దేశంలో దొంగలు పడ్డారు -2- మన విజన్ అంతా గ్యాసే!

deendayaal1.gif

పై చిత్రంలో భగ భగ మండుతోంది చూశారా సహజ వాయువు? ఈ కథ వింటే మన గుండెలు కూడా మండుతాయలా!

బొమ్మలో కనపడుతున్నది గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పోరేషన్ వారు కే-జీ బేసిన్లో జూన్ 2005 లో కనుక్కున్న దీన్ దయాల్ అనే చమురు బావి. దీనిలో 20TCF (ట్రిలియన్ క్యూబిక్ ఫీట్) గ్యాస్ దొరుకుతుందని ఒక అంచనా. అంటే ఇప్పటి మార్కెట్ రేట్ ప్రకారం చూస్తే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే! గుజరాత్ ప్రభుత్వరంగ చమురు సంస్థ దీన్ని ‘ కనుక్కోవడానికి ‘ పట్టిన సమయం 300 రోజులు! అయిన ఖర్చు ఎంతో తెలుసునా? 250 కోట్లు!

చమురు సహజవాయు రంగంలో ఆంధ్రప్రదేశ్ కు భారత దేశంలో ఏ రాష్ట్రానికీ లేనన్ని అనుకూలాంశాలు ఉన్నాయి. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు మనకు నిజంగా చిత్తశుద్ధి ఉన్న నేతలే లేరు.

ఒక్క సారి మనకున్న అర్హతలు చూడండి.

1) కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్ లో దాదాపు 80,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో చమురు, సహజవాయు నిక్షేపాలు ఉన్నాయి

2) చమురు వెలికితీతలో ఎంతగానో ఉపయోగపడే బెరైటీస్ అనే ఖనిజం మన రాష్ట్రంలోని కడప జిల్లాలో విస్తృతంగా లభిస్తుంది. ప్రపంచంలో బెరైటీస్ ఉత్పత్తిలో మన దేశం రెండో స్థానంలో ఉంటే, అందులో దాదాపు 98% మన కడప జిల్లాలోనే ఉత్పత్తవుతుంది. మన నేతలేమో ఆ ఖనిజాన్ని అక్రమంగా అమ్ముకుని డబ్బు చేసుకోవడంలో బిజీగా ఉన్నారు.

3) చమురు అన్వేషణకు రిగ్గులు అవసరం. మన రాష్ట్రంలోని బీ.హెచ్.ఇ.ఎల్ ఆయిల్ రిగ్గుల తయారీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచినది.

4) సముద్రంలో చమురు అన్వేషణకు కావలసిన ప్లాట్ ఫార్మ్ విశాఖపట్నంలోని షిప్ యార్డ్ తయారుచేస్తుంది.

రాష్ట్రం ఏర్పాటయిన మూడేళ్లకే అంటే 1959లోనే ఓయెన్ జీసీ కేజీ బేసిన్ లో చమురు అన్వేషణ మొదలుపెట్టింది. ఆనాటి నుండి ఒకరి తరువాత ఒకరు మన నేతలు ఈ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. 1979లో మొదటి సారి ఓయెన్ జీసీ కేజీ బేసిన్ లోని నర్సాపుర్-1 అనే బావిలో సహజవాయువు ను కనుక్కుంది. ఆ తరువాత ఎనిమిదేళ్లకు కానీ మన రాష్ట్ర ప్రభుత్వానికి సహజ వాయువు వినియోగానికి సంబంధించి ఒక కమిటీ వెయ్యాలని తట్టలేదు. మాజీ ఓయెన్ జీసీ చైర్మన్ డా.ఎన్.. భానుప్రసాద్ నేతృత్వంలో ఏర్పాటయిన ఆ కమిటీ రాష్ట్రంలో సహజవాయు వినియోగానికి అనేక సూచనలు చేసింది. పట్టించుకున్న పాపాన పోలేదు మన రాష్ట్ర ప్రభుత్వం

మొన్న రిలయన్స్ కేజీ బేసిన్ లో సహజవాయు నిలువలు కనుక్కునట్టు ప్రకటన చెయ్యగానే అప్పటి దాక పవర్ పాయింట్ ప్రజంటేషన్లలో అభివృద్దిని చూపించిన మన చంద్రబాబు వెంటనే నిద్రలేచి సహజవాయు వినియోగానికి సంబంధించి మరో కమిటి- టి.ఎల్ శంకరన్ అధ్యక్షతన వేశాడు. ఆ కమిటి తన రిపోర్టులో బోలెడు సూచనలూ చేసింది. ఫలితం..శూన్యం!

ఇక చౌకగా లభ్యమవుతున్న సహజవాయువును వెలికితీసి వాడుకోవడంలో ఘోరంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం, గ్యాస్ అధారిత ప్రైవేటు విద్యుత్ ప్రాజెక్టులకు ఎడాపెడా అనుమతులు ఇచ్చి, వాటితో ఏకపక్ష విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకుని మెడకో గుదిబండను తగిలించుకున్నట్టయింది. ఇప్పుడు నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పాదన ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న 4 ప్రైవేటు విద్యుత్ ప్రాజెక్టులకూ గ్యాస్ సరఫరా చెయ్యలేమని గెయిల్ (Gas Authority of India Ltd.) చేతులెత్తేసింది. 1499 మెగవాట్ల స్థాపిత సామర్ధ్యం ఉన్న జీవీకే, వేమగిరి, కోనసీమ, ఓక్ వెల్ ప్లాంట్లకు ఈ ఏడాది నుండి విద్యుత్ కొనుగోలుచేసినా, చెయ్యకున్నా ప్రభుత్వం దాదాపు 767 కోట్ల రూపాయలు (అక్షరాలా ఏడువందల అరవై ఏడు కోట్ల రూపాయలను) అప్పనంగా సమర్పించుకోవల్సి వస్తుంది. (బాబు హయాంలో జరిగిన విద్యుత్ ‘ సరళీకరణ ‘ దోపిడీపై మరో సారి విపులంగా మాట్లాడుకుందాం)

ఎంతో విజన్ ఉన్న పాలకులుగా ఖండాంతర ఖ్యాతినార్జించిన మన బాబుగారి నిర్వాకం ఇది. ఒక వైపు తినడానికి తిండిలేక, సరైన వైద్య సదుపాయాలులేక చనిపోతున్న చిన్నారులున్నారు. చదువుకు నోచుకోని విద్యార్ధులున్నారు. స్కాలర్షిప్పులకు, మధ్యాహ్న భోజన పధకానికి మన దగ్గర నిధులుండవు.

కానీ ప్రైవేటు దొరలకు అప్పనంగా దోచిపెట్టడానికి మాత్రం వందల వేల కోట్లు బిర బిరా తరలివస్తాయి.

ఇదీ మన అభివృద్ది భారతం!

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: