కొత్త సంవత్సరం, పాత జ్ఞాపకాలు

కళ్లు మూసి తెరిచేలోగానే మరో సంవత్సరం దొరలిపొయ్యింది. నిన్న కలిగిన ఒక ఆలోచన ఎన్నో పాత జ్ఞాపకాలని గుర్తుకు తెచ్చింది. దాదాపు వారం రోజుల క్రితం అనుకుంటా, నా ఫ్రెండ్ వనజ ఒక గ్రీటింగ్ కార్డ్ పాకెట్ చేతిలొ పెట్టి “వంద రూపాయలు” అంది. తీసి చూస్తే హెచ్. ఐ. వీ / ఎయిడ్స్ బాధితులైన చిన్న పిల్లల పెయింటింగులను గ్రీటింగ్ కార్డులుగా వేసిందొక ఎన్.జి.వో. ఈ కార్డుల అమ్మకం నుంచి వచ్చిన డబ్బులు వారి కోసం వినియోగిస్తారన్నమాట.

ఈ వారం రోజులు ఎంతో ఆలోచించి వైజాగ్ లో వున్న ఒక డిగ్రీ క్లాస్ మేట్ కు మాత్రం అందులోంచి ఒక కార్డును పంపాను. ఎంత ఆలోచించినా గ్రీటింగ్ కార్డ్ పంపగలిగే ఇంకొక ఫ్రెండో, బంధువో గుర్తుకువొస్తే ఒట్టు!

పదో తరగతి పూర్తి అయిన 1990 నుంచి ఎంబీఏ పూర్తైన 1997 వరకూ డిసెంబర్ వచ్చిందంటే చాలు ఏదో ఒక గ్రీటింగ్ కార్డ్ సెంటర్ కు వెళ్లి కనీసం డజన్ కార్డులు కొనేవాణ్ని. ఒకోసారి కొంచెం దగ్గరి వారికి ఖరీదైన కార్డులు, అంత ‘ సీను ‘ లేని వారికి మామూలు కార్డులు కొన్న సందర్భాలు కూడా వున్నాయి. ఎంబియే లో వుండగా అనుకుంటా అబిడ్స్ లోని హాల్ మార్క్ గ్రీటింగ్ కార్డ్ సెంటర్ వాడు పర్సనలైజెడ్ కార్డులను అమ్మడం మొదలు పెట్టాడు. ఇక అప్పటినుండి, దగ్గరి స్నేహితుల పుట్టిన రోజులకు, నూతన సంవత్సరాలకు అవే కార్డులు ఇచ్చేవాన్ని. కార్డులన్ని కొన్నాక వాటిలో రాయాల్సిన సందేశం రాసి, సీల్ చేసి, అబిడ్స్ లో జీపీవో కు పోయి అక్కడ అవసరమైన స్టాంపులు కొని, మన కార్డు వెళ్లాల్సిన ఊరును బట్టి వాటిని వేర్వేరు పెట్టెల్లో వేసి వచ్చేవాడిని.

ఇక కొత్త సంవత్సరం మొదటి నెల అంతా మనకు వచ్చే గ్రీటింగ్ కార్డ్ కోసం ఎదురుచూపులే. మన హవా బాగా నడచిన రోజుల్లో దాదాపు 20 కార్డుల దాక వచ్చేవి. డిగ్రీ రోజుల్లో జోరుగా కలం స్నేహం కూడ వెలగబెట్టాం కదా. వారి నుంచి కూడ కార్డులు వచ్చేవి. ఇప్పటికీ నా దగ్గర ఆనాటి గ్రీటింగు కార్డులూ, ఉత్తరాలూ అన్నీ భద్రంగా ఉన్నాయి.

1997 లో ఇంట్లో ఫోన్ వచ్చింది, దాని ప్రభావం మొదటి సంవత్సరమే అర్ధం అయ్యింది. చాలా మందికి ఫోన్ చేసి శుభకాంక్షలు చెప్పాను. అలా అలా గ్రీటింగ్ కార్డు కొనడం అనే అలవాటు తగ్గిపొయ్యింది. 2000 నుంచి ఇంటర్నెట్లో గ్రీటింగు కార్డులు పంపడం అలవాటైంది. రెండేళ్లు గడిచాయో లేదో సెల్ ఫోన్ వచ్చింది. పొడి పొడి గా “హ్యాపీ న్యూ ఇయర్” అని ఎస్సెమ్మెస్ ఇవ్వడం అలవాటైంది.

సరే మనం అంటే ఆ వయసు దాటేసి వచ్చాం అనుకుందామంటే ఈ కాలం కుర్రాళ్లు కూడా పెద్దగా గ్రీటింగు కార్డులను ఆదరిస్తున్న సూచనలేమీ కనపడ్డం లేదు. ఒకప్పుడు కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు రోడ్డు పక్కన వెలిసే గ్రీటింగు కార్డుల దుకాణాలు ఇప్పుడు కనుమరుగు అయ్యాయంటేనే వాటి దుస్థితి అర్ధం అవుతుంది.

ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే…ఆ రోజుల్లో పోస్ట్ లో గ్రీటింగ్ కార్డ్ అందుకున్న క్షణంలో కలిగిన సంతోషంలో వెయ్యోవంతు కూడ ఫొన్ లో ఎస్సెమ్మెస్ అందుకున్నపుడు కలగట్లేదు.

ఇప్పుడు శుభాకాంక్షలు తెలపడం కూడా ఒక రొటీన్ పని అయిపొయ్యింది.

ఎదురుగా వున్న గ్రీటింగ్ కార్డ్ పాకెట్ నేను (మనం?) కోల్పోయిన మంచి రోజులను జ్ఞాపకం తెస్తోంది…

‘అభివృద్ది పధంలో’ మనం వదిలేసి వచ్చిన మరో చక్కని జ్ఞాపకం గ్రీటింగు కార్డ్.


ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 102,456 సందర్శకులు