ఎవరి స్వేచ్చ? ఎవరి వాణిజ్యం? ఎవరికి సబ్సిడీ?

నేను ముసుగులు బయట పడుతున్నాయి అని రాసిన పోస్టుపై వ్యాఖ్యానిస్తూ మిత్రుడు కిరణ్ లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు ఈ పోస్టు.

1) ముందుగా నేను అమెరికాలో పత్తి రైతులకు ఇచ్చే సబ్సిడీ గురించి ఉటంకించిన గణాంకాలు తప్పు అయి ఉండవచ్చునను కిరణ్ అభిప్రాయపడ్డాడు. ఈ అంకెలను నేను యు.ఎన్.డి.పి వారు ప్రచురించిన మానవాబ్ధివృద్ధి నివేదిక (Human Development Report) 2005 నుండి తీసుకున్నాను. కింద screenshot ఇచ్చాను.

["అభివృద్ధి" అనేది ఆ పదానికి మనం ఇచ్చే నిర్వచనం పై ఆధారపడి ఉంటుందని నేను ఇదివరకు కూడా ఒకటి రెండు సార్లు చెప్పాను. అనేక దేశాల్లో ఇప్పుడు అభివృద్ధిగా చూపించబడుతున్నది కేవలం ఆర్ధికాభివృద్ధి మాత్రమే. కొన్నేళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి అనుబంధ యు.ఎన్.డి.పి "మానవాభివృద్ధి" అనే కొత్త కొలమానం ప్రవేశపెట్టింది. అభివృద్ధిని కొలవడానికి ఇప్పటివరకు మనకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ కొలమానం ఇది. ఈ సంస్థ ప్రతీ యేటా వార్షిక మానవాభివృద్ధి నివేదికలు ఇస్తుంది. 2005 నివేదికలో ధనిక దేశాలు పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలను సబ్సిడీల పేరిట, సుంకాల పేరిట ఎలా మోసం చేస్తున్నాయో సుధీర్ఘంగా చర్చించారు.]

2) ఇక అమెరికా ఇస్తున్న సబ్సిడీలు ఆ దేశపు జిడిపిలో కేవలం 0.06% అని. ఆ దేశం ఆల్రెడి అభివృద్ధి చెందిన దేశం కాబట్టి మౌలిక సౌకర్యాలపై ఖర్చు చేయవలసిన పని లేదని అందుకే సబ్సిడీలపై ఖర్చు పెట్టే సామర్ధ్యం దానికుందని కిరణ్ అన్నాడు.

ఇక్కడే ఉంది తిరకాసంతా. ఇప్పుడు మనం సబ్సిడీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? ప్రపంచమంతా ఒకటే గ్లోబల్ మార్కెట్ కావాలనే డబ్ల్యు.టి.వో నేపథ్యంలో కదా మనం ఇప్పుడు సబ్సిడీల ప్రస్థావన తెచ్చింది. పొరుగు దేశంపై ఎటువంటి ప్రభావం చూపని రంగాల్లో ఒక దేశం ఎంత సబ్సిడీ ఇచ్చినా అడిగేవారు ఉండరు. ఇప్పుడు చిక్కల్లా ఒక పక్క ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాల్లోనేమో అన్ని దేశాలూ తమ మార్కెట్లు తెరిచి ఉంచాలి, అన్ని దేశాల్లో వాణిజ్య చట్టాలు సమానంగా ఉండాలి, స్వేచ్చా వాణిజ్యం అని ప్రవచిస్తారు. ఆచరణకు వచ్చే సరికి ధనిక దేశాలకు ఒక రూలు, పేద దేశాలకు ఇంకో రూలు ఉంటోంది.  

ధనిక దేశాలు దొంగదారిలో సబ్సిడీలు ఇస్తూ పేద దేశాలు మాత్రం సబ్సిడీలు ఇవ్వొద్దనడం ఏ విధంగా కరెక్టు? ఆ దేశం ధనిక దేశం కాబట్టి దాని దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అది దానిష్టం వచ్చినట్టు చేసుకుంటుంది అనే వాదన ఎలా సబబు? ఒక వైపు మన రైతులను గ్లోబల్ రధచక్రానికి కట్టివేసి “వాడు డబ్బున్నవాడు అందుకే వాడికో రూల్, నీకో రూల్” అంటే అటువంటి ఆటను ఎలా ఆడాలి? ఆడి ఎలా గెలవాలి? ఇటువంటి అపసవ్య విధానాల వల్ల కాదూ లక్షలమంది రైతులు పిట్టల్లా రాలిపోతున్నదీ గడ్డపైన?

3) సబ్సిడీలను జిడిపిలో శాతంగా కొలవడం సరికాదు అని నా అభిప్రాయం. వాటిని తలసరి లెక్కన కొలిస్తే కొంచెం మేలేమో అలోచించాలి. గ్లోబల్ మార్కెట్లో ఏ వ్యవసాయ ఉత్పత్తి అమ్మకాలు అయినా ప్రపంచ మార్కెట్ రేట్లకే కదా జరిగేది. మరి అటువంటప్పుడు మాది ధనిక దేశం కాబట్టి మేం సబ్సిడీలు ఎక్కువ ఇస్తాం అంటే పేదదేశాల రైతులు అటువంటి మార్కెట్లో ఎప్పటికయినా పోటీపడగలరా? అలోచించండి ఒకసారి. అక్కడ 20,000 మంది పత్తి రైతులకు ఇచ్చే సబ్సిడీ మనబోటి దేశాల్లో ఎన్ని లక్షల మంది రైతుల ఉసురు తీస్తుందో ఆలోచించాలి. ధనిక దేశాల్లో గుప్పెడు మంది రైతుల ప్రయోజనాలు ఒకపక్క, వ్యవసాయం తప్ప మరొక ఉపాధిలేని కోట్లాదిమంది ప్రపంచ రైతులు ఇంకొక పక్క ఉన్నారీ సమస్యలో. ఎవరి ప్రయోజనాలకొరకు ఎవరిని బలిపెడుతున్నాం మనం?

4) ధనిక దేశాల్లో వ్యవసాయ సబ్సిడీలు ఇచ్చే విధానం వల్ల పేద దేశాలపై ఎంత ప్రభావం పడుతుందో 2005 హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ స్పష్టంగా పేర్కొంది. అందులోంచి రెండు ఉదాహరణలు:

-2002 నుండి 2003 మధ్య అమెరికాలో టన్నుకు 415 డాలర్ల ఖర్చుతో పండించిన బియ్యాన్ని అక్కడి సబ్సిడీల పుణ్యమా అని టన్నుకు 274 డాలర్లకే ఎగుమతి చేశారు. 

- చక్కెర పండించడంలో ఎటువంటి అనుకూల పరిస్థితులు లేకపోయినా యూరోప్ ఖండం ప్రపంచ చక్కెర ఎగుమతుల్లో రెండో స్థానంలో ఉంది. దీనికి కారణం అక్కడి దేశాలు ఇస్తున్న సబ్సిడీలే. ప్రపంచ మార్కెట్లో చక్కెర రేటుకు నాలుగింతల మద్ధతు ధర ఉంటుంది యురోపియన్ దేశాల్లో. తత్ఫలితంగా అక్కడ 4 మిలియన్ టన్నుల మిగులు చక్కెర ఉంటోంది. ఇలా పోగుపడిన మిగులును దాదాపు 100కోట్ల డాలర్ల ఎగుమతి ప్రోత్సాహకాల (సబ్సిడీలకు మారుపేరు) సాయంతో ప్రపంచ మార్కెట్లో గుమ్మరించేస్తున్నాయీ దేశాలు.

ప్రపంచ వాణిజ్య సంస్థ ఉరుగ్వేలో సమావేశమయినప్పుడు ధనిక దేశాలు ఇస్తున్న సబ్సిడీల గురించి బాగా వ్యతిరేకత వచ్చింది. ఆ చర్చల్లో సబ్సిడీల్ని తగ్గించుకుంటామన్న అమెరికా, యూరోప్ దేశాలు తదనంతర కాలంలో తమతమ దేశాల్లో వ్యవసాయానికి సబ్సిడీలు ఇంకా పెంచేశారు. ఇది మోసం కాక మరేమిటి?

తమ దేశాల్లో వ్యవసాయ ఉత్పత్తులకు సబ్సిడీలు ఇవ్వడమే దారుణమయితే పేద దేశాల నుండి దిగుమతయ్యే వ్యవసాయోత్పత్తులకు భారీ స్థాయిలో సుంకాలు (టారిఫ్) విధించడం ద్వారా కూడా తమ తమ దేశాల్లోని వ్యవసాయరంగాలను రక్షించుకుంటున్నాయీ దేశాలు. 

మొన్న మొన్నటిదాకా వలస కాలనీల్లో దోచుకోగా మిగిలిందేమన్నా ఉంటే దాన్ని కూడా దోచుకోవడానికి ధనిక దేశాలు రచించిన పంచరంగుల వల ఈ గ్లోబలైజేషన్. అది పైకి చూస్తే మేడిపండులా నిగనిగలాడుతూనే ఉంటుంది. కానీ దాని పొట్ట నిండా మోసమూ, కుట్రా అనే పురుగులు నిండి ఉన్నాయి.

స్వేచ్చా వాణిజ్యం పేరిట జరుగుతున్న ఈ గ్లోబల్ దోపిడీ ఎవరి స్వేచ్చ? ఎవరి వాణిజ్యం కొరకు?

On a Related Note: మన దేశంలో కూడా దుర్వినియోగం అవుతున్న సబ్సిడీలు ఉన్నాయి. పేద కుటుంబాలు ఎన్నున్నాయో గణాంకాలు ఉన్నా కూడా మన రాష్ట్రంలో కోటి ఎనభై లక్షల తెల్ల కార్డుల వారికి 2 రూపాయలకే కిలో బియ్యం ఇస్తున్నామని నిస్సిగ్గుగా దోపిడీ చేసే వ్యవస్థను నెలకొల్పే నాయకుల వల్ల ఎంతో విలువైన ప్రజాధనం వృధా అవుతుందన్నది వాస్తవం.

సబ్సిడీలు తప్పక ఉండాలి. అవి అర్హులకే చేరాలి. అదీ నా అభిమతం.

8 స్పందనలు to “ఎవరి స్వేచ్చ? ఎవరి వాణిజ్యం? ఎవరికి సబ్సిడీ?”


  1. 1 Arun Kumar 1:04 pm వద్ద ఏప్రియల్ 15, 2008

    I would like to read more about globalisation and the effects. Kindly guide me in this regard.

  2. 2 కిరణ్ 3:48 pm వద్ద ఏప్రియల్ 15, 2008

    దిలీప్ గారు
    ఈ పోస్టుతో మరింత వివరించినందుకు కృతజ్ఞతలు. పాశ్చాత్య దేశాలు ఇస్తున్న వ్యవసాయ సబ్సిడీలను నేను సమర్థించను. వీటివల్ల పేదదేశాల్లోని రైతులు మోసపోతున్నారన్నది నిజం. కానీ, అంతకంటే ముఖ్యంగా, ఈ సబ్సిడీలను ఇవ్వడం అనేది పాశ్చాత్య దేశాల ప్రజలకే మంచిది కాదని చాలామంది ఎకనామిస్టుల అభిప్రాయం.

    Economists strongly rebuke the benefits of reduced retail prices derived from subsidising over-production. If the government were to subsidize car manufacturers to produce more cars then this would indeed lower the showroom price but it would be the consumer’s own money collected through tax that would be used to fund the over-production. Even worse, subsidies are a deadweight loss to the welfare in the aggregate economy due to the misallocation of production spending caused by the price distortion in agricultural products. Also, in the hypothetical case that lower retail costs would outweigh the additional production costs, the manufacturers would simply lower their prices themselves until they are at a point of maximum profitability.

    ఎదురింటివాడి దగ్గర మనకంటే 500 రెట్లు డబ్బు ఎక్కువగా ఉంది. ఎదురింట్లో వాడు రోజుకి పది సిగరెట్లు వూదేస్తున్నాడు అని మనింట్లో ఇరవై సిగరెట్లు ఊదెయ్యడం మంచిదా ? ఇదేమి పోటీ ?

    ఇక్కడ మనదేశంలో మనం ఆలోచించుకోవల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. భవిష్యత్తులో రాబోయే ఇంధనం, నీరు, విద్య కొరతలకి తట్టుకునేందుకు మనదేశం చాలా డబ్బులు ఇన్వెస్టు చెయ్యాలి. సబ్సిడీలకి డబ్బులు ఇస్తుంటే వీటికి డబ్బులుండవు. ఆర్థికశాస్త్రంలో దీనిని opportunity cost అంటారు. ఎకనామిస్టు గనుక మన ప్రధానమంత్రి గారు ఇదే పరిభాషని ఉపయోగించారు. ఉన్న డబ్బులు కొంతే అయినప్పుడు వీటిని ఎంత సమర్థవంతంగా ఉపయోగించాలి అనేదే రాజ్యం నడిపేవాడి తెలివికి పరీక్ష. మన అవసరాలని సరిగ్గా prioritize చేసుకోవాలి. సబ్సిడీ అంకెలని శాతంలో చూపించమని అడిగినది ఈ prioritzation కోసమే.

    పాశ్చాత్య దేశాలు ఇస్తున్న వ్యవసాయ సబ్సిడీల వలన మనలాంటి దేశాలకి విదేశీ మారక ద్రవ్యం కోల్పోతున్న మాట నిజం. కానీ, అమెరికా లాంటి దేశాలు ఈ సబ్సిడీలనిస్తోంది పేదదేశాలని కొల్లగొట్టటానికి కాదు. వీటిని సమర్థించేవారు ఉపయోగించే నినాదాలు “దేశానికి ఆహర భద్రత కల్పించాలి”, “సంప్రదాయభద్దమైన జీవన సరళిని మనం కాపాడాలి”. ఈ నినాదాలకి మనదేశం ఎలా సమాధానం ఇవ్వగలదు అన్న దానిని బట్టి, ఆ దేశాలవారు తమ వ్యవసాయంలో స్వేచ్ఛా విపణి అవకాశం మనకి ఇవ్వగలరు.

    ఇది జరిగినా మన దేశం వ్యవసాయం ద్వారా సంపాదించగలిగే విదేశీ మారకద్రవ్యం చాలా తక్కువ. అభివృద్ధి చెందుతున్న దేశాలు పారిశ్రామిక ఎగుమతులపై బాగా శ్రద్ధ పెట్టాలి. వీటిద్వారా మరింత ఎక్కువగా లాభాలని సంపాదించవచ్చు.

    అమెరికా ఇటువంటి అవకాశాన్ని చైనాకి ఇచ్చిపెడుతోంది. అమెరికాకి చేసే ఎగుమతులే చైనా యొక్క ఆర్థిక వృద్ధికి కారణాలు. వలసవాద సిద్ధాంతాల ప్రకారం అమెరికా ఆలోచించినట్లయితే చైనా నుండి వస్తువులను దిగుమతికి అనుమతించేది కాదు. ఉదాహరణకి, బ్రిటీషువారు వలసపాలనలో మనదేశం నుండి పారిశ్రామిక ఎగుమతులను నిర్బంధించేవారు. అమెరికా అలా చెయ్యట్లేదు.

    నిజానికి చైనా తన కరెన్సీని నియంత్రించడం ద్వారా ఈ మార్కెట్టుని చాలా మోసం చేస్తోంది. తన శక్తికి మించి మరిన్ని రెట్లు ఉత్పత్తులను ఇతర దేశాల్లో అమ్మగలుగుతోంది. దీనివలన అమెరికాకు చైనాతో trade deficit విపరీతంగా పెరిగిపోతోంది.

    ఈ కృతిమ కరెన్సీ నియంత్రణ ద్వారా చైనా మన భారతదేశానికి కూడా చాలా ద్రోహం చేస్తోంది. చైనా కంటే పేదదేశమైన మనదేశానికి కూడా చైనాతో trade deficit పెరిగిపోతోంది. కానీ, అసలు నష్టం దీనికంటే పెద్దది. చైనా కరెన్సీ నియంత్రణ లేకపోతే ఇండియా ఉత్పత్తులు వారికంటే తక్కువ ఖరీదుకు అమ్ముడవుతాయి. చైనా మనదేశం యొక్క సహజమైన లాభాలర్జన అవకాశాలని కృతిమ కరెన్సీ ద్వారా కొల్లగొడుతోంది.

    మనదేశానికి నష్టాలు ఏ మూలల నుండి వస్తున్నాయో మనం గమనించాలి. ఉన్న డబ్బులని ఎంత జాగ్రత్తగా వినియోగించాలో ఆలోచించాలి. దేశభక్తులైన అందరికీ ఇది కర్తవ్యం.

  3. 3 Dil 3:57 am వద్ద ఏప్రియల్ 16, 2008

    కిరణ్ గారు,

    సబ్సిడీలు అర్హులకు అవసరమే అని నేను గట్టిగా నమ్ముతాను. అసమ సమాజంలో బలహీనుడికి ఏదో ఒక విధమైన రక్షణ లేకపోతే అది అటవిక రాజ్యమవుతుంది.

    మీరు ఇచ్చిన సిగరెట్ల ఉదాహరణ కొన్ని రంగాల్లో మన ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలకు వర్తిస్తుంది కానీ వ్యవసాయ సబ్సిడీలకు కాదు. కార్లకు చౌక వడ్డీకి రుణాలు అందించి, ట్రాక్టర్లకు హెచ్చు వడ్డీ వేయడం, విమానాల ఇంధనానికి తక్కువ సుంకం విధించి బస్సుల ఇంధనానికి హెచ్చు సుంకాలు వడ్డించడం వంటి పనులు చేయకుండా సహేతుకంగా సబ్సిడీలు ఇవ్వాలి.

    ఇక పారిశ్రామికాభివృద్ధి గురించి…ధనిక దేశాలు చాలా తెలివిగా కాలుష్య కారక పరిశ్రమలను పేద దేశాలకు తరలిస్తూ మనబోటి వారిని ఇదే పారిశ్రామికాభివృద్ధి అని నమ్మించజూస్తున్నాయి. ఈ తరహా పారిశ్రామికీకరణకు నేను వ్యతిరేకిని.

    ఇబ్బడిముబ్బడిగా సరుకులు ఉత్పత్తి చేయడం, అవసరం ఉన్నా లేకున్నా వాటిని వినియోగించడం తాత్కాలికంగా జీడిపీ లు పెంచుతుందేమో కానీ అది మన భవిష్యత్తుకు మంచిది కాదు.

    ఇక అమెరికా చైనా వాణిజ్యం గురించి మరో పోస్టులో…

  4. 4 Dil 4:08 am వద్ద ఏప్రియల్ 16, 2008

    అరుణ్ కుమార్ గారు,

    గ్లోబలైజేషన్ గురించి రెండు వాదనలు ఉన్నాయి. అది మనుషుల మధ్య, దేశాల మధ్య అంతరాలను పెంచి సమాజంలో అశాంతికి దారి తీస్తుందని నా బోటి వాళ్లు నమ్ముతారు. ఇక నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు గ్లోబలైజేషన్ బ్రహ్మాండమైన మందు అని నమ్మే వాదనా ఉంది.

    నేను నమ్మే వాదన గురించి ప్రాధమిక పరిజ్ఞానం కొరకు ఈ పుస్తకాలు చదవొచ్చు:

    ఇంగ్లీషులో:

    1) Globalization and Its Discontents by Joseph Stiglitz

    2) Unholy Trinity - The IMF, World Bank and WTO by Richard Peet

    3) Confessions of an Economic Hitman by John Perkins

  5. 5 కిరణ్ 8:56 am వద్ద ఏప్రియల్ 16, 2008

    దిలీప్ గారు

    19వ శతాబ్దిలో యూరపు నగరాల్లో కాలుష్యం ఎంత ఎక్కువగా ఉండేదో గమనిస్తే కళ్ళు చెదురుతాయి. పారిశ్రామీకరణ మొదల్లో ఈ కాలుష్యం తప్పదు. అయినా, మన ప్రపంచం ఒకటే గోళం. ఒకచోటలో కాలుష్యం ఉత్పత్తి అయితే ప్రపంచానికంతటికీ పాకుతుంది. నిజానికి అమెరికా, యూరపు దేశాలు చైనా యొక్క కాలుష్యం తగ్గించమని డిమాండు చేస్తున్నాయి. చైనాయే దీనికి ఒప్పుకోవట్లేదు.

    అభివృద్ధికి సంబంధించి ఒక మార్గం చూపించి, ఆ తరువాత సామాజిక సమానతల గురించి ఆలోచిస్తే ఒక అర్థం ఉంది. అటు అభివృద్ధీ లేదు, ఇటు సామాజిక సమానతా లేదు .. ఈ కమ్యూనిస్టు సిద్ధాంతాలతో డొంకతిరుగుడు అంతా ! ఒకసారి చైనాలో ఆ ప్రభుత్వం ఉపయోగిస్తున్న పాలిసీలు చూస్తే, మన మొక్కుబడి కమ్యూనిస్టుల వైరుధ్యం అంతా బయటపడుతుంది.

    పేదవాళ్ళకి సహాయం చెయ్యాలన్నది నేను నమ్ముతాను. కానీ సబ్సిడీలు ఇవ్వడం ద్వారా ఎంతమందికి మేలు చెయ్యగలుగుతున్నాము ? వారి జీవితాల్లో ఏమన్నా మార్పు, అభివృద్ధి తేగలుగుతున్నామా ? మన భారత వ్యవసాయ రంగం, రైతాంగం .. ఈ సబ్సిడీల ద్వారా ఎంత వృద్ధి సాధించగలిగింది ? రైతుల ఆదాయం ఎంత పెరిగింది ? తలసరి పంట దిగుబడి ఎంత పెరిగింది ? ఎంతమంది రైతులు వారి పిల్లలకోసం డబ్బులు కూడబెట్టగలుగుతున్నారు ? ఎంతమంది రైతులు ఆకలిని జయించగలుగుతున్నారు. మొత్తం సున్నా.

    సరైన ఫలితాలు ఇవ్వనప్పుడు వీటిని విడనాడి మరింత తెలివిగా మన డబ్బులను ఖర్చుపెట్టాలి. ఇది చెయ్యలేనివాడు మూర్ఖుడు.

  6. 6 Dil 10:38 am వద్ద ఏప్రియల్ 16, 2008

    యూరోప్ కాలుష్యం గురించి మీరు చెప్పినదాంట్లోనే జవాబు ఉంది. అక్కడ కాలుష్యం ఎక్కువైందనే ఇక్కడికి పరిశ్రమలను తరలిస్తున్నారు. వారు ఉపయోగించే వస్తువులను చౌకగా తయారు చెయ్యలి మన కార్ఖానాల్లో, తయారైన వస్తువుని వారు వినియోగిస్తారు. మన ప్రజలు మాత్రం ఆ కాలుష్యానికి బలవుతారు. అయినా కాలుష్యం వారి దేశాల్లో ఎటువంటి సమస్యలు సృస్టించిందో చూసి మనం కూడా అదే పని చేయాలా? ప్రత్యామ్న్యాయాలు చూసుకోవాలి కానీ.

    చైనా కాలుష్యం తగ్గించమని అడిగే నైతిక హక్కు అమెరికాకు లేదు ఎందుకంటే:

    1) చైనా ఉత్పత్తులను అందరికంటే ఎక్కువ కొనేది అమెరికానే. వారు కొనడం మానేస్తే చైనా ఉత్పత్తి చేయడం ఎలాగూ ఆపేస్తుంది. అప్పుడు కాలుష్యం అదే తగ్గుతుంది

    2) శిలాజ ఇంధనాలను (Fossil Fuels) మండించడం వల్ల ఉత్పత్తయ్యే బొగ్గుపులుసు వాయువును అధికంగా వాతావరణంలోకి విడుస్తున్న దేశం అమెరికానే. గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించి వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ఉద్దేశ్యించిన క్యోటో ప్రొటొకాల్ ను అమలుచెయ్యడానికి నిరాకరించిన దేశం అమెరికానే అనే విషయం మీకు తెలియదా? నిజం ఇలా ఉంటే చైనాపై విరుచుకుపడితే ఏమిటి ప్రయోజనం?

    ఏ అభివృద్ధి అయినా ఆర్ధిక అసమానతలను పెంచేదిగా ఉండొద్దు. ఇక చైనా చేస్తున్నది కాబట్టి మనం చెయ్యాలనే రూల్ ఏమీ లేదు. మన దేశం ఏ దేశాన్నీ అనుకరించకుండా తన స్వంత అభివృద్ధి పంథాను ఎంచుకోగల సామర్ధ్యం ఉన్న దేశం. కమ్యూనిస్టులు ఏమంటున్నారన్నది నాకు సంబంధం లేని విషయం. వారు చేసిన/చేస్తున్న పనుల్లో తప్పొప్పుల గురించి చర్చించే వేదిక ఇది కాదు.

    ఇక భారత వ్యవసాయ రంగం కుదేలవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి ప్రపంచీకరణ వల్ల జరిగిన పరిణామాలు. సబ్సిడీలొక్క దాని వల్లనే వ్యవసాయ రంగం బాగుపడడమో నాశనం కావడమో జరగదు.

  7. 7 కిరణ్ 11:46 am వద్ద ఏప్రియల్ 16, 2008

    చైనా వస్తువులను అమెరికా కొనడం ఆపేస్తే ఒక అభివృద్ధి చెందుతున్న దేశానికి ద్రోహం చేసినట్టు అవుతుంది. మార్కెట్ అవకాశం కల్పించడం అనేది ధనిక దేశాలు పేద దేశాలకి కల్పించగలిగే అతిపెద్ద వరం. పేదదేశాలు అభివృద్ధి చెందడానికి ఇదొకటే మార్గం. చైనాలో కాలుష్య నియంత్రణకి చర్యలు తీసుకోమని చెప్పే హక్కు, బాధ్యత ప్రపంచంలోని ప్రజలందరి మీదా ఉంది. ఎందుకంటే మనది ఒకటే భూగోళం కాబట్టి.

    అందుకని సాధ్యమైనంతగా చైనాకి నచ్చజెప్పి వారి కాలుష్యాన్ని తగ్గిస్తూ, అదేవిధంగా వారి దేశం ఎదుగుదలకి సహాయం కల్పిస్తూ ముందుకెళ్ళాలి అని పాశ్చాత్య మేధావుల నమ్మకం. ఇదే సూత్రం ఇండియాకి కూడా వర్తిస్తుంది.

    కరడుగట్టిన రిపబ్లికన్ల పాలన పోయిన తరువాత అమెరికా వచ్చే సంవత్సరం కాలుష్య నియంత్రణ ఒప్పందాలపై సంతకాలు చేయబోతోంది. ఆస్ట్రేలియా ఇప్పటికే చేసింది.

    వ్యవసాయం కుదేలవ్వడానికి కారణాలంటూ ప్రపంచీకరణ, గ్లోబల్ వార్మింగు అని అంతా బయటకి తోసేసి, మన పాలసీలని మనం ప్రశ్నించుకోవటం లేదు. ఒక నిజాయితీ కలిగిన రాజనీతిజ్ఞుడు ఎదురుకాబోయే ఆటంకాలన్నింటినీ ఊహించి, వాటిని తట్టుకునేందుకు సరైన పాలిసీలని నిర్మిస్తాడు. ఉన్న డబ్బులని సాధ్యమైనంత సమర్థవంతంగా వాడడం అనేది అతి ముఖ్యం.

    రాబోయే కాలంలో నేలకి నీరు ఉండదు. పెట్రోలు ధరలు పెరుగుతాయే తప్ప తగ్గవు. సబ్సిడీలు వీటినేమన్నా అరికట్టగలవా ? మరి కానప్పుడు, ఎందుకు ఇంత డబ్బుని ఇలాగ వృధా చేస్తున్నాం ? ప్రపంచీకరణ ఆగిపోయినంత మాత్రాన ఈ ఇబ్బందులు తప్పకపోవు. నిజాలు ఇలా ఉంటే, వీటిని పక్కనపెట్టి తప్పంతా ప్రపంచీకరణ అంటూ తోసేసి ప్రజలని ఎంతకాలం నట్టేటస్నాహ్నం చేయిద్దాం ?

    ఏ దేశమన్నా ఆర్థిక అసమానతలు లేకుండా అభివృద్ధి సాధించిందా ? చరిత్ర మొత్తం తిరగేసి చూడండి. ఒక్క ఉదాహరణ కనిపించదు.

    పారిశ్రామీకరణ వల్ల యంత్రాలు వచ్చి ఉద్యోగాలు లాక్కెళ్ళిపోతాయి. ప్రజలు చాలామంది వీధిన పడతారు. వీరు తిరిగి ఆర్థిక స్రవంతిలోకి రావడానికి సమయం పడుతుంది. విద్య కావాలి. అసమానతలు లేకుండా అభివృద్ధి అనేది ఒక కమ్మటి పగటికల. నిజ జీవితంలో ఈ అసమానతలు తప్పవు. ఈ ఆటుపోట్లను సాధ్యమైనంతగా తట్టుకోవాలి. అభివృద్ధిని సాధించాలి. ఒకసారి అభివృద్ధి చెందిన తరువాత సమానత కోసం ప్రయత్నించవచ్చు. స్వీడను, నార్వే, ఫిన్లండు వంటి దేశాల మళ్ళే.

  8. 8 Dil 6:33 am వద్ద ఏప్రియల్ 30, 2008

    కిరణ్, జవాబులివ్వడం కాస్త ఆలస్యమయ్యింది.

    నేను ఇదివరకు కూడా చెప్పినట్టు ఈ “అభివృద్ధి” అన్న పదం నిర్వచనంతోనే ఉంది పేచీ అంతా. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి “ఎవరి అభివృద్ధి” అనే ప్రశ్న వేసుకోగలిగితేనే దీనికి సమాధానం వస్తుంది.

    1) “మార్కెట్ అవకాశం కల్పించడం అనేది ధనిక దేశాలు పేద దేశాలకి కల్పించగలిగే అతిపెద్ద వరం.”

    ప్రపంచ చరిత్ర ఒక సారి యధాలాపంగా తిరగేసినా ఈ సోకాల్డ్ ధనిక దేశాలు ఇతర దేశాల వనరులను దోచుకుని ధనిక దేశాలయ్యాయని ఇట్టే అర్థం అవుతుంది ఎవరికైనా. అవి పేద దేశాలకు శాపాలేగానీ వరాలివ్వవు ఎప్పటికీ.

    2) “ఏ దేశమన్నా ఆర్థిక అసమానతలు లేకుండా అభివృద్ధి సాధించిందా ? చరిత్ర మొత్తం తిరగేసి చూడండి. ఒక్క ఉదాహరణ కనిపించదు.”

    ఆర్ధిక అసమానతలు లేకుండా అభివృద్ధి సాధించాలని, అసమానతలు రాత్రికి రాత్రే తొలగిపోవాలని ఎవరూ అనలేదిక్కడ. అభివృద్ధి అనేది ఆ అసమానతలు తగ్గించేదిగా ఉండాలిగానీ పెంచేదిగా ఉండొద్దన్నదే మాబోటి వారు కోరుకునేది. ప్రపంచీకరణ ఆ అసమానతలను విపరీతంగా పెంచేస్తున్నది కాబట్టే దానిపైన వ్యతిరేకత.

    3) “వ్యవసాయం కుదేలవ్వడానికి కారణాలంటూ ప్రపంచీకరణ, గ్లోబల్ వార్మింగు అని అంతా బయటకి తోసేసి, మన పాలసీలని మనం ప్రశ్నించుకోవటం లేదు.”

    ప్రశ్నిస్తున్నది మన పాలసీలనే. కానీ మన పాలసీలు ఏడేడు సముద్రాల ఆవల నిర్ణయమవుతున్నాయనే సంగతి మీకు తెలుసో లేదో. ఒకసారి ప్రపంచ బ్యాంకు విధాన పత్రాలను తిరగెయ్యండి. అందులోనుంచే అక్షరమక్షరం ఊడిపడుతున్న మన ప్రభుత్వ విధానాలను పోల్చి చూడండి.

    సబ్సిడీలు ఎవరికి అందాలో వారికే అందితే అవి భారం ఏ మాత్రం కాబోవు. ఎరువుల సబ్సిడి పేరిట, విత్తనాల సబ్సిడీ పేరిట కంపెనీలకు వందల కోట్లు దోచిపెడుతూ వ్యవసాయంపైన, రైతులపైన, పేదలపైన పడితే ఎలా?

ప్రత్యుత్తరమిమ్ము




తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపల్లి, తొండంగి మండలల్లో ONGC నెలకొల్పనున్న SEZ పై స్థానిక ప్రజలు తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్నారు. పేద రైతుకు బుక్కెడు బువ్వ పెట్టే పచ్చని పంటపొలాలను ఇలా విదేశీయుల బాగు కొరకు SEZలు గా మారుస్తున్న ఈ నేతల భరతం పట్టాల్సిన సమయం వచ్చింది.

 

ఏప్రియల్ 2008
M మం బు గు శు
« Mar   మే »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

గణాంకాలు

  • 20,469 సందర్శకులు