దేశంలో దొంగలు పడ్డారు -1

ఇక నుంచి దేశంలో జరిగే అన్ని క్రికెట్ మ్యాచ్ ల లైవ్ టెలికాస్ట్ దూరదర్శన్ లో తప్పక చూపించాలనే ఆర్డినెన్స్ తెచ్చింది కేంద్ర ప్రభుత్వం నిన్న. వరల్డ్ కప్ హక్కులని దాదాపు 1600 కోట్లు పెట్టి కొన్న సోనీ మాక్స్ వంటి ప్రైవేట్ చానెల్స్ ఇది అన్యాయం అని గగ్గోలు పెడుతున్నాయి.

అయితే క్రికెట్ వంటి విషయాల్లో ఇంత నిర్ణయాత్మకంగా ప్రవర్తించగలిగిన భారత ప్రభుత్వం, దేశానికి కీలక రంగాలైన రక్షణ, చమురు – సహజ వనరులు, విద్యుత్, టెలికాం వంటి రంగాల్లో విదేశీ ఆర్ధిక సంస్థల, బహుళ జాతి కంపెనీల వత్తిడికి లొంగడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

1991లో జరిగిన ‘ సంస్కరణ ‘ ల వల్లే ఇప్పుడు ఆర్ధిక రంగం దౌడు తీస్తోందని, భారత్ వెలిగిపోతోందనీ కొంతమంది గత 3-4 ఏళ్లుగా ఊదరకొడుతున్నారు. అయితే ఈ ‘అభివృద్ది ‘ సాధించడానికి మనం చెల్లించిన మూల్యం ఏమిటి? కుచ్ పానే కే లియే కుచ్ ఖోనా చాహియే అని హిందీ లో ఒక సామెత ఉంది. అయితే మన విషయం అందుకు విరుద్దంగా జరిగింది. కుచ్ పానే కే లియే బహుత్ కుచ్ ఖోయే హం .

ఆనాటి ఈస్టిండియా కంపెనీ పాలన మళ్లీ తిరిగొచ్చింది భారతావనికి.

ప్రభుత్వం చేసిన ‘సరళీకరణ ‘ వల్ల కొత్తగా పుట్టుకొచ్చిన కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన ఉద్యోగులూ, కొత్తగా వచ్చిన ప్రాజెక్టుల్లో కాంట్రాక్టులు పొందిన వ్యాపారస్తులూ, కొత్తగా పెరిగిన భూముల ధర వల్ల లాభపడ్డ బ్రోకర్లూ ఇప్పుడు జరుగుతున్న ‘అభివృద్ది ‘ కి నీరాజనాలు పట్టడం మొదలుపెట్టారు.

అయితే గడచిన 15 ఏళ్లలో జరిగిన అభివృద్ది ఎంత, దాని ఫలాలు ఎవరికి చేరాయి, ఎవరు త్యాగం చేస్తే ఎవరు బాగుపడ్డారో అలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ‘Behind every winner is a loser who is willing to lose’ అని ఇంగ్లీషు లో ఒక కొటేషన్ ఉంది. ఈ కొత్త భారతీయ అభివృద్ది కథ లో విజేతల గురించి రాసే వాళ్లు చాలా మందే ఉన్నారు. for a change నేను మనం కోల్పోయిన అవకాశాల గురించీ, ప్రగతి రధం పదఘట్టనల కింద నలిగిన స్వప్నాల గురించీ, రెండో స్వాతంత్ర్య పోరాటం జరగాల్సిన ఆవశ్యక్యత గురించీ నాలుగు ఆలోచనలు పంచుకుంటాను.

దేశంలో దొంగలు పడ్డారు -1 చమురు, సహజవాయు రంగం

ongc2.JPG

చమురు సహజ వనరుల రంగాన్ని అప్పనంగా ప్రైవేట్ చేతుల్లో పెట్టింది మన కేంద్ర ప్రభుత్వం. చేతులు కాలాక ఆకులు పట్టుకోజూస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం.

1990-91 లో ప్రభుత్వరంగ చమురు కంపెనీ ఓయెన్ జీసీ రిగ్గులు కొనుక్కోవడానికి ఒక వంద కోట్లు కావాలని కేంద్ర ప్రభుత్వానికి ఒక అభ్యర్ధన పంపింది. ఘనత వహించిన భారత ప్రభుత్వం ‘ నా దగ్గర చిల్లి గవ్వ లేదు వెళ్లి వరల్డ్ బ్యాంక్ ను అడుగు ‘ అని చేతులెత్తేసింది.

ప్రపంచబ్యాంకేమో అప్పు ఇస్తాను కానీ మరి బదులుగా చమురు, సహజవాయు రంగాన్ని ప్రైవేట్ పరం చెయ్యాలని షరతు పెట్టింది.

ఇంట్లో లంకెబిందెలున్నాయని తెలిస్తే ఎవరైనా ఏంచేస్తారు? గుట్టుచప్పుడు కాకుండా తవ్వుకుని తీసుకుంటారు. కాని మనవాళ్లేమో తవ్వుకోవడానికి డబ్బులు లేవని వరల్డ్ బ్యాంక్ వద్దకి అప్పు కోసం వెళ్లారు.

ఆ రోజు వరల్డ్ బ్యాంక్ మనకు విదిల్చిన అప్పు 100 కోట్లు. బదులుగా మనం తాకట్టు పెట్టిన చమురు లంకెబిందెల విలువ ఎంతో తెలుసునా? ఊపిరి బిగపట్టండి. హీనపక్షం పది లక్షల కోట్లు అని అంచనా!

1991 చివరినాళ్లలో మొదలైన అసలు ప్రైవెటైజేషన్ ప్రక్రియ ఆద్యంతం మోసం, దగా, కుట్ర అనే టైపులో జరిగింది. ముఖ్యంగా మూడు కార్యక్రమాలు చేపట్టారు మన పాలకులు.

ongc3.JPG

1) చమురు బ్లాకులను అమ్మడం

సోవియట్ల సాంకేతిక సహకరంతో మన దేశంలో చమురు అన్వేషణ మొదలుపెట్టింది ప్రభుత్వం. దాదాపు నలభై యేళ్లు కృషి చేసి బాంబే హై, కే.జి బేసిన్, గుజరాత్, రాజస్తాన్, అస్సాం లలో చమురు, సహజ వాయు నిక్షేపాలు కనుక్కుంది ఓయెన్ జీసీ. ప్రైవేటీకరణలో భాగంగా ఓయెన్ జీసీ కనుక్కున్న నిక్షేపాలున్న ప్రదేశాలను బ్లాకులుగా విభజించి అమ్మకానికి పెట్టింది భారత ప్రభుత్వం. ఇప్పటికే అనేక దఫాలుగా సాగిన ఈ బ్లాకుల అమ్మకం అంతా ప్రైవేటు, బహుళజాతి కంపెనీలకు అనుకూలంగా సాగింది. కెయిర్న్ ఎనర్జి, రిలయెన్స్, గుజరాత్ రాష్ట్ర చమురు, సహజవాయు సంస్థ ఇలా బ్లాకులు కొనుక్కున్న వాటిలో ఉన్నాయి.

గత కొన్నేళ్లుగా అటు కెయిర్న్ ఎనర్జీ, ఇటు రిలయన్స్ రెండు కేజీ బేసిన్లో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే నిక్షేపాలు కనుక్కున్నట్టు ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ఇవన్నీ ఓయెన్ జీసీ నుండి లాక్కుని తెగనమ్మిన చోట్లనే కావడం విశేషం.

అయితే గమనించాల్సిన విషయం ఒకటుంది. ఇక్కడ తవ్వకాలు జరపడానికి ఓయెన్ జీసీ దగ్గర డబ్బులు లేవని ప్రైవేటు కార్యక్రమం మొదలు పెట్టారు మన పాలకులు. అయితే వాళ్లు చెప్పింది అబద్దం అనేది ఇటీవలి కాలంలో ఓయెన్ జీసీ బయటి దేశాల్లో కూడా భారీ ఎత్తున చమురు అన్వేషణ మొదలుపెట్టడం, అందుకు ఓయెన్ జీసీ విదేశ్ అనే ఒక కంపెనీని ప్రారంభించడం నిరూపిస్తోంది

2) చమురు కంపెనీలను ప్రైవేటు పరం చెయ్యడం

చమురు వెలికితీతలో ఉన్న ఓయెన్ జీసీ, సహజ వాయు రంగంలో ఉన్న గెయిల్, చమురు శుద్ధి, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియంలను మొదలు పాక్షికంగా, తరువాత పూర్తిగా తెగనమ్మడానికి భారత ప్రభుత్వం చాలా సార్లు ప్రయత్నాలు చేసింది. ఇప్పటికే కొద్ది పాటి షేర్లను అమ్మింది కూడా. ఈ కంపెనీలన్నీ వేల కోట్ల లాభాల్లో నడుస్తుండటం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం.

బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు HPCL, BPCL అమ్మకానికి పెట్టారు. గమ్మత్తుగా ఆ వేలంలో భారతీయ పౌరులుగానీ, భారతీయ కంపెనీలు గానీ పాల్గొనరాదన్న రూలు పెట్టడానికి విఫలయత్నం చేశారు మన ఘనతవహించిన స్వదేశీవాదులు!

3) చమురు బావులను అమ్మడం

ఇక పైవాటికంటే దుర్మార్గంగా జరిగింది అప్పటికే ఓయెన్ జీసీ తవ్వి, చమురు ఉత్పత్తి చేస్తున్న బావులను ప్రైవేటీకరించడం. ముక్తా-పన్నా, రవ్వ బావులని అత్యంత అన్యాయమైన ధరలకు ప్రైవేటు కంపెనీలకు అమ్మేశారు.

17,280 కోట్ల రూపాయల విలువ గల చమురు నిక్షేపాలు ఉన్నాయని అంచనా వేయబడిన ముక్తా-పన్నా బావిని, ఎన్రాన్, రిలయన్స్ కంపెనీల కన్సార్షియం కు 15 కోట్లకు (అవును పదిహేను కోట్లే…జోక్ కాదు) అమ్మారు. మరీ యేడవకుండా ఓయెన్ జీసీ కి కూడ ఒక నలభై శాతం షేర్ ఇచ్చారు ఇందులో.

ఇక దేశం లో ఉత్పత్తయ్యే చమురు లో 8% ఉత్పత్తి చేస్తున్న కేజీ బేసిన్ లోని రవ్వ బావిదీ అదే కథ. దీన్ని కూడా వీడియోకాన్, కమాండ్ పెట్రొలియం, ఓయెన్ జీసీ ల కన్సార్షియంకు అమ్మారు.

కారుచవగ్గా బావులను అమ్మడమే కాదు మన ప్రభుత్వం మరో వరం కూడ ఇచ్చింది ప్రైవేటు దొరలకు. దేశం లో ఓయెన్ జీసీ ఉత్పత్తిచేసే చమురును దేశీయ ధరలకు కొనే ప్రభుత్వం, ఈ బావులను ప్రైవేటు వారికి అమ్మి వాటినించి అంతర్జాతీయ ధరలకు కొనడం మొదలుపెట్టింది. అంటే ఇవే బావులు ఓయెన్ జీసీ దగ్గర ఉంటే మనకు దాదాపు 30% చవగ్గా చమురు లభ్యమయ్యేది. వాటిని ప్రైవేటు వారికి అమ్మి తిరిగి హెచ్చు ధరలకు వారివద్దనే కొనడం మనకు ‘ సరళీకరణ ‘ వల్ల కలిగిన లాభం.

చమురు సహజవాయు రంగాన్ని మనకన్న దశాబ్దాల పూర్వమే ప్రైవేటు పరం చేసిన లాటిన్ అమెరికా దేశాలు ఇప్పుడు తప్పు గ్రహించి వాటిని తిరిగి జాతీయం చేస్తున్నాయి. వెనిజులాలో హ్యుగో చావెజ్, బొలీవియాలో ఇవో మొరాలెస్ చూపుతున్న మార్గం మన పాలకులకు కనపడుతోందా?

ఇక విజన్ ఉన్న పరిపాలకులు పాలించిన ఆంధ్రదేశంలో ఏం జరిగిందో తదుపరి భాగంలో చూద్దాం.

(సశేషం)

దేశంలో దొంగలు పడ్డారు -2- మన విజన్ అంతా గ్యాసే!

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: