మారిషస్ లో అన్ని డబ్బులున్నాయా?

దాదాపు రెండు నెలలక్రితం ఒక రోజు ఆఫీసులో బోర్ కొట్టి అలా ఇంగ్లీషు వికీపీడియాకు వెళ్లి వ్యాసాలు బ్రౌజ్ చేస్తుంటే ఫీచర్డ్ ఆర్టికల్స్ విభాగం లో Economy of India అన్న వ్యాసం కనపడింది. చదువుతూ పోయా. ఒకచోటకి రాగానే భృకుటి ముడిపడింది.

1991నుండి 2004 వరకూ దేశంలోకి వచ్చిన విదేశీమారక ద్రవ్యపు నిల్వల గురించి ఒక టేబుల్ ఉంది. దాన్ని చూసి నా కళ్లు ఆశ్చర్యంతో విప్పారాయి.

From Wikipedia

ఆ టేబుల్ లో ఉన్న ఇన్ ఫర్మేషన్ ప్రకారం గడచిన పదమూడేళ్లలో మనదేశానికి విదేశీమారక ద్రవ్యం ఎక్కువగా వచ్చింది అందరూ ఊహించే అమెరికానుంచో, బ్రిటన్ నుంచో కాదు. అది సూదిమొనంత ఉండే మారిషస్ అనే ద్వీపదేశం నుంచి!

నాకు వెంటనే ఇందులో ఏదో తిరకాసు ఉండే ఉంటుందని అనిపించింది. అటుపై అదే వికీపీడియాలో మారిషస్ గురించి కొంచెం సమాచారం సేకరించా.

అలా.. అలా తీగలాగితే దొంకంతా కదిలినట్టు మొత్తం కథ బయటికి వచ్చింది.

మారిషస్ ఒకప్పుడు వలస కాలనీగా ఉండేది. 1968లో స్వతంత్రం పొందింది. అక్కడ ఉండేది ఎక్కువగా మన తెలుగు, తమిళం మాట్లాడేవాళ్లే. (అనిరుధ్ జగన్నాధ్, వీరస్వామి రింగడు గుర్తున్నారా?)

1983లో మన దేశం మారిషస్ తో Double Tax Avoidance Treaty అనే ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం మన దేశం లో వ్యాపారం చేసే మారిషస్ దేశస్థులకు ఎలాంటి పన్ను విధించరు. పదేళ్ల పాటు దీని ప్రభావం పెద్దగా ఏమి లేదు. 1991లో ఆర్ధిక సరళీకరణ కార్యక్రమాలు మొదలయ్యాక 1992లో మన ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను అనుమతించడం మొదలుపెట్టింది. దాదాపు అదే సమయం లో మారిషస్ కూడా Offshore Business Activities Act అనేది ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఆ దేశం లో విదేశీ కంపెనీలు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. జాగ్రత్తగా అలోచిస్తే ఇదంతా పధకం ప్రకారమే జరిగిందని ఎవరికైనా అర్ధం అవుతుంది.

అదో అప్పటినుంచీ మొదలైంది మారిషస్ నుండి డాలర్ల వరద. అక్కడా ఇక్కడా లాభాలపై పన్నులు లేకపోవడంతో ప్రపంచం నలుమూలల నుండి దబ్బు మారిషస్ మీదుగా మనదేశానికి వస్తోంది. గత మూడు నాలుగేళ్లుగా జరుగుతున్న మోసం కనిపెట్టిన కొంత మంది అధికారులూ, నేతలూ ఈ మోసపూరిత ఒప్పందాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు.

సుప్రీం కోర్టు లో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు అయ్యింది. కానీ కోర్టు ఈ ఒప్పందాన్ని రద్దు చేయలేదు. పార్లమెంటు లో దీని గురించి చర్చ జరిగినప్పుడు ఈ ఒప్పందాన్ని సమీక్షిస్తామని ఆర్ధిక శాఖ సహాయ మంత్రి ఎస్ ఎస్ పలనిమనిక్కం చెప్పారు. కాని ఆర్ధిక మంత్రి చిదంబరం మాత్రం ఈ ఒప్పందం ఇలా కొనసాగాలని లేకుంటే చాలా ‘ ఉపద్రవాలు ‘ జరిగిపోతాయని అంటున్నారు.

మన కేంద్ర బడ్జెట్ లో మారిషస్ నుంచి వస్తున్న అక్రమ పెట్టుబడుల పై ఎంత కాజువల్ గా ప్రస్తావించారో చూడండి!

mauritius2.JPG

ప్రపంచం లో అనేక చిన్న దేశాలు Tax Havens గా మారిపోవడం కొత్తేమీ కాదు. కేమాన్ ఐలాండ్స్, స్విట్జర్లాండ్ వంటి పన్నురహిత దేశాలు ఎన్నో ఉన్నాయి. అవినీతి, అక్రమ వ్యాపారాల ద్వారా సంపాదించిన డబ్బును రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, స్మగ్లింగ్, ద్రగ్స్, మానవ మాంస వ్యాపారం చేసేవాళ్లూ, టెర్రరిస్టులూ… ఇలా అనేక చీకటి వ్యవహారాల డబ్బు ఈ టాక్స్ హావెన్స్ కు చేరుతుందనేది బహిరంగ రహస్యమే. అయితే ఈ చీకటి వ్యాపారాలని నిస్సిగ్గుగా ప్రభుత్వమే ప్రోత్సాహించడం దారుణం.

మారిషస్ నుంచి మనకు వస్తున్న డబ్బులో నిస్సందేహంగా ఇలాంటి డబ్బు చాలానే ఉంటుంది. ఆ మధ్య రిజర్వ్ బ్యాంకు మారిషస్ నుంచి వస్తున్న డబ్బు ఏ క్లయింట్ల నుంచి వస్తుందో చెప్పాలని అక్కడి నుంచి వ్యాపార లావాదేవీలు జరుపుతున్న కొన్ని కంపెనీలను కోరింది. తమ క్లయింట్ల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని కనుక ఆ వివరాలు చెప్పడం కుదరదని సదరు కంపెనీలు మొండికేశాయి. అలా మొండికేసిన కంపెనీల లిస్టు చూడండి- Citigroup, JP Morgan, HSBC, and Goldman Sachs . ఇదీ బహుళ జాతి ఫైనాన్స్ కంపెనీల నిర్వాకం.

కొందరు అధికారుల పరిశోధనలో మన భారతీయ కంపెనీలు కూడా మారిషస్ లో ఆఫీసులు తెరిచి మన దేశం లో వ్యాపార లాభాలను మారిషస్ ద్వారా రూట్ చేసి పన్ను ఎగ్గొడుతున్నారని తెలిసింది.

ఇలా వివిధ పద్ధతుల ద్వారా మనం నష్టపోయిన డబ్బు, మనకు విదేశీమారకద్రవ్యం రూపం లో వచ్చిన దానికంటే ఎక్కువేనని అంచనా!

మే 2005 లో కేంద్ర కంట్రోలర్ ఎండ్ ఆడిటర్ జనరల్ (కాగ్), విజయేంద్ర కౌల్ కూడా తన రిపోర్టులో ఇలా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FII) మన దేశం లో స్టాక్ మార్కెట్ లో సంపాదించిన దానిపై పన్ను వేయాలని ప్రతిపాదించాడు. ఊహించినట్టుగానే ఆ ప్రతిపాదన బుట్ట దాఖలైంది.

ఇప్పుడు ప్రపంచ ఫైనాన్స్ మార్కెట్లు ఒక పెద్ద Casino గా అయిపోయాయని, ఇంటర్నెట్ వచ్చాక స్టాక్ మార్కెట్ వ్యాపారం అత్యంత ప్రమాదకరంగా తయారయిందని విశ్లేషకులు అంటున్నారు. ఇలా విదేశాల నుంచి వచ్చే పెట్టుబడిని నమ్ముకోరాదని, అది మీట నొక్కితే చాలు అరక్షణంలో మరో దేశం తరలిపోతుందనీ వారు చెపుతున్నారు. మన అధినేతలేమో స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ప్రగతి సూచకమని ఊదరకొడుతున్నారు.

పిండుకోవల్సినంత పిండుకున్నాక, మన దేశం వట్టిపోయాక, ఈ ‘ విదేశీ అభివృద్ది ‘ దేశం దాటిపోతుంది. ఎల్లలే లేని విశ్వవిపణి లో భవిష్యత్ తాకట్టుపెట్టే మరో దేశం తప్పక దొరుకుతుందీ ‘ పెట్టుబడి ‘ దొరలకు.

కలలు కల్లలై, భవిష్యత్ శూన్యమై మిగిలేది మాత్రం ఈ దేశ ప్రజలే!

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

ట్విట్టర్ పై తెలంగాణ

a

గణాంకాలు

  • 91,874 సందర్శకులు

%d bloggers like this: