దాచేస్తే దాగని సత్యం!

‘ తెలంగాణ ప్రాంతంగా వ్యవహరింపబడుతున్న తొమ్మిది జిల్లాలో చరిత్ర, శిల్పం, శాసనాలు, చిత్రలేఖనం, తాళపత్ర గ్రంధాలు, తటాకాలు, కోటలు, వీరగాధలు ఎన్నో ఉన్నాయి. సాహిత్యకారులు, కళావేత్తలు ఎందరో ఉన్నారు. అంతే గాక ఏండ్ల తరబడి కాలాన్ని తీర్చి దిద్దడానికి, దేశాన్ని పురోగమిపజేయడానికి ఎడతెగకుండా జరిపిన ఉద్యమాలు ఉన్నాయి ‘ అంటూ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో విలీనమై ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడుతున్నప్పుడు 1956లో ప్రచురించిన ‘ తెలంగాణం ‘ వ్యాస సంపుటానికి ముందు మాటగా వట్టికోట ఆళ్వారుస్వామి రాశారు.

అంత ఘనమైన చరిత్ర గల తెలంగాణా చరిత్ర ఆ తరువాత యాభై సంవత్సరాలలో మరింతగా విస్మరణకు గురయ్యింది. వివక్షకు బలైంది. అంతకు ముందరి శతాబ్దాల చరిత్రలో తెలంగాణ ప్రాంతం, ఇక్కడి ప్రజలు సాధించిన అసాధారణ విజయాలన్నీ ఎక్కడా నమోదు కాని స్థితి వచ్చింది. ఇక 1956 తరువాత గడిచిన యాభై సంవత్సరాలలో అయితే ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర పేరిట విద్యార్ధులకూ, సమాజానికీ అందిన చరితలో తెలంగాణ కు దక్కవలసిన న్యాయమైన వాటా దక్కలేదు.

ఈ అవగాహనతో, తెలంగాణ చరిత్రను తవ్వితీసి, పరిశొధించి, వెలుగులోకి తేవాలనే లక్ష్యంతో తెలంగాణ హిస్టరీ సొసైటీ ఏర్పడింది. జూన్ 2006 లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఇటీవల హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో తొలి సమావేశం జరిపింది. సన్నాహక సమావేశం నాటి పత్రాలను ‘తెలంగాణా చరిత్ర పునర్నిర్మాణం’ పేరిట ఒక పుస్తకం రూపం లో ప్రచురించింది.

tela_hist_small.jpg

ఇందులో 15 మంది తెలంగాణ రచయితలు, జర్నలిస్టులు, చరిత్ర పరిశోధకులు, కళాకారులూ తెలంగాణ చరిత్రకు ఇన్నాళ్లు జరిగిన వివక్ష గురించీ సోదాహరణంగా వివరించారు.

ఆ పుస్తకంలోని ఒక్కో వ్యాసం చదువుతుంటే తెలంగాణ కు ఎన్ని రకాలుగా ద్రోహం జరిగిందో అర్ధమవుతుంది.

మచ్చుకు ఈ ఉదాహరణ చదవండి…

‘గోలకొండ పత్రికల ముడుంబై రాఘవాచార్యులు అనే ఆంధ్రాయన ‘తెలంగాణ లో కవులు పూజ్యం’ అని విమర్శిస్తూ వ్యాసం రాసిండు. దీంతోటి కడుపు మసలిన సురవరం ప్రతాప రెడ్డి, ఆదిరాజు వీరభద్ర రావు, శేషాద్రి రమణ కవులతో కలిసి, 350కి పైగా తెలంగాణ కవులతోటి ‘ గోలకొండ కవుల సంచిక ‘ ను ప్రచురించి అందరి నోళ్లను మూయించిండు.

‘ఒక్కొక్క కవిని 10-15 శతాబ్ధముల మధ్య వెనుకకు ముందుకు లాగి బీభత్సము చేసినారు. వాడు మా ప్రాంతము వాడె యనియు, మా వాడే అనియు ముప్పుతిప్పలు పడి గోవలు గోవలువడ వ్రాసి అచ్చుకొట్టి పెట్టినారు. పాపము ఓరుగల్లు పోతన్నను లాగుకొని పోయి కడప మండలంలో స్థాపించినారు. మహబూబునగరు అప్ప కవిని గోదావరిలో వేయుదమా, కృష్ణలో ముంచుదమా, లేక గుంటూరు లో నిశ్చయము చేయుదమా, అని తగువులాడినారు. బిక్కవోలు (దోమకొండ) సంస్థానము కవియగు మల్లా రెడ్డి ని లాగుకొని పోయి గోదావరి లో పడవేసినారు ‘ అని గోలకొండ కవుల సంచిక సంపాదకీయము లో తెలంగాణ కు ఆంధ్రులు చేసిన అన్యాయాన్ని సురవరం ప్రతాప రెడ్డి లెక్కగట్టి చెప్పాడు.’

– సంగిశెట్టి శ్రీనివాస్

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: