భాషా ప్రయుక్త రాష్ట్రమా గాడిద గుడ్డా!

అసలీ బ్లాగు మొదలు పెట్టిన మొదటి రోజుల్లోనే తెలంగాణా పై నా అభిప్రాయాలను వివరిస్తూ ఒక పోస్టు చేద్దామనుకున్నాను. కానీ ఒకదాని వెంట ఒకటి రాయావలసిన విషయాలు ఉండటంతో రాయలేకపోయాను. కానీ ఇప్పుడు రాయక తప్పదనిపిస్తోంది.

ఒక బస్సులో నాలుగైదు గంటలు కలిసి ప్రయాణించిన మన సహచర ప్రయాణికుడు “ఇక వెళ్లొస్తాను” అంటేనే మనసులో ఏదో మూల చిన్న బాధ కలుగుతుంది చాలామందికి. అలాంటిది కష్టమో నిష్టూరమో యాభై యేళ్లు కలిసి ఉన్నాం. ఇప్పుడు విడిపోయే రోజు దగ్గరపడుతుంటే సహజంగానే చాలా బాధ వేస్తుంది. కొంత మందికి ఆ ఆలోచనే రుచించదు. ఇంకొంత మందికి విడిపోవాలనే వారిపై ఏదో ఒక స్థాయిలో కోపం వస్తుంది.

నా మిత్రుల్లో కనీసం యాభై శాతానికి పైగా ఆంధ్ర ప్రాంతం వాళ్లు. అందులో నా మనసుకి మరీ దగ్గర మిత్రుడొకడు ఆ మధ్య నన్నడిగాడు “ఏరా తెలంగాణా రాగానే మమ్మల్నీ తోలేస్తారా వెనక్కి?” అని.

నిజం చెప్పొద్దూ, ఒక్క క్షణం నోటి వెంట మాట రాలేదు నాకు.

“అలా తోలేయడం ఉండదు రా” అని బదులిచ్చాను. “మరి పరిస్థితిలో ఏం మార్పు ఉంటుందంటావ్?” మళ్లీ అడిగాడు.
“ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన వాళ్లకు పెద్దగా మార్పేమీ ఉండదురా. కోదాడ అవతల NH-9పై ఒక బార్డర్ చెక్ పోస్టు వస్తుందంతే” వివరించాను. తెలంగాణా ప్రాంతానికి ఏం ఒరుగుతుందని నా మిత్రుడు అడగలేదు. కానీ నేనే వివరించానతనికి. (తెలంగాణా వస్తే సమసమాజం ఏర్పడుతుందా? అని సుధాకర్ గారు ప్రశ్నించారు. దానికి విడిగా జవాబు రాస్తాను)

బాల సుబ్రహ్మణ్యం గారు “మనం స్వాతంత్ర్యం వచ్చాక ఒకే జాతికి చెందిన ప్రజలతో అర్థవంతమైన రాష్ట్రాలు ఏర్పరచి రాష్ట్రాల ఏర్పాటుకు ఒక హేతుబద్ధమైన విధానాన్ని రూపొందించుకున్నాం…” అన్నారు.

దానికి నా ప్రతిస్పందన ఇది

——————————–

భాషా ప్రయుక్త రాష్ట్రమా గాడిద గుడ్డా!

ఒక భాష మాట్లాడే వాళ్లందరినీ ఒక రాష్ట్రంగా ఉంచాలనే వాదనను భారత ప్రభుత్వం ఏనాడూ ఒప్పుకోలేదు. రాష్ట్రం ఏర్పాటు చేయడానికి అదొక్కటే కారణం సరిపోదని ఇంకా చాలా కారణాలు ఉంటాయనీ మన తొలితరం నేతలు అనేకులు అభిప్రాయపడ్డారు. State Reorganization Bill పై లోక్ సభలో 10 ఆగస్ట్ 1956 నాడు చర్చలో పాల్గొంటూ ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్వయంగా “We do not stand for this principle of unilingualism” అని పేర్కొన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రమనేది చాలా తరచుగా వినిపించే అర్ధ సత్యం. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును భాషా ప్రాతిపదికన చేసినట్టయితే దాంట్లో ఒరిస్సా రాష్ట్రంలోని గంజాం, బెర్హంపూర్, పర్లాఖిమిడి; కర్ణాటక నుండి హంపీ (బెల్లారి); తమిళనాడులోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు కలిసేవి.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమించే రోజుల్లో ఆంధ్ర మహాసభ, ఇవ్వాళ తెలుగు ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవుడున్న తిరుపతిని (అది తమిళుల గుడి కాబట్టి, తిరు అంటే శ్రీ అని అర్ధం, శ్రీపతి కాస్తా తిరుపతి అయ్యాడు) బాయ్ కాట్ చెయ్యాలని పిలుపిచ్చింది.

ఆనాడు కర్నూల్ లో ఉన్న ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ స్వర్గీయ శ్రీ పి. తిమ్మారెడ్డిగారు బళ్లారిని ఆంధ్ర ప్రదేశ్ లో కలపాలని గట్టిగా డిమాండ్ చేస్తూ, రాయలసీమ జిల్లాలు BACKward జిల్లాలని అన్నాడు (B=Bellari; A=Anantapur; c=Cuddapah, Chittor; K= Kurnool). బళ్లారి లేకుంటే రాయలసీమకు తలకాయ లేనట్టే అని ఆయన ఆనాడు అన్నాడు. అదే విషయం గురించి 24-4-1956 లో పార్లమెంటులో మాట్లాడుతూ ఎంపీ శ్రీ రామచంద్రారెడ్డి ఇలా అన్నారు “If Bellari is taken away, the portion of Raayalaseema will become not only still BACKward but also AWKward”

ఆనాడు విశాలాంధ్ర అనీ, భాషా ప్రయుక్త రాష్ట్రమనీ పోరాడిన వారికి ఈ ప్రాంతాలు కనపడలేదా? లేక కనపడ్డా విలువైన తెలంగాణా ముందు అవి విలువలేనివిగా కనపడ్డాయా?

ఇక ఒకే భాష మాట్లాడే వాళ్లంతా ఒకే జాతి అనీ, ప్రపంచంలో అనేక దేశాలు అలాగే ఏర్పడ్డాయనే వాదన తీసుకొస్తున్నారు. ఇక్కడ మనం దేశాలు ఏర్పాటు చెయ్యడం గురించి మాట్లాడడం లేదు. కాబట్టి అది అప్రస్తుతం. రాష్ట్రాల విషయమే మాట్లాడుదాం.

భాషకో రాష్ట్రం అనే లాజిక్ ఉపయోగిస్తే దేశంలో 22కు మించి రాష్ట్రాలు ఉండే అవకాశమే లేదు (మన రాజ్యాంగం అధికారికంగా గుర్తించిన భాషలు 22). మరి హిందీ మాట్లాడే రాష్ట్రాలు 9 ఎందుకు ఉన్నట్టు? స్వతంత్రం వచ్చే నాటికే అవన్నీ ఉన్నాయనుకోవడానికీ లేదు. 1947 లో 14 రాష్ట్రాలు ఉంటే ఇప్పుడవి 35 అయ్యాయి (29 రాష్ట్రాలూ, 6 కేంద్ర పాలిత ప్రాంతాలూ). అవన్నీ ఏ ప్రాతిపదికన ఏర్పడ్డాయి?

ఇక భాషనే జాతీయతకు ఏకైక సూత్రం అనే వాదాన్ని వితండవాదం చెయ్యదలుచుకుంటే మన దేశంలో 10,000మంది కంటే ఎక్కువమంది మాట్లాడే భాషలు 211 ఉన్నాయి. ఏం వారందరికీ రాష్ట్రాలు అక్కరలేదా?

పాండిచ్చేరీ ఉదాహరణ తీసుకుందాం. తెలుగు మాట్లాడే యానాం, తమిళం మాట్లాడే పాండిచ్చేరి, మళయాళం మాట్లాడే మాహెలు కలిపి ఒక రాష్ట్రం ఏర్పాటు చేశారు. కనీసం మూడూ ప్రాంతాలూ భౌగోలికంగా కూడా ఒక్కదగ్గర లేవు, వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పాండిచ్చేరి రాష్ట్ర ఏర్పాటుకు ఒకటే ప్రాతిపదిక. ఈ మూడు ప్రాంతాలూ ఫ్రెంచ్ కాలనీలుగా ఉండటం. పోర్చుగీసు పాలనలో ఉన్న డామన్, డయ్యు లను కూడా విడిగా కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచారు. అందులో ఒకటి గుజరాత్ లో ఉంటే మరొకటి మహరాష్ట్ర, గుజరాత్ ల సరిహద్దులో ఉంది.

మరి అదే లాజిక్ తెలంగాణా కూడా వర్తించొచ్చు కదా?

స్వతంత్రం వచ్చాక రాష్ట్రాలను సహేతుకంగా ఏర్పాటు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్రాల పునర్విభజన కమీషన్ (ఫజల్ అలీ కమీషన్) ఎంతో ప్రయాసపడి ఒక నివేదిక ఇస్తే దాన్ని పట్టించుకోకుండా రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగింది. (మొదటి ఎస్సార్సీ తెలంగాణా విషయం లో ఏమన్నదో ఇక్కడ చదవండి)

1960లో ఉమ్మడి బాంబే రాష్ట్రాన్ని మహారాష్ట్ర, గుజరాత్ లు గా విభజించింది మొదలు మొన్న 2000 సంవత్సరంలో జార్ఖండ్, చత్తీస్ గడ్, ఉత్తరాంచల్ లు ఏర్పరిచే వరకు వివిధ కారణాలు చూపుతూ సగటున ప్రతి 4-5 యేళ్లకు ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటవుతూనే వచ్చింది మన దేశంలో.

సిక్కిం అనే స్వతంత్ర దేశాన్ని కూడా ఆక్రమించుకుని  మనదేశంలో ఒక రాష్ట్రంగా ప్రకటించుకున్నాం.

నడుస్తున్న ప్రభుత్వాల చిత్తం వచ్చిన చోట, స్వార్ధ పరుల ప్రయోజనాలు సిద్ధించేటట్టు రాష్ట్రాల ఏర్పాటు జరిగిందీ దేశంలో.

తెలంగాణా విషయం రాగానే కొత్త లాజిక్ లు గుర్తొస్తాయి. అప్పుడు చరిత్ర చాలా కన్వీనియంట్ గా మరచిపోతారు మన మిత్రులు.

బాల సుబ్రహ్మణ్యం గారు “మీరు ఇంత తెలిసినవారై ఉండి కేసీయార్ లాంటి దగుల్బాజికి వంతపాడే పని భుజానికెత్తుకున్నందుకు నాకు చాలా బాధగా ఉంది.” అన్నారు.

తెలంగాణా కావాలని కోరుకుంటున్నది మూడున్నర కోట్ల మంది ఇక్కడి ప్రజలు. కేసీయారు, నరేంద్ర, వంటి నేతలు మాత్రమే కాదు. చంద్రబాబు, వైయెస్ కన్నా ఎక్కువ దగుల్బాజీ ఏమీ కాడు కేసీయార్!

ప్రజల ఆకాంక్షలను నిచ్చెన మెట్లుగా చేసుకుని పదవులు అధిరోహించే నేతలు అన్ని చోట్లా ఉంటారు. అది తెలంగాణా ప్రజలకు అందరి కన్నా బాగా తెలుసు. కాబట్టి Don’t try to shoot Telangana from KCR’s shoulders.

Note: గమనిక: ఈ పోస్టును రాయడానికి ఉపయుక్తమైన సమాచారం “తెలంగాణా చరిత్ర పునర్నిర్మాణం” పుస్తకం నుండి తీసుకోబడింది.

23 స్పందనలు నుండి “భాషా ప్రయుక్త రాష్ట్రమా గాడిద గుడ్డా!” కు


  1. 1 నవీన్ గార్ల 11:46 పూర్వాహ్నం వద్ద మార్చి 12, 2007

    రేపు ఉత్తర తెలంగాణా జిల్లా…దక్షిణ తెలంగాణా జిల్లాల మధ్య పోరు వస్తే..ఇంకో రెండు రాష్ట్రాలు ఏర్పడతాయా? “భాషా ప్రయుక్త రాష్ట్రమా గాడిద గుడ్డా!” అంటే…ఏదో మంచి లాజిక్ తో తెలంగాణా రాష్ట్రాం ఏర్పడటాన్ని సమర్థిస్తారనుకొన్నాను.

    మిగిలిన వారి సంగతొదిలెయ్యండి….సామాన్య ప్రజ జీవితం లో తెలంగాణా రాష్ట్రాం ఏమి మార్పులను తెస్తుందో….కలసుంటే ఎందుకు ఆ మార్పులు రావో వివరించండి..తెలుసుకొని సమైక్యవాదులు కూడా తమ అభిప్ర్తాయాలను మార్చుకొంటారు.

  2. 2 Dil 12:14 అపరాహ్నం వద్ద మార్చి 12, 2007

    నవీన్ గారూ

    తెలంగాణ ఏర్పాటుకు చాలా లాజికల్ రీజన్స్ ఉన్నాయి. అందులో ఒకదాన్ని మాత్రమే ఇక్కడ వివరించడం జరిగింది. గమనించగలరు

    ఇక ప్రత్యేక రాష్ట్రం ఏం మార్పులు తెస్తుందో, అవి సమైఖ్య రాష్ట్రం లో ఎందుకు సాధ్యం కావో వివరించమని మంచి ప్రశ్న అడిగారు. తప్పక వివరిస్తాను.

  3. 3 Jaya Prakash 2:28 అపరాహ్నం వద్ద మార్చి 12, 2007

    గత యాభై ఏల్లల్ల రాని అభివృద్ధి కలిసి ఉంటె ఇంకో వంద ఏల్లల్లగూడ రాదు, కారణాలు ఉన్నయి, చాన ఉన్నయి. ‘కారణాలు తెలిపితే …తెలుసుకొని సమైక్యవాదులు కూడా తమ అభిప్రాయాలను మార్చుకొంటారు’ అని మీలాంటి వాల్లు చేసే comment చాన optimisticగ ఉన్నది.

    అయితె దానికి అందరు సమైఖ్యవాదులు ముందు ఆ కారణాలు చూడడానికి openగ ఉండాలె. ఎందుకంటె నెత్తి నోరు కొట్టుకొని ఎన్ని చెప్పినా ‘దేశన్ని ముక్కలు ముక్కలు చేసుకుంటా పోతె మిగిలేది ఏంది…. ఎవరో ఒక రాజకీయ నాయకుడు రెచ్చగొడితే దారిదప్పిన గొర్రెల లెక్క తెలంగాణ ప్రజలంతా కల్లు మూసుకుని పోతున్నరు’ అనుకుంట ఇదే పిడివాదన చేసుకుంట పోతె చెప్పేటోనికి కూడ విసుగొస్తది. ఒకవేళ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టినా కల్లు మూసుకొని ఒకరిని గుడ్డిగ వెంబడించేటంత పిచ్చోల్లేమి కాదు, 1945ల్ల రైతాంగ పోరాటమప్పుడు తెలంగాణ ప్రజలకు ఎవ్వరి న్యాయకత్వము అవసరం పడలే, ఒక ఉప్పెన లెక్క తిరగబడ్డరు ప్రజలు (అది ఏ చరిత్ర పుస్తకాలల్ల కనపడనీకుంట చేసిన్రు, దాని వెనుక ఉన్న కుట్ర ఇంకో పెద్ద కథ). అంత మంది unanimousగ గొంతు విప్పి అడుగుతున్నరంటె, గుడ్డిగ దాన్ని అడ్డుకోకుంట ఎందుకు అడుగుతున్నరో ఒక్క క్షణం ఆగి వినిపిచ్చుకోవాలె !

    PS: ‘తెలంగాణని ఏమన్నా అనంగనే ఓ పరిగెత్తుకొని వస్తారు, కామెంట్ చెయ్యడానికి’ అన్న వాల్లకి సమాధానం… తెలంగాణ ఒక న్యాయమైన కారణం, ఎక్కడెక్కడ దాన్ని, ఎవరెవరు అడ్డుకుంటరో కనీసం దాన్ని defend అన్న చేసుకోకుంట నోరుమూసుకొని కూచునే అంత దీన స్థితిల ఇప్పుడు లేరు తెలంగాణ ప్రజలు.

  4. 4 Gowri Shankar 5:56 అపరాహ్నం వద్ద మార్చి 12, 2007

    సమైఖ్యాంద్ర ఒక డొల్ల అని ఒకరంటే, తెలంగాణ ఒక డొల్ల అని వేరొకరంటారు. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రా ఇదికాదు అస్సలు ప్రశ్న – ఇక్కడ అస్సలు ప్రాబ్లెం ఏంటి అని కల్ముష్యము లేని మనస్సుతో ఆలోచిస్తే వచ్చేప్రశ్న- ప్రజల కష్టాలేంటి? వాటిని తొలగించగల అస్త్రాలేంటి? ఈ ప్రజా ప్రశ్నలకు సమాధానము – చదువు, చదువు కున్న ప్రజలు ఎన్నుకొనే నాయకులు.
    “As long as the people are not educated and politically literate to elect good, dedicated leaders there will be no solutions to common people voes – food and shelter.

    Just the recent examples of Jarkhand, Goa will show that small states grow better is a myth, a total lie. They only satisfy the egos of various Political Parties HEAD’s to be called Chief Minister’s and make their monies”

    ఈ రెండు వాదలను రెండు సత్తు నాణ్యాలే!
    అస్సలు ప్రశ్నను అందరూ మడిచి మంచం కింద పెట్టెసారుగా!

    I cannot resist to quote figures as facts here for the argument ‘people wish Telangana’ – TRS whose sole election agenda was Telangana contested only 52 seats and won only 26 seats i.e., it won only less than 25% of all Telangana seats. This is fact till it gets erased in the next elections (may be, may not be).

  5. 5 రవి వైజాసత్య 7:36 అపరాహ్నం వద్ద మార్చి 12, 2007

    తెలంగాణ తీసుకుంటే తీస్కున్నరు.. మీ భాష వేరు మా భాష వేరు అని తెలుగు అనుబంధాన్ని తెగ్గొట్టకండి సార్

  6. 6 Dil 2:50 పూర్వాహ్నం వద్ద మార్చి 13, 2007

    రవి గారూ,

    తెలంగాణ సంస్కృతి, చరిత్ర వేరు. కానీ తెలంగాణ భాష తెలుగు కాదు అనడం సరికాదు అనే నా నమ్మకం కూడా. తెలుగు భాష కు ఉన్న ఒక అందమైన మాండలికం మాత్రమే తెలంగాణా భాష.

    మన అనుబంధం ఒకరు తెంచితే తెగేది కాదు…

  7. 7 నాగరాజా 3:12 పూర్వాహ్నం వద్ద మార్చి 13, 2007

    కొన్ని తెలియని విషయాలు తెలియజెప్పారు. కృతజ్ఞతలు. రవి గారి ప్రశ్న – దిల్ గారి జవాబూ చదివితే నవ్వాలో/ఏడవాలో అర్థం కాలేదు (రెండూ చెయ్యలేదు అనుకోండి). తెలంగాణా మాండలికంలో ఎన్నో అందమైన పదాలుండగా, దిల్ అనే హిందీ పదాన్ని ఈ బ్లాగుకు ఎందుకు పెట్టారో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది.

  8. 8 సుధాకర్(శోధన) 4:49 పూర్వాహ్నం వద్ద మార్చి 13, 2007

    మనలో మనం తెలంగాణా గురించి మాట్లాడుకునేటప్పుడు మనం “అసలు సిసలైన ప్రజలు కోరుకునే తెలంగాణా” గురించే మాట్లాడుకుంటాం. అది మనకున్న సంస్కారం. మనం అనుకునే తెలంగాణాలో ఇతర రాష్ట్రాల ప్రజలు ఉగాండా తరహాలో రాష్ట్రం నుంచి గెంటివేయబడరు, దగా కోరులుగా కనిపించరు…తెలుగు బాష దగా కోరుల చేత రుద్దించి వేయబడిన భాష అంతకన్నా కాదు, తెలుగు తల్లి అంటే ఏవో కొన్ని జిల్ల్లాల సొత్తు కాదు…అంతా అద్భుతంగా కలల ప్రపంచంలా బాగానే వుంది. తెలంగాణ వచ్చాక మొదలవుతుంది..అప్పుడు దానిని పరిపాలించేది ఇలా అసలు సిసలు తెలంగాణా వాదులు కాదు…విగ్రహాలు పెడితే గానీ చరిత్రలో మిగలని రాజకీయ నాయకులు , వారిని వెర్రిగా అభిమానించే వారు…వారి యువ సేనలు గట్రా..వారి పుర్రెకి ఏది రాజకీయం చెయ్యాలనిపిస్తే అది చేస్తారు. అప్పుడు ఎవరిని తోలాలో వారు నిర్ణయిస్తారు. భాష ఏమిటో వారు నిర్ణయిస్తారు. మీరన్న తెలంగాణా మాండలీకాన్ని ఒక భాషగా గుర్తింపు తేవటానికి ప్రయత్నించినా ఆశ్చర్యం లేదు.

    మీరు భాషా ప్రయుక్త రాష్ట్రమా నా బొంద అన్నారు…మరి ఏ ప్రాతిపదికగా రాష్ట్రాలు వుండాలి? నెహ్రు గురించి చెప్పకండి, అది అతనిలో నాటుకున్న హిందీ అహంకారం. నిజానికి జాతులు,మతాలు, కులాల , తెగల ప్రాతిపదికగా ఏర్పడిన ప్రదేశాలు(పురాతన కాలం నుంచి ఇదే వరస)భాష పరంగా ఐకమత్యం చెందటమే గొప్పతనం, అదే మార్గదర్శకం. అంతేకానీ ఎప్పుడొ తాతల కాలం నాడు రాజులు ఏలుకున్న సరిహద్దులు ఇప్పుడూ చెల్లుతాయా?

  9. 9 Dil 7:59 పూర్వాహ్నం వద్ద మార్చి 13, 2007

    సుధాకర్ గారు, మీరు ఇదివరకు అడిగిన ప్రశ్న, ఇప్పటి ప్రశ్నకు జవాబులు తదుపరి పోస్టులో ఇస్తాను.

    ఇక నాగరాజు గారు,

    మీకు అటు నవ్వలేని, ఇటు ఏడ్వలేని ఒక వింత ఇబ్బందికర పరిస్థితి కలిపించినందుకు క్షంతవ్యున్ని!

    అయితే గమ్మత్తేమిటంటే మీరు నా పేరు గురించి అడిగిన ప్రశ్న నన్ను సరిగ్గా అలాంటి మీమాంసలోకే నెట్టింది. మొదట దిల్ అనేది నా బ్లాగు పేరు కాదు. అది నా పేరు ఇంగ్లీషు స్పెల్లింగ్ (Dileep) లోని మొదటి మూడు అక్షరాల (Dil) కలయికతో ఏర్పడిన సంక్షిప్త నామం. నా బ్లాగు పేరు గుండె చప్పుడు. దాని URL http://hridayam.wordpress.com , అన్నీ Heart Problems అన్న మాట!

    మనలో చాలామంది పేర్ల మూలాలు సంస్కృతం లో ఉంటాయి అన్న విషయం మీకీపాటికే తెలిసి ఉండాలి.

    జరుగుతున్న చర్చపై ఏమైనా అభిప్రాయాలు ఉంటే మాట్లాడుకుందాం. అంతే కానీ ఈ రామాయణం లో పిడకలవేట ఏమిటి మేష్టారూ! ప్రపంచీకరణకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు ప్యాంటూ షర్టూ వేసుకోవద్దు, పంచె, లాల్చీ ధరించే మాట్లాడాలి అన్నట్టుంది మీ వరస…

  10. 10 T.Bala Subrahmanyam 9:45 పూర్వాహ్నం వద్ద మార్చి 13, 2007

    తెలంగాణా మీద ఏళ్ళ తరబడి చదివి చదివి విసుగొచ్చింది గాని ప్రత్యేక తెలంగాణా ఎందుకు కావాలంటున్నారో సంతృప్తికరంగా వివరించలేకపోతున్నారు. వివరించలేక “ఎందుకు వద్దో చెప్పండి”అని ఎదురు ప్రశ్న వెయ్యడం.లేదా సమైక్యవాదులకి దురుద్దేశాలు ఆపాదించడం.కాసేపు నీళ్ళ గొడవంటారు.కాసేపు ఉద్యోగాలంటారు.కాసేపు మా మాండలికానికి గౌరవం లేదంటారు.ఒక NRI వెబ్‌సైట్‌లో నైతే సమైక్యవాదులూ ప్రత్యేక వాదులూ పరస్పరం “అమ్మ…నీ…”బూతులు (ఇంగ్లీషులో)తిట్టుకుంటూ ప్రపంచ ప్రజలకి మనం ఎంత వెధవాయిలమో బహిరంగంగా తెలియజేశారు.ప్రత్యేక రాష్ట్రాలిస్తే ఈ గొడవలు ఇంకా పెరుగుతాయి గాని తగ్గవు. మనం ఇండియా-పాకిస్తాన్ తరహాలో తయారైనా నేను ఆశ్చర్యపోను.ఎందుకంటే ప్రత్యేక తెలంగాణా ఏర్పఱచడంతో “శుభం” కార్డు పడదు.కథ కంచికి వెళ్ళదు. ఆ తరువాత దాన్ని ప్రత్యేకంగా (ఆంధ్రా ప్రాంతంతో మళ్ళీ జన్మలో కలవకుండా) ఉంచాల్సిన “కర్తవ్యం” ఇక్కడి నాయకత్వం మీద పడుతుంది.అందుకని అవసరమున్నా లేకపోయినా ఆంధ్రాతో తెలంగాణాకి గొడవలు వచ్చేలా కొన్ని సంఘటనలు అడపా దడపా సృష్టించాల్సి కూడా వస్తుంది. (ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ చేస్తున్నది ఇదే) దేశాలూ రాష్ట్రాలూ ఏర్పడ్డానికి తగినంత కారణం లేనప్పుడు శత్రుత్వాన్నే కారణంగా చూపించాల్సి వస్తుంది.మానవ మనస్తత్వాన్ని- ముఖ్యంగా మనవారి మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని డిమాండ్లు చెయ్యడం నేర్చుకోవాలి.

  11. 11 T.Bala Subrahmanyam 10:10 పూర్వాహ్నం వద్ద మార్చి 13, 2007

    దిలీప్ గారూ ! సున్నితత్వం లోపించిన మీ శీర్షిక గురించి మాట్లాడను. కాని భాషారాష్ట్రాల హేతుబద్ధత గురించి కొంచెం చెప్తాను.

    నేననేది “దేశాలే భాషాప్రాతిపదికపై ఏర్పడుతుంటే రాష్ట్రాలు ఏర్పడితే తప్పేమిటి ?” అని. మీరు దేశాల విషయం అప్రస్తుతం అంటున్నారు. ఎందుకు అప్రస్తుతమో చెప్పండి. మీరు కోరుకునే తెలంగాణా భాషారాష్ట్రం కాదా ? అందులో కన్నడ జిల్లాల్ని మరాఠి జిల్లాల్ని కలుపుకోవడానికి మీరొప్పుకుంటారా ?

    “హిందీవారికి అన్ని రాష్ట్రాలున్నప్పుడు తెలుగువారికి రెండు రాష్ట్రాలుంటే తప్పేముంది ?”

    ఈ వాదన ఎంతమంది తెలంగాణావాదుల నోటి వెంట విన్నానో గుర్తులేదు. ఒక మనిషికి సరిపడే మందు ఇంకో మనిషి శరీర తత్వానికి ఎలాగైతే సరిపడదో ఒక జాతికి సరిపడేది మరో జాతికి సరిపడదు.హిందీవాళ్ళు దక్షిణాసియాలో అత్యంత బలవంతులు.వాళ్ళని కలిపేది భాష కాదు, పాకిస్తాన్ చైనాలతో ఉన్న విరోధం. అందుచేత ఎన్ని రాష్ట్రాలుగా పాలనాపరమైన విభజన చేసినా వాళ్ళకి నష్టం లేదు.మన విషయం అలా కాదు. మనం అంత బలవంతులం కాము. హిందీ మాట్లాడే ప్రాంతం దక్షిణాసియాలో 13 లక్షల చదరపు కిలోమీటర్లు. తెలుగు మాట్లాడే ప్రాంతం కేవలం 3 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇందులో చాలా జిల్లాల్ని కోల్ఫోగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ పేరుతో వ్యవహరించబడుతున్న భూభాగం కేవలం 2 లక్షల 75 వేల చదరపు కిలోమీటర్లు మాత్రమే. మనం అన్ని విధాలా చాలా రిస్కులో ఉన్న భాషాజాతి. మనం విడిపోతే మనల్ని ఇంకా విడగొట్టి పాలించి అన్యాయం చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలయింది.బాబ్లి ప్రాజెక్టు గురించి కోస్తావారు మాట్లాడట్లేదు. నాన్-తెలుగు జనం చేస్తున్న గ్యాస్ దోపిడీ గురించి తెలంగాణావారు మాట్లాడట్లేదు. నిజంగా శ్రద్ధ పెట్టాల్సిన అంశాలు మరుగున పడి ప్రాంతీయ తగాదాలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. అర్థమైనవాడికి అర్థమైనంత మహదేవా !

  12. 12 నవీన్ గార్ల 2:25 అపరాహ్నం వద్ద మార్చి 13, 2007

    “ఐకమత్యమే మహా బలం” అని మరచిపోకండి.

  13. 13 Nagaraja 6:21 అపరాహ్నం వద్ద మార్చి 13, 2007

    “మన” అనుబంధం “ఒకరు” తెంచితే తెగేది కాదు అని మీరు రాసిన దానికే స్పందించాను గురువు గారూ.
    ఇది పిడకల వేటో, గాడిద గుడ్డో నాకు తెలియదు. “ఐకమత్యమే మహా బలం” అనే వాక్యాన్ని నేను పూర్తిగా నమ్ముతాను.

  14. 14 Dil 3:01 పూర్వాహ్నం వద్ద మార్చి 14, 2007

    బాల సుబ్రహ్మణ్యం గారు,

    దేశాల ఏర్పాటుకీ, రాష్ట్రాల ఏర్పాటుకీ హస్తమశకాంతరం తేడా ఉంది. ఆ సంగతి మీరూ ఒప్పుకుంటారనుకుంటాను. కాబట్టే దాని విషయం ఇక్కడ అనవసరం అన్నాను. ఇక భాష ఒక్కటే రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాతిపదిక కాదనీ, కాకూడదనీ; ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు పూర్తి గా భాషప్రయుక్తత పై ఆధారపడి జరగలేదన్నది నా పోస్టు లో నేను చెప్పదలచుకుంది. మీ భాషలోనే చెప్పాలంటే ఒక రాష్ట్రానికి సరిపోయిన మందు ఇంకొక రాష్ట్రానికి సరిపడదు.

    ఇక తెలంగాణా ఎందుకు ఏర్పాటు చెయ్యాలో సరిగా వివరించలేక పోతున్నారని అన్నారు. యాభై ఏళ్లుగా అన్ని పద్ధతులూ ఉపయోగించి తెలంగాణా ఎందుకు కావాలో చెబుతున్నారు ఇక్కడి ప్రజలు.. (నీళ్లు, స్వయం నిర్ణయాధికారం, ఆత్మగౌరవం, నిధులు, ఉద్యోగాలు … అన్నీ విని వినపడట్లేదు, అర్ధం కావట్లేదు అంటే ఎట్లా?)

  15. 15 Dil 11:23 పూర్వాహ్నం వద్ద మార్చి 14, 2007

    ఐకమత్యం “అందరికీ” బలం అయితే బాగుంటుంది కానీ “కొందరి”కయితే అంత బాగుండదేమో. మిత్రులు అలోచించాలె…

  16. 16 valluri 5:08 అపరాహ్నం వద్ద మార్చి 14, 2007

    స్వయం పాలనాధికారం రాగానే, మీరు చెప్పిన ప్రస్తుత తెలంగాణ సమస్యలైనా “నీళ్లు, నిధులు,ఉద్యోగాలు ,స్వయం నిర్ణయాధికారం, ఆత్మగౌరవం …” వంటి సమస్యల పరిష్కారాలు ఎలా సాధ్యపడతయో నాకు అర్ధం కావట్లేదు. ఉదాహరణకి: ‘నీళ్ళు ‘ తీసుకుందాము. ఈ జాతీయ జలమండళలు,బచావత్ వంటి వాటర్ ట్రిబ్యునళ్ళ తీర్పుల కట్టుబాట్లు, సరిహద్దు రాష్ట్రాల జలవివాదాలు, ఇవన్ని ఏ రాష్టానికైన రావణకాష్టంవంటి సమస్యలే; ఇక నిధులు: ఇవి ఎక్కడనుంచి వస్తాయీ. కేంద్రం ప్రత్యేకాభిమానంతో నిధులు సమకూర్చదు కదా. అంతర్గత పన్నుల ద్వార కొన్ని నిధులు సమకూర్చుకోవచ్చు. కానీ, ప్రస్తుత పరిస్తితులలో తెలంగాణ ప్రజలు విటిని ఎల తట్టుకోగలరు? లేదా మరోక మార్గం, అప్పు తెచ్చుకోవటం. కొత్త రాష్ట్రానికి ఏ విదేశి సంస్త అప్పులివ్వటానికి ముందుకోస్తుంది? ఒకవేళ ఇచ్చినా, వారి హిరణ్యాక్షవరాలు కొత్త రాష్ట్రం తిర్చగలదా? ఇక ఉద్యోగాలు. తెలంగాణ రాష్ట్రామేర్పడిన తరువాత కొత్తగా వచ్చే ఉద్యోగాలేమిటంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వోద్యోగాలు. అవి ప్రస్తుత నిరుద్యోగ సమస్యని తీర్చగలవా? కేవలం స్వయం నిర్ణయాధికారం, ఆత్మగౌరవం అన్ని సమస్యలు తీర్చలేవు. ఇదంతా చదివి నేనేదో ఒక వర్గనికి కొమ్ముకాస్తున్నను అని భావించవద్దు. నేనూ తెలంగాణ వాసినే. కాకపోతే, నా బాధల్లా, ఎప్పుడు తెలంగాణ విషయం చర్చకొచ్చినా, వాదోపవాదాలు, విసుర్లు, అంతిమంగా ఫలనావారు ఈ గ్రూపు కి చెందినవారని వర్గీకరణలు. వీటితొ సాదించేదేమిటొ నాకు అర్ధంకావటంలేదు. ఫ్రెండ్స్, ఇకనైనా గ్రౌండ్ రియాలిటిస్ గురించి మాట్లాడదాము.

  17. 17 Dil 2:49 పూర్వాహ్నం వద్ద మార్చి 15, 2007

    వల్లూరి గారు,

    రాష్ట్రం ఏర్పడితే ఏం జరుగుతుందో, ఏం జరగదో వివరిస్తూ ఒక పోస్టు రాస్తున్నాను. అందులో ఇవన్నీ చర్చిద్దాం. గ్రౌండ్ రియలిటీసే మాట్లాడుకుందాం…

    We shall take up one thing at a time.

  18. 18 karthee 9:06 పూర్వాహ్నం వద్ద మార్చి 16, 2007

    ప్రజా ప్రతి నిధులు సరిగా పని చేస్తే ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదు,
    అలా ఛెయ్యాలంతటే ఓటు హక్కు అందరూ సక్రమంగా వినియోగింఛుకోవాలి,
    అలా జరగకుండా వున్నన్ని రోజులూ ఇలాంటి ఛర్ఛలు ఎన్ని జరిగినా ఏమి లాభం వుండదు…….
    అభివృద్ధికి,రాష్ట్రానికి సంభంధం ఏంటో….

    ఇలా తెలంగాణ, రాయలసీమ, కోన సీమ, ఇంకోసీమ అని విడిపోతూ వుంటే…చివరికి ప్రతిమనిషికి ఒక రాష్ట్రం కావలసి వస్తుంది….:-)

  19. 19 నవీన్ గార్ల 1:52 అపరాహ్నం వద్ద మార్చి 16, 2007

    దిలీప్ గారు “ఐకమత్యమే మహా బలం” అన్నదానిని మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. కొందరికి మాత్రం బలం వస్తే ఇస్తే అది ఐకమత్యం ఎందుకు అవుతుంది?

  20. 20 dasari 2:42 పూర్వాహ్నం వద్ద జూన్ 26, 2007

    ఖార్తి గారు కరెచ్త్ గా చెప్పారు. ఆభివ్రుద్ధి , ప్రత్యేక రాష్త్రం ఒక్కటి కాదు. నిజం చెప్పాలన్టె దీనంతటకి మూలము మన సినిమాలె. తెలంగాన మాండలికాలని కించపర్చడం వలన వచ్చిన పెల్లుబికిన అత్మాభిమనమే ఈ ప్రత్యేక రాష్ట్ర హక్కులా ప్రతిభంబిస్తుంది.

  21. 21 వికటకవి 2:26 పూర్వాహ్నం వద్ద ఆగష్టు 2, 2007

    అయ్యా,

    తెలంగాణ వారే ముఖ్యమంత్రులుగా ఉండి తెలంగాణాకు ఒరిగించిందేమీ లేదు. పీ.వీ.నరసింహారావ్ గారు తెలంగాణాను ఉధ్ధరించిందేమీ లేదు. మరింకా, ప్రత్యేక రాష్త్రం తాలూకు మీ భ్రమలేమిటో తెలియటం లేదు. ఒకటి మాత్రం చెపుతాను, వెనకబాటు తనం అన్నది అన్ని చోట్ల ఉన్నదే. ఎక్కడ చదువు ఉందో అక్కడ వెలుగుంది. చదువులేమే బలహీనతకు, బానిసత్వానికీ కారణం. ఆ తేదా స్పష్టంగా కనపడుతూనే ఉంది రాష్ట్రవ్యాప్తంగా. ఈ బేసిక్స్ వదిలేసి ఆత్మ గౌరవం వగైరాలతో విడిపొయినా మార్పు కల్ల.


  1. 1 నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు » Blog Archive » గుండె చప్పుడు 1:45 అపరాహ్నం వద్ద మే 6, 2008 పై ట్రాక్ బ్యాకు
  2. 2 పొద్దు » Blog Archive » గుండెచప్పుడు విందాం.. 12:53 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 27, 2009 పై ట్రాక్ బ్యాకు

ప్రత్యుత్తరమిమ్ము




ముఖచిత్రం: మోదుగు పూలు (Flame of the Forest)

Polepally SEZ

092508 Andhra Jyothy Cartoon

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

More Photos

a

గణాంకాలు

  • 39,144 సందర్శకులు