ఎంత దాచుకుందామని ప్రయత్నించిన మన నేతల అసలు నైజం బయటపడుతూనే ఉంటుంది. మొన్న ప్రణాళికా సంఘం మీటింగులో మన ప్రధాని అన్న ఈ మాటలు ఒక సారి చదవండి.
“ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులపై ఇస్తున్న సబ్సిడీలు ఈ ఒక్క ఏడాదిలోనే భారీస్థాయిలో రూ.లక్ష కోట్లను దాటుతున్నాయి. దీనర్థం.. మనం కొత్త పాఠశాలలు పెట్టలేకపోవచ్చు. ఆసుపత్రులు కట్టలేం. విద్యార్థులకు ఉపకార వేతనాలివ్వలేం. వ్యవసాయ రంగంపై ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవచ్చు. మౌలిక వసతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉండొచ్చు. అందుచేత సబ్సిడీలను హేతుబద్ధం చేయాల్సిన అవసరం ఉంది. “
- ప్రధాని మన్మోహన్‌సింగ్
నాకైతే పై లైన్లు చదివాక మన్మోహన్ సింగుని ఒకటే ప్రశ్న అడగాలనిపించింది
“కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా మన్మోహన్?”
ప్రైవేటు కంపెనీలు పెట్టే అడ్డమైన గడ్డి తినమరిగి ఇటువంటి చెత్త వాగుడు వాగడం అలవాటైంది మన నేతలకు.
సబ్సిడీలు లక్ష కోట్లు దాటుతున్నాయని గుండెలు బాదుకుంటున్న మన్మోహన్ గారూ, మీకు ఈ కింది విషయాలు తెలియవా, లేక తెలిసీ దొంగనాటకాలు ఆడుతున్నారా?
1) అమెరికా, యురోపు దేశాలు వ్యవసాయానికి, పశుపోషణకు మన దేశంలో ఇస్తున్న దానికన్న అనేక రెట్లు ఎక్కువ సబ్సిడీలు ఇస్తున్నాయి. యురోపియన్ దేశాల్లొ ఒక్కో ఆవుకి సగటున రోజుకి 2 డాలర్ల విలువైన సబ్సిడీలు ఇస్తున్నారు. ప్రపంచంలో సగం జనాభాకి రోజుకు 2 డాలర్ల ఆదాయం కూడా లేదు.
2) అమెరికాలో ఉన్న 20,000 పత్తి రైతులకు ఆ దేశం ఏటా ఇచ్చే సబ్సిడీల మొత్తం విలువ 470కోట్ల డాలర్లు!
3) అమెరికాలో మొత్తం వరి ఉత్పత్తి విలువ 120 కోట్ల డాలర్లు ఉంటే వరి రైతులకు ఇచ్చే సబ్సిడి విలువ 140 కోట్ల డాలర్లు
4) స్పెషల్ ఎకనామిక్ జోన్ల పేరిట మీరు ఆడుతున్న కొత్త బాగోతం పుణ్యమా అని కేంద్ర ప్రభుత్వానికి అక్షరాలా లక్ష కోట్ల రూపాయల పన్ను నష్టం వస్తుందని సాక్షాత్తూ ఒక కేంద్ర మంత్రే మొత్తుకుంటున్నారు.
5) బ్యాంకులకు బడాబాబులు ఎగ్గొట్టిన సొమ్ము 3 లక్షల కోట్లు ఉందని సీపీఐ 2005 లోనే బయటపెట్టింది.
6) 1991 లో సరళీకృత ఆర్ధిక విధానాల పేరిట దాదాపు 10 లక్షల కోట్ల విలువైన చమురు. సహజ వాయువు నిక్షేపాలు ప్రైవేటు కంపెనీలకు అప్పనంగా ఒప్పజెప్పారు తమరు. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న “రవ్వ” అనే ప్రభుత్వ చమురు బావిని ప్రైవేటు కంపెనీకి అమ్మి, దాని దగ్గర తిరిగి అధిక ధరలకు చమురు కొంటుంది మన కేంద్ర ప్రభుత్వం. ఇటువంటి చచ్చు పనులు చేసి చమురు సబ్సిడీలు పెరిగిపోతున్నాయని మోసపు మాటలు ఎలా వస్తున్నాయి మీకు?
7) ప్రైవేటు కంపెనీలకు చౌక ధరలకు అప్పజెప్పిన బాక్సైట్, ఇనుము, ఇలుమినైట్ వంటి సహజ వనరుల విలువ కొన్ని లక్షల కోట్లు ఉంటుంది.
పేదవారికి, రైతులకు ఇచ్చేవేమో సబ్సిడీలు.
ఐటీ, బీపీవో కంపెనీలు, SEZలకు ఇచ్చేవేమో “ప్రోత్సాహకాలు”.
ప్రజలకు ఏమైనా ఇవ్వాలంటే చాలా బాధేస్తుంది మన నాయకులకు.
కంపెనీలకు మాత్రం వేల, లక్షల కోట్లు పళ్లెంలో పెట్టి బహూకరిస్తారు.
ప్రజలు గమనిస్తున్నారు…వారు త్వరలోనే మేలుకుంటారు…
Note:
మన్మోహన్ సింగు ఎవరి రికమండేషన్ పై ప్రధాని అయ్యాడో ఇక్కడ చదవండి.









Nic article.
Really Good.
మన్మోహన్ తన జీవితం మొత్తం మీద సంపాదించిన గౌరవాన్ని ప్రధానిగా అతి కొద్ది కాలంలో కోల్పోయాడు. ఇప్పుడు అతను ఒక కార్పొరేట్ వీపి. ఇండియా inc. ని లాభాలలోనికి ఎలా తీసుకెల్లాలనేదే అతని బాధ. అందువలన అలాంటివి అతనికి గుర్తు రావు.
ఎప్పుడు సబ్సీడిల మీద ఏడవటం, పక్క నుంచి ప్రయివేట్ వ్యవస్థకు బిలియన్ల కొద్ది రాయతీలిచ్చెయ్యటం.
దేశం మట్టిగొట్టుకు పోయే రోజులు అతి దగ్గరలోనే వున్నాయి
మా నాయిన ఎవరి మీదన్న కోపం వస్తె ఒకటే మాట అనెటోడు “చినిగిపోయిన పాత చెప్పును ఒక వారం రోజులు నానబెట్టి, తడి ఆరే దాక కొట్టలెరా వాన్ని” అని…
ప్రజలు మన నాయకుల దుమ్ము దులిపే రోజు ఎప్పుడు వస్తదో తెలువదు కని, ఇంట్ల పాత చెప్పులు మాత్రం ఎక్కువ అయితున్నయి !
దిలీప్ గారు
విషయం మరుగుపరచడానికి ఒక తెలివైన ఆయుధం సరైన సంఖ్యలలో చూపించవలసినదానిని పర్సంటేజిగా చూపించడం, పర్సంటేజిగా చూపించవలసినదానిని అసలు సంఖ్యలతో చూపించడం.
పాశ్చాత్య దేశాలు ఇస్తున్న వ్యవసాయ సబ్సిడీలు వారి ఎకానమీలకి సరిపడేవి. మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ముందు ఆలోచించుకోవలసినవి ఫ్యాక్టరీలు, ఉపాధి కర్మాగారాలు. 70% ప్రజానీకం వ్యవసాయంపై ఆధారపడి జీవితాంతం మనలేరు. కనీసం వారి తరువాతి తరం పిల్లలకైనా వేరే ఉపాధి అవకాశాలు చూపించగలగాలి.
పాశ్చాత్య దేశాల వ్యవసాయ సబ్సిడీలు దారుణమైనవి. వీటివల్ల పేద దేశాలు తమ వ్యవసాయ ఉత్పత్తులను ధనిక దేశాలకు ఎగుమతి చెయ్యలేకపోతున్నాయి – వీటిపై మనదేశం WTOలో పోరాడుతోంది.
దేశం వేగంగా అభివృద్ధి చెందడానికి ఒకటే మార్గం – ఎగుమతులు. జపాను, కొరియా, మలేశియ, ప్రస్తుతం చైనా అన్ని దేశాలు ఇదే నిరూపించాయి. కాని, మనదేశంలో ఇంకా కమ్యూనిస్టులు వారి మూఢ నమ్మకాలను విడిచిపెట్టట్లేదు. దేశాన్ని మరింత లోతుకి గుంజుకు పోతున్నారు. 60 ఏళ్ళ స్వతంత్ర చరిత్ర తరువాత కూడా దారుణమైన బీదరికం, ఆకలి, నిరక్షరాస్యతలో మనం కొట్టుమిట్టాడుతున్నాం. శ్రామికవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం అని గొప్పలుచెప్పుకునే కమ్యూనిస్టులు ఈ వైఫల్యాలను ఎందుకు అంగీకరించరు ?
నా పోస్టు చదివి మీ సూచనలు వ్రాయండి. ఒక కమ్యూనిస్టు కార్యకర్తకి పుట్టిన కొడుకుగా అడుగుతున్నా.
కిరణ్ గారూ,
జవాబివ్వడం కొద్దిగా ఆలస్యమయ్యింది క్షమించగలరు.
1) పర్సంటేజీల్లో, సంఖ్యల్లో… అన్నారు. కొద్దిగా వివరంగా చెబితే దాని గురించి నా అభిప్రాయం చెప్పగలను.
2) పాశ్చాత్య దేశాల్లో సబ్సిడీల గురించి ఉటంకించింది అక్కడ ఇచ్చినంతే ఇక్కడ కూడా ఇవ్వాలని అడగడం కాదు. మొదలు GATT ఆ తరువాత WTO ఒప్పందాల్లో సబ్సిడీల గురించి ఉన్న వివక్షను ఎత్తి చూపడానికే ఎవరైనా విదేశాల్లోని సబ్సిడీలను ఉదాహరణగా చెబుతారు. అక్కడ సబ్సిడిలు సరైనవే అయితే ఇక్కడ కూడ సరైనవే అవుతాయి కదా? పక్షపాతపూరిత ఒప్పందాలపై సంతకాలు పెట్టి ఆనక పోరాడటమెందుకు? ముందే అలోచించి నిర్ణయాలు తీసుకోవచ్చు కదా?
3) “60 ఏళ్ళ స్వతంత్ర చరిత్ర తరువాత కూడా దారుణమైన బీదరికం, ఆకలి, నిరక్షరాస్యతలో మనం కొట్టుమిట్టాడుతున్నాం. శ్రామికవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం అని గొప్పలుచెప్పుకునే కమ్యూనిస్టులు ఈ వైఫల్యాలను ఎందుకు అంగీకరించరు ?” అని రాశారు. ఈ బీదరికానికి, ఆకలికి, నిరక్షరాస్యతకి కమ్యూనిస్టులే కారకమని నేరుగా అనలేదు సంతోషం. వారీ విషయాలను తమ ప్రతీ సమావేశంలో మనకు బోర్ కొట్టే దాకా ఒప్పుకుంటూనే ఉంటారే? అయినా వైఫల్యం మనల్ని పాలించిన పార్టీలది అవుతుంది కానీ ప్రతిపక్షంలో ఉండి మాటి మాటికీ ధర్నాలూ, ఆందోళనలు చేసే వారిది ఎలా వైఫల్యం అవుతుందో వివరించగలరు.
మీ వ్యాసం చదివాను. మీ భావాలు కొత్త తరహాలో ఉన్నాయని మాత్రం అర్థమయ్యింది. అంతకు మించి ఆ పోస్టుపై వ్యాఖ్యానించే విషయ పరిజ్ఞానం నాకు లేదు. ఆ పోస్టుకు follow-upగా ఇప్పుడు మన దేశంలో అమలవుతున్న అభివృద్ధి నమూనా పైన మీ అభిప్రాలు రాస్తే నేను ఏమైనా స్పందించగలను.
అమెరికాలో పత్తిరైతులకు ఇచ్చే సబ్సిడీ 470 కోట్ల డాలర్లని వ్రాసారు. ఆ దేశం GDP 13 ట్రిలియన్ డాలర్లు, అంటే, 1,30,000 కోట్ల డార్లు. అందుకని వీరిస్తున్న సబ్సిడీ 470/130000 = 0.36%. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశంలో, కొత్తగా పోర్టులు, రోడ్లు, పాఠశాలలు లాంటి ఇంఫ్రాస్ట్రక్చరు పనులు చెయ్యవలసిన అవసరం అమెరికాకి లేదు. అందుకని, 0.36% GDP ఖర్చుపెట్టడం వారికి సమస్య కాదు.
మన దేశంలో ఇస్తున్న సబ్సిడీలు మనకి తలకు మించిన భారం. ఇలా సబ్సిడీలు ఇస్తూ పోతే రోడ్లు,కర్మాగారాలు ఎప్పటికీ నిర్మించలేము.
వారు అధికారంలో లేనంతమాత్రాన కమ్యూనిస్టుల వైఫల్యం తగ్గిపోదు. శాస్త్రీయ బద్ధంగా సమాజాన్ని ఎలాగ మార్చాలో మార్క్సు చెప్పాడు. ఈ పోరాటాలకి అడ్డంకులు ఎదురవుతాయి. కానీ, ఆయన ప్రకారం చివరికి కమ్యూనిస్టులదే విజయం కావాలి. అలా జరగట్లేదు అంటే మార్క్సు సిద్ధాంతంలోనే తప్పు ఉండాలి, లేదా కమ్యూనిస్టుల ఆచరణలోనైనా తప్పుండాలి.
నా ఉద్దేశ్యం ప్రకారం, కమ్యూనిస్టులు జాతిని, మతాన్ని, పెట్టుబడినీ – ఒకేగాటన కట్టివేసి మిత్రులు కావలసిన వారిని శత్రువులు చేసుకుంటున్నారు. ఫ్యూడల్ పద్ధతిపై పోరాటానికి పెట్టుబడిదారీ బూర్జువా వర్గానికి తోడ్పాటు అందించాలి అని మార్క్సు కమ్యూనిస్టులకు ఉద్బోధించాడు. కానీ, ఈ పెట్టుబడిదారీ వర్గం విజయం సాధించేలోపే దానిని అణిచివెయ్యడానికి చూస్తే, చివరికి నెగ్గేది ఫ్యూడల్ వర్గమే. మన దేశంలో జరిగిందిదే.
నేను మార్క్సిస్టు పరిభాషలో కమ్యూనిస్టు సిద్ధాంతాల వైఫల్యాలను చెప్పడానికి ప్రయత్నించాను. చాలామంది మార్క్సిజాన్నే నమ్మరు. వారి దృష్ఠిలో ఇదంతా తలా-తోకాలేని ఒక సిద్ధాంతం.
నా పోస్టులో మార్క్సిజం జీవ పరిణామ సిద్ధాంతంలో లామార్కు సిద్ధాంతాన్ని పోలి ఉంటుందని వివరించాను. నిజమేనోనని అనిపించినా, ఇది సరైన సిద్ధాంతం కాదు.
మీరిచ్చిన సమాచారం నాకు తప్పని తోస్తోంది. అమెరికా దేశం ఇస్తున్న వ్యవసాయ సబ్సిడీల గురించి ఇక్కడ ఉంది. మొత్తం అన్ని పంటలకి కలిపి 8 బిలియన్ డాలర్లు, అనగా వారి 13 ట్రిలియన్ డాలర్ల GDP లో 8/13000 * 100 = 0.06%
ఇదే వివరాలు పర్సంటేజిగా మన భారతదేశం వ్యవసాయ సబ్సిడిలలో చూస్తే విషయం తెలుస్తుంది.
కిరణ్ గారు,
సబ్సిడీలపై పూర్తి వివరణతో ఒక పోస్టు రాస్తాను. అందులో మీరు లేవనెత్తిన ప్రశ్నలన్నిటికీ జవాబులిస్తాను సరేనా?
దిలీప్