ముఖ్య గమనిక: ఈ పోస్టులో కేవలం వ్యక్తిగత విషయాలే ఉన్నాయి.
కొన్నాళ్ల క్రితం ఇంట్లో బియ్యం అయిపోయాయి. వెంటనే ఊర్లో ఉండే నాన్నకి ఫోన్ చేశాను బియ్యం పంపించమని. “ఇక్కడ కూడా అయిపోయాయి. షాపుకు పోయి కొనుక్కో” మని అట్నుంచి జవాబు.
మనస్సు కలుక్కుమంది అది విని.
ఎక్కడ్నుంచి ఎక్కడికొచ్చాం మనం!
గత 20 యేళ్లుగా ఇలా ఒక్కో సరుకూ పండించడం అనే దశ నుండి ‘కొనుక్కోవడం’ అనే దశకి మా కుటుంబం సాధించిన “అభివృద్ధి” ఒకసారి నెమరు వేసుకుంటే…
నల్గొండ జిల్లాలో మోత్కూరు మండలం, ఆరెగూడెం అనే చిన్న గ్రామానికి చెందినవాన్ని నేను. మూడు స్వంత బావులూ, ఒక బావి లో 1/3 పొత్తుతో కలిపి దాదాపు 50 ఎకరాల సేద్యయోగ్యమైన భూమి ఉండేది నాకు జ్ఞాపకం ఉండే నాటికి.
ఈ 50 ఎకరాల్లో మా తాత, నాన్న ఇద్దరూ కలిసి (అయిదారుగురు జీతగాళ్ల రెక్కల కష్టం సాయంతో) చాలా పంటలే పండించేవారు. నీటి సౌకర్యం ఉన్న తరి పొలాల్లో వరి పండేది. మా కుటుంబంలో దాదాపు అందరికీ, (నేనూ, మా అక్కలూ, చెల్లెలూ) మా పొలాల్లో పండిన బియ్యమే నిన్న మొన్నటి వరకూ సరిపోయేవి. మొదట్లో మేము తినడమే కాక మార్కెట్ కు పంపేవారం. గత 5-6 యేళ్లుగా మా వరకే సరిపోతూ వచ్చాయా ధాన్యం.
ఇక ఆరు తడి పొలాల్లో మిర్చి, ఇంకా టొమాటొ, వంకాయ, గోకర కాయ (గోరు చిక్కుడు), వంటి కూరగాయలు, కొత్తిమీర, పాలకూర, గోంగూర వంటి ఆకు కూరలూ పండేవి. చెలకల్లో చేను మధ్యలో కాసే దోసకాయలూ బాగానే ఉండేవి.
సెలవల్లో ఆరెగూడెం వెళ్తే ఈ కూరగాయలను తరాజులో జోకి ఎడ్ల బండిలో పోసి మోత్కూర్ లోని చిల్లర వ్యాపారులకు పంపుతూ క్షణం తీరిక లేకుండా నాయనమ్మ కనపడేది. తోట బావి దగ్గర ఉన్న పెద్ద కరివేపాకు చెట్టు నుంచి మాకు సరిపోయినంత కరివేపాకు వచ్చేది. సీజనులో దోసకాయల వంటి కూరగాయలు కోసి ఎండబెట్టి ఒరుగు చేసుకుని పచ్చి కూరగాయలు లేనప్పుడు తినేవాళ్లం.
వర్షాధార చెల్కా నేలల్లో కందులు, ఆముదాలు, పెసర్లు, ఉలవలు, బొబ్బర్లు, పొద్దు తిరుగుడు, వేరు శెనగ, జొన్న, మొక్కజొన్న పండించేవారు.
ఇంట్లోకి సరిపడా పప్పు ధాన్యాలను మిల్లుకు పంపి పప్పు పట్టించి వాడుకునే వాళ్లం. వేరుశనగ, పొద్దు తిరుగుడు నూనె తీయించి వాడుకునే వాళ్లం. నూనె తీయిస్తే వచ్చే చెక్క ఆవులకు, బర్రెలకు మేతగా పనికివచ్చేది.
ఇక బావి పక్కన 6 ఎకరాల స్థలంలో బత్తాయి, మామిడి తోట ఉండేది. తోటలోనే ఒక దబ్బకాయ, మూడు ఉసిరి, 2 నిమ్మ చెట్లు ఉండేవి. ఆపుడప్పుడూ పులిహోరకూ, ఏడాదికోసారి పచ్చడికీ ఉపయోగపడేవీ చెట్ల ఫలాలు.
సంవత్సరానికి మూడు కాతలు (అంగం, గైరంగం, ఎడకారు) కాసేది మా బత్తాయి తోట. ఇక మామిడిలోనయితే తోతాపురి, బంగినపల్లి, రసాలు…ఇవే కాక సంవత్సరం లో రెండుసార్లు కాసే పునాస రకమూ ఉండేది.
ఇక బావి చుట్టు దాదాపు అరడజను చింత చెట్ల నుండి చింతపండు వచ్చేది. ఎండాకాలంలో ఆ చింతపండును కొట్టి గింజలను తీయడం ఇప్పటికీ జ్ఞాపకమే.
చాలా ఏళ్లు పసుపు కూడా పండించారు నాన్న వాళ్ళు. అడపాదడపా ఉల్లిగడ్డ కూడా పండేది. ఒక ఏడాది మా నాన్న అరటి తోట వేశాడు కానీ అప్పటికి (80ల్లో) మార్కెట్ సౌకర్యాలు లేక అది కొనసాగించలేదు.
మా తాత ఉన్నన్ని రోజులూ గొర్రెల మంద ఉండేది. కొన్ని మేకలూ ఉండేవి. తాత మేక పాలు తాగేవాడు కానీ నాకవి అంతగా రుచించలేదు. పండగొచ్చిందంటే ఒక మేకనో, గొర్రెనో కోసేవారు. తాజా పొట్టేలు మాంసంతో చేసిన రకరకాల వంటకాలు నోరూరించేలా తయారయ్యేవి.
ఇక కోళ్ల సంగతి చెప్పనక్కర లేదు. ఎప్పుడు వంద కోళ్లకు తగ్గకుండా ఉండేవి మా బావి దగ్గర. వాటికి రోగాలు రాకుండా మా నాయనమ్మ అనేక చిట్కా వైద్యాలు చేసేది. చీమ కోళ్లు (తెలుసా ఎలా ఉంటాయో ఇవి? నల్లని శరీరంపై చిన్న తెల్ల చుక్కలుంటాయి) కూడా చాలా ఏళ్లు పెంచాము. అవి రాత్రి పూట చెట్ల పైన గడిపేవి. గుడ్లు ఏ రక్కిస పొదల్లోనో పెట్టేవి. మా ఇంటి పని మనిషితో కలిసి ఆ రక్కిస పొదల వెంట చీమ కోడిగుడ్ల కోసం చేసిన అన్వేషణ ఇంకో మధుర జ్ఞాపకం. ఈ కోళ్లుంటే పాములు దగ్గరికి రావని నమ్మకం.
మా పట్టా భూముల్లోనే రెండు కుంటలు (చిన్న చెరువులు) ఉండేవి. ప్రతీ యేడూ వర్షాకాలం నీటితో నిండిన ఈ కుంటల్లోనూ, మా వ్యవసాయ బావుల్లోనూ చేపపిల్లలు వేసేవాడు మా నాన్న. ఎండాకాలం వచ్చేనాటికి అవి మంచి సైజుకి ఎదిగేవి. నేనూ నాన్నా కలిసి గాలం పుచ్చుకుని బావి గట్ల మీదా, కుంట కట్ట మీదా గడిపిన రోజులు ఎన్నటికి తిరిగిరాని మధుర జ్ఞాపకం.
ఇంట్లో ఎప్పుడూ కనీసం రెండో మూడో పాలిచ్చే బర్రెలు ఉండేవి. నిన్నమొన్నటి దాకా పాలకు గానీ పాల ఉత్పత్తులకు గానీ కొదవుండేది కాదు..
అప్పట్లో మోత్కూర్ లోని కిరాణా షాపుకు వెళ్లి మేము కోనే సరుకులు- సబ్బులూ, మసాలా దినుసులు.
మరి ఇప్పుడో?
అటు ప్రకృతీ, ఇటు ప్రభుత్వమూ కలిసి వ్యవసాయం పైన ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ధాటికి అందరి వ్యవసాయాల్లాగే మా వ్యవసాయమూ కుదేలైంది. నీరు పాతాళం లోకి పోయి బావుల్లో తుప్పలు మొలిచే పరిస్థితి ఏర్పడింది. రెండేళ్ల వరుస కరువుకు పదేళ్లు అల్లారు ముద్దుగా పెంచిన తోట నిలువునా ఎండిపోయింది. వరి పంట గగనమైంది. అటు మార్కెట్, ఇటు వర్షం రెండు పక్కలా దగా చేయడంతో చెల్క పంటలు అటకెక్కాయి. పాడీ, పంటా రెండూ దశలవారీగా కనుమరుగయ్యాయి.
మెల్లగా ఒకో వస్తువూ కొనుక్కోవడం మొదలు పెట్టిన మా కుటుంబం ఇప్పుడు చివరికి బియ్యం కూడా కొనుక్కునే స్థాయికి “అభివృద్ధి” సాధించింది.





do you mind if i print this in our monthly magazine under”gnaapakaalu”
reply me by mail beyondindia.telugu@gmail.com
చాలా మంచి జ్ఞాపకాలు. మా ఊళ్ళ వైపుకి లాక్కెళ్ళిపోయారు. మా వరకు మా తాత గారి ఊరి నుంచొచ్చే ధాన్యం ఓ పదిహేనేళ్ళ క్రితం వరకు తెచ్చుకొని వండుకుతిన్న జ్ఞాపకం.
వ్యవసాయం మూలబడటము అన్నది మాత్రము చాలా బాధాకరమయిన విషయము. బాబుని వ్యవసాయం పేరుతో తిట్టి పైకొచ్చిన వైయెస్సు ఏమన్నా వ్యవసాయాన్ని ఉద్ధరించాడా లేదా అన్నది మీలాంటి వాళ్ళే చెప్పాలి.
మీరు బియ్యం మాత్రమే కొనుక్కునేంత “అభివృద్ధి” సాదించారు - మేం నీళ్ళు కూడా కొనుక్కొనే అంత ‘వృద్ధుల’మైపోయాం!! ఇప్పుడు మనకున్న లైవ్ స్టాకంతా స్టాకు మార్కెట్టే. ఒకప్పుడు, జనాభాలో అధికశాతం స్వయం ఉపాధి మీద ఆధారపడేవారు, ఇప్పుడా దార్లన్నీ సుమారుగా మూసుకుపోయినట్టే. బ్లేమిటాన్ కీన్స్!!
ప్రపంచమంతటా,వ్యవసాయం పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది - మనదేశంలో మరీనూ. ఒక సర్వే ప్రకారం, దక్షిణాదిన, 50% వ్యవసాయ భూములన్నీటిలో salination ఎక్కువైపోయిన కారణంగా, అవి ఇక ఎన్నటికీ వ్యవసాయానికి అనుకూలం కావట. ఇప్పటిదాకా పచ్చగా ఉన్న బ్రెజిల్ లాటి దేశాల్లో, ఇథనాల్ ఫార్మింగే ఎక్కువ చేస్తారట, రానున్న కాలంలో మరి తిండిగింజలు ఎక్కడ నుండీ వస్తాయో
ఏ రైతూ తన పిల్లలని వ్యవసాయంలోకి దించడానికి ఒప్పుకోకపోవడానికి ఇవే కారణాలేమో.
1980ల దాక మా పొలంలోని బియ్యన్నే “మిల్లాడించకుండా” తెప్ప్పించుకునే వాళ్ళం. బందర్ కలక్టరాఫీసు నుండి పెర్మిట్ లు అవసరం ఉండేది.
ఎస్.ఆర్.ఎమ్.టి, టీ.వి.ఎస్ లాంటి వాళ్ళూ పర్మిట్ లేకుండా పార్సిలు బూక్ చేసుకునేవారు కాదు.
ఆ అక్కుళ్ల్లు , ఇంకా ఏవో పేర్లుండేవి. రంగు బియ్యం. తెల్ల బియ్యం కాదు. ఐనా ఎంత రుచిగా ఉండేవో! అని నోరురేటట్టు చెప్పుకునేవారు ఇంట్లో.
ఆ ఊళ్ళు మొన్నామధ్య విజిట్‌లో తిరుగుతు ఉంటే, కూలి నాలి చేసుకుని బ్రదికేవాళ్ళు కూడా, ఆ చేపల చేరువుల పుణ్యమా అంటూ, “మినరల్ వాటర్” కొనుక్కుని, బియ్యం కూడా కొనుక్కుని, కూరలు కొనుక్కుని, పాలు కొనుక్కుని జీవనాన్ని సాగిస్తున్నారు.
ఎంత దౌర్భాగ్యం మనది?!
అనానిమస్ గారు,
ఈ పోస్టును నిరభ్యంతరంగా మీ పత్రికలో ప్రచురించుకోండి. మీ పేరు, పత్రిక పేరు చెబితే బాగుండేది…
దిలీప్
మాది కూడా అదే రూట్లో వున్న కాటేపల్లి గ్రామం. మా వూరు ముత్తిరెడ్డిగూడెం కంటె ముందట ఉంది.
దాదాపు స్వయంసమృద్ధ స్థాయి నుండి అన్నీ కొనుక్కోడం దాకా రావడం విషాదం!
మా ఊర్లో ఇన్నిపంటలు ఏనాడూ పండించలేదు. వరి, మినుము - అక్కడక్కడా వేరుశనగా - తప్ప మరోటి వేసిన సంగతి నాకు తెలీదు. ఇదివరకు జీలగ వేసి తొక్కించేసేవాళ్ళు, ఇప్పుడలా చేస్తున్నట్టు లేరు. చాలా అరుదుగా.. ఎవరో ఒకరిద్దరు కూరగాయలు వేసేవారు - అంతే! పాడి మాత్రం ఉండేది, ఉంది కూడా! ఇప్పుడు అదీ తగ్గించేస్తున్నారు.
ఆ చీమకోళ్ళనే కాబోలు.. మేం గిన్నికోళ్ళు అనే వాళ్ళం.
మీ మధురానుభూతులు వినడం అంతా బానేవుంది, కానీ, కొన్ని తీక్షణమైన ప్రశ్నలు సంధించక తప్పదు.
1) మీ తాత గారి కుటుంబం, వారి పిల్లలు ఎంతమంది ? జనాభా పెరగకుండా సమానంగా ఉండాలంటే 2 మించి పిల్లలు ఉండకూడదు. ఈ తాతలనాటి తరంలో ప్రతీ కుటుంబానికి 7 మంది (కొన్ని సందర్భాల్లో 15 మంది) పిల్లలు కన్నారు. ఇంతమందిని ఆ భూమి పోషించగలదా ?
2) మీరు అదృష్ఠవంతులు. భూమి కల కుటుంబంలో పుట్టారు. ఇంతటి భూమి సమాజంలొ 5% మందికి మించి ఎవ్వరికీ లేడు. మిగిలిన జనాల్లో ఎందరో, ఆ తాతలనాటి తరంలో, మింగడానికి మెతుకులేక ఆకలిచావులు చచ్చారు.
3) ఆధునిక జీవితానికి సామాన్య అవసరాలుగా మనం భావించే టీవీలు, కరెంటు బల్బులు, ఫానులు, ఫోనులు ఇవన్నీ తయారు కావాలంటే ఆ భూమి ఒక్కటే సరిపోదు. ఖనిజాలు కావాలి, చమురు కావాలి. మనదేశంలో ఇవేమీ దండిగా లేవు.
ప్రభుత్వాన్ని (ఆర్థిక విధానాలను) నిందించే ముందు సమగ్రమైన సమకాలీన అవగాహన చాలా అవసరం. వ్యవసాయానికి అన్యాయమెవ్వరూ చెయ్యట్లేదు. కాని భవిష్యత్తులో మనమందరం వ్యవసాయాన్ని పట్టుకుని బతకలేము. ఒక్క భూమి ఒక్కటే అంతమందిని భరించలేదు. బుర్ర ఉపయోగించాలి (సేవా రంగాలు). ఫ్యాక్టరీలు నిర్మించాలి.
కిరణ్ గారు,
నా అభిప్రాయాలు ఇలా ఉన్నాయి
1) జనాభా పెరుగుదలను అరికట్టాలనేది మంచి ఆలోచన.
2) అందరికీ సరిపోయినంత భూమి ఉందనేది ఒక చేదు నిజం. దానిని కొందరే చెరబట్టారనేదీ నిజం. ఇక ప్రజలంతా వ్యవసాయం చేసి బ్రతకాలని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. తాతల కాలం నాడు కూడా గ్రామం లో కొందరే వ్యవసాయం చేసేవారు. మిగతా వారు వేరే పనులు చేసేవారు.
3) మనదేశం లక్షల కోట్ల రూపాయల విలువైన సహజ వనరులకు నిలయం. వాటిని ప్రైవేటు బహుళజాతి కంపెనీల చేతిలో పెట్టి మనం అప్పులు తెచ్చుకుని బ్రతుకుతున్నాం.
వ్యవసాయ రంగం గురించి, దానికి జరుగుతున్న అన్యాయం గురించి మీరు ఇంకొంత లోతైన పరిశీలన జరపాలి…
ఇప్పుడు జరుగుతున్న “అభివృద్ధి” తక్కువని, మనం ఇంకా అభివృధ్ధి పథం వైపు పోవాలని అభివృధ్ధి చెందిన దేశాలను చూసి వాతలు పెట్టుకుంటున్నం (దీనితోటి లాభాలు నష్టాలు రెండు ఉన్నయి, వివరాలల్లకు ఇప్పుడు వద్దు). అయితె అందరం సేవా, ఉత్పాదక రంగాలల్లకు పొయ్యి అభివృధ్ది రెట్టించినంక, ఏ గడ్డి తిని బతకాలె?
భూమి ఎంత ఉంది, ఎక్కువా తక్కువా అన్నది కాదు సమస్య. భూమి రోజు రోజుకీ ఎందుకింత వ్యవసాయ రహితంగా మారిపోతుందనేదే సమస్య అంతా. ముఖ్య కారణం నీరు లేక పోవడమే. నీరు రోజు రోజుకీ లోలోనికి ఇంకి పోతుంది. ఇలా అయితే మరికొంత కాలానికి ఈ ప్రాంతమంతా ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది. ప్రాజెక్టులు నిర్మించడం తక్షణావసరం. ప్రాజెక్టులంటే నాదృష్టిలో నిఖార్సైన ప్రాజెక్టులు. నిజాయితీ ప్రాజెక్టులు. మీ కాలంలో భూమి సశ్యశ్యామలంగా ఉండటానికి ముఖ్య కారణం భూగర్భ జలం తక్కువ లోతులో ఉండటం. దానికి కారణం అడవులు ఎక్కువగా ఉండటం. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ వ్యవసాయన్ని, వాణిజ్యాన్నీ జోడుగుర్రాల్లా అభివృద్ధి చేయగల నేర్పరులైన రాజకీయ వేత్తలను ఇప్పట్లో ఊహించగలమా? నిస్వార్థ చిత్తులైన యువతరం రాజకీయాల్లోకి ప్రవేశించేంత వరకూ ఈ పరిస్థితి తప్పదేమో.
http://www.andhrajyothy.com/navshow.asp?qry=/2008/feb/28navya1
Dilip garu
please visit http://www.beyondindia-telugu.blogspot.com
we published your article in March Edition.
బాబు గారు,
నా బ్లాగ్ పోస్టును మీ “తెలుగు వెలుగు” పత్రికలో ప్రచురించినందుకు కృతజ్ఞతలు.
భవదీయుడు,
దిలీప్
I read it in Andhrajyothi I suppose. A good post.