దురహంకారపు ప్రేలాపన!

“ప్రపంచం రోజురోజుకీ బాధ్యతలేని ఆడవారితో నిండిపోతోంది.దానికి స్త్రీవాదమనీ చిలకడదుంప అనీ పేరుపెట్టి భావితరాలకి ఇంకా ఇంకా ద్రోహం చేస్తున్నారు.”

“గృహహింసలో అధికభాగం తల్లులు పిల్లలపై చేస్తున్న భౌతిక దాడులే.తమ మానసిక ఒత్తిళ్ళని పిల్లలపై తీర్చుకోవడం మూలంగా ఇది సంభవిస్తోంది.”

“నీటి సంపులో పడిపోయి చనిపోయిన ప్రతి పిల్లవాడి వెనుకా, ఇంటి ముందు ఆడుకుంటూ ఏ వాహనమో ఢీకొట్టి చనిపోయిన ప్రతి బిడ్డ వెనుకా ఓ బాధ్యతా రహితురాలైన తల్లి ఉంటుంది.”

“బడికి వెళ్ళే పిల్లలకి సరైన భోజనం ఇచ్చి పంపడానికి బద్ధకించి పసుపూ నిమ్మకాయ కలిపిన పాచికూడు పులిహోర పేరుతో కలిపి ఇచ్చే మిలియన్లాది తల్లులున్నారు ఆంధ్రాలో.”

“ఏ దేశంలో నయినా మగవాడి నుంచి సమాజం చాలా ఎక్కువ ఆశిస్తుంది.ఆడదాని పట్ల సమాజం ఎలాంటి భ్రమల్నీ ఆశల్నీ పెంచుకోదు”

“స్వయంకృషితో జీవితంలో ఓ స్థాయికి చేరుకున్న దశలో మాత్రమే మగవారు పెళ్ళిచేసుకుంటున్నారు.తండ్రులవుతున్నారు.ఈ విధమైన ఆంక్ష ఆడవారి మీద లేకపోవడం చేత పొద్దున లేవగానే బాత్‌రూమ్‌కి వెళ్ళడం ఎంత మామూలో పెళ్ళి కాగానే పిల్లల్ని కనడం బాధ్యతా రహితులైన ఆడవారికి అంత మామూలు విషయమైపోయింది.”

“తల్లికైనా సరే గౌరవమివ్వడం బేషరతు (unconditional) కాదు.”

ఇవి మొన్న మదర్స్ డే నాడు “తెలుగు జాతీయవాది” నంటూ గత కొంతకాలంగా ఒక బ్లాగు నడుపుతున్న అంబానాధ్ అనే బ్లాగర్ రాసిన “తల్లుల్ని తయారుచెయ్యాలి” అనే గొప్ప వ్యాసరాజం లోంచి కొన్ని ఆణిముత్యాల్లంటి వ్యాఖ్యలు. ఇవి చదివి మీలో కొందరికి అసహ్యం, జుగుప్స లాంటి భావాలు కలగవచ్చు. ఇంకొందరు ఆవేశంతో పళ్లు పట పటా కొరకవచ్చు. నాకు వివిధ పాళ్లలో ఇవన్నీ కలిగాయి.

ఇక రాసినాయన పైత్యం ఒక ఎత్తు అయితే, దాన్ని చదివి తన్మయత్వం తో “ఆహా…ఓహో” అంటున్న ముగ్గురు నలుగురు బ్లాగర్లకు నాదొకటే ప్రశ్న.

పై లైన్లు చదివినాక కూడా మీకు అంబానాధ్ “కొందరు” స్త్రీ లనే ఉద్దేశించి ఈ పోస్టు రాశాడని మీకు అనిపించిందా? ఆయన భావాలు అందరు స్త్రీలను, లేదా మెజార్టీ స్త్రీలను ఉద్దేశించి రాసాడని నాకు అర్ధం అయ్యింది. ఒకవేళ మీకూ అలాగే అర్ధం అయ్యుంటే మహిళలను ఇంత దుర్మార్గంగా చిత్రిస్తున్న అతని పోస్టును సమర్ధిస్తూ ఎలా మాట్లాడగలుగుతున్నారు.

ఒక బ్లాగర్ నాలుగు గ్రాంధిక పదాలూ, ఒకటో రెండో శ్లోకాలూ, పద్యాలూ ఉటంకిస్తే వెంటనే అతను ఏది రాసినా “అబ్బా ఏం రాసారండీ” అంటూ జైకొట్టే ముందు ఒకసారి ఆ పొందికైన పదాల వెనుక ఎంత దుర్మార్గమైన ఎజెండా ఉందో అర్ధం చేసుకోనక్కరలేదా?

ఒక బ్లాగు పోస్టులో మనం ఒప్పుకోని విషయాలు ఉంటే తప్పకుండా దాన్ని చర్చకు పెట్టాల్సిందే. ఒక బ్లాగరు ఒక విషయం పై పోస్టు రాసి దాన్ని కూడలి వంటి సైట్లలో పెట్టుకోనిస్తున్నాడంటే దాని అర్ధం అది అందరూ చదవాలనే కదా. చదివి నచ్చితే మెచ్చుకునే వాళ్లూ ఉంటారు. నచ్చకపోతే విమర్శించే వాళ్లూ ఉంటారు. (నచ్చని వ్యాఖ్యలు వస్తే వ్యాఖ్యలు తొలగించుకునే వీలు బ్లాగర్ కు ఉంది కదా)

ఇక అంబానాధ్ దురహంకారంతో చేసిన వ్యాఖ్యలకు నా సమాధానం ఇదీ

“ప్రపంచం రోజురోజుకీ బాధ్యతలేని ఆడవారితో నిండిపోతోంది.దానికి స్త్రీవాదమనీ చిలకడదుంప అనీ పేరుపెట్టి భావితరాలకి ఇంకా ఇంకా ద్రోహం చేస్తున్నారు.”

బాధ్యత అంటే బానిసల్లాగా చెప్పిన పని చెయ్యడమేనా?. ఒక వైపు తన కాళ్ల మీద తను నిలబడడానికి ఉద్యోగం చేస్తూ, మరో వైపు అనాదిగా వస్తున్న ఇంటి పనీ, పిల్లల సమ్రక్షణా చేస్తున్న మహిళలపై ఇంత బేస్ లెస్ కామెంట్ ఎలా చెయ్యగలిగారు?

“గృహహింసలో అధికభాగం తల్లులు పిల్లలపై చేస్తున్న భౌతిక దాడులే.తమ మానసిక ఒత్తిళ్ళని పిల్లలపై తీర్చుకోవడం మూలంగా ఇది సంభవిస్తోంది.”

నాకు తెలిసినంత వరకూ గృహ హింస అంటే భర్తా, అతని కుటుంబ సభ్యులు స్త్రీలను పెడుతున్న బాధలు. యాదృచ్చికంగా గృహ హింస కేసుల్లో మన రాష్ట్రం ముందు వరసలో ఉంది. సరిగా చదువుకోనందుకో, హోం వర్కు చేయనందుకో పిల్లలని రెండు అంటించిన సంఘటనను మీరు గృహ హింస అంటున్నారంటే మీ అవగాహనా రాహిత్యానికి నవ్వొస్తోంది.

“నీటి సంపులో పడిపోయి చనిపోయిన ప్రతి పిల్లవాడి వెనుకా, ఇంటి ముందు ఆడుకుంటూ ఏ వాహనమో ఢీకొట్టి చనిపోయిన ప్రతి బిడ్డ వెనుకా ఓ బాధ్యతా రహితురాలైన తల్లి ఉంటుంది.”

బట్ట తలకూ మోకాలికి బ్రహ్మముడి వేయడం అంటే ఇదే. మీరు చూసినప్పుడు పొరపాటున ఏ కోడి పెట్టనో బిల్డింగ్ మీద నుండి కిందికి దూకుతూ కనిపిస్తే వెంటనే ఆంధ్ర దేశంలో కోడి పెట్టలు పక్షుల్లాగా గాల్లో ఎగరడం నేర్చుకున్నాయి అని సూత్రీకరణలు చేసేయగలరు మీ బోటి వారు.

“బడికి వెళ్ళే పిల్లలకి సరైన భోజనం ఇచ్చి పంపడానికి బద్ధకించి పసుపూ నిమ్మకాయ కలిపిన పాచికూడు పులిహోర పేరుతో కలిపి ఇచ్చే మిలియన్లాది తల్లులున్నారు ఆంధ్రాలో.”

మిలియన్ అంటే పది లక్షలు. ఇక మీరు ఏ సర్వే ప్రకారం ఈ పాచి స్టాటిస్టిక్స్ కనుక్కున్నారో కానీ అది పచ్చి అబద్దమని చూడగానే అర్ధం అవుతుంది. తమ భావజాలనికి సరిపోయే అబద్ధాలను ఇంత నిస్సిగ్గుగా రాసిన మరో మనిషిని చూళ్లేదు నేనింత వరకూ. తాము కలో గంజో తాగి పిల్లల అభ్యున్నతి కొరకు పాటుపడే మాతృమూర్తులే ఎక్కువ ఉంటారు ఏ సమాజంలోనైనా. దయచేసి ఇటువంటి పాచి అబద్దాలతో తల్లులని కించపరచకండి.

“ఏ దేశంలో నయినా మగవాడి నుంచి సమాజం చాలా ఎక్కువ ఆశిస్తుంది.ఆడదాని పట్ల సమాజం ఎలాంటి భ్రమల్నీ ఆశల్నీ పెంచుకోదు”

తమరి పురుషాహంకారం ఇంత నగ్నంగా బయటపెట్టేసుకున్నారు. స్త్రీ పురుషులు సమాజ రధానికి రెండు చక్రాల్లంటి వారు. ఒకరు మరొకరి కంటే గొప్ప అని అనడం దురహంకారమే…

“స్వయంకృషితో జీవితంలో ఓ స్థాయికి చేరుకున్న దశలో మాత్రమే మగవారు పెళ్ళిచేసుకుంటున్నారు.తండ్రులవుతున్నారు.ఈ విధమైన ఆంక్ష ఆడవారి మీద లేకపోవడం చేత పొద్దున లేవగానే బాత్‌రూమ్‌కి వెళ్ళడం ఎంత మామూలో పెళ్ళి కాగానే పిల్లల్ని కనడం బాధ్యతా రహితులైన ఆడవారికి అంత మామూలు విషయమైపోయింది.”

మాతృత్వం స్త్రీకి పునర్జన్మ వంటిదని అంటారు. ప్రసవ వేదన పడ్డ ఏ తల్లినైనా అడుగు తల్లి కావడమంటే ఏమిటో. బాత్ రూంకి వెళ్లడం అంత సులభంగా ఉండేది పురుషులకు. స్త్రీలకు అది నవ మాసాలూ మోసి, ఆనక జీవితాంతం కొనసాగే బాధ్యత.

“తల్లికైనా సరే గౌరవమివ్వడం బేషరతు (unconditional) కాదు.”

ప్రపంచంలో అంతో ఇంతో ప్రేమ మిగిలి ఉంది తల్లీ బిడ్డల మధ్యే. దాన్నీ ఒక transaction కింద దిగజార్చేశారు, మీకసలు మానవత్వం అనేది ఉందా అసలు?

అంబానాధ్ మొత్తం వ్యాసాన్ని ఇక్కడ చదవచ్చు

http://telugujaatheeyavaadi2.blogspot.com/2007/05/blog-post_13.html

ఆ వ్యాసానికి ప్రసాద్ చరసాల రాసిన చక్కని జవాబుని ఇక్కడ చదవచ్చు:

http://www.charasala.com/blog/?p=167

అంబానాధ్ ప్రేలాపనకు కొండవీటి సత్యవతి గారి ప్రతిస్పందన ఇక్కడ చదవచ్చు:

http://maagodavari.blogspot.com/2007/05/blog-post_22.html

11 స్పందనలు నుండి “దురహంకారపు ప్రేలాపన!” కు


  1. 1 ప్రసాద్ 1:54 అపరాహ్నం వద్ద మే 25, 2007

    నేనిప్పటికే ఈ అడుసులో కాలుపెట్టి అయిన బుడదంతా కడుక్కోలేక ఛస్తున్నాను. చూసి చూసి మీరు అడుగేశారా? అక్కడొకాయన ఓ కామెంటు రాశారు చూశారా? మూర్ఖులతో వాదన పెట్టుకోవద్దు అని. అది అక్షరాలా నిజం.

    ప్రాచీన కాలంలోమల్లే స్త్రీ ఇంటి పనులకూ వంటి పనులకే పరిమితం కావాలనుకునే ఛాందసులకు, మగ దురఃకారులకూ ఆయన హృదయంలోపల దాగిన (ఎంత దాచుకున్నా దాగక బయట పడుతూనే వుంది ప్రతిసారీ) అజెండా అర్థం కాదు. ఎలాంటి నీచమయిన భావాలను ప్రచారం చేస్తున్నా నోరుమూసుకుని వుండాలంటున్నారు కొందరు.

    ఆయన ఇలా దుర్మార్గంగా వున్న కొద్దిమంది తల్లులనే చూపించారు అని కొందరి వాదన. ఏ విధంగా చదివినా, ఎన్ని విధాలుగా చదివినా, పొద్దు పొడవక ముందే చదివినా, అందరూ నిద్దరోయాక చదివినా ఆయన భావాలు అధిక శాతం తల్లులను వుద్దేశింఛే అని నాకు స్పష్టంగా కనిపిస్తోంది. మరి నాది హస్వ దృష్టో వాళ్ళదో తెలియట్లేదు.

    –ప్రసాద్
    http://blog.charasala.com

  2. 2 kondaveeti satyavati 5:54 అపరాహ్నం వద్ద మే 25, 2007

    ఈ ఆధునిక మనువు ఆడవాళ్ళని,ఇపుడిపుడే కొంచం స్వేచ్చగా గాలి పీల్చుకుంటున్న వాళ్ళని మళ్ళీ మధ్య యుగాల్లోకి తోసేయాలని కంకణం కట్టుకున్నాడల్లే ఉంది. ఆ మనువు మీద ఈగ వాలితే తోలడానికే ఉన్నట్టు ప్రవర్తిస్తున్న వందిమాగధులను చూస్తుంటే భలే నవ్వు వస్తొంది.జాలి పుడుతోంది. ఆడవాళ్ళ మీద, అదీ తల్లుల మీద వీరి అసహ్యం, అక్కసు చూస్తుంటే గుండె జలదరిస్తొంది.వారి తల్లుల్ని,చెల్లెళ్ళని, వారి వారి భార్యల్ని తలుచుకుంటే నాకు వెన్నులోంచి వణుకు పుడుతోంది.తమకు సంబంధం లేని మిలియన్ల తల్లుల గురించి అంత విషం చిందించిన వీళ్ళు……

  3. 3 Karthik 6:46 అపరాహ్నం వద్ద మే 25, 2007

    అంబానాథ్ గారు రాసినవి అన్నీ ఏదో ఒక సందర్భంలో మనం కూడా అనుకునేవే. కాని ఆయన అవన్నీ గుదిగుచ్చి ఒక టపాగా రాయడంతోను written word కి ఉన్న ఫోర్సు మూలంగాను కొంతమంది బాధపడుతున్నారు. వారిలో ఎక్కువమంది ఆయన పాత టపాలు చదివినవాళ్ళు కారు. ఆ బ్లాగు మొదలైనప్పటినుంచి దాన్ని చదువుతూ ఆయన శైలీ కోణం తెలిసినవారు అపార్థం చేసుకోలేదు. ఆయన కొన్ని సమస్యలని మొట్టమొదటి సారిగా ప్రస్తావించాడు. అందుకని ఆయన్ని అసహ్యంగా తిట్టడం పనికిరాదు. ఆయన ఎవరినీ తిట్టలేదు. ఆ టపా మీద విరుచుకుపడ్డవాళ్ళు ఎక్కువమంది తమ సెంటిమెంట్ల గురించి విరుచుకుపడుతున్నారు తప్ప ఆయన చెప్పినదానిలో వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారు. నిజమే కదా ! తల్లే కాదు ఏ మానవసంబంధం పట్ల గౌరవమైనా బేషరతు కాదు. అవతలివారు ఎలా ఉంటారనేదాన్ని బట్టే మనం ఉంటాం. తప్పేముంది ? ఆ మాట చెప్పినందుకు ఆయన్ని తిట్టాలా ? ఒక ఆలోచనాపరుడుగా అంబానాథ్ స్థాయి చాలా పెద్దది. ఆయన స్వయంగా దైవభక్తుడై ఉండీ నాస్తికుల్ని తన గురువులుగా చెప్పుకోవడానికి వెనుదియ్యని విశాలహృదయుడు. మన తెలుగు బ్లాగర్లలో ఆయన standards అందుకోగలవారు ఒక్కరూ లేరని నా ఉద్దేశం.

  4. 4 Krishna Mohan 6:53 అపరాహ్నం వద్ద మే 25, 2007

    Please respect one’s feelings. Just because they have commented with out hipocracy, we cannot blame the commentators. Everyone has right to comment her/his own voice. They did not even scolded anyone. Just because we believe in something very strong, we should not expect the same from everyone or force them to be silent in blog world. This is not a good practice in free speech world. One will be afraid to write what ever comes in mind.

  5. 5 రానారె 9:21 అపరాహ్నం వద్ద మే 25, 2007

    మీరు తీవ్రమైన ఆవేశాలకు లోనుకాకుండా చాలా మంచి విమర్శచేశారు. అంబానాథ్ రాసిన వ్యాసాలలో నేను పూర్తిగా చదివినది ఆ వ్యాసం ఒకటే. అందునుండి ఇక్కడ ఉదహరించిన వాక్యాలలో చాలామటుకు అభ్యంతరకరమైనవే. కానీ, వాటిని ఇలా పక్కకు తీస్తే అవి మరీ అన్యాయంగా కనిపిస్తాయి. ఆయనరాసిన వ్యాసంలో వీటిని నేను పట్టించుకోలేదుగానీ ఆ వ్యాసంలో ఒక మంచి విషయం ఉంది. ఆ విషయపు సారాంశం – “కొన్ని దశాబ్దాలక్రితం వరకూ పెద్దల ఆధ్వర్యంలో జరిగిన కుటుంబజీవనం నేడు అసాధ్యమౌతోంది. ఈ పరిస్థితులలో ఎవరికివారుగా బ్రతుకుతున్న నేటి యువతకు పెద్దల అనుభవంతో అందివచ్చే తోడ్పాటు కొరవడడడంతో వారు సమర్థులైన తల్లిదండ్రులు కాలేకపోతున్నారు. ఈ విషయంలో శిక్షణ అవసరం గురించి ఆలోచించాలి.” ఆ వ్యాసంలోని ఇలాంటి విషయాలను గుర్తించి వాటికి మద్దతుతెలిపినవారు కొందరైతే, అందులోని కరుకైన మాటలు కలుగజేసిన ఆవేశంతో వ్యతిరేకతకూడగట్టే ప్రయత్నం మరికొందరిది కాగా, ఈ వ్యతిరేకతను అడ్డుకునే పనిలో మరికొందరు సంయమనం కోల్పోయారు. తల్లులగురించి మాట్లాడగానే, నిందజెంది, “ఏం తండ్రులకు బాధ్యతలేదా” అన్నవారు కొందరు. లేదని అనలేదు కదా. అందులో ప్రస్తావించనంతమాత్రాన వ్యతిరేకించినట్లు కాదుకదా. అలాగే కొన్ని సెంటిమెంట్లమీద అందరికీ నమ్మకం ఉండాలనీ లేదు. మాతృదేవత సెంటిమెంటు ఒకటి. ఇష్టము, కృతజ్ఞత, నిజమైన గౌరవం ఉంటేచాలు భక్తి ఎందుకని నా ఉద్దేశం. అసలు భక్తి అంటే ఏమిటో కూడా నాకు తెలీదు. దాని ఆవశ్యకత నాకు అనుభవంలోకి రాలేదు. ఎవ్వరితోనూ మనం పూర్తిగా ఏకీభవించలేము, పూర్తిగా విభేదించనూలేము. ఏకీభవం జరిగితే ఆనందం సరేగానీ, విభేదం జరిగితే కోపం రాకూడదు. కోపమున ఘనత కొంచెమైపోవు – అంతేగానీ, మంచి ఫలితం ఉండబోదు కాబట్టి, తప్పు అనిపిస్తే నిందలకు దిగి ప్రయోజనంలేదు. ఇది తప్పు అని సాలోచనగా చెబుదాం, ఒప్పులుంటే గ్రహిద్దాం – అని నా అభిప్రాయం.
    మనకు ఒప్పనిపించింది అందరికీ ఒప్పు కానవసరంలేదు. అలాగే మనకు తప్పనిపించింది అందరికీ తప్పుకానవసరం లేదు కదా.

  6. 6 lalithag 1:37 పూర్వాహ్నం వద్ద మే 26, 2007

    రానారె గారు,
    జోహార్లు.

    ఆంబానాథ్ గారి వ్యాసంలో కనిపించిన సందేశం, నా లాంటి వారు lamaze, parenting classes గురించి చెప్పిన వాటిలో కనిపించినట్టు లేదు మరి?

    నేను ఆయన వ్యాసానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన వారిలో ఒక దాన్ని. అక్కడ వ్యాఖ్యానించిన వారిని రక రకాలుగా విభజించారు మీరు. నేను ఏ కోవలో చేరుతానో తెలిపితే తెలుసుకుంటాను. వ్యతిరేకించిన వారిలో ఏదో ఒక వైషమ్యం లేకుండా, అనిపించిన అర్థాన్ని వ్యతిరేకించిన వారే లేరంటారా?

    నా మటుకు నేను మొదటి ఒక్క వ్యాఖ్య అయినా ఆవేశ పడకుండానే చేశాను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? నా లాంటి వారి వ్యాఖ్యలలో మీకు పట్టించుకో దగ్గ మంచి మాటలు కనిపించలేదా? అంబానాథ్ గారి వ్యాసంలో మటుకే మంచిని చూడ గలిగారా మీరు?

    నేను ఈ వేదిక మీద ఈ ప్రశ్న అడగడం blog ethics కి లోబడే ఉంటుందనుకుంటున్నాను.

    పంది తన పిల్లలను కని పెంచడము, ఒక మానవ స్త్రీ తన పిల్లలను కని పెంచడమూ పోల్చదగిన విషయాలు కాదనిపిస్తే నాది తప్పు మాట అంటారా? ఇక్కడ నేను పందిని తక్కువ చేశాను అని ఈ మాటల ద్వారా మీరు ఊహించుకుంటున్నారా, లేక నేనే అలా అన్నానా? అంబానాథ్ గారు తండ్రులకు శిక్షణ అవసరం గురించి ప్రస్తావించలేదు అనీ, ఆయన వారికి శిక్షణ అవసరం ఉన్నట్లు భావించలేదని, నేను ఊహించుకున్నానేమో కదా మరి? అందుకే ఆయన Fathers’ day కి ఏం ప్రబోధం ఇస్తారా అని ఎదురు చూస్తున్నాను. అక్కడ తండ్రులకి ముందుగా అభినందనలు కూడా తెలిపాను.

    ఇలా ఎన్నో మాటలకు ఉద్దేశాలు, అర్థాలకు, అపార్థాలకు, ఆవేశాలకు, ఆక్రోశాలకు తేడా తెలుసుకోవాలని ఉంది. దయ చేసి ఎవ్వరైనా సెలవివ్వండి. నాకు వ్యాఖ్యలు రాయాలన్నా, బ్లాగులు రాయలన్నా భయంగా ఉంది.

    నాకు తెలియట్లేదు. అర్థం కావట్లేదు. Please help!

    ఈ ఒక్క టపా విషయంలో మటుకు, నిండా మునిగాను కదా అని చలిని లెక్క బెట్టడం లేదింత వరకు.

    ఇన్ని ఆవేశ కావేశాలు చెలరేగుతుంటే బాధ్యత గల moderator గా అంబానథ్ గారు వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన వారిలో ఒక్కరి వ్యాఖ్యకి కూడా స్పందించక పోవడం, ప్రశంశలకు మాత్రమే స్పందించడం(the latest I checked his post was today morning I guess) ఏ మాత్రం ప్రశ్నార్థకం కాదా?

    నాకు బ్లాగులు రాసిన వారిలో, వ్యాఖ్యలు రాసిన వారిలో బ్లాగుల ద్వారా తప్ప పరిచయమైన వారు లేరు. ఇష్టమైన వారు లేరు. ఇష్టం కాని వారు లేరు. వారి అభిప్రాయాల మీద నాకు అభిప్రాయాలు మాత్రమే ఉన్నాయి.

  7. 7 Karthik 2:49 పూర్వాహ్నం వద్ద మే 26, 2007

    ప్రతి విమర్శకీ ఆవేశపడిపోయి ప్రతిస్పందించెయ్యడం అంబానాథ్ గారి ధోరణి కాదనుకుంటా. ఆ మాటకొస్తే ఆయన ఏ బ్లాగులోనూ వ్యాఖ్యలు రాయగా కూడా నేను చూడలేదు. గతంలో ఆయన టపాల గురించి “పొద్దు”లో ఒక సమీక్ష వచ్చింది. ఆయన పట్టించుకోనేలేదు.అయినా మీలా విమర్శలు రాసిన వాళ్ళు చాలా వేడిమీద ఉన్నారు. ఆయన బ్లాగులోకి వెళ్ళి ఆయన్నే అసహ్యంగా తిట్టారు. అలాంటివాళ్ళకు ఎవరైనా ఏం చెప్పగలరు ? చెప్పింది సరిగా అర్థం చేసుకోలేనివాళ్ళతో వాదాలు అనవసరం. ఆ వ్యాఖ్యల్ని (తిట్లు) కూడా ఆయన publish చేశాడు.అంతటితో సంతోషించండి. ఇక్కడ దిలీప్ గారికి అంబానాథ్ గారిలో ఒక అజెండా కనిపిస్తోంది. సత్యవతిగారికి అంబానాథ్ గారిలో ఒక ఆధునిక మనువు కనిపిస్తున్నాడు. ఇలా ఆయన గురించి ఎవరికి తోచింది వాళ్ళు రాసేస్తున్నారు కదా ! Open mind లేనప్పుడు ఈ విధంగా ఎవరి కలర్ గ్లాసెస్ లోనుంచి వాళ్ళు చూస్తారు. వాళ్ళకి చెప్పడం ఎవరి తరం ? ఇలా అపార్థాలు తీస్తున్నారని ఆయన ఈమధ్య ఆ టపాలో ఒక కొత్త పేరాగ్రాఫ్ కూడా చేర్చాడు. అయినా జనం వివిధ నాట్యాలు మానలేదే.

  8. 8 lalitha 12:30 అపరాహ్నం వద్ద మే 26, 2007

    Hi! All,
    My anguish has been because of this.
    I have been trying to understand this:
    How can anyone who could see the message beyond some very objectionable statements, cannot see the sense in not so hot comments.
    Why can someone not sympathise with the reaction caused by objectionable statements themselves?
    How can someone say the author post can include objectionable statemnts because of the message it seems to deliver and then judge readers’ reaction to that, and judge the way the readers commented?
    The author should not be judged. Only the readers’ comments should be?
    The readers’ and the comment writers’ motives can be judged?

    Now – I am thinking that all these questions are in vain. My questions are aimed at the top layer of interpretation while there is a much complex mechaninsm underneath which will be hard to explain in limited words. So, I resign. I will try my best to stay away from this post and related stuff.

    Sincerely,
    lalitha.

  9. 9 mounimounamlo 7:14 పూర్వాహ్నం వద్ద ఆగష్టు 12, 2007

    రానేరుగారు చక్కగా వివరించారు.యింత సంచలనం సృటించిన ఈ విషయం గూర్చి ,చాల మంది అభిఫ్రాయాలు వ్యక్తపరిచారు.అది అందరి దృష్టిని పడేట్లు చేస్తోంది.ఈ సారాషంలోంచి భావితరాల ఫ్రధాన్యత, ఈ విషం పై మనమందరం గమనికలో ఉండాలి.ఈ విషయం ముఖ్యమైంది.ఇందులో ఎవరిని నిధించడం,ఎత్తిపొడచడం కాదు మనం చేయాల్సింది.తల్లి చేసె పనులు,మానసిక వత్తిల్లు చాల మంది చక్కగా వివరించారు.అలా చేయాల్సిన అవసరం కూడా ఉంది.ఎందుకటే,సమాజం ప్రతి తప్పును స్త్రీ
    మీదకు నెట్టడానికి ప్రయత్నిస్తుంది.

  10. 10 bollojubaba 5:53 అపరాహ్నం వద్ద జులై 16, 2008

    బ్లాగుకిచ్చిన లింకు పనిచేయటం లెదు
    బొల్లోజు బాబా


  1. 1 పొద్దు » Blog Archive » గుండెచప్పుడు విందాం.. 12:52 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 27, 2009 పై ట్రాక్ బ్యాకు

ప్రత్యుత్తరమిమ్ము




ముఖచిత్రం: మోదుగు పూలు (Flame of the Forest)

Polepally SEZ

092508 Andhra Jyothy Cartoon

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

More Photos

a

గణాంకాలు

  • 39,144 సందర్శకులు