రాజకీయమా వీరాభిమానమా?

అసలే సినిమావాళ్లు ఆపై రాజకీయాలు, ఇక పరిస్థితులు మరోలా ఎందుకు ఉంటాయి?

మన “ఫ్యాన్స్” సినిమా విడుదల రోజు చేసే పాలాభిషేకాలూ, కట్టే కటౌట్లు, బ్యానర్లు  చూస్తే అసలు వీళ్లు తమకొరకు, తమవాళ్ల కొరకు ఎప్పుడైనా ఇంత కష్టపడ్డారా అనిపించక మానదు. సరే సరిగా చదువుకోని వాళ్లే ఇలా చేస్తారనుకోవడానికీ లేదు. అమెరికాలో ఉన్న మన వారు ఇంటర్నెట్ సినిమా చర్చా వేదికల్లో కొట్టుకు చచ్చేతీరు, వాడే భాష చూసి మనకు ఈ మొత్తం సినిమాల పైనే విరక్తి కలగడం ఖాయం. దీనికి తోడు చిరంజీవి, బాలకృష్ణల ఫ్యాన్స్ మధ్య వైరం వెర్రితలలు వేసి కుల రంగు పులుముకుని నానా చండాలంగా తయారైంది. ఇప్పుడు చిరంజీవి రాజకీయరంగ ప్రవేశం దాదాపుగా ఖరారు అవడంతో పరిష్తితి ఇంకా ఉద్రిక్తంగా తయారైంది.

నిన్న రాజశేఖర్ పై జరిగిన దుర్మార్గమైన దాడి కొంతమంది దుండగులకు రోజురోజుకీ చట్టం పై, పోలీసు వ్యవస్థపై ఎంత చిన్న చూపో చెబుతోంది (లేక అవసరమైతే వాటిని కొనేయవచ్చు అనే ధీమానో). నగరం నడిబొడ్డున ఒక ప్రముఖ నటుడిపై, పోలీస్ స్టేషన్ ఎదురుగా దాడి జరిగిందంటే ఇక సామాన్యుడి భద్రత ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు

ఇక నిన్నదాడి జరిగిన తీరు కొంచెం అనుమానాస్పదంగానే ఉంది. రాజశేఖర్ పై దాడి చేసిన మూకకు నాయకత్వం వహించిన బచ్చు రాజా అనేవాడు ఒక పెద్ద రౌడీ షీటర్ అనీ, అతను వడ్డేపల్లి నర్సింగరావు, దానం నాగేందర్ అనే ఇద్దరు కాంగ్రెస్ నాయకులకు అనుచరుడనీ తెలిస్తే ఇందులో ఏదో మతలబు ఉందని అనిపించక మానదు. నిన్న రాజశేఖర్ వెనుక నిలబడి దొంగ చూపులు చూస్తున్న దానం నాగేందర్ ను చూస్తే ఈ అనుమానాలు ఇంకా బలపడటం ఖాయం. ఇక దాడి చేసినవారు ఆ సంఘటనను వీడియో తీసి మరీ టీవీ చానెళ్లకు పంపించారంటే వారు నిస్సందేహంగా బరితెగించిన వారైనా అయి ఉండాలి లేక ఇది చిరంజీవికి చెడ్డ పేరు తెచ్చేందుకు జరిగిన ఉద్దేశ్యపూర్వక కుట్రైనా అయి ఉండాలి.
 
ఒక వైపు జరిగిన దుర్ఘటనకు బాధపడి ఇక వివాదానికి పుల్ స్టాప్ పెడదామని చిరంజీవి అనుకుంటుంటే, మోహన్ బాబు లాంటి మనుషులు ఆ సంఘటనను కూడా స్వంత కక్షలు తీర్చుకోవడానికి ఒక వేదికలా ఉపయోగించుకోవడం జుగుప్స కలిగించింది.  సందట్లో సడేమియాలా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎవరి విధేయతలు, అసలు రంగులు వాళ్లు చాటుకున్నారు

ఏదేమైనా ఇది భవిష్యత్ పరిణామాలకు ఒక సూచిక లాగుంది. హీరోల అభిమానులు ఇటీవల విపరీత చర్యలకు ఒడిగడుతున్నారు. ఇప్పుడు వారి అభిమాన హీరోలు రాజకీయనాయకులైతే పరిస్థితి ఇంకా దిగజారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రత్యర్ధులను దెబ్బతీయడానికి జరిగే ఈ ఎత్తుల పైఎత్తుల క్షుద్రక్రీడలో ఎన్ని అమాయక జీవితాలు బలికానున్నాయోనని భయం కలుగుతున్నది.

రాజకీయం అనే రొచ్చుగుంటలోకి ఏ ఉద్దేశ్యాలతో దిగినా తనకూ ఆ మకిలి అంటక మానదు అని చిరంజీవికి అర్థం అవుతుందా? తనకన్న ముందు రాజకీయాల్లోకి వచ్చిన NTRకి చివరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయో చిరంజీవికి తెలుసు కదా? స్వయంకృషితో ఎంతో ఎత్తుకు ఎదిగిన ఈ అందరివాడు ఇలా రాజకీయాల్లోకి వచ్చి కొందరివాడు అవబోతున్నాడా?

12 స్పందనలు నుండి “రాజకీయమా వీరాభిమానమా?” కు


  1. 1 తెలుగు'వాడి'ని 7:34 పూర్వాహ్నం వద్ద జనవరి 29, 2008

    ఇప్పటిదాకా మీరు వ్రాసిన అన్ని టపాలు ఎంతో విశ్లేషణాత్మకంగా, పూర్తి వివరా(సత్యా)లతో ఉండటంతో మరియు మీ బ్లాగు మీద, మీరు వ్యక్తపరచే అభిప్రాయాల మీద ఒక విధమైన నమ్మకంతో, ఇష్టంతో ఈ టపా చదవటానికి వచ్చిన నాకు అత్యంత నిరాశాపూరితంగా అనిపించటమే కాదు … మరియు ఏదో విరగదీశామన్నట్టుగా ప్రపంచంలో వారు తప్ప ఇలాంటి పరిశోధనలు చేసి వా..స్త…వా…లు కనిపెట్టలేరు అన్నట్టుగా వార్తలు ప్రచురించే ఆ తెలుగు దినపత్రికల లాగా లేక వాటి ఆధారంగా మీరు ఇలా బ్లాగటం నిజంగా శోచనీయం …

    బచ్చు రాజా లేక ఎవరైనా కానివ్వండి … తను కాంగ్రెస్ లేక తెలుగుదేశం లేక మరేదన్నా పార్టీలో సభ్యుడై ఉండొచ్చు….ఆ సభ్యులతో అనుబంధముండొచ్చు … అనుచరుడై ఉండొచ్చు……పార్టీ మీద అభిమానం చూపించేది ఏదో ఆ ఎలక్షన్ మూడు నాలుగు నెలల సమయంలోనే … అలాగే ఆ అభిమానం చూపేది ఏదో సభలు, సమావేశాలు, గర్జనలు జరిగేటప్పుడే … కానీ ఈ ఫాన్స్ లేదా హీరోల మీద అ(దుర)భిమానం అనేది అనునిత్యం ఉండేది (మన హీరో సినిమా షూటింగ్ స్టార్ట్ అయినా, సినిమా విడుదల అయినా, పక్క హీరో సినిమా హిట్/ఫట్ అయినా, కటౌట్ పెద్దది/చిన్నది అయినా మొ:నవి)…ఇంకొకటి ఏమిటంటే ఈ అభి(!?)మానులు అనేవారికి వారి పార్టీని అంటే ఎక్కువ పొడుచుకొస్తుందా లేక హీరోనా అంటే….సమాధానానికి నాకైతే ఎలాంటి సందేహం లేదు….ఖచ్చితంగా హీరోనే….చివరగా, ఇప్పటి వరకు చిరంజీవి అభిమానులు ఏ పార్టీకి చెందనివారు(సపోర్ట్ చేయని వారు) అయి ఉంటారు అని మీ (మరియు ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక వారి) అభిప్రాయమా….లేకపోతే ఏమిటండీ ఈ రాతలు….లేని పోని చెత్త అనుమానాలు….వీటిని అడ్డం పెట్టుకోని అసలు దాడిచేయటం అనే విషయాన్ని పక్కత్రోవ పట్టించటం కాకపోతే …. ఎవరు చేసి ఉంటారు అన్నది ఒక్క నిముషం పక్కన పెడితే , చిరంజీవి(రేపు బాలకృష్ణ మొ:లగు) లాంటి హీరో రాజకీయాలలోకి వస్తాడేమో అనే భావనలో ఉన్నప్పుడు ఎవరైనా ఎలాంటి వ్యాఖ్య చేసినా, ఈ అభిమానులు అనే వారు దాడిచేస్తారా అనే ఒక పోల్ నిర్వహిస్తే, నా అభిప్రాయం ప్రకారం 100% అవుననే వస్తుంది (మరీ ముఖ్యంగా చిరంజీవి అభిమానుల విషయంలో ..ఎందుకంటే చిన్న కూతురు ప్రేమ వివాహం చేసుకుంటే, భర్తను కూడా చంపేయటానికి హెచ్చరికలు ఇంకా ఏవైనా ఇవ్వటానికి వెనుకాడని చరిత్ర …. అసలు మొదలయ్యింది ఇక్కడే…) …

    ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో … రాజకీయాలలో ఒక కేశవరావు (ఇంట్లో జరిగింది హత్యా లేక ఆత్మహత్య), సినీ(పాక్షిక రాజకీయ)రంగం లో నాగబాబు (దాడి చేసింది రిజిష్టర్డ్ లేక నాన్-రిజిష్టర్డ్), పత్రికా రంగం లో ఆంధ్రజోతి(దాడి చేసినవారు ఏ పార్టీ, ఏయే సినిమాలు చూస్తారు, ఎవరితో ఫోటోలు దిగారు) అనే నిర్ధారణకు క్షణకాలం చాలు అని నిరూపించే చాకచక్యం ఉన్నవారు … కనుక ప్రస్తుతానికి మన తెలుగు బ్లాగ్లోకంలో అలాంటివారి అవసరం లేదేమో కదా ..

    చివరగా నేను చెప్పదలచుకున్నది ఒకటే …. కనీసం మన తెలుగు బ్లాగుల్లో అయినా ఈ పక్క వాడి/పార్టీ/హీరో వాళ్ల వైపు వేలు చూపించేలా ముఖ్యంగా సందేహస్థితిలో ఉన్న వాటి గురించి ఇంత సీరియస్ గా ప్రస్తావించకండి …. ముఖ్యంగా ఈ ‘గుండెచప్పుడు’ అనే బ్లాగులో ఎందుకంటే అది ఈ బ్లాగు యొక్క స్థాయిని బాగా తగ్గించివేస్తుంది….ఆలోచించి చూడండి.

  2. 2 Dil 8:23 పూర్వాహ్నం వద్ద జనవరి 29, 2008

    మిత్రమా,

    నాకు తెలుసు ఈ పోస్టు కొంత మంది మిత్రులను నిరుత్సాహపరిచే అవకాశం ఉందని. కానీ జరిగిన సంఘటన పట్ల నా అభిప్రాయం ఇది అని, అది మీ అభిప్రాయంతో కాస్త భిన్నంగా ఉండవచ్చని సహృదయంతో అర్థం చేసుకొమ్మని చెప్పడం మినహా ఇప్పుడు నేను చేయగలిగిందేమీ లేదు.

    దిలీప్

  3. 3 నవీన్ గార్ల 2:42 అపరాహ్నం వద్ద జనవరి 29, 2008

    మొత్తానికి జనాలకు TV9 అనబడు తెంగ్లీష్ ఛానల్ తెర మీద మల్టీస్టారర్ సినిమా చూసే అవకాశం వచ్చింది. పాపం రాజశేఖర్‌కు కనీసం పేరుకైనా ఒక్క అభిమాన సంఘం ఉంటే బాగుండేది…..చక్కగా తన ఇంటికి కాపలా కాసేవారు.

    ఐనా…..రెండు రోజులాగితే చల్లబడిపోయే ఇలాంటి వార్తలను పట్టించుకోవడం అనవసరం.

  4. 4 కిరణ్ 3:53 అపరాహ్నం వద్ద జనవరి 29, 2008

    తెలుగు”వాడి”ని గారు

    బ్లాగులలో వారి వారి అభిప్రాయాలు, థియరీలు చెప్పే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. మీకు ఈ థియరీ ఏదో నచ్చలేదు, సరైన నిర్ధారణ లేదు అన్నంతమాత్రాన, ఆయన అనుమానాలు వివరించే హక్కు దిలీప్ గారికి ఇవ్వకపోవడం భావ్యం కాదు. సినీ ఏక్టర్ల అభిమాన సంఘాలు పిచ్చి ముదిరిన సంగతి అందరికీ తెలుసు. కానీ, రాజకీయ రంగంలో రాటుదేలిన రాజశేఖరులకు, బాబులకు సినీ అభిమానులకంటే నాలుగంకెలు ఎక్కువే తెలుసు. ఇది ఒక రాజకీయ చదరంగం, చిరంజీవి లాంటి వ్యక్తి ప్రజల అభిమానం ఉంచుకుంటే సరిపోదు, చక్రం తిప్పగల సామర్థ్యం కూడా ఉండాలి. లేకపోతే, రాజకీయాల్లొకి దిగితే, ఆ మంటల్లో ఆయన కాలిపోవడం సహజం.

  5. 5 సుధాకర్ 4:35 అపరాహ్నం వద్ద జనవరి 29, 2008

    తెలుగువాడిని గారు,

    మీరు ఎందుకు బాధ పడుతున్నారో నాకర్ధం కావటం లేదండి. అసలు ఈ విషయం అంత సందేహ స్థితిలో ఏమీ లేదు. రక్తదానాలు చేస్తే రిజష్తర్డు ఫ్యాన్, రాళ్ళుచ్చుక్కొడితే అన్ రిజిష్టర్డు ఫ్యాన్ అనటం అసలు చిరంజీవి వర్గమే తమ ఫ్యాన్ల్స్ మీద సందేహంలో వున్నట్లు తెలుపుతుంది. నేను కూడా చిరంజీవి అభిమానినే. కానీ ఇప్పటి వరకు నేనొక అన్ రిజిష్టర్డ్ ఫ్యాన్ ని అని నాకే తెలీదు. అయితే ఎంత ఫ్యాన్ ని అయినా గుడ్డిగా చట్ట ధిక్కార చర్యలను నేను సమర్ధించను. ఇక ప్రజా సేవ అంటారా? పట్టు మని ముఫ్పయ్యేల్లు నిండని సాంకేతిక నిపుణులు తమకు తోచినంత ప్రజాసేవ గత పదేళ్ళనుంచి చేస్తునే వున్నారు. చిరంజీవి ఆ లెక్కన చాలా ఆలస్యంగా అది మొదలుపెట్టారు. ఆ కొద్ది మాత్రానికే పద్మవిభూషణనూ కొట్టేసారు. ఇదంతా మన పిచ్చాభిమానం వలనే. మొదటి పేరాలో చెప్పినట్లు, మనం మన కుటుంబ సభ్యులనయినా ఇంత అభిమానిస్తామా? అలా అభిమానిస్తే వాళ్ళు కళ్ళ నీళ్ల పర్యంతమవుతారేమో.

  6. 6 తెలుగు అభిమాని 5:06 అపరాహ్నం వద్ద జనవరి 29, 2008

    అభిమానులను మధ్యతరగతి కళ్ళతో చూసి అర్థంచేసుకోలేము. రాజశేఖర్ చిల్లర ప్రవర్తనకు చిరంజీవి హుందాగా వ్యవహరించాడు. రాజశేఖర్ దురుద్దేశంతోనే ఇంకా పార్టీనే పెట్టని చిరంజీవి గురించి అనవసర వ్యాఖ్యలు చేశాడు. అభిమానులు దాడి చేయటం అనేది ఒక spontaneous reaction. హృదయం తీవ్రంగా గాయపడినప్పుడు సంయమనం పాటించడానికి అభిమానులు గాంధీలు కారు. కుహనా మేధావులు arm chair experts మాస్ సైకాలజీనీ అర్థం చేసుకోలేరు. ఇలాగే గుజరాత్ అల్లర్లకు మూలకారణం గోధ్రా ఘటనవల్ల హిందువుల హృదయాలు తీవ్రంగా గాయపడటమే. అలాంటి సమయాల్లో సంయమనంగా ఉండటం సాధ్యం కాదు.

  7. 7 Chilakapati Srinivas 7:32 అపరాహ్నం వద్ద జనవరి 29, 2008

    చిరంజీవికి రాజకీయానుభవం లేదన్నది వాస్తవమే కదా? అది చెప్పటం చిల్లర ప్రవర్తన అవుతుందనడమూ, వెంట పడి కొట్టడం మాత్రం మనస్తాపం చెందడం వల్లనేనని చెప్పడమూ హాస్యాస్పదం. తెలుగు అభిమాని గారూ, ఇది మీ వ్యక్తిత్వాన్ని తెలుపుతూంది, గమనించండి.

  8. 8 radhika 11:07 అపరాహ్నం వద్ద జనవరి 29, 2008

    తెలుగు అభిమాని గారు ఇదసలు పెద్దగా ఫీల్ అవ్వాల్సిన విషయమే కాదు.ఒక వేళ ఫీల్ అయ్యారే అనుకోండి ఇలా చేయడం ఎంత వరకు సమంజసం.క్రమశిక్షణకు మారు పేరు చిరు అభిమానులని గొప్పగా చెప్పుకుంటారే మరి ఇలాగేనా ప్రవర్తించేది.ఇంత చిన్న విషయానికే ఇలా చేస్తే రేపు ఎన్నికల్లో ఎవరన్నా చిరు అభ్యర్ధి లేక చిరు ఓడిపోతే పరిస్థితి ఇలాగే వుంటుందా?చిరు రాజకీయాల్లోకి వస్తే రాష్ట్రానికి బాగుంటుందని ఎక్కడో కొంత అనిపించేది.ఒకవేళ అధికారం లోకి వస్తే ఇక ప్రతిపక్షాలు ఒక మాటన్నా,ఇది అన్యాయమని మొత్తుకున్నా సోకాల్డ్ అభిమానులు ఇలాగే చేస్తారా? చిరు ప్రభుత్వం కూడా గూండా రాజకీయం లా అయిపోతుందని తలచుకుంటేనే భయం వేస్తుంది.

  9. 9 meeruchadivaaraa 5:12 పూర్వాహ్నం వద్ద జనవరి 30, 2008

    రూపాయి నుంచి పది రూపాయలు లాగాలనుకునే అద్భుతమైన వ్యాపారస్తుడు, మహా నటుడు చిరంజీవి నటనను మనం కాసేపు పక్కన పెడితే, ఈ వింత విచిత్ర తెలుగు రాజకీయ వాతావరణంలో ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆడుతున్న వింత నాటకం నివ్వెరపోతూ పరిశీలించండి. 1984లో రామారావు రాజకీయాల్లోకి వచ్చినపుడు అన్నీ తానై తెలుగుదేశం కరపత్రిక ఈనాడు పోషించిన పాత్ర చరిత్రలో నల్లటి అక్షరాలతో నమోదైంది. ఇప్పుడు ఆ వికృత గాధను మరోమారు తిరగ రాయాలని ఆంధ్రజ్యోతి ఉవ్విళ్ళూరుతోంది. చిరంజీవిని రాజకీయాల్లోకి తీసుకురావాలని అటు చిరును, ఇటు తెలుగు ప్రజలను అదేపనిగా గోబెల్స్ ప్రచారం చేయడం రెండవ ఎత్తుగడ. (మధ్యంతరం ఊసుల మొలకలెత్తినపుడు చిరు రాజకీయ ఆరంగేట్రం ప్రకటన చేయడం మొదటి ఎత్తు.) ఇప్పుడు ఇంతరవ్వ బురద చిరు మీద పడబోయేముందర ఆగమేఘాలమీద ఆ బురదను కడగడానికి ఎలాంటి నీచమైన రాతలు రాస్తోందో చూస్తుంటే తెలుగు పత్రికలమీద జుగుప్స కలుగుతోంది. ఆరోజు ఈనాడు, ఈరోజు ఆంధ్రజ్యోతి అన్ని విలువల వలువలు నిస్సిగ్గుగా విడిచేస్తుంటే ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో మిగిలాం.
    -దుప్పల రవికుమార్

  10. 10 viswanadh 5:22 పూర్వాహ్నం వద్ద జనవరి 30, 2008

    @ సుదాకర్-
    చిరంజీవి ఆలస్యంగా ప్రజాసేవ మొదలెట్టడన్నారు. అతడు ఏం సేవచేస్తున్నాడు, అతడి పేరున అభిమానులు చేయడం తప్ప. రాష్ట్రంలో ఏవైనా ప్రకృతి వైపరీత్యాల సమయంలో సినీనటులు విరాళాలు ఇవ్వడం మామూలు. అలా చిరంజీవి ఇచ్చిన సంధర్భాలు చాలా తక్కువ, ఇచ్చిన మొత్తాలూ తక్కువే. అతడి బ్లడ్ బ్యాంక్ అతడి కృషి కాదు. అంత వరకూ ఎందుకు ఎవరైనా తను పుట్టి పెరిగిన ఊరికి ఏదైనా చేద్దామనుకొంటారు. అలా అతడి ఊరులో అతడు చేసిన పనులెన్ని ఉన్నాయనేది మీకు తెలుసా ?. పాలకొల్లు పరిశర్ ప్రాంతాల నుండి ఎందరో సినీ పరిశ్రమలో స్థిర పడ్డారు. వారి వారి తహతుకు తగినట్టుగా వారి ఊళ్ళకు సేవచేసారు,చేస్తున్నారు. మరి చిరంజీవి కుటుంబం, అల్లువారి కుటుంబ ఏంచేసినట్టు ?. ఉట్టికెగర్లేనమ్మ స్వర్గానికి ఎగిరందని, చిరంజీవి రాజకీయాలలోకొస్తే అదే అవుతుంది.


  1. 1 పొద్దు » Blog Archive » జనవరి నెల తెలుగు బ్లాగుల కథా కమామిషూ! 3:00 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 4, 2008 పై ట్రాక్ బ్యాకు
  2. 2 Crossroads » Blog Archive » Telugu Blogs - Jan ‘08 9:55 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 5, 2008 పై ట్రాక్ బ్యాకు

ప్రత్యుత్తరమిమ్ము




ముఖచిత్రం: మోదుగు పూలు (Flame of the Forest)

Polepally SEZ

092508 Andhra Jyothy Cartoon

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

More Photos

a

గణాంకాలు

  • 41,597 సందర్శకులు