బలి కోరిన సామ్రాజ్యవాదం

పచ్చి నెత్తురు తాగే సామ్రాజ్యవాద మృగం మరో సారి జూలు విదిల్చింది. తనను ఎదిరించిన పాపానికి మరొక యోధుణ్ని క్రూరంగా ఉరి కొయ్యకు వేలాడదీసింది.

సద్దం హత్య నన్నైతే తీవ్రంగా కలచివేసింది. అమెరికా దురంతాల గురించి ఇదివరకు ఎంతో చదివినా కూడ ఇది మాత్రం వూహించని ఘోరం. గ్లోబలైజేషన్ క్రమంలో ప్రపంచం ఎంతో మారిపోతోందని ఎవరైన భ్రమ పడితే అది ఉత్తిదే అని, ఈనాటికి బలం వున్నవాడిదే రాజ్యం అనే ఆటవిక నీతే నడుస్తోందని అమెరికా నిర్లజ్జగా చూపించింది లోకానికి.

ఒక వేళ సద్దాం నిజంగానే తప్పు చెసి వుంటే దాన్ని విచారించి శిక్షించవలసింది ఇరాక్ ప్రజలు. అంతే కాని ప్రపంచంలొనే పెద్ద టెర్రరిస్టు దేశం అయిన అమెరికా కాదు. రెండో ప్రపంచ యుద్ధంలొ అణు బాంబులు వేసి లక్షలాది మంది జపనీయుల ఉసురు తీసింది మొదలు అమెరికా సామ్రాజ్యవాద రక్త దాహానికి బలి అయిన ప్రాణాలెన్ని? ఆ తప్పులకు అమెరికా నేతలను విచారించనక్కర లేదా? వారి దురంతాలకు ఎన్ని మరణశిక్షలు విధించాలి? అమెరికా ప్రాపకంతో ఎదిగిన నియంతలెంత మంది? మొన్నటికి మొన్న చిలీ నియంత పినోషె విషయంలో ఇదే అమెరికా ఎలా ప్రవర్తించిందో మనకు గుర్తులేదూ?

అసలు ఏ కారణం చూపించి ఇరాక్ పై దాడికి పాల్పడ్డాడో అది పచ్చి అబద్ధం అని తేలిపోయాక కూడ బుష్ ఇంతటి దౌష్ట్యానికి పాల్పడటం క్షమించరాని నేరం. ఒక అబద్దపు కారణంతో ఇరాక్ పై దాడికి దాడికి దిగిన బుష్, దాని ఫలితమైన ఆరు లక్షల మంది ఇరాకీ పౌరుల దుర్మరణానికి శిక్ష అనుభవించొద్దా?

ఉరికొయ్యను కూడా ధైర్యంగా ఎదుర్కొన్న సద్దాం స్పూర్తి మాత్రం మాటల్లో వర్ణించరానిది. అతడి చుట్టూ మూగిన కిరాతకులు గేలి చేస్తూ, అవమానకరమైన భాష వాడుతూ సభ్యత మరచి ప్రవర్తిసుంటే కూడా తొణకక, బెణకక నిలబడ్డ ఆ వీరుడు, భావి పోరాటాలకు ఎనలేని ఉత్తేజాన్నిస్తాడు.

సద్దాం ఉరితీత దృశ్యాలను వీడియో తీసి ప్రపంచానికి చూపడం ద్వారా అమెరికా తన ఆటవికతను మరో సారి నిరూపించుకుంది. బహుశా అలా చేయడం ద్వారా తన మాట వినకుంటే ఎవరికయినా ఏ గతి పడుతుందో అమెరికా తెలియజెప్పదల్చుకుందేమో కానీ నిజానికి ఆ చర్య ద్వారా అమెరికా నాగరికత ఏపాటిదో ప్రపంచానికి బహిర్గతం అయ్యింది.

సామ్రాజ్యవాదాన్ని నిలువరించడం అనే అత్యంత అవశ్యక కర్తవ్యంలో మన దేశం, మనతో పాటు చైనా, రష్యాల వైఫల్యమే సద్దాం ఉరి అని నాకనిపిస్తోంది. అమెరికాతో వ్యాపారం ఎక్కడ దెబ్బతింటుందో అని ఈ మూడు దేశాలూ మిన్నకుంటున్నాయని అర్ధం అవుతోంది. ముఖ్యంగా మన దేశం వైఖరి ఆశ్చర్యం కలిగిస్తోంది. నాలుగు కాసుల కోసం కక్కుర్తి పడుతున్న మనం, రేపు రాబోయే పెను ప్రమాదాన్ని సరిగా అంచనా వేయలేక పోతున్నాం. సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడంలో మనకన్నా అన్ని విషయాల్లో (జనాభా, వనరులు) చిన్నవైన క్యూబా, వెనిజులా, ఇరాన్ వంటి దేశాలు ఎంతో సాహసోపేతంగా అమెరికాను నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయి. మన నాయకులేమో అమెరికా ఎన్ని ఆకృత్యాలకు పాల్పడినా ఎటో చూస్తున్నట్లు నటిస్తున్నారు. సద్దాం విషయంలొ సామన్య పౌరుడు వ్యక్తపరచినంత నిరసన కూడా భారత ప్రభుత్వం ప్రకటించకపోవడం చూస్తే, నిజంగా మన నేతలు ఈ దేశాన్ని ఎంత నిర్వీర్య స్థితికి చేర్చారో అర్ధం అవుతుంది.

ఈ హత్య వార్తను తెలుగు పత్రికలు, తెలుగు సమాజం ఖండించిన తీరు గురించి కూడా రెండు ముక్కలు చెప్పుకోవాలి. ఉరి వార్త గురించి తెలియగానే వెంటనే కొంతమంది కవులు, కళాకారులు, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వద్ద నిరసన ప్రదర్శన జరిపారు. ఈ దారుణాన్ని ఖండిస్తూ 3 జనవరి నాడు ఖైరతాబాదు లోని ఒక హాలులో సభ ఏర్పాటు చేసారు. ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ దారుణానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతూనే వున్నాయి.

ఇక చాలా విషయాల్లో బాధ్యతారాహిత్యంగ ప్రవర్తిస్తుండే తెలుగు వార్తాపత్రికలు సద్దాం విషయంలో మాత్రం ప్రశంసాపూర్వకమైన వైఖరి తీసుకున్నాయి. ఈనాడు పత్రిక “చంపేసారు” అన్న హెడ్ లైన్ పెట్టగా, వార్త ఒక అడుగు ముందుకి వేసి సద్దాం మరణాన్ని యోధుని వీర మరణం అని శ్లాఘించింది.

సద్దాం గురించి మొదటి సారి నేను విన్నది 1991లో. అప్పుడప్పుడే ఇంటర్ లోకి అడుగుపెట్టిన నేను ఇరాక్ కువైట్ పై దాడి చేయడం, దాన్ని సాకుగా చూపి అమెరికా ఇరాక్ పై యుద్ధం ప్రకటించడం, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలంటూ ఇక్కడ అంద్రప్రదేశ్ లో వామపక్షాలు ధర్నాలు చెయ్యడం చూసి అసలు అక్కడెక్కడో ఏదో జరిగితే ఇక్కడ ఇంత గొడవ చెయ్యడం ఎందుకు అనే సందేహం కలిగేది. ఆ రోజు నుంచీ కొంచెం కొంచెం గా అమెరికా సామ్రాజ్యవాదం గురించి అర్ధంచేసుకునే ప్రయత్నం మొదలుపెట్టాను. ఇవ్వాళ గ్లోబలైజేషన్ విశ్వరూప ప్రదర్శనలో అక్కడెక్కడో జరిగిన దానికి ఇక్కడ ఎందుకు నిరసన ప్రకటించాలో స్పష్టంగా బోధపడుతోంది అందరికీ. ఇప్పుడు సద్దాం హత్య చాలా మందికి కళ్లు తెరిపించి వుంటుందనే అనుకుంటున్నా.

అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా సాగాల్సిన అవసరాన్ని సద్దాం హుస్సేన్ బలిదానం మరోసారి గుర్తుచేస్తోంది.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: