ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణా ప్రజలు చేస్తున్న ఉద్యమాన్ని “వేర్పాటువాదం’ అని ముద్ర వేస్తున్నారు కొందరు. ఇలా వేసేవారందరూ ఒకే ఉద్దేశ్యం తో ఈ పని చేయట్లేదు. కొంత మంది మిత్రులు నిజంగానే ఈ తేడా ను అర్ధం చేసుకోలేకపోతున్నారు. మరి కొంత మంది అర్ధం చేసుకున్నా ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న వేర్పాటువాద (ఉదా: కాశ్మీర్, ఖలిస్తాన్) ఉద్యమాల కోవలో చూడగూడదు. దేశం నుండి విడిపోవాలనుకోవడం వేర్పాటువాదం అవుతుంది కానీ తమ ప్రాంతానికి స్వయం పాలనాధికారం కావాలని కోరడం వేర్పాటువాదం కాదు.
ఒకవేళ తెలంగాణా కోరడం వేర్పాటువాదం అయితే 1952 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి విడిపోవాలనుకున్న తెలుగు ప్రజల ఆకాంక్షను కూడా వేర్పాటువాదం గానే పరిగణించాల్సి ఉంటుంది.
ప్రాంతం ప్రాతిపదికన అసలైన ప్రాంతీయతత్వం, సంకుచిత ప్రాంతీయతత్వం, వేర్పాటువాదం…వీటి మధ్య తేడాను వివరిస్తూ ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ రాసిన ఈ చక్కటి వ్యాసం ఆంధ్రజ్యోతి నుండి…..
నోట్: ఈ పోస్ట్ ఉద్దేశం ప్రాంతీయవాదం, వేర్పాటువాదాల మధ్య తేడా వివరించడానికే. వేర్పాటువాదం చెడ్డదని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు.
సమైక్యతను దెబ్బతీస్తున్న వివక్ష
- రామచంద్ర గుహ
అసోమ్‌లో ఇటీవల బీహారీ కూలీలపై యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్‌ఆఫ్ అసోమ్ (ఉల్ఫా) దాడులు నిస్సందేహంగా నేరపూరితచర్యలే. అసోమ్ ప్రజలు, భద్రతా దళాలు వాటినలా పరిగణించడం పూర్తిగా సబబే. అయితే ఉల్ఫా దాడులను చారిత్రిక నేపథ్యంలో పరిగణించాల్సిన అవసరమెంతైనా ఉంది. భారత్ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించినదాది వక్రగతి పడుతోన్న ప్రజల మనోభావాలు అభివ్యక్తమవుతోన్న వైనంలో ఆ దాడులు ఒక భాగం. ప్రజలకు తమ భాష, ప్రాంతంతో ఉన్న అనుబంధం ప్రాతిపదికగా ఉత్పన్నమైనదే ఈ ప్రజా ప్రవృత్తి. ప్రజలు ప్రదర్శిస్తున్న ఆ ప్రవృత్తికి ‘ప్రాంతీయవాదం’ అని పేరిడవచ్చు. ఇది వివిధ రూపాలలో హింసాత్మకంగా ప్రజ్వరిల్లుతోంది. ప్రజల్లో ప్రాంతీయతత్వం తొలుత ప్రత్యేక ప్రదేశాన్ని అంటే (భారత్‌లో భాగంగా ఉండే సొంత రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ డిమాండ్ చాలావరకు న్యాయబద్ధమైనదే. ఈ తరహా ప్రాంతీయవాదానికి ఆద్యులు ఇది వరకటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు భాష మాట్లాడే ప్రజలు.
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 1952లో 52రోజులపాటు ఆమరణ నిరాహారదీక్షచేసి అమరుడయ్యారు. ఆయన ఆత్మబలి తొలుత ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి, సుదీర్ఘకాలంలో భాషా ప్రయుక్తత ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు ప్రధాన హేతువయింది. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ప్రాంతీయతత్వాన్ని పూర్తిగా రూపుమాపలేదు. కేంద్రం నుంచి తమకు మరిన్ని నిధులు, అధికా రాలు కావాలనే డిమాండ్ రూపంలో ఇది ఇప్పుడు వ్యక్తమవుతోం ది. ఈ తరహా ప్రాంతీయ వాదానికి ఆద్యులు తమిళులు. కేంద్ర ప్రభుత్వం ఉత్తరాదిరాష్ట్రాల (ముఖ్యంగా హిందీ భాషా రాష్ట్రాలు) ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తుందనేది తమిళల ఆరోపణ. వారు తమ నిరసనను చాలా తీవ్రస్థాయిలో వ్యక్తంచేసేవారు. లక్ష్య సాధ నలో విజయమూ సాధించారు. హిందీ వ్యతిరేకోద్యమానికి నాయకత్వం వహించిన డిఎంకె 1967లో అధికారానికి వచ్చింది. ఎన్నికలలో పోటీచేసి గెలవడం ద్వారా అధికారానికి వచ్చిన తొలి రాజకీయ పక్షం డిఎంకె.
ఆ తరువాత డిఎంకెని ఆదర్శంగా తీసుకొని పం జాబ్‌లో అకాలీదళ్, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, అసోమ్‌లో అసోమ్ గణపరిషత్ తమ తమ ప్రాంతాల హక్కుల కోసం, కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా పోరాడి అధికారం లోకి వచ్చాయి. ఈ రాజకీయ పక్షాలు తమ పేర్ల ద్వారా తమను తాము ప్రాంతీయ రాజకీయపక్షాలుగా ప్రకటించుకున్నాయి. అయితే సిపిఎం పశ్చిమ బెంగాల్ విభాగాన్ని -కనీసం ఆ శాఖకు జ్యోతిబసు, బెంగాల్ ఆర్థిక కార్యకలాపాలకు అశోక్ మిత్రా సారథ్యం వహించినప్పుడు-కూడా ఒక ప్రాంతీయపక్షంగా పేర్కొనవచ్చు. ఏమంటే న్యూఢిల్లీ అనుసరిస్తోన్న వివక్షాపూరిత విధానాలకు వ్యతిరేకంగా బెంగాల్, బెంగాలీల ప్రయోజనాలను కాపాడేందుకు తాము నిబద్ధమయ్యామని మార్క్సిస్టు నాయకులు ఉద్ఘాటించేవారు.
భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ వివిధప్రాంతాల ప్రజలలో అసంతృప్తి తొలగి పోనేలేదు. ప్రాంతీయవాదం కొత్త రూపు తీసుకొంది. దీనికి ఉప-ప్రాంతీయతత్వమని విద్యావేత్తలు పేరు పెట్టారు. భాష ప్రాతిపదికన ఏర్పడిన కొత్త రాష్ట్రాలలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్దిష్ట ప్రాంతాలలో అత్యధిక సంఖ్యలో మైనారిటీలు ఉన్నారు. భాష లేదా జాతి/ మతం ప్రాతిపదికన వారు రాష్ట్రంలోని మెజారిటీ వర్గానికి వ్యతిరేకంగా సమైక్య మవడం జరిగింది. పశ్చిమ బెంగాల్‌లో నేపాలీలు, అసోమ్‌లో బోడో భాషీయులు ఇలాంటి మైనారిటీ వర్గాలే. సొంత రాష్ట్రం కోసం పలు సంవత్సరాలపాటు పోరాడిన నేపాలీలు, బోడోలు చివరకు ఉన్న రాష్ట్రంలోనే స్వతంత్ర ప్రతిపత్తిగల మండళ్ళ (అటానమస్ కౌన్సి ల్స్)తో సంతృప్తి పడవలసివచ్చింది.
సొంత రాష్ట్రంకై ఉత్తరప్రదేశ్‌లోని కొండ ప్రాంతాల ప్రజల పోరాటం ఉత్తరాంచల్‌గా ఫలించింది. అలాగే చోటానాగపూర్ పీఠభూమి వాసులైన గిరిజనులు, ఇతర ప్రజలు జార్ఖండ్‌ను సాధించుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం వారు స్వాతంత్య్రం రాకముందునుంచే పోరాడుతున్నారు. తమ విలక్షణ గుర్తింపును పరిరక్షించుకోవడానికి భారత్‌లో భాగంగా సొంత రాష్ట్రం లేదా రాష్ట్రంలో భాగంగా స్వతంత్ర పాలనామండలిని డిమాండ్‌చేయడం ప్రజాస్వామ్యా నికిగానీ, దేశభక్తికిగానీ విరుద్ధమైనది కాదు. అయితే మనజాతి చరిత్రలో ప్రాంతీయ వాదం కొన్నిసార్లు సంకుచితత్వంగా పరిణమించింది. ఇది బెంగాలీల విషయంలో నిరపాయంగా వ్యక్తమైంది. బెంగాలీలు తమ సాహిత్యం, సంగీతం భారత్‌లోని ఏ ప్రాంతపు సాహిత్య సంగీతాలకంటే ఉత్కృష్టమైనవని భావిస్తారు. అయి తే సంకుచిత ప్రాంతీయ తత్వం హింసాత్మకంగాకూడా వ్యక్తమయింది. బీహారీలపై ఉల్ఫాదాడులే ఇందుకు తార్కాణం. అసోమ్‌లో నివశించే హక్కు అస్సామీ భాష మాట్లాడే ప్రజలకు మాత్ర మే ఉందన్న ప్రగాఢ విశ్వాసమే ఉల్ఫా కార్యకర్తలను ఆ దాడులకు పురిగొల్పింది.
నిరపాయ సంకుచిత ప్రాంతీయ తత్వా నికి నాయకులు బెంగాలీలు అయితే దౌర్జ న్యపూరిత సంకుచిత ప్రాంతీయ తత్వానికి ఆద్యులు మహారాష్ట్రీయులు. 1960ల మధ్యనాళ్ళలో బొంబయిలోని దక్షిణ భారతీయులపై శివసేన కార్యకర్తలు తర చుదాడులు చేసేవారు. వారు భూమిపుత్రులుగారని, నగరానికి ‘వెలుపలివార’నేది శివసే న ఆరోపణ. ఆ ఆరోపణలతోనే వారు బొంబాయిలోని ఉడిపి హోటళ్ళను దగ్ధంచేశారు. తదనంతర కాలంలో బెంగాలీలు, బీహారీలపై కూడా శివసేన వారు ఇదే విధమైన ఆగ్ర హావేశాలను ప్రదర్శించారు. శివసేన, ఉల్ఫాదాడుల మధ్యకాలంలో బీహారీ వలస కార్మి కులను పంజాబ్‌లో ఖలిస్థానీ తీవ్రవాదులు, జమ్మూ-కాశ్మీర్‌లో ముజాహిదీన్‌లు హత మార్చారు. భారతీయ నేర శిక్షాస్మృతిప్రకారం ఈ చర్యలు ఘో రనేరాలే. అంతకంటే కలవరపరిచే విషయమేమిటంటే ఆ హత్యా కాండ అసలు భారత్ భావన (ఐడియా ఆఫ్ ఇండియా)కే సవాల్ కావడం.
భారత్‌లో ఎక్కడైనా నివశించడానికి, పనిచేసుకోవడానికి భారతరాజ్యాంగం తన పౌరులకు హక్కు కల్పించింది. ఒక రాష్ట్రంనుంచి మరో రాష్ట్రానికి, ఒక ప్రాంతంనుంచి మరో ప్రాంతానికి స్వేచ్ఛగా తరలివెళ్ళడమనేది స్వేచ్ఛాయుత పౌరసత్వానికి ప్రాతిపదిక. భారత్‌నుంచి పూర్తిగా విడివడి సార్వభౌమికదేశంగా ఏర్పడాలనే ప్రగాఢ ఆకాంక్ష, కాల్పనిక భావన అతి తీవ్ర, ప్రమాదకర మైన ప్రాంతీయతత్వానికి ప్రాతిపదిక. ఇటువంటి ఆకాంక్ష ఒకప్పుడు నాగానాయకుడు ఎ.జడ్. ఫిజోను ఆవహించింది. ఆయన నేతృత్వంలో నాగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ చాలా సంవత్సరాలపాటు స్వతంత్ర నాగాలాండ్ కోసం పోరాడింది. ఇప్పుడు నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ నేత టి.మూయివాను నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది కూడా ఇదే ఆకాంక్ష అని చెప్పవచ్చు. ఆ విధంగా సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికే కాశ్మీర్‌లో కాశ్మీరీ, కాశ్మీరీయేతర తీవ్రవాదులు దశాబ్దాలుగా పోరాడుతున్నారు.
1980లనాటి సిక్కు తీవ్రవాదులుకూడా తమ సొంతజాతి- రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనిఆశించారు. వాస్తవానికి ద్రవిడ ఉద్యమం కూడా చాలా సంవత్సరాలపాటు భారత్‌నుంచి విడిపోయేహక్కు తమకుందని వాదించింది. ఈ తరహా ప్రాంతీయ తత్వాన్ని వేర్పాటువాదంగా పరిగణించవచ్చు. సంకుచిత ప్రాంతీయ తత్వానికి కంటే దీనికి న్యాయబద్ధత మరింత తక్కువే. ఆనందకరమైన విషయమేమిటంటే సిక్కులు మళ్ళీ భారత్‌తో మమేకమయ్యారు. అలాగే మిజోలకూడా. ప్రత్యేక దేశంకోసం పోరాడిన మిజోలు 1986 నుంచి భారత్‌లో భారతీయులుగా శాంతియుత సహజీనవం నెరపుతున్నారు. ఈ విధంగా మన దేశంలో ప్రాంతీయవాదం మూడు రకాలుగా అభివ్యక్తమయింది. ఒకటి భాష, ప్రాంతం ప్రాతిపదికన అసలైన ప్రాంతీయతత్వం, రెండోది సంకుచిత ప్రాంతీయతత్వం, మూడోది వేర్పాటువాదం. ఉల్ఫా ప్రాంతీయతత్వం ప్రత్యేకమైనదని చెప్పవచ్చు.
మనం ప్రస్తా వించుకున్న మూడు విధాల ప్రాంతీయ తత్వధోరణులు మిలిటెంట్ సంస్థ పోరాటానికి స్ఫూర్తిగా ఉన్నాయి. కనుకనే అస్సామీలు ఉల్ఫాను పూర్తిగా వ్యతిరేకించ లేకపోతున్నారు. తాము వివక్షకు గురవుతున్నామన్న భావన అస్సామీలలో బలీయంగా ఉంది. ప్రత్యేక దేశంగా ఏర్ప డాలన్న ఉల్ఫా ఆకాంక్షతో వారు ఏకీభవించకపోవచ్చు; వలస కార్మికులను హతమార్చడాన్ని కూడా వారు ఆమోదించకపోవచ్చు. అయితే తమ రాష్ట్రాన్ని మిగతా భారతదేశం తిరస్కార ధోరణితో చూస్తుందనే భావనకు అస్సామీలు లోనవుతున్నారు. నాగాలు, కాశ్మీరీలు కూడా ఇదే విధమైన అసంతృప్తితోఉన్నారు. అసోంతో పాటు నాగాలాండ్, జమ్మూ-కాశ్మీర్‌లో కూడా ప్రాంతీయతత్వం హింసాత్మకంగా ప్రజ్వరిల్లడానికి కారణమిదే. అందుకే భారత్ (యూనియన్‌ఆఫ్ ఇండియా)తో ఒక సుస్థిర శాంతి ఒప్పందానికి రావడానికి నాగాలు, కాశ్మీరీలు తిరస్కరిస్తున్నారు.
(వ్యాసకర్త చరిత్రకారుడు)









బహుశా సెషెషన్ అనే ఇంగ్లీషు మాటను అనువదించడంలో వచ్చిన ఇబ్బంది కావచ్చు. నిజానికి వేర్పాటు అనేది అంత చెడు మాటేమీ కాదు, ఆస్తి పంపకాలపుడు కూడా వాడుతారు – వేరు పడుతున్నారు అని. వాడుకలో ఈమాటను ఏర్లు పడడం అని కూడా అంటారు మా గుంటూరు జిల్లాలో. రాష్ట్ర విభజన కోరడం వేర్పాటు అని అనవచ్చేమో! అయితే.. ఇది కేవలం నా ఆలోచన, రామచంద్ర గుహ గారి అభిప్రాయాలను ఒప్పుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు.
ఉల్ఫా ప్రాంతీయ తత్వం ప్రత్యేకమైనదైనట్లే.. ప్రత్యేక తెలంగాణ వాదం కూడా మరో రకంగా భిన్నమైనది! వ్యాసంలో ఉదహరించిన ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు విషయంలో.. విడిపోదలచినవారు విడిపోయి కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ విషయంలో మాత్రం.. విడిపోదలచిన వారు ‘రాజధాని మాదే, మీరు పోయి మీ రాజధానిని నిర్మించుకోండి’ అని మిగతావారిని అంటున్నారు. ఇన్నాళ్ళు తమది కూడా అనుకున్న నగరం తమది కాకపోతే సహజంగా బాధ కలుగుతుంది. తెలంగాణపై కోస్తా రాయలసీమల వ్యతిరేకతకు బహుశా అదో ముఖ్యకారణం కావచ్చు. ఇకపోతే దీనికి మించిన నీళ్ళ పంపకాల గొడవ ఎలాగూ ఉండనే ఉంది.
వ్యాసం చాలా బాగుంది. వేర్పాటువాదం సంగతేమో గానీ, ‘తెలంగాణా ముద్దు బిడ్డలం’ అని చెప్పుకునే కొంతమంది రాజకీయ నాయకులు చాలా అసహ్యకరమైన రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు. అది ఎంత వరకూ వచ్చిందంటే ‘తెలుగు’ భాష మీద దాడి కూడా మొదలయింది.ఇలాంటి కోవలోని వారే తెలంగాణా వాదానికి వేర్పాటువాదం అని పేరు పెట్టేది. పక్కనున్న తోటి తెలుగు వాళ్లని తిట్టడం, ఢిల్లీ వెళ్లి ఇటాలియన్ల కాళ్లు గుద్దటం ఏ రకమైన ఆత్మాభిమానమో కూడా అర్ధం కాదు. ఇది మన ప్రాంతం, మన ప్రజలు, మన భాష. ఏదైనా తేల్చుకోవాలంటే ఇంట నుంచి గెలుచుకు రావాలి. ప్రతి ఇంటి నుంచి ఆ నినాదాన్ని మారు మోగించాలి. అంతే గానీ ఎద్దు తోక తొక్కితే పిల్లి ఎలక వంక ఎర్రగా చూసిందన్నట్లు, ఎవరికో భూములు దొరక్క, పదవులు రాక, సరిగ్గ జనాలను దోచుకునే అవకాశం రాక మొదలు పెట్టిన ఈ నినాదం, వాదం తోటి తెలుగు వాల్లను దొంగలుగా చిత్రీకరించటం మానాలి. ప్రతీ దగ్గరా పేదల కడుపు కొట్టే వాడు ఒకడే…అది తెలంగాణా కావచ్చు, పాడుబడిన ఉత్తరాంధ్ర కావచ్చు. తెలంగాణ వచ్చిన తరువాత కూడా పేదోడు పెద్ద పేదోడు, ధనికుడు పెద్ద ధనికుడూ అవుతారు. ఇది పరమ సత్యం.ఇక్కడ మనమేమి నవ నూతన పేదోళ్ల దేశాన్ని నిర్మించటం లేదని గుర్తించాలి. శ్మశానాన్ని ఎన్ని భాగాలు చేసినా రాబందులకు కొదవుండదు.
అయితే ఈ తెలంగాణవాదం ఇప్పటికయినా ఆ అవకాశ రాజకీయ నాయకులను పక్కన పెడితే, తెలంగాణా ప్రజల సమైక్యవాదం మొదలై ఈ స్వప్నం సాధించటం అతి దగ్గరలోనే ఉండవచ్చు.
దిలీప్ గారూ మీరు చాలా కష్టపడ్డారు. కాని తెలంగాణా వాదం ముమ్మాటికీ వేర్పాటువాదమే. పది కోట్ల తెలుగు మహాజాతిలోంచి వేరుపడాలని ప్రయత్నం చెయ్యడం ఇంకేమనిపించుకుంటుంది ? అలా వేరు పడడానికి సరైన ప్రాతిపదిక ఏమిటి ? ఖచ్చితమైన హేతువేంటి మన ప్రాంతం వాడొకడు లేచి ఆ నినాదం ఇచ్చి మన బి.పి.పెంచడం తప్ప ? నాకు ఈ సందర్భంలో అంబానాథ్ గారు గుర్తొస్తున్నారు. మీరు చెప్పే ఇండియన్ యూనియన్ అనే దేశమూ దాని సమైక్యమూ దాని రాజ్యాంగమూ పుట్టక ముందే తెలుగుజాతి ఉంది.కాబట్టి ఇండియన్ యూనియన్ ఉన్నా ఊడినా మన జాతి నిలబడాలి. నిలబడాలంటే కలిసుండాలి.కాబట్టి మన సమైక్యానికి దాని సమైక్యానికి ముడిపెట్టకండి.
ఇహపోతే మద్రాసు నుంచి తెలుగువాళ్ళు వేరుపడ్డారన్నారు. అయ్య మద్రాసు రాష్ట్రం ప్రజలు ఏర్పరచింది కాదు.తెలుగువాళ్ళూ తమిళులూ కలిసి ఉంటామని బ్రిటీషువాళ్ళతో ఎప్పుడూ అనలేదు.వాళ్ళు తమ సామ్రాజ్య పరిపాలనా నిర్వహణల నిమిత్తం నానా భాషల కలగాపులగంతో అర్థం పర్థం లేని రాష్ట్రాలు ఏర్పరిచారు. మనం స్వాతంత్ర్యం వచ్చాక ఒకే జాతికి చెందిన ప్రజలతో అర్థవంతమైన రాష్ట్రాలు ఏర్పరచి రాష్ట్రాల ఏర్పాటుకు ఒక హేతుబద్ధమైన విధానాన్ని రూపొందించుకున్నాం. మీరు చూడండి ప్రపంచంలో దేశాలు సైతం భాషాప్రాతిపదికనే ఏర్పడ్డాయి. మినహాయింపులు ఉండొచ్చు. కాని చాలా తక్కువ.మీరు ఇంత తెలిసినవారై ఉండి కేసీయార్ లాంటి దగుల్బాజికి వంతపాడే పని భుజానికెత్తుకున్నందుకు నాకు చాలా బాధగా ఉంది.
వ్యాసం బాగుంది. కాని ఒక విషయం. శోధన సుధాకర్ గారు అన్నట్లు తెలంగాణ వచ్చిన తరువాత కూడా పేదోడు పెద్ద పేదోడు, ధనికుడు పెద్ద ధనికుడూ అవుతారు. అంతకన్నా పెద్ద మార్పేమి వుండదు. ఇప్పడు తెలంగాణ వెనుకపడింది అభివృద్ధి లేదు అంటున్నారు. అసలు ఏ ప్రాంతం లో అభివృద్ధి మెండుగా వున్నట్లు? వెనకబాటుతనం ప్రతి చోటా వుంది. రేపు తెలంగాణా వస్తే అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది. చుట్టి చుట్టి హైదరాబాదు చుట్టూనే జరుగుతుంది (ప్రస్తుతం ఆంధ్రా లో అత్యధిక వేగవంతంగా అభివృద్ధి జరుగుతున్న ప్రాంతం కూడా అదే). ఇప్పుడు ఉన్న మహబూబునగరు అలానే వుంటుంది, నల్గొండ అలానే వుంటుంది. అదిలాబాదు అలానే వుంటుంది. విడిపోతే అన్ని ప్రాంతాలు అభివృద్ధి అవుతాయనుకుంటే విడిపోవటం లో తప్పు లేదు కాని స్వార్థ రాజకీయాల కోసం కొంతమంది కుహ(నా)యకుల అభివృద్ధి కోసం విడిపోవటం తెలంగాణ కు నిజంగా మేలు చేస్తుందా?
పోస్టు పై వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలు. జవాబులు మరీ పెద్దగా ఉండటం వలన వాటిని ఇక్కడ కాకుండా విడిగా పోస్టు చేద్దామని ఆగాను. రేపటినుండి పోస్టు చేయడం మొదలు పెడతాను…
ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణ జిల్లాలతో హైదరాబాద్ రాజధాని గా ఉండింది. అప్పటికే హైదరాబాద్ భారతదేశంల అభివృద్ధి చెందిన నగరాలల్ల ఒకటి. కలిసినప్పుడు హైదరాబాద్ తో సహా ఎట్ల కలిసినమో విడిపోయేటప్పుడు అట్లనే హైదరాబాద్ తో సహా విడిపోవాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నరు. అది సహజమే కదా! తెలంగాణ అనే బదులు ముందు ఉన్నట్టుగానే హైదరాబాద్ రాష్ట్రం అని డిమాండ్ చేస్తే హైదరాబాద్ తెలంగాణల భాగమని అర్థం అవుతదేమో మరి. ఇన్నాళ్ళు తమది కూడా అనుకున్న నగరం తమది కాకపోతే సహజంగా బాధ కలుగుతుంది అని చదువరి గారు అన్నరు. అది నిజమే! కాని అదివరకే అభివృద్ధి చెందిన హైదరాబాద్ ని తమది అనుకున్నట్టే పాలకులు తెలంగాణ జిల్లాలను కూడా తమవి అనుకుని నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, సెక్రెటేరియట్ కొలువులు తగిన పాళ్లలో సమకూర్చి వుంటే 50 ఏళ్ల నుండి తెలంగాణ డిమాండు పదే పదే ముందుకు వచ్చేది కాదు. ఇంకో విషయం 50 ఏళ్లుగా కలిసివున్నందుకే ఆంధ్ర ప్రాంతం వారికి హైదరాబాద్ తమది కాకుండా పోతే బాధ కలిగితే 400 ఏళ్లుగా తెలంగాణ జిల్లాల ప్రజల కష్టాన్ని, వనరులని ఉపయోగించి నిజాం నిర్మించిన హైదరాబాద్ తెలంగాణది కాకపోవడం ఎక్కడి న్యాయం?
తెలంగాణ వచ్చిన తరువాత కూడా పేదోడు పెద్ద పేదోడు, ధనికుడు పెద్ద ధనికుడూ అవుతారు అని సుధాకర్ గారు అన్నరు. అది నిజమే. తెలంగాణ వస్తే సమసమాజం ఏమీ రాదు కదా! అయితే ప్రత్యేక రాష్ట్రం వస్తే కనీసం రాష్ట్రానికి రావలిసిన నీళ్లు, నిధులు, ఉద్యోగాలు తెలంగాణకే వస్తయి అని తెలంగాణ ప్రజల ఆశ! నిధులు వస్తే రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు దండుకునే డబ్బు పోగా మిగిలిందయినా వేరే ప్రాంతానికి తరలించబడకుండా మా ప్రాంతానికే వస్తయి కదా! ఉద్యోగాలు చిన్నవో, పెద్దవో మా ప్రాంతానివి మాకే ఉంటయి కదా! ఆంధ్రప్రదేశ్ జనాభాల 40% ఉన్న తెలంగాణ ప్రజలకి సెక్రెటేరియట్ ల 10% కూడా లేని ఉద్యోగాలు (ఆ 10% కూడా చాలామటుకు అటెండర్లు, స్వీపర్ల ఉద్యోగాలట) తెలంగాణ వస్తే మావి మాకే ఉంటయి కదా! సెక్రెటేరియట్ ల ఉద్యోగావకాశాలు తగ్గినయనే అంశం కన్న ముఖ్యమైనది ఆ ఉద్యోగాలు తెలంగాణ వాళ్లకు లేనందువల్ల అన్ని రంగాలల్ల నిర్ణయాలు తీసుకోబడుతున్న సెక్రెటేరియట్ ల మా ప్రాతినిధ్యం లేనట్టే కదా! అన్నింటికీ మించి నదులపై ఒకటో రెండో ప్రాజెక్టులు కట్టుకుంటే పేదోడు ధనికుడైపోకపోయినా కనీసం పొట్టకూటికి సరిపడే వ్యవసాయం చేసుకోగలడు కదా! ఆంధ్రప్రదేశ్ ల కృష్ణా నది 68.5% పరివాహక ప్రాంతం, గోదావరి 69% పరివాహక ప్రాంతం తెలంగాణలనే ఉన్నయి. అయినా ఆంధ్రప్రదేశ్ ల నదీ జలాలతో సాగు చేయబడుతున్న ప్రాంతం తెలంగాణల ఉన్నది 18.2% శాతం మాత్రమే! ఇగ భాష, సంస్కృతులపై దాడి ఉండనే ఉన్నయి. అయితే తెలంగాణ కోసం ఉద్యమించే ప్రతి ఒక్కరికీ ఆంధ్ర ప్రాంత పాలకుల పట్ల వ్యతిరేకతే కాని ఆంధ్ర ప్రజల పట్ల కాదు. ఆ విషయాన్ని పదే పదే ఎన్నో వేదికల మీద కవులు, కళాకారులు, ఉద్యోగుల సంఘాలు, విద్యావంతులు చెప్తనే వున్నరు.
ఎందరు కవులు, కళాకారులు, విద్యావంతులు, ఉద్యోగులు మొత్తుకున్నా, 1969 ల మొత్తం పది జిల్లాలల్ల వోట్లు వేసి చెప్పినా, మొన్న కరీంనగర్ ఎన్నికలల్ల ప్రజలు వోట్లతో తెలియజేసినా ఇది రాజకీయ నాయకుల డిమాండ్ అని చెప్పి ఒక ప్రజాస్వామిక ఆకాంక్షని విలువ లేనిదిగా చూపించాలని ప్రయత్నిస్తున్నరు. తెలంగాణల రాజకీయ పార్టీలకు అతీతంగ ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్ని సంఘాలు ఏర్పడినా రాజకీయ నాయకుల మాయల పడ్డట్టే మాట్లాడడాన్ని ఏమనాలె? TRS కి అనుకూలంగా, వ్యతిరేకంగా, ప్రత్యామ్నాయంగా ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నరు. ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా అయినా, వ్యతిరేకంగా అయినా, అతీతంగా అయినా ఈరోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలని కోరుకుంటున్నది నిజం – అది కూడా వాళ్ల చైతన్యంతో, న్యాయమైన డిమాండ్లతో కోరుకుంటున్నరు, ఎవరో చెప్పిన మాటల మాయల పడి కాదు. తెలంగాణ రావాలని నిజంగా ప్రజల గట్టి కోరిక అయితే వాళ్లే కొట్లాడి తెచ్చుకుంటరు. లేకపోతే ఉద్యమం ఎలాగూ నీరు కారిపోతది. తెలంగాణ విషయంల తెలంగాణ ప్రజలకే నిర్ణయించుకునే హక్కు ఉంటదని అయితే అందరూ అంగీకరిస్తరనుకుంటున్న. ఇగ అది కూడ కాదంటే వాళ్లు అప్రజాస్వామికం అనక తప్పదు.
PS: తెలంగాణ ప్రజలు తెలంగాణ ఒక్కటే వెనకబడిందని ఏమీ అనడం లేదు. తెలంగాణ వెనకబడ్డది అని అంటున్నరు. వారికున్న చైతన్యంతో దానికి పరిష్కారంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షని వ్యక్తపరుస్తున్నరు. ఇతర వెనకబడిన ప్రాంతాలవారు వారి పరిష్కారాన్ని వాళ్లే వెతుక్కుంటరు.
>> ఆంధ్రప్రదేశ్ జనాభాల 40% ఉన్న తెలంగాణ ప్రజలకి సెక్రెటేరియట్ ల 10% కూడా లేని ఉద్యోగాలు (ఆ 10% కూడా చాలామటుకు అటెండర్లు, స్వీపర్ల ఉద్యోగాలట)
ఈ విషయం ఎవరు చెప్పారు మీకు?