రక్షిత ప్రాంతంగా ప్రకటించింది. అయితే జురాంగ్ తో ఒప్పందం కుదుర్చుకోవడానికి వుడా చాలా తెలివిగా ఈ ప్రాజెక్టు కప్పుల ఉప్పాడ గ్రామ పరిధి లోని సర్వే నెంబర్ 314లో ఉందని తప్పుడు ప్రచారం చేస్తోంది. మరో సారి విలువైన చారిత్రక సంపద భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది

2007: తెల్లాపూర్/ తెలుంగణపురం

హైదరాబాద్ శివార్లలోని బీ.హెచ్.ఈ.ఎల్ ప్రాంతానికి కొద్ది దూరంలో ఉన్న చిన్న పల్లె అయిన తెల్లాపూర్ ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. హైదరాబాద్ నగరాభివృద్ది సంస్థ హుడా ఇక్కడ 400 ఎకరాల స్థలాన్ని వేలం వేస్తే ఒక ప్రయివేటు సంస్థ దాదాపు 2000 కోట్లకు కొన్నది. ఇక్కడో బ్రహ్మాండమైన నివాస ప్రాంతం డెవలప్ చేసేందుకు ఈ సంస్థ నడుం కట్టింది.

అయితే చాలా మందికి తెలియని సంగతి ఒకటుంది. తెలంగాణ అన్న పదం మొదటిసారి ఉపయోగించినట్టు చెబుతున్న తెల్లాపూర్ శిలా శాసనం లభ్యమైంది ఈ తెల్లాపూర్ లోనే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖ శాసన సేకరణ విభాగపు సర్వేలో మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం, తెల్లాపూర్ గ్రామంలోని ఒక దిగుడు బావి ముందర క్రీ.శ. 1417 సంవత్సరం నాటి తెలుగు శాసనం వెలుగు చూసింది. స్థంబానికి ఒకే వైపు మొత్తం 24 పంక్తులలో ఉన్న ఈ శాసనం, “తెలుంగణ” అనే పదాన్ని కలిగి ఉన్న తొలి శాసనంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. పురావస్తు శాఖలో పనిచేస్తున్న శ్రీ ఈమని శివనాగి రెడ్డి గారు ఈ శాసనాన్ని గురించి విస్తృతంగా ప్రచారం చేసి ఉన్నారు.

శాసన పూర్తి పాఠం ఇక్కడ చూడొచ్చు.

tella_shas1.gif

శాసన తాత్పర్యం ఇక్కడ చదవండి

శాసన తాత్పర్యం 1

శాసన తాత్పర్యం 2

(కొలిమి లిఖిత సాహితీ పత్రిక నుంచి తెల్లాపూర్ శాసనం పూర్తి పాఠం, తాత్పర్యం తీసుకోబడ్డాయి)

శాసనాన్ని కనీసం మ్యూజియానికి కూడా తరలించే ఓపిక లేని మన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా ఆ చుట్టూ ఉన్న స్థలాన్ని అమ్మివేయడం దారుణం.

చేసిన నిర్వాకం ఇలా ఉంటే పైనుంచి ఈ అమ్మకం ఒప్పందాన్ని ఏకంగా న్యూయార్క్ నగర వీధుల్లో జరుపుతామని తద్వారా ఇంకొంత మంది రియల్ ఎస్టేటు వ్యాపారస్తులను ఆకర్షించవచ్చనీ మన ప్రభుత్వం వాళ్లు అలోచిస్తున్నారట

మన చారిత్రక సంపద పట్ల మనకున్న నిర్ల్యక్షానికి నిలువెత్తు ఉదాహరణలు ఈ సంఘటనలు.

అసలు మనకు ఆర్ట్స్ కోర్సులు అవసరం లేదు సైన్సులు ఉంటే చాలని సెలవిచ్చిన బాబు లాంటి నాయకుల మైండ్ సెట్ వల్ల చివరికి చరిత్ర లేని జాతిగా మిగిలిపోనున్నామా మనం?

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: